2.5.2. అనైతిక జీవితం, వ్యాజ్యెములు
(5:1-6:20)
2.5.2.1. వావి వరుసలు లేని లైంగిక సంబంధము (5:1-8)
2.5.2.2. అపార్ధములు, అనైతిక జీవితం (5:9-13, 6:12-20)
2.5.2.3. సోదరులపై వ్యాజ్యెములు (6:1-11)
2.5.2.4. అనైతిక జీవితము (6:12-20)
పౌలు కొరింతు క్రైస్తవ సంఘములోనున్న అనైతిక జీవితం (సంఘములో వ్యభిచారము), వివాదముల గూర్చి విశ్లేషణ చేయుచున్నాడు. నైతిక జీవితం మరియు విలువల గురించి పౌలు కొరింతీయులకు బోధించు చున్నాడు.
అలాగే పౌలు వ్యభిచార దోషము, సోదరులను అపార్ధము చేసుకోవడం, సోదరులపై వ్యాజ్యెములు, అనైతిక జీవితము అను పలు అంశములపై చర్చిస్తున్నాడు.
2.5.2.1. వావి వరుసలు లేని లైంగిక
సంబంధము (5:1-8)
లైంగిక నియమముల గురించి లేవీయకాండము
18వ అధ్యాయములో చూస్తున్నాము, “మీలో ఎవరు తమ రక్త సంబంధులను వివస్త్రులను చేయరాదు.
నీ తండ్రిని దిగంబరుని చేయరాదు. నీ తల్లిని వివస్త్రను చేయరాదు. నీ సోదరినికాని,
మారు సోదరునికాని కూడరాదు. నీ మనుమరాలిని కూడరాడు. నీ తండ్రికి మరియొక భార్య వలన
పుట్టిన యువతిని కూడరాదు. ఆమె నీకు మారు చెల్లెలు. నీ మేనత్తను కూడరాదు. నీ తల్లి
సోదరిని కూడరాదు. నీ పినతండ్రి భార్యను కూడరాదు. నీ కోడలిని కూడరాదు. నీ మరదలిని
కూడరాదు. నీవొక స్త్రీని కూడినచో మరల ఆమె కుమార్తెనో, మనుమరాలినో కూడరాదు. నీ
భార్య బ్రతికియుండగా ఆమె సోదరిని పరిగ్రహింపరాదు, కూడరాదు. ముట్టుతను కూడరాదు.
పరుని భార్యను కూడరాదు. మీరు స్వలింగ మైధునమునకు పాల్పడరాదు. స్త్రీ పురుషులు ఎవరైనను
జంతు సంపర్కము చేయరాదు (18:6-23).
అన్యులు ఇలాంటి లైంగిక సంబంధాలను కలిగి యుండెడివారు. యిస్రాయేలు ప్రజలు ఇలాంటి అనైతికమైన వాటికి పాల్పడరాదని, అలాంటి వాటికి దూరముగా ఉండాలని దేవుడు ఆదేశించాడు. పౌలు కాలములో కూడా అన్యులు ఇలాంటి లైంగిక సంబంధాలకు పాల్పడెడివారు. అన్యులు యూదులుగా మారినప్పుడు ఇలాంటి సంబంధాలు యూద మతములో ఆచరించేవారు. అన్యులు క్రైస్తవులుగా మారినప్పుడు ఇలాంటి లైంగిక సంబంధాలను అనుసరించడం పౌలు తీవ్రముగా ఖండిస్తున్నాడు. ‘యెరూషలేము సమావేశము’లో (అ.కా. 15) కూడా ఇలాంటి వాటిపట్ల తీవ్రమైన హెచ్చరికలు చేయబడ్డాయి.
కొరింతు క్రైస్తవ సంఘములో ఒక వ్యక్తి తన సవితి తల్లిని ఉంచుకోవడం పౌలుకు తెలిసి, వావివరుసలు లేని లైంగిక సంబంధమును కలిగియున్న ఆ వ్యక్తిని బయటకు గెంటివేయవలయును (1 కొరి. 3:2) అని పౌలు ప్రభువగు యేసు నామమున ఆ దారుణము చేసిన వ్యక్తిపై తీర్పు చేసియున్నాడు.
తాత్కాలికముగా సంఘమునుండి తప్పులు చేసిన వ్యక్తులను బయటకు వెడలగొట్ట బడటం 1 కొరి. 5:2, 9-13, 2 తెస్స. 3:6-14, తీతు. 3:10, 1 యోహా. 5:16-17, 2 యోహా. 10లో చూస్తున్నాము. అలాంటి వ్యక్తులు నాశనమగుటకై సైతానుకు అప్పగించ బడునని 1 కొరి. 5:5, 1 తిమో. 1:20లో చూస్తున్నాము. సైతానుకు అప్పగించ బడటం అనగా, ఆ వ్యక్తి క్రైస్తవ సంఘమునుండి ఎలాంటి సహాయమును, మద్దతును పొందడని అర్ధము. కొన్నిసార్లు దేవుడే ఈ సైతానును అనుమతించును (2 తెస్స. 2:4, యోబు. 1:6). అయినప్పటికిని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా మారుమనస్సు, రక్షణకు అవకాశము ఉన్నది (2 తెస్స. 3:15).
క్రైస్తవ సంఘములో ఇలాంటి క్రమశిక్షణ
నియమాలు ఉండుట వలన తల్లి శ్రీసభకు, సభ్యుల పట్ల కొంత వరకు అధికారమున్నట్లుగా మనకు
అర్ధమగు చున్నది (మత్త. 18:15-18). 1 కొరి. 5:6-7లో పులిసిన పిండి అవినీతికి,
చెడుకు చిహ్నముగా చెప్పబడినది (చూడుము. మత్త. 16:6, గలతీ. 5:9). పులియని పిండి
స్వచ్చతకు, నిజాయితీకి, సత్యమునకు సూచకము. పాస్కా పండుగ రోజులలో రొట్టెల పిండిని
పులియ చేయు పదార్ధమును యిండ్ల నుండి పారవేయ వలయును (నిర్గమ. 12:15). పాస్కా
గొర్రెపిల్లను అర్పించెదరు (నిర్గమ. 12:6). పొంగని లేదా పులియని రొట్టెలను
తినవలయును (నిర్గమ. 12:18-20).
ఈ పాస్కా నియమాలు క్రైస్తవ పరమ రహస్యాలకు సంసిద్ధ పడుటకు సూచనలుగా ఉన్నవి. క్రీస్తు నిజ పాస్క గొర్రెపిల్ల. పాత పులిసిన పిండి అను పాపమును వినాశనము చేసి పులియని రొట్టె అను స్వచ్చతను, నిజాయితి, సత్యములను సుసాధ్యము చేయును.
2.5.2.2. అపార్ధములు, అనైతిక జీవితం
(5:9-13, 6:12-20)
అనైతికులతో సంబంధాలు పెట్టుకొన రాదని ఇంతకు ముందు ఒక లేఖ ద్వారా పౌలు కొరింతు సంఘమునకు తెలియజేసి యున్నాడు. అయితే, ఆ లేఖ సంఘములో కొన్ని అపార్ధములను సృష్టించినది. కొరింతు సంఘములో కొంతమంది తమనుతాము తీర్పరులుగా, ఉన్నతులుగా, శ్రేష్టులుగా భావిస్తూ అన్యులపై తీర్పును చేయుచున్నారు.
కొంతమంది, అనైతిక వ్యక్తులతో దూరముగా ఉండుటకు, సంఘము నుండే దూరముగా ఉండటం ప్రారంభించారు. అట్టివారితో సాంగత్యము వలదని పౌలు అభిప్రాయము కాదని (1 కొరి. 5:10) స్పష్టము చేయు చున్నాడు. ఈ లోకము నుండి పారిపోక, ఈ లోకమున ఉన్న స్థితి గతుల నుండి తప్పించు కొనక జీవించాలని పౌలు వారికి తెలియజేయు చున్నాడు.
అలాగే, క్రైస్తవులు క్రైస్తవేత్తరులను తీర్పు చేయ కూడదు. అన్యులపై దేవుడు తీర్పు చేయును అని పౌలు అభిప్రాయము. సంఘములోని వారిపైన తీర్పు చెప్ప వలసి యున్నది. దుష్టుని సంఘము నుండి తొలగించాలని (చూడుము. ద్వితీయ. 17:7) పౌలు తెలియజేయు చున్నాడు.
అనైతికమైన విషయాలలో మునిగి తేలక, వారి దేహములను దేవుని మహిమార్ధమై ఉపయోగించాలని పౌలు కొరింతీయులకు సూచిస్తున్నాడు. దేహమును అనైతిక విషయాలకు ఉపయోగించ కూడదు. ఎందుకన, “మీ శరీరము మీయందు పవిత్రాత్మకు ఆలయము” (1 కొరి. 6:19, చూడుము. 3:16) అని పౌలు వారికి గుర్తు చేయుచున్నాడు. “మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు. ప్రభువు దాని కొరకు” (1 కొరి. 6:13). ఒకని శరీరమును పరిశుద్ధముగా ఉంచుటకు ప్రధాన కారణం, ‘ఉత్థానము’, “దేవుడు ప్రభువును మృతుల నుండి లేవ నెత్తును. ఆయన మనలను కూడ తన శక్తితో లేవనేత్తును!” (1 కొరి. 6:14).
దేవుడు తన కుమారున్ని లేవనెత్తినట్లుగా, క్రీస్తు సభ్యులైన వారందరినీ దేవుడు లేవనెత్తెను. వ్యభిచారము అను పాపము క్రీస్తుతో గల సంబంధమును, ఐఖ్యతను వినాశనము చేయును. “వ్యభిచరింపకుడు. మానవుడు చేయు ఏ ఇతర పాపమైనను అతని శరీరమునకు వెలుపల ఉండును. కాని వ్యభిచరించు వ్యక్తి తన శరీరమునకు వ్యతిరేకముగ పాపము చేయును (1 కొరి. 6:18). కనుక, క్రైస్తవులు క్రీస్తునకు చెందిన వారిగా నడుచు కొనవలయును (1 కొరి. 6:15-17, చూడుము. ఎఫెసీ. 5:21-23).
లైంగిక పాపాలు దేవుని ఆలయమైన శరీరమును నాశనం చేయును. కనుక పరిశుద్దులముగా జీవించాలి. మనము మనకు చెందిన వారము కాదు. క్రీస్తు తన రక్షణదాయకమైన సిలువ బలి ద్వారా వెలనిచ్చి మనలను కొనెను. కనుక, మన దేహముతో దేవుని మహిమ పరచాలి (1 కొరి. 6:19-20).
2.5.2.3. సోదరులపై వ్యాజ్యెములు
(6:1-11)
పౌలు కొరింతు సంఘములో నున్న వ్యాజ్యెముల గూర్చి చర్చిస్తున్నారు. సంఘములో సోదరుల మధ్య వివాదము తటస్థించినచో, వారు అవినీతి పరుల యెదుట న్యాయమును కోరుట సాహసించ రాదు. వివాదములు సంభవించినపుడు, దైవసంఘముచే తృణీకరింప బడిన వ్యక్తుల యొద్దకు విచారణకై తీసుకొని పోరాదు. అవిశ్వాసియగు వ్యక్తులచే తీర్పు పొందరాదు. చిన్న చిన్న వివాదములను క్రైస్తవ సంఘములోనే పరిష్కరించు కొనవలయును.
ఒకరిపై ఒకరు వ్యాజ్యెమాడిన యెడల పూర్తిగా దిగజారి పోయినట్లేనని పౌలు తెలియజేయు చున్నాడు. జ్ఞానస్నానము ద్వారా మనము విశ్వాసమును పొందితిమి. కనుక ఇతరులను బాధించుటకన్నా మనము బాధననుభవించుటే మేలు! ప్రతీకారం తీర్చుకొనుటకన్న అవమానములను పొందుట మేలు (మత్త. 5:21-26, 38-42, రోమీ. 12:14, 19-21). ఎందుకన, మనము సోదరులము!
పాపాత్ములు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కాని మనము మన ప్రభువగు యేసుక్రీస్తు నామము వలన, మన దేవుని ఆత్మ వలన కడగబడి, పరిశుద్ధ పరుపబడి నీతిమంతులుగా తీర్చి దిద్దబడితిమి.
2.5.2.4. అనైతిక జీవితము (6:12-20)
పౌలు మరల అనైతిక జీవితము గురించి
ఇచ్చట ప్రస్తావించు చున్నారు. శరీరము పాపము చేయుట కొరకు కాదని లేదా ఎలాంటి అనైతిక
జీవితము కొరకు కాదని తెలియజేయు చున్నాడు. ఎందుకన, “శరీరము దానియందు వసించు
పవిత్రాత్మకు ఆలయము” (6:19, 3:16). 6:12-13లో తన బోధనలకు వ్యతిరేకముగా కొరింతు
సంఘములో వినిపించిన రెండు నినాదాల గురించి ప్రస్తావించు చున్నాడు: “నేను ఏదియైనను
చేయవచ్చును” మరియు “పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట”.
కొరింతు సంఘములో కొంతమంది, శరీరమునకు
అన్నపానీయములు ఎంత అవసరమో, లైంగిక సంపర్కం కూడా అంతే అవసరం అని వాదించే వారికి,
పౌలు సమాధానం ఇచ్చుచున్నాడు. పౌలు ప్రకారం, అన్నపానీయములు ప్రస్తుత లోకసంబంధమైనవి
మరియు అవి ఈ లోకముతోపాటే నాశనం అవుతాయి. అందుకే పౌలు, 10:31లో “ఏమి తినినను,
త్రాగినను, ఏమి చేసినను, దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుము” అని
కొరింతీయులను కోరుచున్నాడు.
శరీరమును ఎందులకు మనము పవిత్రముగా
ఉంచుకోవాలి అన్న దానికి పౌలు ప్రధాన వాదన లేదా బోధన ఏమనగా, “పునరుత్థానము” (6:14).
క్రైస్తవులు క్రీస్తు శరీరములో సభ్యులు కనుక, దేవుడు ప్రభువును మృతులలో నుండి
లేవనెత్తిన విధముగా, వారిని కూడా తన శక్తితో మృతులలో నుండి లేపును. దేవుడు శరీరము,
అన్నపానీయములను నాశనం చేయునప్పటికిని, ఆయన మానవున్ని సంపూర్ణముగా లేవనెత్తును. క్రైస్తవుల
లైంగిక ప్రవర్తన, వారు క్రీస్తుకు చెందినవారగుటను ప్రభావితము చేయును. కనుక, వారి
శరీరములు, క్రీస్తు దేహములో సభ్యులు అని పిలువడుటకు తగిన అర్హతగల ప్రవర్తన కలిగి
జీవించ వలయును (6:15-17, ఎఫెసీ 5:21-33).
క్రైస్తవుని యొక్క శరీరము
పవిత్రాత్మకు ఆలయము అని పౌలు మరోసారి గుర్తుకు చేయుచున్నాడు (3:16, 6:19). 3:16లో,
మీరు, అనగా క్రైస్తవ సంఘము, దేవుని ఆత్మకు నివాసమని పౌలు చెప్పియున్నాడు. అయితే
ఇచ్చట 6:19లో, వ్యక్తిగతముగా, క్రైస్తవులు పవిత్రాత్మకు ఆలయమని తెలియజేయు
చున్నాడు. లైంగిక పాపాలు చేయువారు లేదా వ్యభిచారము చేయువారు తమ శరీరములకు
వ్యతిరేకముగ పాపము చేయును కనుక, శరీరము అను ఆ దేవాలయము అవిత్రము చేయబడు చున్నది. దేవుడు
క్రైస్తవులను, తన కుమారుడైన క్రీస్తు మరణముతో వెలనిచ్చి కొన్నాడు కనుక, వారు తమ దేహములతో
లేదా శరీరములతో పాపము చేయక, దేవుని మహిమ పరచాలి (6:20, 7:23) అని పౌలు స్పష్టము
చేయుచున్నాడు. మానవాళి కొరకు, త్యాగపూరితమైన మరియు ప్రత్యామ్నమైన క్రీస్తు మరణము,
పాప బానిసత్వమునుండి స్వతంత్రమును కొనెను.
No comments:
Post a Comment