1. పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ

 1. పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ
1.1. ఉపోద్ఘాతం
1.2. తిమోతిపై పౌలు అభిప్రాయం
1.3. లేఖ ఉద్దేశ్యము
1.4. ప్రధానాంశాలు
1.4.1. శ్రీసభ ‘నిర్మాణం’ లేదా క్రమము (3:1-13, 5:3-22)
1.4.1.1. పీఠాధిపతులు లేదా సంఘాధిపతులు (1 తిమో. 3:1-7)
1.4.1.2. దైవసంఘ సహాయకులు లేదా దీకనులు (1 తిమో. 3:8-13)
1.4.1.3. వితంతువులకు నియమాలు (1 తిమో. 5:3-16)
1.4.2. అసత్యపు బోధకులు (1:3-20, 3:14-4:10, 6:3-10)
1.4.3. దైవసంఘములో సంబంధాలు, విశ్వాసము (2:1-15, 4:11-5:2, 5:22-6:2, 6:6-19)
1.4.3.1. పౌలుకు స్త్రీలపై నున్న అభిప్రాయం (2:9-12)
1.5. ముగింపు

1.1. ఉపోద్ఘాతం

పౌలు అన్యజనుల ప్రేషిత పరిచర్య మరియు ప్రయాణాలలో సహచరుడిగా ఉండిన తిమోతికి క్రైస్తవ సంఘ నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పుతూ వ్రాసిన లేఖ ఇది.

ఎఫెసు మరియు తెస్సలోనిక సంఘాలలో తిమోతి పనిచేసాడు. పౌలుకు ప్రీతిపాత్రుడు, పభువు నందు విశ్వసనీయ సహచరుడు (1 కొరి. 4:17, 1 తిమో. 1:2). పౌలు అనుమతితో సున్నతి కావింప బడ్డాడు (అ.కా. 16:1-3). పౌలు తన లేఖలు వ్రాయడానికి సహాయ పడ్డాడు (1తెస్స. 1:1, 2 కొరి. 1:1).

తిమోతి లికోనియాలోని లిస్త్రా గ్రామానికి చెందినవాడు. తల్లి యూనీకే (యునిస) మరియు అమ్మమ్మ లోయి. లిస్త్రాలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా ఈ కుటుంబమే (2 తిమో. 1:5). తిమోతి అనగా “దేవున్ని గౌరవించడం” అని అర్ధం.

పౌలు సువార్తా ప్రచారమునకై లిస్త్రాకు వెళ్ళినప్పుడు (క్రీ.శ. 46) తిమోతితో అనుబంధం ఏర్పడినది (అ.కా. 13:1-14:28). తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి భక్తిగల యూదురాలు. యూదురాలైన తిమోతి అమ్మమ్మ మొదటగా క్రైస్తవురాలిగా మారింది (2 తిమో. 1:5, అ.కా. 16:1-2). తిమోతి తన చిన్నతనము నుండి హీబ్రూ గ్రంథముల పట్ల విద్యాభ్యాసాన్ని పొంది యున్నాడు (2 తిమో. 3:15).

మొదటగా లిస్త్రాను పౌలు మరియు బర్నబాసులు సందర్శించారు. అచ్చటి ప్రజలు వారిని ‘దేవుళ్ళు’గా భావించి ఆహ్వానించారు. కాని ఆ తరువాత పౌలును రాళ్ళతో కొట్టి, అతడు మరణించెనని భావించి, పట్టణము బయటకు ఈడ్చి వేసిరి (అ.కా. 14:6-20). చిన్నవాడైన తిమోతి, సంఘటనను కనులారా చూడనప్పటికిని, ఆ తరువాత తప్పక వినే ఉంటాడు.

పౌలు రెండవ సారి లిస్త్రాను సందర్శించినప్పుడు (క్రీ.శ. 50-52), పెద్దవాడైన తిమోతిని తన సహచరునిగా తీసుకున్నాడు (అ.కా. 15:36-18:22). యూదుల పోరు వలన, తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించెను (అ.కా. 16:3). హస్త నిక్షేపణ వలన పౌలు సమక్షములో, పెద్దలచేత అభిషేకింప బడినాడు (1 తిమో. 4:14, 2 తిమో. 1:6).

ఆసియా మరియు ఐరోపా ప్రేషిత పరిచర్య ప్రయాణాలలో తిమోతి పౌలును అనుసరించాడు. ఇరువురు కలసి మొట్టమొదటిసారిగా ఐరోపాకు వెళ్లి యున్నారు (అ.కా. 16:9). వారిరువురు కలిసి గలతి, ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరయాలలో సువార్తను బోధించారు (అ.కా. 17:14-15, 18:5). తెస్సలోనిక క్రైస్తవులను బలపరచుటకు పౌలు తిమోతిని వారి వద్దకు పంపెను. తిమోతి తిరిగి పౌలును కొరింతులో కలుసుకొనెను (1 తెస్స. 3:6, అ.కా. 18:5).

కేవలం ఎఫెసులోనే ఇరువురు కలిసి దాదాపు రెండు సంవత్సరములు కలిసి పని చేసారు. ఎఫెసు నుండి పౌలు తిమోతిని మాసిడోనియాకు (అ.కా. 19:22, 1 కొరి. 4:17, 16:10), బహుశా యెరూషలేము విశ్వాసులకు కొరకు ధన సహాయమునకై పంపి యుండవచ్చు.

క్రీ.శ. 57-58 చలికాలము తిమోతి కొరింతులో పౌలుతోనే ఉండెను. ఆ సమయముననే తిమోతి కూడా పౌలు వెంట రోము నగరమునకు కొనిపోబడెను (రోమీ. 16:21).

అ.కా. 20:4-5 ప్రకారం, క్రీ.శ. 58 వ సంవత్సరములోని పెంతకోస్తు మహోత్సవమునకు ముందుగా, ఆరంభములో యెరూషలేమునకు ప్రయాణములో తిమోతి పౌలుతో ఉండెను. తిమోతి ముందుగా వెళ్లి పౌలు కొరకు త్రోయలో వేచి ఉండెను.

పౌలు ఈ లేఖను వ్రాయు సమయమున తిమోతి ఎఫెసు నగరములో ఉండెను. పౌలు మాసిడోనియాకు వెళ్ళెను (1 తిమో. 1:3). పౌలు తిమోతిని ఎఫెసు నగరములో త్వరలో కలవాలని ఆశించి యున్నాడు (1 తిమో. 3:14-15, 4:13).

1.2. తిమోతిపై పౌలు అభిప్రాయం

“క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటలో మాతో పాటు దేవుని కొరకు పని చేయు మా సోదరుడు” (1 తెస్స. 3:2).

“తిమోతి శ్రద్ధ కలవాడు. ఆయన తప్ప నాకెవ్వరునూ లేరు. తన యోగ్యతను నిరూపించు కొనెను. తండ్రికి కుమారుడు సేవచేయునట్లు అతడు సువార్త కొరకై నాతో కలిసి పని చేసెను” (ఫిలిప్పీ. 2:19-23).

“ప్రియతముడు, క్రీస్తు నందు విశ్వాసపాత్రుడైన నా పుత్రుడు” (1 కొరి. 4:17).
“అతడు నావలెనే ప్రభువు కొరకు కృషి సలుపు చున్నాడు” (1 కొరి. 16:10-11).
“విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి” (1 తిమో. 1:2).

పౌలు సహచరులందరిలో తిమోతి ఎక్కువ కాలం, రెండు దశాబ్దాలు పౌలుతో పాటు ఉండెను (క్రీ.శ. 46-67). ఎఫెసు క్రైస్తవ సంఘ బాధ్యతలను పౌలు తిమోతికి అప్పజెప్పడం జరిగింది. “నేను నిన్ను కోరిన విధముగ, నీవు ఎఫెసు నందే ఉండుము” (1 తిమో. 1:3) అని పౌలు తెలియజేయు చున్నాడు. అచట అసత్య బోధకులు వారి అసత్య బోధనలను మానివేయునట్లు తిమోతి ఆజ్ఞాపింప వలయును. తిమోతి సత్యమును, విశ్వాసమును కాపాడ వలయును. తిమోతి మంచి పోరాటమును పోరాడగలనన్న నమ్మకం పౌలుకు ఉండెను. తిమోతి తన విశ్వాసమును, నిర్మలమగు అంత:కరణమును కాపాడుకొన వలయును. తమ విశ్వాసమును నాశనము చేసుకొనిన హుమెనేయు మరియు అలెగ్జాండరులను పౌలు దైవ సంఘమునుండి బహిష్కరించెను (1 తిమో. 1:18-20).

1.3. లేఖ ఉద్దేశ్యము

ఈ లేఖ ముఖ్యోద్దేశమును 3:14-15లో చూడవచ్చు:

“నేను ఈ ఉత్తరమును వ్రాయుచు, నిన్ను త్వరలో వచ్చి చేరగలనని ఆశించు చున్నాను. కాని, ఒకవేళ, నేను ఆలస్యము చేసినచో, దేవుని గృహమున మనము ఎట్లు ప్రవర్తింప వలెనో నీకు ఈ ఉత్తరము తెలియజేయును. సత్యమునకు మూలస్థంభమును, పునాదియునగు సజీవ దేవుని శ్రీసభయే ఈ గృహము.”

1.4. ప్రధానాంశాలు
1.4.1. శ్రీసభ ‘నిర్మాణం’ లేదా క్రమము (3:1-13, 5:3-22)

ఇచ్చట వివిధ రకాలైన దైవసంఘ నిర్వాహకుల గురించి చెప్పబడినది: పీఠాధిపతులు లేదా సంఘాధిపతులు (1 తిమో. 3:1-7), దైవసంఘ సహాయకులు లేదా దీకనులు (1 తిమో. 3:8-13) మరియు వితంతువులకు నియమాలు (1 తిమో. 5:3-16). దైవసంఘమునకు తిమోతి నాయకుడు. అతనికి సహాయము చేయుటకు పెద్దలు, పీఠాధిపతులు, దీకనులు మరియు వితంతువులు ఉండిరి. “ఎవనికైనను హస్త నిక్షేపణ చేయుటకు తొందర పడకూడదు” (1 తిమో. 5:22) అని పౌలు తిమోతికి తెలియజేయు చున్నాడు. మొదట వారు పరీక్షింపబడ వలయును.

1.4.1.1. పీఠాధిపతులు లేదా సంఘాధిపతులు (1 తిమో. 3:1-7)

పీఠాధిపతులు లేదా సంఘాధిపతుల అర్హతల గురించి 1 తిమో. 3:1-7లో చూస్తున్నాము:

- దోషరహితుడును, విజ్ఞతకలవాడును, ఇంద్రియ నిగ్రహము, క్రమశిక్షణ కలవాడునై ఉండవలయును.
- క్రమశిక్షణను కలవాడునై ఉండవలెను.
- అతిధులను ఆదరింప వలెను.
- ఉత్తమ బోధకుడై ఉండవలయును.
- త్రాగుబోతుగాని, దుర్జనుడుగాని కాక, సాత్త్వికుడును, జగడమాడని వాడునై ఉండవలయును.
- ధనాపేక్ష కలిగి ఉండరాదు.
- క్రొత్తగా క్రైస్తవుడైన వ్యక్తి కారాదు.
- క్రీస్తు సంఘమునకు చెందని వారి మధ్యలోకూడ మంచి పేరుకలవాడై ఉండవలెను.

“ఎవడైనను సంఘాధిపత్యమును ఆశించిన యెడల అతడు ఉత్తమ కార్యమును కోరుచున్నాడు” (1 తిమో. 3:1) అను వాక్యమును బట్టి ఆ పదవి చాలా ఉన్నతమైనదని మరియు బాధ్యతాయుతమైనదని అర్ధమగుచున్నది.

1.4.1.2. దైవసంఘ సహాయకులు లేదా దీకనులు (1 తిమో. 3:8-13)

వీరు కూడా సంఘాధిపతుల అర్హతలవంటి వాటినే కలిగి యుండవలెను:

- మంచి నడవడిక గలవారై, రెండు నాల్కలు గల వారుకాక కపటము లేనివారు కావలెను.
- త్రాగుబోతులు కాని, అత్యాశ కలవారు కాని కారాదు.
- నిర్మలమైన అంత:కరణముతో విశ్వాస పరమ రహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెను.
- దోషరహితులై ఉండవలయును.
- క్రీస్తు యేసు నందలి విశ్వాసమునందు బహుధైర్యము కలవారై ఉండవలయును.

గమనింపదగిన విషయాలు: “మొదట వారు పరీక్షింప బడవలెను” (1 తిమో. 3:10) అను వాక్యము వీరు యువ సమూహమునకు చెందినవారని అర్ధమగు చున్నది. అలాగే, “తమ విధులను సక్రమముగా నెరవేర్చు వారు మంచి పదవిని సంపాదించు కొనెదరు” (1 తిమో. 3:13) అను వాక్యమును బట్టి సహాయకులు లేదా దీకనులు పీఠాధిపతులుగా లేదా సంఘాధిపతులుగా అర్హత సాధిస్తారని అర్ధమగు చున్నది. అందులకే ఇరువురి అర్హతలు ఒకే మాదిరిగా ఉన్నవి.

గ్రీకు పదము “దియాకొనేయిన్ అనగా “సేవ”. ‘దీకనులు’ అను పదము దీనినుండి సంగ్రహించ బడినది. వీరు పీఠాధిపతులకు లేదా సంఘాధిపతులకు సహాయకులగా ఉండిరి.

ఆనాటి దైవ సంఘములో స్త్రీ దీకనులు ఉండిరా? దీకనుల అర్హతలను ప్రస్తావిస్తూ పౌలు 1 తిమో. 3:8లో పురుష దీకనుల గురించి చెప్పడం ఆరభించారు, అయితే, 1 తిమో. 3:11 నుండి “పరిచర్య చేయు స్త్రీలు” గురించి ప్రస్తావించాడు. పౌలు ప్రస్తావించిన ఈ “పరిచర్య చేయు స్త్రీలు” ఎవరు? సంఘములో పరిచర్య చేయుచున్న సాధారణమైన స్త్రీలుగా భావింపవచ్చా? లేక వారు పురుష దీకనుల యొక్క భార్యలుగా భావింపవచ్చా? 1 తిమో. 3:12లో “పరిచారకుడు (‘దీకను’) ఒకే భార్యను కలిగి ఉండాలి. ఆమె తన సంతానమును, కుటుంబమును చక్కదిద్దు కొనగలిగి ఉండవలెను” అని చెప్పబడినది. ఇదే వాస్తవమైనచో (“పరిచర్య చేయు స్త్రీలు” కూడా దీకనులు అయినచో), స్త్రీ దీకనుల అర్హతలుకూడా పురుష దీకనుల అర్హతల వంటివే: సత్ప్రవర్తన కలిగి ఉండాలి. కొండెములను చెప్పనివారై ఉండవలయును. ప్రతీ విషయములోను అణకువ కలవారై నమ్మకమైన వారుగా ఉండవలెను (1 తిమో. 3:11). ఆర్.ఇ. బ్రౌన్ ప్రకారం, గ్రీకు పదం “దియాకొనోస్” స్త్రీ, పురుషులకు ఇరువురికి వర్తిస్తుంది. రోమీ. 16:1లో ఫేబీ అనబడు పరిచారకురాలు గురించి ప్రస్తావించ బడినది.

పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖలో దీకనుల గురించి ఎంతగానో చెప్పబడినప్పటికిని, వారు చేయవలసిన సేవ గురించి ఏమీ చెప్పబడలేదు. అ.కా. 6:1-6 ప్రకారం, “అనుదిన పరిచర్యలో ఆహార పరిచర్యల యందు నిమగ్నులై ఉండుటకు” అని తెలుప బడినది. అనగా, క్రైస్తవ సంఘ ఆర్ధిక లావాదేవీలను చూసుకొనెడి వారు. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడు చున్నారని గ్రీకు మాట్లాడెడి యూదులు, హెబ్రీయుల మీద సణిగిన సందర్భముగా శిష్యులు సంఘమంతటిని సంప్రదించి వీరిని ఎన్నుకొనిరి.

స్తెఫాను మరియు ఫిలిప్పులు అను పరిచారకులు (దీకనులు) బోధనలు కూడా చేసియున్నారు (అ.కా. 7, 8:4-8).

1.4.1.3. వితంతువులకు నియమాలు (1 తిమో. 5:3-16)

క్రైస్తవ సంఘాలు, కుటుంబాలు విధవలను ఆదరించవలయును. వారు సంఘములో ఏమైనా బాధ్యతలను నిర్వర్తించారా లేదా మరియు శ్రీసభ ‘నిర్మాణ క్రమ’ విషయములో వారు భాగమేనా అన్న విషయాలు స్పష్టముగా చెప్పబడలేదు.

“నిజమైన అనాథలైన విధవలు” (1 తిమో. 5:3) ఎవరు? భర్తల మరణము వలన విధవలైనవారు, సంఘములో పరిచర్యలు చేయుచున్న విధవలు అని వ్యత్యాసము చూపించుటకు చెప్పబడినదని అర్ధమగు చున్నది.

వితంతువులు లేదా విధవల అర్హతలు:

- అరువది యేండ్లు దాటినవారై యుండాలి (1 తిమో. 5:9). యువతులగు విధవలను చేర్చకూడదు (1 తిమో. 5:11).
- ఒక్క పురుషునకు మాత్రమే భార్యయై ఉండవలయును (1 తిమో. 5:9).
- సత్కార్యములు చేయుటయందు ప్రఖ్యాతి గలదియై యుండవలయును (1 తిమో. 5:10).
- బిడ్డలను సక్రమముగా పెంచవలయును (1 తిమో. 5:10).
- తన గృహమున అతిధులను ఆదరించవలయును (1 తిమో. 5:10).
- దైవ ప్రజల పాదములను కడిగి, కష్టములో ఉన్నవారికి తోడ్పడి, అన్ని విధముల మంచిని చేయుటకు పూనుకొనినదై ఉండవలయును (1 తిమో. 5:10).
- తన భారమును దైవసంఘముపై మోపక సాయపడవలయును(1 తిమో. 5:5, 10).

వితంతువులు లేదా విధవల బాధ్యతలు:

- రేయింబవళ్ళు ప్రార్ధన చేయాలి (1 తిమో. 5:5). విధవరాలైన అన్నమ్మ రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి యుండెను అని లూకా 2:36-37లో చూస్తున్నాము. ఈమె క్రైస్తవ సంఘములో నున్న వితంతువులందరికి ఆదర్శము.
- తన గృహమున అతిధులను ఆదరించ వలయును. దైవప్రజల పాదములను కడగ వలయును. కష్టములో ఉన్నవారికి తోడ్పడ వలయును (1 తిమో. 5:10).

పౌలు వేరే వితంతువుల గురించి కూడా 1 తిమో. 5:11-16లో తెలియజేయు చున్నాడు. వారే “యువతులగు విధవలు” వారిని పట్టికలో చేర్చరాదు అని పౌలు స్పష్టముగా తెలియజేయు చున్నాడు. ఎందుకన,

- వారికి వివాహమాడు కోర్కె కలిగించినచో వారు క్రీస్తు నుండి మరలిపోయి, ఆయనకు చేసిన తమ మొదటి వాగ్ధానమును భంగమొనర్చిన దోషులగుదురు.
- వారు సోమరులై ఇంటింట తిరుగుచూ, వారు మాట్లాడని విషయములను గూర్చి మాట్లాడుచు, వారి కబురులతో అధిక ప్రసంగము చేసెదరు.

కనుక, పౌలు వారికి ఇచ్చుచున్న సలహా ఏమనగా, “విరోధులు నిందించుటకు అవకాశము ఈయకుండుటకై, యువతులగు వితంతువులు వివాహమాడి, సంతానవతులై గృహ నిర్వహణమున శ్రద్ధ వహింప వలెను” (1 తిమో. 5:14). ఇప్పటికే కొందరు విధవలు త్రోవ తప్పి సైతానును అనుసరించు చున్నారని, పౌలు హెచ్చరిస్తున్నాడు (1 తిమో. 5:15).

ఇలాంటి యువతులగు వితంతువులను ఉద్దేశించే, పౌలు 1 తిమో. 2:9-15లో పౌలు ఇలా చెప్పి యున్నాడు”

“స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకముతో మర్యాదస్థులుగా మెలగవలెనని, సక్రమముగా దుస్తులు ధరింప వలెనని నా వాంఛ. వారు చిత్ర విచిత్రములగు జడలను, బంగారు ఆభరణములను, ముత్యములను, మిగుల విలువైన వస్త్రములను ధరింపక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లు సత్కార్యములచేత తమ్ముతాము అలంకరించు కొనవలెను. స్త్రీలు మౌనమును పాటించుచు సంపూర్ణ విధేయతతో బోధనలను ఆలింపవలెను.స్త్రీలు బోధన చేయుటగాని, పురుషులపై అధికారము కలిగి యుండుట కాని నేను అనుమతింపను. వారు మౌనముగ ఉండ వలెను. ఏవ కంటె ముందుగ ఆదాము సృష్టింపబడెను గదా! అంతేగాక మోసగింప బడినది ఆదాము కాదు. ఆ స్త్రీయే మోసగింపబడి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినది. కాని అణకువతో విశ్వాసము, ప్రేమ పవిత్రత యను వానియందు సుస్థిర బుద్ధితో ఉన్నచో స్త్రీలు బిడ్డలను కనెడి ధర్మమూ వలన రక్షింపబడుదురు.”

1.4.2. అసత్యపు బోధకులు (1:3-20, 3:14-4:10, 6:3-10)

విరోధమైన బోధనలు, సిద్ధాంతాలు వివిధ క్రైస్తవ సంఘాలలో ప్రబలిపోయాయి. పౌలుకూడా స్వయముగా, తన సత్య బోధనలను వ్యతిరేకించిన అసత్య బోధకులను ఎదుర్కొన్నాడు. “వివాహ మాడుట” మరియు “కొన్ని పదార్ధములు తిను విషయము” మొదలగు విషయములలో వచ్చిన అసత్య బోధనలను పౌలు అడ్డుకొని, సరిచేసియున్నాడు. క్రైస్తవులు ఇప్పటికే ఆధ్యాత్మికతను సాధించారు, కనుక వారు సెక్స్, వివాహము, భోజనమునకు దూరముగా ఉండాలని అసత్యపు బోధకులు సూచించారు. ఈ అసత్యపు బోధనల వలన కొందరు స్త్రీలు మోసపోతిరి (1 తిమో. 5:13, 1 తిమో. 3:6).

“మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క యథార్ధములగు పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తియైన, జ్ఞాన శూన్యుడు, పొగరుబోతు. అట్టి వానికి వాగ్వివాదముల యందును, వాగ్యుద్ధముల యందును అభిలాష మెండు. వీని మూలముగా అసూయలు, కలహములు, దూషణలు, దుష్ట సందేహములు, సత్యదూరులు బుద్ధిహీనులు అగువారితో వాగ్వివాదములు కలుగుచున్నవి. ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకొందురు” (1 తిమో. 6:3-5).

పౌలు తన జీవితమునే ఉదాహరణగా చూపుచూ, అసత్య బోధనలు చేయువారు మారుమనస్సు పొందవలెనని తెలియజేయు చున్నాడు:

“పూర్వము నేను ప్రభువగు క్రీస్తు యేసును దూషించి, హింసించి అవమానించినను, అది తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక దేవుని దయ నాకు లభించెను. క్రీస్తు యేసుతో ఐఖ్యము అగుటవలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగ కురియ జేసెను. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలి వచ్చెను.ఇది నమ్మదగినది, సంపూర్ణ అంగీకార యోగ్యమైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను. అందువలననే, క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును, కనికరమును చూపెను. ఇకముందు నిత్యజీవము పొందుటకై ఆయనను విశ్వసింప వలసిన వారందరికి నేను ఆదర్శప్రాయుడనుగా ఉండుటకే ప్రధాన పాపినైన నాయందు ఆయన ఇట్లు చేసెను (1 తిమో. 1:13-16).

తిమోతి, యువకుడైనప్పటికిని, అసత్య బోధకులను ఎదుర్కొనుటలో, విశ్వాస సంబంధమగు బోధనను, మంచి సిద్ధాంతమును అనుసరించెను. ఈవిధముగా, తిమోతి క్రీస్తు యేసునకు ఉత్తమ సేవకుడు కాగలిగాడు అని పౌలు ప్రశంశిస్తున్నాడు (1 తిమో. 1:18-19, 4:6).

ఇంతకు ఈ అసత్యపు లేదా బూటకపు బోధకులు ఎవరు? వారు ఏమి బోధించు చున్నారు?

- యూద నేపధ్యము కలిగి ధర్మశాస్త్ర చట్టమును బోధించువారని 1 తిమో. 1:7లో అర్ధమగుచున్నది: “తాము దేవుని చట్టమును బోధించు వారలమని వారు చెప్పుకొందురేగాని, వారు మాట్లాడునది, రూఢిగా పలుకునది వారికే బోధపడదు.”
- కట్టు కథలను, అంతులేని వంశావళులను బోధించెడివారు (1 తిమో. 1:4, 4:7, చూడుము. 2 తిమో. 4:4, తీతు. 1:14, 3:9)

తిమోతి వంటి సత్యబోధకులు యేసు క్రీస్తును అనుసరించ వలయును. అసత్య బోధకులకు దూరముగా ఉండవలయును. సత్యబోధకులు నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను సుగుణములను అలవరచుకొన వలయును. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమునుపోరాడి నిత్యజీవమును గెలుచుకొన వలయును. నిష్కళంకముగా, నిందలేని వారుగా ఉండవలయును (1 తిమో. 6:11-16).

1.4.3. దైవసంఘములో సంబంధాలు, విశ్వాసము (2:1-15, 4:11-5:2, 5:22-6:2, 6:6-19)

- దైవ సంఘములో ఒకరిమధ్య ఒకరికి ఉండవలసిన సంబంధము, బాధ్యత గురించి తెలియజేయు చున్నది. వృద్ధుడగు వ్యక్తిని కఠినముగ గద్ధింపక, అతనిని నీ తండ్రిగ భావించి హెచ్చరింపుము. పిన్నలను నీ సోదరులుగను, వృద్ధ స్త్రీలను తల్లులుగను భావించి సరిదిద్దుము. యువతులను, అక్క చెల్లెండ్రుగా పరిగణించి పూర్ణ పవిత్రతతో తీర్చిదిద్దుము (1 తిమో. 5:1-2).
- 1 తిమో. 2:8-15లో పురుషులు, స్త్రీలు దైవసంఘపు ఆరాధనలో ఎలా ప్రవర్తించాలో సూచనలను చూస్తున్నాము.
- 1 తిమో. 6:1-2లో యజమానులకు, బానిసలకు మధ్య సంబంధము గురించి చెప్పబడినది. “బానిసలు తమ యజమానుల పట్ల సకల గౌరవములను చూపవలెను. యజమానులు విశ్వాసులైనచో, వారు తమ సోదరులేనని, బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగ లాభమును పొందు విశ్వాసులు తమ ప్రియ సోదరులు కనుక వారిని మరింత అధికముగ సేవింపవలెను.” “క్రీస్తునందు అందరు స్వతంత్రులు” అని బోధించిన క్రైస్తవ సంఘాలు బానిసల స్వతంత్రమును గూర్చి చర్చించలేదు.
- 1 తిమో. 2:1-2లో ఆన్నింటి కంటె ముందు మానవులందరి కొరకు ముఖ్యముగ రాజుల కొరకును, అధికారులందరి కొరకును దేవునకు విన్నపములను, ప్రార్ధనలను, మనవులను, కృతజ్ఞతలును అర్పింపవలెను.

1.4.3.1. పౌలుకు స్త్రీలపై నున్న అభిప్రాయం (2:9-12)

1 తిమో. 2:8-12లో చెప్పబడిన సూచనలు స్త్రీలకు మరియు పురుషులకు కూడా వర్తిస్తాయి. స్త్రీలు దుస్తుల విషయములో వివేకముతో మర్యాదస్థులుగా మెలగవలెనని, సక్రమముగా దుస్తులు ధరింపవలెను. స్త్రీలు మౌనమును పాటించుచు సంపూర్ణ విధేయతతో బోధనను ఆలింపవలెను. అణకువతో విశ్వాసము, ప్రేమ, పవిత్రత యను వాని యందు సుస్థిర బుద్ధితో ఉండవలెను. “స్త్రీలు బోధన చేయుటగాని, పురుషులపై అధికారము కలిగి యుండుట కాని నేను అనుమతించను” (1 తిమో. 2:12) అన్న పౌలు వాక్యములను “దైవసంఘ ఆరాధన” నేపధ్యములోనే అర్ధము చేసుకోవలెను. కేవలము ఈ వాక్యమును మాత్రమే చదివే వారికి పౌలు స్త్రీ-ద్వేషియా అనే సందేహం కలగవచ్చు. కాని, 1 తిమో. 5:11-15లో యువతులగు విధవల గురించి చెప్పబడిన నేపధ్యములో అర్ధము చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

దీనిని “బూటకపు బోధకులు” నేపధ్యములో కూడా పౌలు సూచనలను మనము అర్ధం చేసుకోవచ్చు. పౌలు సూచించు స్త్రీలు ధనవంతులు (చూడుము. 1 తిమో. 2:9). “భోగలాలసులైన వితంతువులను” (1 తిమో. 5:6) పౌలు సూచిస్తున్నాడు. వీరు సోమరులై ఇంటింట తిరుగుచూ, వారు మాట్లాడరాని విషయములను గూర్చి మాట్లాడుచు, వారి కబురులతో అధిక ప్రసంగము చేయుట నేర్చుకొందురు” (1 తిమో. 5:13). ఇలాంటి స్త్రీలను బూటకపు బోధకులు వారి బోధనల ప్రచారము కొరకు వినియోగించు కొనుచున్నారు. ఈవిధముగా, ఈ స్త్రీలు “ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకొందురు” (1 తిమో. 6:5, చదువుము. 2 తిమో. 3:6). ఇలాంటి స్త్రీలు ఇంటింట తిరిగి అసత్యవాదుల బోధనలను చాటి చెప్పుచున్నారు. అందుకే పౌలు వీరిని “మోసగింపబడి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన” ఏవతో పోల్చుతున్నాడు (1 తిమో. 2:13-14).

కనుక పౌలు అందరి స్త్రీల గురించి గాక, కేవలం అసత్యపు లేదా బూటకపు బోధకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన స్త్రీల గురించి మాట్లాడుచున్నాడు. అలాంటి స్త్రీలకు బోధనను చేయుటకు గాని, పురుషులపై అధికారము కలిగి యుండుటకు గాని అనుమతి లేదు (1 తిమో. 2:12, చూడుము. తీతు. 2:3).

యువతులగు “స్త్రీలు బిడ్డలను కనెడి ధర్మము వలన రక్షింపబడుదురు” (1 తిమో. 2:15) అనునది 1 తిమో. 5:14లో ప్రతిధ్వనిస్తున్నది, “యువతులగు వితంతువులు వివాహమాడి, సంతానవతులై గృహ నిర్వహణమున శ్రద్ధ వహింపవలెను” (చదువుము. ఆ.కాం. 3:16). ఇది “వివాహ మాడుట దోషమని” (1 తిమో. 4:3) బోధించు వారికి సరియైన సమాధానము.

1.5. ముగింపు

1 తిమో. 6:17-19లో ధనవంతులకు పౌలు సూచనలు చేయుచున్నాడు. వారు గర్విష్టులుగా ఉండక, దేవుని యందే నమ్మకముంచాలి. ఉదారబుద్ధి కలిగి, ధర్మము చేయువారిగ ఉండవలయును.

1 తిమో. 6:20-21లో తిమోతికి అప్పజెప్ప బడిన దానిని భద్రముగా కాపాడుకొన వలయునని, నాస్తిక సంభాషణలకును, కొందరు అవివేకముచే “జ్ఞానము”గ నెంచు మూర్ఖపు వివాదములకును దూరముగ ఉండవలయునని, విశ్వాస మార్గములో నడువ వలయునని సలహా ఇస్తూ పౌలు ఈ లేఖను ముగిస్తున్నాడు.

No comments:

Post a Comment