2.5.4. ఆరాధన, ప్రభు భోజనము, పవిత్రాత్మ వరాలు, ప్రేమ (11:2-14:40)

 2.5.4. ఆరాధన, ప్రభు భోజనము, పవిత్రాత్మ వరాలు, ప్రేమ (11:2-14:40)
2.5.4.1. ఆరాధనలో సరైన వస్త్రధారణ (11:2-16), ప్రవర్తన (14:33-36)
2.5.4.2. ప్రభు భోజనము (11:17-34)
2.5.4.2.1. దివ్య భోజన సమావేశములో దుర్వినియోగాలు (11:17-22)
2.5.4.2.2. ప్రభువు భోజనము – స్థాపన (11:23-26)
2.5.4.2.3. ఆత్మ పరిశీలన (11:27-34)
2.5.4.3. పవిత్రాత్మ వరాలు (12:1-11)
2.5.4.4. ప్రేమ (13:1-13)
2.5.4.5. ప్రవచనం, భాషలలో మాటలాడుట, ఆధ్యాత్మిక వరాలు (14)

పౌలు తాను పొందిన సమాచారం ప్రకారం (1 కొరి. 1:11), క్రైస్తవ ఆరాధనలో కొన్ని సమస్యలు ఉన్నట్లు మనకు తెలియు చున్నది. ఈ విషయములలో కొరింతీయులు అడిగిన ప్రశ్నలకు పౌలు సమాధాన మిస్తున్నాడు (1 కొరి. 7:1). ఆ సమస్యలలో ఒకటి ఆరాధనలో సరైన దుస్తులను ధరించడం (1 కొరి. 11:2-16). రెండవ సమస్య ప్రభు భోజన సమావేశాలలో క్రైస్తవుల మధ్య సహవాసము లేకపోవడం మరియు ఇతరుల పట్ల దయ, ఔదార్యం లేకపోవడం (1 కొరి. 7:17-34).

2.5.4.1. ఆరాధనలో సరైన వస్త్రధారణ (11:2-16), ప్రవర్తన (14:33-36)

11:2-16: తాను అందజేసిన సంప్రదాయములను యథాతథముగా అనుసరించుచున్నారని పౌలు కొరింతీయులను అభినందిస్తున్నాడు (11:2). ఆ సంప్రదాయాలు ఏమనగా,

(అ) అధికార క్రమము: ఆరాధన సమయములో, స్త్రీలు తలపై ముసుగు వేసుకొనవలెను (11:3-6). క్రీస్తు ప్రతి వ్యక్తిపై అధికారి, భర్త భార్యపై అధికారి, దేవుడు క్రీస్తుపై అధికారి. అయితే, కొరింతు సంఘములో సమస్య ఏమనగా, కొందరు స్త్రీలు తలపై ముసుగును ధరించుటలేదు.

(ఆ) సృష్టి క్రమము: ఈ క్రమము ప్రకారం, అధికారమునకు సూచనగా, స్త్రీ తప్పక తలపై ముసుగు ధరింపవలెను. (11:7-12). ఆది కాండము 2వ అధ్యాయం ప్రకారం, పురుషుడు దేవుని రూపమున మహిమను ప్రతిబింబించును. స్త్రీ పురుషుని వైభవమును ప్రతిబింబించును (11:7). ఆ.కాం. 6:1-4లోని గాథ, మరల పునరావృతం కాకుండా, అనగా, దేవపుత్రులు, మానవ కుమార్తెల సౌందర్యమును చూచి శోధింపబడక ఉండుటకు, స్త్రీలు తప్పకకుండా తలపై ముసుగును ధరించాలి.

(ఇ). ప్రకృతి క్రమము: స్త్రీకి పొడవైన జుట్టు మరింత సౌందర్యమును జోడించును (11:13-16). ఆ పొడవైన జుట్టు ఆమెకు తలను కప్పుకొనుటకు ఒసగబడినది. పురుషునికి పొడవైన వెంట్రుకలు అవమానకరమని ప్రకృతియే బోధించుచున్నది.

1 కొరి 14:34-35 కూడా ఆరాధన సమయములో స్త్రీల ప్రవర్తన గురించి చర్చిస్తున్నది. ఈ భాగము పౌలు వ్రాయలేదని, తరువాత చేర్చబడినదని బైబులు పండితుల అభిప్రాయం. దీనికి రెండు కారణాలు: ఒకటి చట్టానికి దాని విజ్ఞప్తి, బహుశా, ఆ.కాం. 3:16, ఇది పౌలుది కాదు. రెండవది, 11:5లో పౌలు చెప్పినదానికి ఇది వ్యతిరేకముగా ఉన్నది. సమావేశములయందు స్త్రీలు మౌనముగా ఉండవలెను అని భాగ సారాంశం. ఈ బోధనలను 1 తిమోతి 2:11-14లో కూడా చూడవచ్చు.

ఈ భాగములో, స్త్రీల గురించి మూడు నిషేధాలు చెప్పబడ్డాయి:

దేవాలయాలలో స్త్రీలు మౌనముగా ఉండవలెను,
మాటలాడుటకు అనుమతి లేదు, అణకువతో ఉండవలెను
ఏదైన తెలిసికొనవలెనన్నచో ఇంటి వద్ద అడుగవలెను

దేవాలయాలలో స్త్రీలు మౌనముగా ఉండవలెనను ఆదేశము 11:5కు వ్యతిరేకముగా యున్నది. అందుకే, ఈ భాగం తరువాత చేర్చబడినడినదని పండితులతో ఏకీభవించవచ్చు. లేదా పౌలు కొరింతీయుల పురుషులను ఉద్దేశించి వారు మాత్రమే దేవుని పలుకులను స్వీకరించిరా? (14:36) వ్యంగ్యముగా ప్రశ్నించియుండవచ్చు.

2.5.4.2. ప్రభు భోజనము (11:17-34)

పౌలు మూడు విషయముల గూర్చి చర్చిస్తున్నాడు:

దివ్య భోజన సమావేశములో దుర్వినియోగాలు (11:17-22)
దివ్య భోజనము – స్థాపన (11:23-26)
ఆత్మ పరిశీలన (11:27-34).

2.5.4.2.1. దివ్య భోజన సమావేశములో దుర్వినియోగాలు (11:17-22)

దైవ సంఘముగా సమావేశమైనపుడు కొరింతు విశ్వాసులలో విరుద్ధ వర్గములు ఉన్నవని (1 కొరి. 11:18) పౌలు తెలియజేయు చున్నాడు. ధనవంతులు, పేదవారు అను వర్గములున్నవి. ధనిక క్రైస్తవులు ప్రభువు భోజన సమావేశములకు ముందుగానే వచ్చి భోజనమును ఆరంభించెదరు. వారి ఇష్టానుసారముగా తినుచుందురు. కొందరు ఇంకను ఆకలితో ఉండగా, వారు త్రాగి తూలు చుందురు. పేదవారు వచ్చేసరికి, వారికి కొద్ది భోజనము మాత్రమే ఉండెడిది (1 కొరి. 11:21). వారు కేవలం ‘ప్రభువు భోజన’ సాంగ్యమును అపవిత్ర పరచడమే గాక, పవిత్ర సంఘమును ముక్కలు చేయుచున్నారు.

ఇలాంటి దుర్వినియోగాల గురించి విన్న పౌలు వారిని ఈవిధముగా ప్రశ్నిస్తున్నాడు, “తినుటకు, త్రాగుటకును మీకు మీ యిండ్లు లేవా? లేక మీరు దేవుని సంఘమును తృణీకరించి అవసరములో ఉన్న వ్యక్తులను అవమానింతురా? దీనిని గూర్చి మీకు నేను ఏమి చెప్పవలెను? మిమ్ము పొగడవలెనా?” (1 కొరి. 11:22). ఈ ప్రశ్నలలో ప్రభువు భోజనమును సాధారణ భోజనము నుండి వేరుపరచాలనే భావన కనిపిస్తుంది. తృణీకరణ, అవమానం, పేదలపట్ల ప్రేమ లేకపోవడం, ఇవన్నీ కూడా ‘ప్రభువు భోజనం’ నిజము కాదని నిరూపిత మగుచున్నది. అందుకే పౌలు ఈ సమావేశములు మంచి కంటే చెడును ఎక్కువ చేయుచున్నవని తెలియజేయు చున్నాడు (1 కొరి. 11:17).

2.5.4.2.2. ప్రభువు భోజనము – స్థాపన (11:23-26)

దివ్య భోజనము (దివ్య సత్ప్రసాదము)ను స్వయముగా యేసు ప్రభువే స్థాపించి యున్నాడని, దివ్య భోజనము గురించిన ఉపదేశమును ప్రభువు నుండి నమ్మకమైన సంప్రదాయము నుండి పొంది యున్నానని పౌలు తెలుపుతూ, ప్రభువు ఏవిధముగా ‘దివ్య భోజనము’ను స్థాపించి యున్నాడో తెలియజేయు చున్నాడు (1 కొరి. 11:23-26). పౌలు స్వీకరించిన సంప్రదాయాన్ని క్రైస్తవ సంఘాలకు అందిస్తున్నాడు.

పౌలు చెప్పిన విధానము (11:23-26), మార్కు. 14:22-25, మత్త. 26:26-29 కన్న, లూకా. 22:15-20కి దగ్గరగా ఉన్నది.

దీనిలో పౌలు ప్రత్యేకతలు:

“మీ కొరకు” (11:24)
“నా రక్తములోనైన నూతన నిబంధన” (11:25)
“నా జ్ఞాపకార్ధము చేయుడు” (11:24b, 25b)

ప్రభు దివ్య భోజనము క్రీస్తు యొక్క మరణమును జ్ఞప్తికి చేయు చున్నది. విశ్వాసులు ‘ప్రభువు రాకడ’ కొరకు ఎదురు చూస్తున్న సందర్భమున, ‘దివ్య భోజనము’ పాస్కా విందును వాస్తవిక పరుస్తున్నది.

2.5.4.2.3. ఆత్మ పరిశీలన (11:27-34)

ప్రభువు దివ్య భోజనములో పాల్గొనే ముందు ఆత్మ పరిశీలన ఆవశ్యకతను గూర్చి పౌలు తెలియజేయు చున్నాడు. క్రీస్తు శరీర రక్తములను అయోగ్యముగా తినినను, త్రాగినను, ప్రభువు శరీరమునకు, రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. కనుక, ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని, పాత్రము నుండి త్రాగవలెను. రొట్టెను తినుచు, పాత్ర నుండి త్రాగుచు అది ప్రభువు శరీరము అని గుర్తింపనిచో, అతడు తినుట వలనను, త్రాగుట వలనను తీర్పునకు గురియగును. తీర్పునకు, ఖండనకు గురికాకుండ ఉండవలెనంటే, ప్రభు భోజనమును ఆత్మ పరిశీలన చేసుకొని, యోగ్యరీతిగా స్వీకరించ వలయును. పౌలు ప్రకారం, కొరింతు క్రైస్తవ సంఘములో అనేకమంది వ్యాధిగ్రస్తులై బలహీనముగ ఉన్నారు, కొందరు మరణించారు (1 కొరి. 11:30). ఎందుకన, వారు ప్రభు భోజనమును ఆత్మ పరిశీలన గావించక, అయోగ్యముగా స్వీకరించిరి.

ఆత్మ పరిశీలన గావించుకొనినచో, దేవుని తీర్పునకు గురికాము. “ప్రభు భోజనమున పాల్గొనుటకు సమావేశమైనప్పుడు మీరు ఒకరికొరకు ఒకరు వేచి యుండుడు. ఒకవేళ, ఎవరైనను ఆకలిగొని యున్నచో, మీ సమావేశమున మీరు దేవుని తీర్పునకు గురి కాకుండా ఉండుటకై, అతడు ఇంటి వద్ద భుజింప వలెను” (1 కొరి. 11:33-34) అని పౌలు ప్రభువు భోజన సమావేశములో విశ్వాసులు ఏవిధముగా ప్రవర్తించాలో మరోసారి తెలియజేయు చున్నారు.

2.5.4.3. పవిత్రాత్మ వరాలు (12:1-11)

ఆత్మ సంబంధమైన వరములను గురించి తెలియజేయు సందర్భమున, ముందుగా పౌలు కొరింతి క్రైస్తవులు, పూర్వము అన్యులుగా ఉన్న కాలమున, వారు విగ్రహముల ప్రభావమునకు ఎలా లోనై యుంటిరో, వారికి గుర్తుచేయు చున్నాడు. ఇప్పుడు వారు యేసు నందు విశ్వాసమును కలిగియున్నందున, ‘యేసే ప్రభువు’ అని వారి విశ్వాసమును ప్రకటించుటకు పవిత్రాత్మ వారికి శక్తినొసగును. దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియైనను ‘యేసు నాశనమగును గాక!’ అని శాపనార్ధాలు పలుకజాలడు. ఆరంభములో, క్రైస్తవులు ప్రార్ధనకై సినగోగునకే వెళ్ళేవారు. యూదమతము, నూతన “మార్గము” (అ.కా. 9) లేదా క్రైస్తవ మతమునకు విరోధిగా మారుతున్న సందర్భమున, యూదులు క్రీస్తుకు వ్యతిరేకముగా శాపనార్ధాలు పలికేవారు.

ఆత్మ సంబంధమైన విశేష వరములకు మూలము త్రిత్వైక సర్వేశ్వరుడు, అవి ఆత్మద్వారా ఒసగబడును అని పౌలు నొక్కి చెబుతున్నాడు (12:4-6). ఈ వరములన్నింటిని అందరి మేలుకొరకై ఉపయోగించ వలయును (12:7). ఆ పవిత్రాత్మ వరములు ఏమనగా: వివేకపూర్వకమగు వాక్కు, విజ్ఞానపూర్వకమగు వాక్కు, విశ్వాసము, స్వస్థపరచుశక్తి, అద్భుతములు చేయు శక్తి, ప్రవచన శక్తి, ఆత్మలను వివరించు శక్తి, వివిధ భాషలలో మాట్లాడు శక్తి, భాషల అర్ధమేమో వివరించగల శక్తి, (12:8-10). వీటన్నింటిని పనిచేయు ఆత్మ ఒక్కడే.

2.5.4.4. ప్రేమ (13:1-13)

ప్రేమలేనిచో, దేవుడు తన ఆత్మద్వారా ఒసగు వరములన్నియు కూడా వృధాయేయని, ప్రేమ ఉన్నచో, వాటికి విలువయని, పౌలు నొక్కి చెప్పుచున్నాడు (1-3). ఇచ్చట ఐదు వరముల గురించి చెప్పబడింది: మానవ భాషలను, దేవదూతల భాషలను మాట్లాడుట, ప్రవచనం చేయుట, గొప్ప అద్భుతములు చేయగల విశ్వాసము, సమస్తమును పరిత్యాగము చేయుట (దానధర్మాలు చేయడం), స్వీయత్యాగము చేయుట (శ్రమలను పొంది మరణించుటకైనను సిద్ధపడుట). ఈ వరములన్నియు కూడా ప్రేమచేత ప్రేరేపించబడితేనే, వాటికి విలువ ఉంటుంది. ప్రేమ లేనిచో వాటికి విలువ లేదు.

13:4-7లో ప్రేమయొక్క 15 లక్షణాలను చూస్తున్నాము. సానుకూలముగా చెప్పబడిన లక్షణాలు (7): ప్రేమ సహనము కలది, దయ కలది, సత్యమునందు ఆనందించును, సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రతికూలముగా చెప్పబడిన లక్షణాలు (8): ప్రేమకు అసూయ లేదు, ప్రేమకు డంబము లేదు, ప్రేమకు గర్వము లేదు, ప్రేమకు అమర్యాద ఉండదు, ప్రేమకు స్వార్ధపరత్వము ఉండదు, ప్రేమకు కోపస్వభావము ఉండదు, ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు.

చివరి భాగములో (13:8-13) ప్రేమ శాశ్వతము, శ్రేష్టము అను గుణముల గురించి ప్రశంసించ బడినది. ప్రవచనం, వివిధ భాషలు మాట్లాడటం, విజ్ఞానము... మొదలగునవి, పరిశుద్ధాత్మ వరాలు అయినప్పటికిని, అవన్నియు కూడా పరిమితులు కలవి. కాని, ప్రేమ అనంతమైనది, శాశ్వతమైనది. పౌలు ప్రకారం, ప్రేమ అసంపూర్ణమైన విజ్ఞానమును సంపూర్ణము చేయును. జ్ఞానమునకు బదులుగా నిజమన ప్రేమ వరమును మనం కోరుకోవాలి. జ్ఞానము కొరకు తపించడం కొరింతీయుల అపరిపక్వతకు తార్కాణం. కనుక, వారు, పిల్ల చేష్టలను వీడి, అపరిపక్వతనుండి పరిపక్వతలోనికి అనగా ప్రేమ వరమును వారి లక్ష్యముగా, అతిగొప్పదైన విజ్ఞానముగా కోరుకోవాలని పౌలు ఆశిస్తున్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడింటిలో, ప్రేమ శ్రేష్టమైనదని పౌలు అభిప్రాయం.

2.5.4.5. ప్రవచనం, భాషలలో మాటలాడుట, ఆధ్యాత్మిక వరాలు (14)

ప్రధమ భాగములో, ప్రవచన వరాన్ని భాషలలో మాటలాడు వరముతో పోల్చడం జరిగింది (14:1-25). ద్వితీయ భాగములో, పౌలు ఆచరణాత్మకమైన ఆదేశాలను ఇస్తున్నాడు (14:26-40). ప్రేమను ధ్యేయముగా ఏర్పరచుకోవాలని, ఆధ్యాత్మిక వరమగు ప్రవచన వరమును ఆశించాలని పౌలు కొరింతు సంఘమును కోరుచున్నాడు (14:1). ప్రవచన వరము, భాషలలో మాటలాడుట వరముకన్న గొప్పదని పౌలు తెలియజేయు చున్నాడు. వివిధ భాషలలో మాట్లాడువారు, వారు చెప్పుదానిని వివరించగలగాలి. ఈ ఆధ్యాత్మిక వరములన్నింటిని కూడా క్రీస్తు సంఘాభివృద్ధికై ఉపయోగించాలి (14:12).

వివిధ భాషలలో మాట్లాడేవారు తప్పకుండా, వారు చెప్పుదానిని వివరించే శక్తిని పొంది యుండాలి. అలా లేనిచో అది అజ్ఞానముతో సమానము అని పౌలు అభిప్రాయము (14:9, 13-19). 14:21లో పౌలు యెషయ 28:11-12ను ఉదహరిస్తున్నాడు. ఈ వాక్యాలు అవిశ్వాసులైన ఇజ్రాయేలు ప్రజల గురించి చెప్పబడినవి. దేవుడు, ఆక్రమణ దారులు, అన్యులు అయిన అస్సీరియ ప్రజల భాషలో ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుటకు నిశ్చయించుకున్నాడు. అనగా అన్యులచేత దేవుడు ఇజ్రాయేలు ప్రజలను శిక్షింప నిర్ణయించుకున్నాడు. ఎందుకన ఇజ్రాయేలు ప్రజలు దేవుని విశ్వసింపరైరి. అలాగే, గర్వితులైన నేటి కొరింతీయులుకూడా, అవిశ్వాసులైన ఇజ్రాయేలు ప్రజలవలె శిక్షకు గురి అగుదురని పౌలు హెచ్చరిస్తున్నాడు.

కనుక, క్రీస్తు సంఘాభివృద్ధికై, భాషలలో మాటలాడుట అవిశ్వాసులకు గురుతు అని, ప్రవచించుట విశ్వాసులకు గురుతు అని పౌలు స్పష్టము చేయుచున్నాడు (14:22). ప్రవచించు వరము పాపముల గురించి ఒప్పుదల కలిగించును. నిజ దేవుని తెలుసుకొనునట్లు చేయును (14:24-25).

14:26-33లో పౌలు, భాషలలో మాటలాడుట మరియు ప్రవచించుట వరముల గురించి కొన్ని ఆచరణాత్మక ఆదేశాలను ఇచ్చుచున్నాడు. క్రైస్తవ సంఘ ఆరాధన సమావేశాలలో ఈ వరములను ఉపయోగించుటను ప్రోత్సహించాలి, కాని, సంఘము యొక్క ఆధ్యాత్మిక వికాసమే ఆ వరముల ఉద్దేశమై యుండవలయును. భాషలలో మాటలాడుట తప్పక వివరింప బడాలని పౌలు మరోసారి తెలియజేయు చున్నాడు. ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే ఒకరి తరువాత ఒకరు మాటాడవలెను. ఆ చెప్పబడునది ఏమియో వేరొకనిచే వివరింపబడ వలెను. వివరింపగల వ్యక్తి ఎవరు లేనిచో, భాషలలో మాటలాడు వరమును ఉపయోగించరాదు. ఆవిధముగనే, ఇద్దరు లేక ముగ్గురు ప్రవచించ వలెను, ఇతరులు వివేచింపవలెను. సమావేశములో ఎవరైనను దేవుని నుండి సందేశమును పొందెనేని, వారిని గౌరవించ వలయును. పౌలు ప్రవచించు వరమునకు ప్రాధాన్యతను ఇస్తున్నాడు. అందరు ప్రవచించడం నేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు.

పౌలు, తన బోధనలు అధికారపూర్వకమైన ప్రభువు ఆజ్ఞ అని పునరుద్ఘాటిస్తూ ఈ భాగమును (14:37-40) ముగిస్తున్నాడు. తన బోధనలను గుర్తించనివారు, త్రుణీకరించువారు దేవునిచేత, సంఘముచేత గుర్తింపబడరు అని పౌలు తన ప్రత్యర్ధులను హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరములన్నింటిని సముచితముగాను, క్రమబద్ధముగాను ఉపయోగించాలని, ముఖ్యముగా ప్రవచించుటకై ఆసక్తితో కాంక్షించాలని, భాషలలో మాటలాడుటను నిరోధించరాదని క్రైస్తవులను కోరుచున్నాడు.

No comments:

Post a Comment

Pages (150)1234 Next