2.5.5. పునరుత్థానము (15:1-58)

 2.5.5. పునరుత్థానము (15:1-58)
2.5.5.1. శ్రీసభ విశ్వాసము (15:1-11)
2.5.5.2. కొరింతీయుల ఆలోచనను తోసి పుచ్చుట – పౌలు వాదనలు (15:12-34)
2.5.5.3. పునరుత్థానము గూచి పౌలు వ్యక్తిగత వీక్షణ (15:20-28)
2.5.5.3.1. పౌలు మొదటి వీక్షణ 15:20-22
2.5.5.3.2. పౌలు రెండవ వీక్షణ 15:23-28
2.5.5.4. మన పునరుత్థానము (15:35-58)
2.5.5.4.1. పునరుత్థాన వివరణ (15:36-44)
2.5.5.4.1.1. ప్రకృతి నుండి సారూప్యత  (15:36-38)
2.5.5.4.1.2. వివిధ రకాలైన శరీరములు (15:39-41)
2.5.5.4.1.3. పునరుత్థాన పాఠాలు (15:42-44)
2.5.5.4.2. ఆదాము-క్రీస్తు, వర్గీకరణము (15:45-49)
2.5.5.4.3. పునరుత్థానమందు మార్పు (15:50-58)
2.5.5.4.3.1. ప్రభువు రాకయందు పునరుత్థాన పరమ రహస్యము (15:51-53)
2.5.5.4.3.2. ప్రభువు రాకడ – పవిత్ర గ్రంథ యధార్ధములు (15:54-58)

పునరుత్థానము నందు కొంతమంది కొరింతీయులు విశ్వసించలేదు. మృతుల పునరుత్థానము లేదని కొందరు చెప్పుచున్నారు (1 కొరి. 15:12). పునరుత్థాన పరమ రహస్యముగూర్చి వారికి పౌలుగారు తేటతెల్లము చేయుచున్నారు.

గ్రీకులు ‘మృతుల పునరుత్థానము’ను లౌకికమైనదిగా భావించారు. యూదులు బాబిలోనియ ప్రవాసము తర్వాతనే ‘పునరుత్థానము’ అనే ఆలోచనను కలిగియున్నారు. అప్పటినుండి ‘పునరుత్థాన’ అవగాహన యూదులలో క్రమముగా పరిణమిస్తూ వచ్చినది (చూడుము. యోబు. 19:25, కీర్తన. 16:10, యెహెజ్కె. 37:10). అపోకలిప్టిక్ (apocalyptic) కాలములోనే ‘పునరుత్థానము’ అను భావన యూదులలో విస్తరించడం జరిగింది (దాని. 12:2-3, 2 మక్క. 7:9). సద్దూకయ్యులు పునరుత్థానమును ఎప్పటికినీ విశ్వసించలేదు (మత్త. 22:23, మార్కు. 12:18, లూకా. 20:27).

2.5.5.1. శ్రీసభ విశ్వాసము (15:1-11)

“క్రీస్తు మన పాపముల కొరకై మరణించి, సమాధి చేయబడి, మూడవ దినమున సజీవుడుగ లేవనెత్త బడెను” అనునది పౌలు బోధనలలో మూలాధారమైన సువార్త. ఇది శ్రీసభ దృఢ విశ్వాసము. అలాగే ఉత్థాన క్రీస్తు అపోస్తలులకు, విశ్వాసులకు, చివరకు పౌలుకును దర్శన మిచ్చెను. “పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడవ దినమున సజీవుడుగ లేవనెత్త బడెను. ఆయన పేతురునకు తదుపరి పండ్రెండు మంది అపోస్తలులకును కనబడెను... చివరకు నాకును ఆయన దర్శన మిచ్చెను” (1 కొరి. 15:3-8).

ఇచ్చట నాలుగు అనాది క్రైస్తవ విశ్వాస ప్రధాన సత్యాలు పేర్కొన బడ్డాయి:

పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు,

(అ). క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను (చూడుము. యెషయ 53:8-9)
(ఆ). ఆయన సమాధి చేయబడెను
(ఇ). మూడవ దినమున సజీవుడుగ లేవనెత్త బడెను (యెషయ 53:10-11, హోషె. 6:2, యోనా. 2:17)
(ఈ). ఆయన పేతురునకు, తదుపరి పండ్రెండు మంది అపోస్తలులకును కనబడెను.

“మన పాపముల కొరకు” అను వ్యక్తీకరణ క్రీస్తు మరణము యొక్క రక్షణ కార్య కారకముగా నొక్కి చెప్ప బడుతుంది. 15:6-8లో ఉత్థాన క్రీస్తు దర్శనాల గూర్చి పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఎందుకన, పౌలుకు ఈ దర్శనాలు పునరుత్థాన వాస్తవానికి నిదర్శనాలు. కొరింతీయుల మదిలో నున్న అనుమానాలను తొలగించుటకు ఉత్థాన క్రీస్తు దర్శనాల గూర్చి పౌలు తెలియజేయు చున్నాడు.

పౌలు ఎప్పుడు కూడా తననుతాను క్రీస్తు అపోస్తలునిగా (పండ్రెండు అపోస్తలుల వలె) పరిగణించాడు. ఎందుకన, ఉత్థాన క్రీస్తు తనకి కూడా దర్శన మిచ్చి (1 కొరి. 15:8), దైవ పిలుపును పొంది యున్నాడని తన భావన. “అపోస్తలులందరిలొ అల్పుడైనను, దేవుని అనుగ్రహమున ఇప్పుడున్న స్థితిలో (అపోస్తలుడు) ఉన్నాను. ఇతర అపోస్తలులు కంటె అధికముగా శ్రమించితిని” (1 కొరి. 15:9-11) అని పౌలు తెలియజేయు చున్నాడు.

2.5.5.2. కొరింతీయుల ఆలోచనను తోసి పుచ్చుట – పౌలు వాదనలు (15:12-34)

“మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్త బడెనని గదా మా సందేశము! మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు?” (1 కొరి. 15:12) అని పౌలు కొరింతీయులను ప్రశ్నిస్తున్నాడు.

మృతుల పునరుత్థానము లేనిచో, కలిగే పరిణామాలను పౌలు 15:13-19లో వివరిస్తున్నాడు:

(అ). మృతుల పునరుత్థానము లేనిచో, క్రీస్తు లేవనెత్త బడలేదనియే గదా! (15:13, 16)
(ఆ). క్రీస్తే లేవనెత్త బడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే (15:14)
(ఇ). దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తెననుటచే, మేము అసత్య మాడినట్లే (15:15)
(ఈ). క్రీస్తు లేవనెత్త బడనిచో, మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు (15:17)
(ఉ). క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే! (15:18)
(ఊ). క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే ఐనచో, ప్రపంచములో అందరి కంటెను మనము అత్యంత దయనీయులము (15:19).

పునరుత్థానము పట్ల కొరింతీయులలో నున్న అవిశ్వాసమును పౌలు ఈవిధముగా త్రోసి పుచ్చుతున్నాడు, ఖండిస్తున్నాడు.

క్రీస్తు పునరుత్థానము చారిత్రాత్మిక వాస్తవము. దీనిని పౌలు నిరూపించాడు. తనతో సహా అనేకమంది ఉత్థాన క్రీస్తుకు సాక్షులై యున్నారు. కనుక, పునరుత్థానమును విశ్వసించక పోవడం రక్షణీయ మైనది కాదు. విశ్వసించనిచో పరిణామాలు దారుణమైనవి: పౌలు బోధన వ్యర్ధము, కొరింతీయుల విశ్వాసము వ్యర్ధము. దీని అర్ధం వారు ఇంకను పాపములోనే జీవిస్తున్నారు మరియు విశ్వాసముతో మరణించిన వారు భ్రష్టులైనట్లే!

కాని క్రీస్తు ప్రభువు నిజముగా ఉత్థానమైనారు. తన ఉత్థానము ద్వారా మరణించిన వారి ఉత్థానము సాధ్యమగును.

15:12-19లో వలెనె, 15:29-34లో కూడా పౌలు తన వాదనలను వివరిస్తున్నాడు:

(అ). మరణించిన వారు లేవనెత్త బడనిచో, మృతుల కొరకు జ్ఞానస్నానమును ఎలా పొందు చున్నారు? ఇచ్చట కొరింతీయులలో నున్న ఆచారమును దృష్టికి తెచ్చు చున్నాడు. అదేమనగా, వారి ఆచారం ప్రకారం, కొరింతీయులు మరణించిన వారి బంధువుల కొరకు రెండవసారి జ్ఞానస్నానమును పొందేవారు. ఇది మృతుల పునరుత్థానము పట్ల వారి విశ్వాసమును ప్రకటిస్తుంది. అట్లయిన, వారిలో కొంతమంది ఎట్లు విశ్వసించ కుండా ఉన్నారు అనునది పౌలు ప్రశ్న మరియు సవాలు!

(ఆ). మృతుల పునరుత్థానము లేనిచో, పౌలు పొందెడు అపాయములకు, ఎఫెసులోని మృగములతో పోరాడటములో అర్ధము లేదు (1 కొరి. 15:30-32).

(ఇ). మృతుల పునరుత్థానము లేనిచో, “రేపు మనము మరణింతుము కనుక హాయిగా తిని త్రాగుము” (1 కొరి. 15:32).

(ఈ). కనుక, మోసపోకుడు, చెడ్డ స్నేహితులు మంచి నడవడికను నాశనము చేయుదురు (1 కొరి. 15:33).

(ఉ). జ్ఞానము కలిగి పాప మార్గము నుండి మరలి పోవుడు. మీలో కొందరు (మృతుల పునరుత్థానమును విశ్వసించని వారు) దేవుని ఎరుగరు. దేవుని ఎరుగక పోవటం, వారు సిగ్గు పడునట్లు చేయును (1 కొరి. 15:34).

2.5.5.3. పునరుత్థానము గూచి పౌలు వ్యక్తిగత వీక్షణ (15:20-28)

15:20-28లో పునరుత్థానము గురించి పౌలు తన వ్యక్తిగత భావాలను తెలియజేయు చున్నాడు: మృతుల నుండి లేవనెత్త బడిన వారిలో క్రీస్తు ప్రధముడు. ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే, మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదాము నందు అందరు ఎట్లు మృతి చెందు చున్నారో, క్రీస్తు నందు అందరు బ్రతికింప బడుదురు.

2.5.5.3.1. పౌలు మొదటి వీక్షణ 15:20-22

క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్త బడెను. మృత్యువు నుండి లేవనెత్త బడిన వారిలో క్రీస్తు ప్రధముడు (1 కొరి. 15:20). ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించెను. అట్లే, మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలమున వచ్చెను (1 కొరి. 15:21). ఆదాము నందు అందరు మృతి చెందు చున్నారు. అటులనే క్రీస్తు నందు అందరు బ్రతికింప బడుదురు (1 కొరి. 15:22).

2.5.5.3.2. పౌలు రెండవ వీక్షణ 15:23-28

- క్రీస్తు మృతులలో నుండి లేవనెత్త బడెను.

- క్రీస్తుకు చెందిన వారు, ఆయన రాకడ సమయమున మృత్యువు నుండి లేవనెత్త బడుదురు (1 కొరి. 15:23). దేవుడు శతృవుల నందరను ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింప వలెను (1 కొరి. 15:25). పునరుత్థాన సమయము నుండి క్రీస్తు పరిపాలించును. క్రీస్తు పరిపాలన ప్రయోజనం, ఉద్దేశ్యము శతృవులందరు కూడా క్రీస్తుకు విధేయతను చూపడం. “దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను” (కీర్తన. 110:1, 8:6). “సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచుట” (1 కొరి. 15:25) అనగా దేవుడు మినహా సమస్తమును, ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచుననునది సుస్పష్టము (1 కొరి. 15:27). నాశనము చేయబడ వలసిన చివరి శతృవు మృత్యువు (1 కొరి. 15:26). మృత్యువును నాశనము చేయడమే పునరుత్థానము.

- అంతము వచ్చునప్పుడు, పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరిని క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును (1 కొరి. 15:24).

- చివరిగా, కుమారుడు తననుతాను దేవునకు లోబరచు కొనును (చూడుము. 1 కొరి. 3:23). అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును (1 కొరి. 15:28). అంతమున, తన రక్షణ కార్యము కొరకు ఇవ్వబడిన అధికారమును, క్రీస్తు తండ్రి దేవునికి అప్పగించును.

2.5.5.4. మన పునరుత్థానము (15:35-58)

“చనిపోయిన వారు ఎట్లు జీవముతో లేవనెత్త బడుదురు? వారికి యెట్టి శరీరముండును?” (1 కొరి. 15:35) అని కొరింతీయులు తమ సందేహమును, అవిశ్వాసమును తెలిపిరి. దీనికి పౌలు తక్షణ సమాధానం, “ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు అది మరణింపనిదే మొలకెత్తదు” (1 కొరి. 15:36). ప్రకృతిలో వృక్షకోటి పెరుగుదలకు ఈలాంటి సహజ చట్టం ఉన్నప్పుడు, మానవుల మరణం క్రొత్త జీవితమును ఉత్పత్తి చేయలేదా?

2.5.5.4.1. పునరుత్థాన వివరణ (15:36-44)

శరీరము యొక్క ఉత్థానము ‘ఎలా’ జరుగునని పౌలు ఈ క్రింది విధముగా వివరిస్తున్నారు:

ముందుగా, పౌలు ప్రకృతి నుండి సారూప్యతను తీసుకొని వివరించాడు (1 కొరి. 15:36-38).
ఆ తరువాత వివిధ రకాలైన శరీరముల గురించి ప్రస్తావించాడు (1 కొరి. 15:39-41).
చివరిగా, పునరుత్థానము గురించిన పాటాలను తెలియజేయు చున్నాడు (1 కొరి. 15:42-44).

2.5.5.4.1.1. ప్రకృతి నుండి సారూప్యత  (15:36-38)

- ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు, విత్తనము మరణించినప్పుడు, ఒక మొక్క మొలకెత్తును.
- భూమిలో నాటునది విత్తనము మాత్రమే. కాని బయటకు వచ్చునది ఒక క్రొత్త మొక్క.
- అనేక రకములైన విత్తనములున్నవి. అనేక రకములైన మొక్కలున్నవి.

2.5.5.4.1.2. వివిధ రకాలైన శరీరములు (15:39-41)

- జీవ కోటిలో అనేక శరీరములున్నవి. అన్నియు ఒకే విధముగా ఉండవు. అనేక శరీరములు: మానవులు, జంతువులు, పక్షులు, చేపలు.
- అనేక ఆకాశ వస్తు రూపములు, భూవస్తు రూపములున్నవి. భూవస్తు రూపముల వైభవము ఒక విధమైనది. ఆకాశ వస్తు రూపముల వైభవము వేరొక విధమైనది.
- సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు: ఒక్కొక్కటి ఒక్కొక్క వైభవమును కలిగి యున్నది.

2.5.5.4.1.3. పునరుత్థాన పాఠాలు (15:42-44)

1. భూమిలో నాటబడిన విత్తనము మరణించు నట్లుగనే, మానవ శరీరము కూడా మరణించును. విత్తనము మరణించు నప్పుడు, మొక్క ఏవిధముగా మొలకెత్తునో, మానవ శరీరము కూడా లేప బడును.
2. నాటబడినది నశించును. లేవనెత్త బడునది నశించనిది.
3. క్షయమగునదిగా విత్తబడి, అక్షయమగునదిగా లేప బడును.
4. గౌరవము లేనిదిగా విత్తబడి, వైభవము గలదిగా లేప బడును.
5. బలహీనమైనదిగా విత్తబడి, బలము గలదిగా లేప బడును.
6. భౌతిక శరీరముగా అది విత్తబడి, ఆధ్యాత్మిక శరీరముగా అది లేప బడును.
7. భౌతిక శరీరముల, ఆధ్యాత్మిక శరీరముల వైభవములో వ్యత్యాసమున్నట్లే, భౌతిక, ఆధ్యాత్మిక మానవ శరీరముల వైభవములో కూడా వ్యత్యాసముండును.

2.5.5.4.2. ఆదాము-క్రీస్తు, వర్గీకరణము (15:45-49)

ఆదికాండము 2:7 ప్రకారముగా, ఆదాము-క్రీస్తు వర్గీకరణ విధానాన్ని పౌలు చూపుచున్నారు (1 కొరి. 15:21-22).

1. మొదటి మానవుడైన ఆదాము సజీవిగా సృష్టింప బడెను (ఆ.కాం. 2:7). చివరి ఆదామైన యేసు క్రీస్తు ప్రాణ ప్రదాతయగు ఆత్మ.
2. మొదటి మానవుడు, ఆదాము భువినుండి వచ్చెను. భువియందలి మట్టితో చేయబడెను. రెండవ ఆదాము, యేసు క్రీస్తు దివి నుండి వచ్చెను.
3. భువికి సంబంధించిన వారు భువినుండి చేయబడిన వానిని పోలి యుందురు. దివికి సంబంధించిన వారు దివినుండి వచ్చిన వానిని పోలి యుందురు.
4. భువి నుండి పుట్టిన వానిని పోలి యుండిన మనము, దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము.

2.5.5.4.3. పునరుత్థానమందు మార్పు (15:50-58)

పౌలు మరొక సారి రక్త మాంసములతో చేయబడిన మానవునికి, దైవరాజ్యమునకు మధ్యగల వ్యత్యాసమును తెలియజేయు చున్నాడు (1 కొరి. 15:50).

1. భువి యందలి మానవుడు (జీవించుచున్నను, మరణించినను), “రక్త మాంసములు” మరియు “నాశనమగునది”గా పిలువ బడుచున్నాడు.
2. భువి యందలి మానవుడు అమరత్వం పొందలేడు, బలహీనుడు, నాశనమగును. దివి యందలి జీవితము అమరత్వమైనది.

2.5.5.4.3.1. ప్రభువు రాకయందు పునరుత్థాన పరమ రహస్యము (15:51-53)

పునరుత్థాన పరమ రహస్యమును పౌలు తెలియజేయు చున్నాడు. అలాగే, ప్రభువు రాకడ సమయమున సజీవులలో తను కూడా ఉందునని పౌలు ఆశిస్తున్నాడు (1 తెస్స. 4:16-17). కాని, ఈ భావనను పౌలు తరువాత మార్చుకున్నాడు (చూడుము. 2 కొరి. 4:14). ప్రభువు రెండవ రాకడ సమయమున తాను మృతులలో ఒకనిగా ఉందునని తలంచు చున్నాడు.

ప్రభువు రాకడ సమయమున సంభవించు ఘటనలను గూర్చి పౌలు తెలియజేయు చున్నాడు:

సజీవులలో సంభవించు మార్పులు:

1. వారు మరణింపరు కాని వారియందు చివరి బాకా మ్రోగగానే, రెప్పపాటు కాలములో మార్పు సంభవించును (1 కొరి. 15:51-52).
2. భౌతిక మయినది అమరమయిన దానిని కప్పుకొన వలయును (1 కొరి. 15:53). నిత్యమైన దానిని ధరింప వలయును (2 కొరి. 5:2-4).

మృతులలో సంభవించు మార్పులు:

1. బాకా మ్రోగుటతో మృతులు అమరులై లేవనెత్త బడుదురు (1 కొరి. 15:52).
2. మరణించునది మరణింపని దానిని ధరించు కొనవలయును (1 కొరి. 15:53).

2.5.5.4.3.2. ప్రభువు రాకడ – పవిత్ర గ్రంథ యధార్ధములు (15:54-58)

1. కనుక భౌతికమయినది అమరమయిన దానిని కప్పుకొని నప్పుడు, మరణించునది మరణింపని దానిని ధరించి నపుడు (1 కొరి. 15:54), “మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణము” (యెషయ 25:8) అను పవిత్ర గ్రంథ వాక్యము యధార్ధమగును.
2. పౌలు హోషె. 13:14ను ఉదాహరణగా ఇచ్చుచున్నాడు, “ఓ మృత్యువా! నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా! బాధ కలిగింప గల నీ ముళ్ళు ఎక్కడ?” ఈ వాక్యమునకు పౌలు వేరే అర్ధమును ఇచ్చుచున్నాడు. అదేమనగా, ‘క్రీస్తు పునరుత్థానము, మరణముపై విజయాన్ని పరిపూర్ణం చేసినది, మరణపు ముల్లును తీసి వేసినది’.
3. పౌలు ప్రకారం, మరణపు ముల్లు పాపము. పాపము కన్నా బలము ధర్మశాస్త్రమే (1 కొరి. 15:56).
4. మరణమును నాశనము చేయుట, యేసు క్రీస్తు ద్వారా దేవుడు క్రైస్తవులందరికి ప్రసాదించిన విజయము (1 కొరి. 15:57).

1 కొరి. 15:58వ వచనం, పౌలు పునరుత్థానము గురించి ఇచ్చిన వివరణకు ముగింపు వాక్యము. దృఢముగా, స్థిరముగా నిలబడుడని, ప్రభు కార్యములో సర్వదా శ్రద్ధ చూపుడని కొరింతీయులను కోరుచున్నాడు. ఏలయన, ప్రభువు సేవలో వారు చేయు ఎట్టి కార్యము నిష్ప్రయోజనము కాదు.

No comments:

Post a Comment