2.5.3. వివాహము, బ్రహ్మచర్యము
(7:1-40)
2.5.3.1. వివాహములో లైంగిక సంబంధము (7:1-9)
2.5.3.2. విడాకులు (7:10-16)
2.5.3.3. దేవుని పిలుపు – జీవిత విధానము (7:17-24)
2.5.3.4. అవివాహితులను, విధవరాండ్రను గూర్చిన సమస్యలు (7:25-40)
కొరింతీయులు పౌలుకు వ్రాసిన లేఖలో అడిగిన ప్రశ్నలకు సమాధానములను ఇచ్చు చున్నాడు (1 కొరి. 7:1). ముఖ్యముగా వివాహమునకు సంబంధించిన విషయాల గూర్చి పౌలు చర్చిస్తున్నాడు.
2.5.3.1. వివాహములో లైంగిక సంబంధము
(7:1-9)
వివాహితులు వివాహ ధర్మములను నెరవేర్చ వలయును. అంతేగాని, జ్ఞానస్నానము, వైరాగ్యం, నిరాడంబరం, నియమబద్ధ జీవనం పేరిట వివాహ ధర్మముల నుండి తప్పించు కోవడం భావ్యం కాదు. లేనిచో వివాహ విలువలను తగ్గించిన వారమవుతారు. పౌలు కాల సమాజములో స్త్రీలకు ప్రత్యేకమైన గుర్తింపుగాని, హోదాగాని, అధికారముగాని ఉండేవి కావు. అందుకే వారు అణగ ద్రొక్కబడిన వివాహ బాధ్యతల నుండి తప్పించుకొని స్వతంతృలుగా జీవించాలని చూసేవారు. వివాహమును, వివాహ బంధములో లైంగిక సంబంధాలను పరిరక్షించుటకు పౌలు ప్రయత్నం చేయు చున్నాడు.
వివాహ బాంధవ్యములో, భార్యాభర్తలు ఇరువురు వారి శరీరములను ఒకరినొకరు అర్పించు కొనుచున్నారు. కనుక, ఒకరి శరీరముపై మరొకరికి హక్కు కలదు. “స్త్రీ తన శరీరమునకు యజమానురాలు కాదు. భర్తయే ఆమె శరీరమునకు యజమానుడు. అట్లే పురుషుడు తన శరీరమునకు యజమానుడు కాడు. భార్యయే అతని శరీరమునకు యజమానురాలు” (1 కొరి. 7:4). కనుక, ఒకరికి ఒకరు దూరము కారాదు. సైతాను ఆకర్షణకు లోనుగాకుండునట్లు తిరిగి కలుసు కొనుడు (1 కొరి. 7:5). పౌలు ఉద్దేశ్యం ప్రకారం, వివాహితులు బ్రహ్మచర్యమును పాటించ వలసిన అవసరము లేదు. కాని, పౌలు అభిప్రాయం ఏమిటంటే, “నిజమునకు అందరు నావలెనే ఉండవలెనని నా కోరిక. కాని, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రత్యేకమగు దేవుని వరమును పొంది ఉన్నాడు. ఒకనికి ఈ వరము, వేరొకనికి ఆ వరము. అవివాహితులకు, విధవలకును నేను చెప్పునదేమన, వారు నా వలెనె ఒంటరిగ జీవించుట ఉత్తమము. కాని, నిగ్రహ శక్తి లేకున్నచో వారు వివాహ మాడవలెను. వ్యామోహము వలన వ్యధ చెందుట కంటె వివాహమాడుట మేలు” (1 కొరి. 7:7-9).
2.5.3.2. విడాకులు (7:10-16)
క్రైస్తవ సంఘములో విడాకులకు చోటులేదని, ఇది ప్రభువు ఆజ్ఞగా పౌలు తెలియజేయు చున్నాడు (1 కొరి. 7:10). “ఒకవేళ విడనాడినచో మరల వివాహ మాడరాదు లేదా భర్తతో / భార్యతో సమాధాన పడవలయును” (1 కొరి. 7:11). 1 కొరి. 7:12-16లో ప్రభువు ఆజ్ఞగాకాక, పౌలు తన ఆజ్ఞగా తెలియజేయు చున్నాడు, “ఇది నా మాటయే. ప్రభువు పలుకు కాదు. ఒక క్రైస్తవునికి అవిశ్వాసురాలగు భార్య ఉన్నచో, ఆమె అతనితో జీవించుటకు ఇష్టపడినచో, అతడు ఆమెను విడనాడరాదు. ఒక క్రైస్తవ స్త్రీ అవిశ్వాసియగు పురుషుని వివాహమాడి ఉన్నచో, అతడు ఆమెతో జీవించుటకు ఇష్టపడినపుడు ఆమె అతనిని విడువరాదు... కాని అవిశ్వాసియగు ఒక వ్యక్తి తన క్రైస్తవ భార్యను గాని, భర్తను గాని, విడనాడ దలచినచో అట్లే చేయనిండు. అట్టి సందర్భములలో క్రైస్తవ భర్తగాని, భార్యగాని కట్టుపడి యుండనక్కర లేదు.”
ఆనాడు ఉన్న పరిస్థితులలో భార్యలు వారి భర్తల మరియు బానిసలు వారి యజమానుల మతాచారములను అనుసరించెడి వారు. ఇది అన్యులలోని విశ్వాస స్త్రీలకు పెద్ద సమస్యయై ఉండెను. ఈ సమస్యకు పౌలు ఒక పరిష్కారాన్ని చూపుచున్నాడు. అవిశ్వాసియగు ఒక వ్యక్తి, విశ్వాసముగల వ్యక్తిని సహించునంత వరకు వివాహ బంధము నిలుచును. కాని అవిశ్వాసియగు వ్యక్తి విశ్వాసియగు వ్యక్తితో జీవించుటకు సమ్మతము లేని యెడల వారిరువురు విడిపోవచ్చు. ఎందుకన, వివాహ నిబద్ధత కన్న, జ్ఞానస్నాన నిబద్ధతను ఇష్టపడుట మేలు!
2.5.3.3. దేవుని పిలుపు – జీవిత
విధానము (7:17-24)
“దేవుడు తనను పిలిచిన నాడు తానున్న స్థితిని బట్టియు జీవించుచుండ వలెను” (1 కొరి. 7:17). విశ్వాసులు వారు ఉన్న స్థితిలోనే జీవించాలనే సలహాను, ‘ప్రభువు రాకడ తక్షణమే సంభవించును’ అన్న సందర్భములో ఇచ్చుచున్నాడు (1 కొరి. 7:29-31, చూడుము. 1 తెస్స. 4:17, 1 కొరి. 15:51). ‘ప్రభువు రాకడ’ సమయమున విశ్వాసులు వారు ఉన్న స్థితి ముఖ్యము కాదని పౌలు భావిస్తున్నాడు. “ఎవడైనను తాను పొందిన పిలుపునకు పూర్వమే సున్నతి చేయబడి యుండిన యెడల అతడు సున్నతి చిహ్నములను తీసివేయ ప్రయత్నింప రాదు... సున్నతి చేయబడని యెడల అతడు సున్నతి పొందరాదు. ఏలయన, సున్నతి పొందుట, పొందకపోవుట ముఖ్యము కాదు. దేవుని శాసనములకు విధేయత చూపుటయే ముఖ్యము. నీవు బానిసవైతే లెక్కచేయకుము, కాని స్వతంతృడవగుటకు అవకాశము ఉన్నచో, దానిని ఉపయోగించు కొనుము. ఏలయన, ప్రభువుచే పిలువ బడిన సేవకుడు ప్రభువునకు చెందిన స్వతంతృడే (1 కొరి. 7:18-22). కనుక, “తాను పిలువ బడిన వాడు ఉన్న విధముననే ప్రతీ వ్యక్తియు దేవుని సహవాసములో నిలిచి పోవలయును” (1 కొరి. 7:24). ఎందుకన, దేవుడు మనలను వెలను ఇచ్చి కొనెను (1 కొరి. 7:23, చూడుము. 6:20). ప్రభువు రాకడ కొరకు సంసిద్ధ పడుతున్న సందర్భముగా పాపమునకు దూరముగా ఉండవలయుననునది పౌలు భావనలో ప్రాధానంశము.
2.5.3.4. అవివాహితులను,
విధవరాండ్రను గూర్చిన సమస్యలు (7:25-40)
అవివాహితుల విషయములో కూడా పౌలు తన స్వంత ఆజ్ఞను ఇచ్చుచున్నాడు. వివాహముకన్న బ్రహ్మచర్యమును పౌలు ప్రతిపాదించు చున్నాడు. ఎందుకన, “ఇంకా ఎంతో సమయము లేదు” (1 కొరి. 7:29). అనగా, ప్రభువు రాకడ దగ్గరలోనే ఉన్నదని అర్ధము. పౌలు ఇచ్చు కారణమేమన, “సోదరులారా! నేను చెప్పునదేమనగా, ఇంకా ఎంతో సమయము లేదు. కనుక ఇప్పటినుండి భార్యలు కలవారు, భార్యలు లేనట్లుగను, ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనదించువారు ఆనందముగ లేనట్లును ప్రవర్తింప వలెను. ఏలయన, ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరును ఇంకా ఎంతో కాలము ఉండబోదు” (1 కొరి. 7:29-31). అవివాహితుడు ప్రభువు సేవలో ఎక్కువగ నిమగ్నమై ఉండును. వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని రెండు ప్రక్కలకు లాగబడు చుండును (1 కొరి. 7:32-34). బ్రహ్మచర్య ప్రతిపాదన ప్రభువు శాసనము కాదని, ఇది తన అభిప్రాయమని పౌలు తెలియజేయు చున్నాడు (1 కొరి. 7:25).
క్రైస్తవులు అనేక మంది వివాహ
జీవితమునకు పిలువబడి యున్నారు, కనుక వారు అట్టి స్థితిలోనే ఉండుట మంచిదని పౌలు
అభిప్రాయం (చదువుము. 1 కొరి. 7:26-28). 1 కొరి. 7:32-35లో వివాహితుల కన్న
అవివాహితులే ఎక్కువగా ప్రభువును సంతోష పెట్టుటకు ప్రయత్నించుచు ప్రభువు పనియందే
నిమగ్నులగునని పౌలు తెలియజేయు చున్నాడు. వివాహితులు లౌకిక వ్యవహారములలో చిక్కుకొని
భార్యను, భర్తను సంతోష పెట్టవలెనను తలంపుతో ఉండెదము అని పౌలు వాదన. అవివాహితులు
లౌకిక వ్యవహారములలో చిక్కుకొనక, స్వతంతృలుగా వారి జీవితమును, దృష్టిని సంపూర్ణముగా
ప్రభువు పనియందు అంకితం చేసు కొనగలరు.
పౌలు ముఖ్యాభిప్రాయం ఏమనగా,
క్రైస్తవులు వారు ఉన్న స్థితిలో ఉన్నట్లుగా ఉండుటయే ఉత్తమము. వివాహితులు,
వివాహితులగనే, అవివాహితులు అవివాహితులుగనే ఉండుట మంచిది. ప్రదానము లేదా నిశ్చిత్తార్ధము
చేసుకున్న తర్వాత కూడా అవివాహితులుగా ఉండుటకు వారి నిర్ణయమును మార్చుకొనుటను పౌలు
స్వాగతిస్తున్నాడు (1 కొరి. 7:36-37). భర్త మరణించినచో, స్త్రీ తాను కోరిన
వ్యక్తిని వివాహమాడుటకు ఆమెకు స్వేచ్చ కలదు. కాని, అది క్రైస్తవ వివాహమై ఉండవలయును
(1 కొరి. 7:39). కాని పౌలు అభిప్రాయము, సలహా ఏమనగా, ఆ స్త్రీ ఉన్నట్లే (విధవరాలిగ)
ఉండినచో ఆమె ఎంతయో సంతోషింప గలదు (1 కొరి. 7:40). పౌలుగారి ఈ అభిప్రాయములన్నింటిని
కూడా ‘ప్రభువు తక్షణ రాకడ’ సందర్భమున మనము అర్ధం చేసుకోవాలి.
No comments:
Post a Comment