1. పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ
1.1. ఉపోద్ఘాతము
1.2. తెస్సలోనిక పట్టణము
1.3. తెస్సలోనికలో క్రైస్తవ సంఘము
1.4. పౌలు లేఖ వ్రాసిన సందర్భం
1.1. ఉపోద్ఘాతము
పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ, నూతన గ్రంథములోనే ప్రప్రధమముగా వ్రాయబడిన రచన. ఇది సువార్తలకన్న కూడా ముందుగా వ్రాయబడినది. మొదటి శతాబ్దము మధ్య కాలములో తెస్సలోనిక సంఘ పరిస్థితులను ఈ లేఖ ప్రతిబింబిస్తుంది.
పౌలు తన రెండవ ప్రేషిత ప్రయాణములో, సిలాసు, తిమోతిలతో కలిసి తెస్సలోనికలో దైవ సంఘమును నిర్మించారు (అ.కా. 17:1). తెస్సలోనిక సంఘముగూర్చి తిమోతిద్వారా నివేదికను స్వీకరించిన పౌలు, జవాబుగా ఈ లేఖను వ్రాసి యున్నాడు. పౌలు ఈ లేఖను క్రీ.శ. 50వ సంవత్సరములో కోరింతు నుండి “తండ్రియగు దేవునియందును, ప్రభువగు యేసు క్రీస్తు నందును, తెస్సలోనిక దైవసంఘ ప్రజలకు,” (1 తెస్స 1:1) వ్రాసెను.
తిమోతి నివేదికద్వారా తెస్సలోనిక సంఘము గురించి తెలుసుకొనిన ఎన్నో మంచి విషయములను, అనగా వారి విశ్వాసము, ప్రేమను, వారు ఏవిధముగా పౌలును, అతని అనుచరులను మరియు ప్రభువును అనుకరించినది, అనేక బాధలు పడినను ఆనందముతో సువార్తా సందేశమును స్వీకరించినది, ఇతర విశ్వాసులకు ఏవిధముగా మార్గదర్శకులైనది, విగ్రహములనుండి విముఖులై దేవుని వంకకు మరలినది, మొదలగు వానిని బట్టి, పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచూ లేఖను ప్రారంభించాడు (1 తెస్స 1:2-10). వారు పొందిన నూతన విశ్వాసములో బలపడి యుండాలని తెస్సలోనిక క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నాడు. అలాగే, ‘ప్రభువు రాకడ’కు ముందుగానే మరణించిన విశ్వాసుల పునరుత్థానము పట్ల వారిలోనున్న భయాందోళనలను తొలగిస్తున్నాడు.
“విశ్వాసమును, ప్రేమను కవచముగను, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగను ధరింపవలెను” (1 తెస్స 5:8) అని తెస్సలోనిక క్రైస్తవులను పౌలు కోరుతున్నారు.
1.2. తెస్సలోనిక పట్టణము
మాసిడోనియా
ప్రాంతములో తెస్సలోనిక అతి ముఖ్యమైన పెద్ద పట్టణం. ఈ పట్టణమును క్రీ.పూ. 315వ
సంవత్సరములో మాసిడోనియాకు రాజైన కసండర్ నిర్మించాడు. కసండర్ రాజు అలెగ్జాండర్
చక్రవర్తి యొక్క జనరల్సులో ఒకరు. కసండర్ ఈ పట్టణమును నిర్మించి, అలెగ్జాండర్ చక్రవర్తి సోదరి మరియు తన భార్యయైన
తెస్సలోనిక పేరును పెట్టాడు. నేడు ఇది ఉత్తర గ్రీసు దేశములోని భాగము.
తెస్సలోనిక రేవు పట్టణము. దీనికి సహజ నౌకాశయము కలదు. దీనిమూలముగా అచ్చట వ్యాపారాలు, అమ్మకాలు, కొనుగోళ్ళతో కూడిన ఆర్ధిక కార్యకలాపాలు బాగా పెంపొందాయి.
క్రీ.పూ. 148వ సంవత్సరములో మాసిడోనియా ప్రాంతమునకు తెస్సలోనిక రాజధాని నగరముగా ఏర్పడినది. రోమను సామ్రాజ్యములో భాగమైనప్పుడు అచ్చట అనేక విభిన్నమైన మతాలు వెల్లివిరిసాయి. క్రీ.పూ. 42వ సంవత్సరము నుండి తెస్సలోనికలో స్వతంత్రముగా అధికార సభ ఏర్పాటు చేయబడినది (అ.కా. 17:6).
అచ్చటి జనాభా గ్రీకులు, రోమనులు, యూదులు మరియు ఇతరులతో కూడియున్నది. అచ్చట యూదుల ప్రార్ధనా మందిరము (సినగోగు) ఒకటి కలదు (అ.కా. 17:1). వారిలో ఎంతోమంది ‘దైవభీతి’, ‘దైవభక్తి’గల యూదులు (అ.కా. 16:14, 18:7) ఉండిరి. అట్లే దేవుని ఆరాధించు గ్రీసు దేశస్థులు (అ.కా. 17:4) ఉండిరి.
ఈ గ్రీకులలో కొందరు, హీనముగా చూడబడిన తమ మతము పట్ల విసిగి వేసారి, యూద మతము (దేవుడొక్కడే, ఖచ్చితమైన నీతిధర్మాలు) పట్ల ఆకర్షితులైరి, కాని కర్మ చట్టాల పట్ల ముఖ్యముగా సున్నతి పట్ల అసంత్రుప్తులై ఉండిరి.
1.3. తెస్సలోనికలో
క్రైస్తవ సంఘము
పౌలు తన రెండవ ప్రేషిత ప్రయాణములో తెస్సలోనిక పట్టణములో సువార్తను బోధించి (అ.కా. 17:1-14) అచట క్రైస్తవ సంఘమును నిర్మించాడు. మొదటగా, ఫిలిప్పీ నగరములో సువార్తను ప్రకటించిన తరువాత, పౌలు తన అనుచరులైన సిలాసు, తిమోతిలతో తెస్సలోనికకు వెళ్ళెను. (అ.కా. 17:1, 18:5). సువార్త నిమిత్తమై వారు ఫిలిప్పీ నగరములో హింసలను పొందియున్నారు (అ.కా. 16: 19-24). తెస్సలోనిక ఫిలిప్పీ నగరమునుండి 150 కి.మీ. దూరం ఉంటుంది. పౌలు క్రైస్తవ సంఘమును నిర్మించిన రెండవ పట్టణము తెస్సలోనిక. మొదటిది ఫిలిప్పీ నగరము.
పౌలు తెస్సలోనికలో కొంతకాలము సువార్తను బోధించి, అచ్చటనుండి వెడలి పోయెను (1 తెస్స 1:1, 5-9). పౌలు తెస్సలోనికలోని యూదుల ప్రార్ధనా మందిరము (సినగోగు)నకు వెళ్లి, మెస్సయా బాధలను అనుభవింపవలెననియు, ఆయన మృతులలోనుండి లేపబడవలెననియు వరుసగా మూడు విశ్రాంతి దినములు పరిశుద్ధ గ్రంథమునుండి వివరించుచు, నిరూపించుచు, ఆయన ప్రకటించుచున్న ఆ యేసే “క్రీస్తు” అని నొక్కివక్కానించాడు. వారిలో కొందరు అతడు చెప్పిన దానిని విశ్వసించిరి. అట్లే దేవుని ఆరాధించు చాలామంది గ్రీసు దేశస్థులు, ప్రముఖులైన పలువురు స్త్రీలు విశ్వసించిరి (అ.కా. 17:2-4).
ఎప్పుడైతే, ప్రజలు క్రీస్తు సందేశమును అంగీకరించి, విశ్వసించుచున్నారో, అది చూచిన యూదులు ఈర్ష్యపడిరి. పౌలు మరియు అతని అనుచరులు బస చేయుచున్న యాసోను ఇంటిని ముట్టడించి, పౌలును, సిలాసును బయటకు లాగి, ప్రజల యెదుట పెట్టుటకై ప్రయత్నించిరి. కాని వారు అచటనుండి తప్పించుకొనిరి (అ.కా. 17:5-9). వారు కనబడక పోవుటచే యాసోనును, ఇతర సోదరులను కొందరను నగర అధికారుల వద్దకు ఈడ్చుకొని వచ్చి, వారికి ఇకనుండి ఆతిధ్యము ఇవ్వకూడదని ప్రతిజ్ఞ చేయించితిరి. పౌలును, సిలాసులు “చక్రవర్తి శాసనము”ను మీరుతున్నారు (అ.కా. 17:7) అను నెపముతో వారిని బంధించ ప్రయత్నం చేసారు.
“చక్రవర్తి శాసనము” ఏమిటి? యూదులు, గ్రీకులు అనేకమంది క్రైస్తవులుగా మారి, యేసు ప్రభువును, మెస్సయ్యగా మరియు గొప్ప రాజుగా ఆరాధించుచున్న నేపధ్యములో, రోము చక్రవర్తియైన క్లౌదియ ఈ క్రీస్తు మెసయ్య “మార్గమును” అణచివేయాలని చేసిన తీర్మాన పత్రమే ఈ శాసనము. ఈ సందర్భములోనే, రోమాలోనే యూదులు బహిష్కరింప బడినారు. అదేసమయములో, తెస్సలోనికలో కూడా “మెస్సియ”ను గూర్చిన అలజడులు ఎక్కువైనాయి.
తెస్సలోనికలో పౌలు
పడిన బాధలు ఈ క్రింది వానిగా చెప్పుకొనవచ్చు:
(అ). తెస్సలోనికకు రాకముందు ఫిలిప్పీ నగరములో బాధలు, అవమానములు పడియున్నాడు (1 తెస్స 2:2).
(ఆ). ఎన్నో
ఆటంకముల మధ్య పౌలు తెస్సలోనికలో సువార్తను
ప్రకటించెను (1 తెస్స 2:2) ముఖ్యముగా, అన్యజనులకు
రక్షణను ప్రసాదించు సందేశమును బోధింప కుండునట్లు యూదులు పౌలును అడ్డగించిరి (1 తెస్స 2:16), తద్వారా, తెస్సలోనిక సంఘము అనేక బాధలు పడినను
సందేశమును స్వీకరించితిరి (1 తెస్స 1:6).
(ఇ). తెస్సలోనిక
నుండి వెళ్ళిపోయిన పౌలు ఒంటరిగా ఎతెన్సులో ఉండి పోయెను (1 తెస్స 3:1).
(ఈ). పౌలు తిరిగి తెస్సలోనికకు వెళ్ళలేక పోవుటవలన (1 తెస్స 2:18), ఏ ఒక్కరును వెనుదిరుగరాదని, వారిని బలపరచుటకును, వారి విశ్వాసమునకు తోడ్పడుటకును తిమోతిని పంపెను (1 తెస్స 3:2-3).
రాత్రికి రాత్రే, పౌలు సిలాసుతో బెరయాకు వెళ్ళెను. బెరయా పట్టణము తెస్సలోనిక నుండి 80 కి.మీ. దూరం ఉంటుంది. మిగతా ప్రదేశములకన్న ఇచట వారికి మంచి ఆహ్వానము, ఆతిధ్యము లభించెను. వారు బెరయాలోని యూదుల ప్రార్ధనా మందిరములోనికి వెళ్లి దేవుని వాక్కును బోధించిరి. అక్కడి ప్రజలు విశాల హృదయులు. వారు సందేశమును గొప్ప ఆపేక్షతో ఆలకించి, అనుదినము పరిశుద్ధ గ్రంథము చదువుకొనుచు పౌలు చెప్పినది నిజమా కాదా అని పరిశీలించు చుండిరి (అ.కా. 17:10-11 ). బెరయాలోని యూదులు క్రీస్తును విశ్వసించిరి.
కాని ఇది తెలుసుకొనిన తెస్సలోనికలోని యూదులు బెరయాకు వచ్చి కలవరం సృష్టించిరి (అ.కా. 17:10-13). అందుచే పౌలు బెరయా నుండి బహుశా సముద్ర మార్గముగుండా ఏతెన్సుకు వెళ్లి అచట సువార్తా ప్రచారం చేసెను (అ.కా. 17:15-34). తరువాత పౌలు ఏతెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను (అ.కా. 18:1). సిలాసు, తిమోతిలు మాసిడోనియా ప్రాంతములోనే నున్న బెరయాలోనే ఉండిపోయిరి (అ.కా. 17:14). ఆతరువాత వారు పౌలును కొరింతులో కలుసుకొనిరి (అ. కా. 18:5). తెస్సలోనికలో పౌలు ప్రేషిత కార్యం అసంపూర్తిగా మిగిలిపోయినను, అచ్చట క్రైస్తవ సంఘమును ఏర్పాటు చేయుటలో సఫలీకృతుడయ్యెను. అచ్చట అనేకమంది యూదులు క్రైస్తవ సంఘములోనికి చేరిరి.
పౌలు బోధించిన ‘నూతన విశ్వాసము’నకు శతృవులైన యూదులు, పౌలు తెస్సలోనిక నుండి వెళ్లిపోవడముతో, అతని ప్రేషిత కార్యము అంతటితో ముగుసి పోయినదని భావించారు. కాని, వాస్తవానికి, పౌలు ప్రేషిత కార్యము, సువార్తా బోధనవలన తెస్సలోనికలో బలమైన క్రైస్తవ సంఘము ఏర్పాటు చేయబడినది. అంతేగాక, వేరే ప్రాతాలలో కూడా అదే సువార్తా నిర్విరామముగా ప్రకటింప బడినది.
అపోస్తలుల కార్యములు ప్రకారం, పౌలు తెస్సలోనికలో మూడు వారాలు మాత్రమే ఉన్నట్లు తెలియు చున్నది. కాని లేఖలో చెప్పబడిన విషయాలను బట్టి (2:9-12, 3:6-10), అలాగే ఫిలిప్పీ సంఘము నుండి పెక్కుమారులు పొందిన సాయమును బట్టి (ఫిలిప్పీ. 4:16), పౌలు అచట బహుశా కొన్ని నెలల పాటు ఉన్నట్లుగా తెలియు చున్నది.
1.4. పౌలు లేఖ వ్రాసిన
సందర్భం
పౌలు ఆకస్మికముగా తెస్సలోనికనుండి వెళ్ళిపోయిన తరువాత, క్రైస్తవులు అనేక హింసల పాలైనారు. వారు ఎన్నో శ్రమలను అనుభవించారు. ఈ హింసలలో, శ్రమలలో కొంతమంది క్రైస్తవులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇది తెలుసుకున్న పౌలు ఎంతగానో వేదన చెందాడు. అందువలననే, పౌలు వారి విశ్వాసాన్ని గూర్చి తెలుసుకోవడానికి తిమోతిని తెస్సలోనికకు పంపియున్నాడు (1 తెస్స. 3:1-5). వాస్తవానికి పౌలు తిరిగి తెస్సలోనికకు తిరిగి వెళ్ళవలెనని ఎంతో ఆతృతతో అమితముగా ఆశించాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కాని ‘సైతాను’ అడ్డుపడుట వలన వెళ్ళలేక పోయాడు (1 తెస్స. 2:17-18). అందువలననే పౌలు ఇక సహింపలేక తెస్సలోనిక సంఘమును, వారి విశ్వాసమును గూర్చిన సమాచారమును తెలిసికొనుటకు తనకు నమ్మకపాతృడైన తిమోతిని పంపించాడు (1 తెస్స. 3:5).
తెస్సలోనిక
క్రైస్తవుల విశ్వాసమును తెలుసుకొనుటకు వెళ్ళిన తిమోతి త్వరలోనే కోరింతులో నున్న పౌలు
వద్దకు తిరిగి వచ్చియున్నాడు. తెస్సలోనిక
ప్రజల విశ్వాసమును, ప్రేమను గూర్చిన శుభవార్తను పౌలుకు అందించాడు:
(అ). తెస్సలోనిక ప్రజలు అనేక బాధలు పడినను, పవిత్రాత్మ వలన లభించు ఆనందముతో
క్రీస్తు సందేశమును స్వీకరించిరి (1 తెస్స. 1:6).
(ఆ). తెస్సలోనిక ప్రజల క్రైస్తవ జీవన విధానం మాసిడోనియా, అకయాలలోని
విశ్వాసులందరకును మార్గదర్శకమై యుండెను (1 తెస్స. 1:7).
(ఇ). ఆదర్శప్రాయమైన క్రైస్తవ
ప్రవర్తన వలన సువార్తా ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది (1 తెస్స. 1:8).
(ఈ). వారు ఎన్ని శ్రమలు
అనుభవించినను వారి విశ్వాసం చెక్కుచెదరలేదు (1 తెస్స. 2:14-16).
(ఉ). సువిశేషమునకు, బోధకులకును తెస్సలోనిక ప్రజలు విశ్వాస పాత్రులుగా ఉండిరి (1 తెస్స. 3:6).
ఈ సమాచారము పట్ల పౌలు ఎంతో ఆనందాన్ని, ఊరటను, ఓదార్పును పొందాడు (1 తెస్స. 3:9). ఈ అనందముతోనే పౌలు తెస్సలోనిక ప్రజలకు ఈ లేఖను వ్రాశాడు.
అయితే, శుభవార్తతో పాటు తిమోతి
చెడు వార్తను కూడా మోసుకొని వచ్చాడు:
(అ). తెస్సలోనిక క్రైస్తవ సంఘము కొన్ని విశ్వాస విషయాలలో అనిశ్చితిని,
అస్థిరత్వమును, సంశయమును కలిగి ఉండెను (1 తెస్స. 3:10).
(ఆ). కొంతమంది నైతిక జీవన
విధానం ప్రమాదములో పడిపోయినది (1 తెస్స. 4:3).
(ఇ). వారిలో కొందరు కష్టించి
పని చేయడం మరచి సోమరిపోతులై ఉండిరి (1 తెస్స. 5:14).
(ఈ). ‘మరణించిన వారి ఉత్థానం’ విషయములో తెస్సలోనిక క్రైస్తవ సంఘము నమ్మకం లేనిదిగా ఉండెను (1 తెస్స. 4:13).
ఇది తెలుసుకొనిన పౌలు తెస్సలోనిక ప్రజలపై కోపగించుకొనక, ఆగ్రహించక, వారి విశ్వాసమును బలపరచుటకు ఈ లేఖను వ్రాశాడు.
హింసల పాలైన తెస్సలోనిక క్రైస్తవ సంఘమును ఒదార్చుటకు, ప్రోత్సహించుటకు, విశ్వాసమును బలపరచుటకు పౌలు ఈ లేఖను వ్రాశాడు. అలాగే, ఒకరినొకరు సహాయం చేసుకోవాలని, కష్టపడి పని చేసుకోవాలని, ప్రభువు రాకడ... మొదలగు విషయాల గురించి పౌలు ఈ లేఖలో వివరించాడు.
సిలాసు,
తిమోతి
పౌలు మొదటిసారిగా తెస్సలోనికను సందర్శించినప్పుడు, సిలాసు, తిమోతీలు ఇరువురు కూడా పౌలుతో ఉండిరి (అ.కా. 17:1-9). సిలాసు, తిమోతీలు ఎవరు?
సిలాసు: పౌలు సహచరుడు. అనాధి క్రైస్తవ సంఘ నాయకుడు. పౌలు లేఖలలో సిలాసు 1 తెస్స. 1:1, 2 తెస్స. 1:1, 2 కొరి. 1:19లో ప్రస్తావించ బడినాడు. అతనికి రోము పౌరసత్వము కలదు (అ.కా. 16:37-38). యేరూషలేము సంఘములో ప్రవక్తయై ఉండెను (అ.కా. 15:32). పౌలు సిలాసును తన సహచరునిగా ఎన్నుకొని (అ.కా. 15:22), తన రెండవ ప్రేషిత ప్రయాణములో తన వెంట తీసుకొని వెళ్ళెను (అ.కా. 15:41-18:5).
తిమోతి: తిమోతి పౌలు సహాయకుడు, ప్రీతిపాతృడు, విశ్వసనీయ సహచరుడు (1 కొరి. 4:17, 1 తిమో. 1:2). పౌలు తన లేఖలలో తిమోతి గురించి 1 తెస్స. 1:1, 3:2, 6, 1 కొరి. 4:17, 16:10, 2 కొరి. 1:1, 19, ఫిలిప్పీ. 1:1, 2:19, ఫిలే. 1, రోమీ. 16:21, 2 తెస్స. 1:1, కొలొస్సీ. 1:1లో ప్రస్తావించాడు. లూకా కూడా తను వ్రాసిన అపోస్తలుల కార్యములు 16:1-3, 17:14-15, 18:5, 19:22, 20:4) లో తిమోతిని ప్రస్తావించాడు.
No comments:
Post a Comment