1.5. ప్రధానాంశాలు
1.5.1. ప్రేషిత కార్యము – హింసలు (2:1-12)
1.5.2. దేవుని సంతోషపెట్టు జీవితం (4:1-12)
1.5.3. ప్రభువు రాకడ - మృతుల పునరుత్థానము (4:13-18)
1.5.1.
ప్రేషిత కార్యము – హింసలు (2:1-12)
తెస్సలోనికలో పౌలు ప్రేషిత కార్యము వ్యర్ధము కాలేదు. తెస్సలోనికకు రాకపూర్వము కూడా పౌలు ఫిలిప్పి నగరములో ఎన్నో బాధలను, అవమానములను పడియున్నాడు. అయినప్పటికిని, దేవునియందు ధైర్యము వహించి ఎన్నియో ఆటంకముల నడుమ తెస్సలోనికలో సువార్తను ప్రకటించాడు. ఫిలిప్పి నగరములోవలె, తెస్సలోనికలో పౌలు సువార్తను ప్రకటించుటలో ఎన్నో ఇబ్బందులను, ఆటంకములను, వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో తటస్థముగా తెస్సలోనికనుండి వెళ్లిపోవలసి వచ్చినది (అ.కా. 17:1-9)
పౌలు వెళ్ళిన తరువాత అతని గురించి, అతని సువార్త బోధన గురించి ఎన్నో అపనిందలు వేసి దూషణలు చేసారు. అందుకే పౌలు ఈ లేఖలో, “మా బోధ మోసపూరితమైనది కాదు, ఆశుద్ధమైనది కాదు. దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడగోరునో ఎల్లవేళల అటులనే పలికితిమి. దేవుడు మమ్ము ఆమోదించి, సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు ఏనాడును ప్రయత్నింపక, మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే ప్రయత్నించితిమి. ముఖ స్తుతితో మేము మీ యొద్దకు రాలేదు. ధనాపేక్షను మరుగుచేయు మాటలను చెప్పలేదు. మీ నుండిగాని, ఎవరినుండియైనను గాని, పొగడ్తలు పొందవలెనని ప్రయత్నించలేదు. క్రీస్తు అపోస్తలులుగా మీపై అధికారమును ప్రదర్శింప గలిగి ఉండియు అట్లు చేయలేదు” (1 తెస్స. 2:3-7) అని తెలియజేయు చున్నాడు. ఈవిధముగా, పౌలు తన ప్రేషిత కార్యమును దృఢముగా సమర్ధించుకొను చున్నాడు. అలాగే, తెస్సలోనిక క్రైస్తవులలో నున్న అపోహలను, అనుమానాలను తీసివేయు చున్నాడు. ఆయన బోధనలో ఎలాంటి లోపం, మోసం, పొగడ్తలు, దురాశ, అపవిత్రత గాని లేవని నొక్కివక్కాణించి చెప్పుచున్నాడు.
పౌలు తన ప్రేషిత కార్యములో క్రీస్తుని అపోస్తలుడిగా ఎంతో మృదువుగా ప్రవర్తించి యున్నాడు. “చంటి పిల్లలను పోషించు తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించునట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగా ప్రవర్తించితిము. మీపై మాకున్న ప్రేమ వలననే, దేవుని సువార్తను మాత్రమేకాక, మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధపడితిమి. మీరు మాకు అంతటి ప్రేమపాత్రులైతిరి (1 తెస్స. 2:7-8).
పౌలు తన ప్రేషిత కార్యములో ఎప్పుడుకూడా తన జీవనోపాధికోసం ఎవరిమీద ఆధారపడలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. రాత్రింబవళ్ళు కష్టపడి నాకు కావలసినది నేను సంపాదించు కొంటిని అని పౌలు తెలియ జేశారు (చూడుము. 2 కొరి. 11:9, 12;13, 2 తెస్స. 3:8, 2 కొరి. 11:7). పౌలు, అతని అనుచరులు ఎప్పుడు కూడా క్రైస్తవ సంఘ శ్రేయస్సును ఆశించారు.
1.5.2. దేవుని
సంతోషపెట్టు జీవితం (4:1-12)
తిమోతి ద్వారా తెస్సలోనికలోకొంతమంది క్రైస్తవులు నైతిక విలువలను మరచి ముఖ్యముగా కుటుంబములో లైంగిక జీవితము పట్ల అనైతికముగా నున్నట్లు పౌలు తెలుసుకున్నాడు. వారు గ్రీకు సంస్కుతికి బాగా అలవాటు పడినారని పౌలుకు బాగా తెలుసు.
గ్రీకులలో ఒక వ్యక్తి భార్యగాక వారి లైంగిక సంతృప్తి కొరకు ప్రియురాలుగాని, ఉంపుడుగత్తెనుగాని ఉంచుకోవచ్చు. ఇదిగాక, లైంగిక సంతృప్తి కొరకు ఎప్పుడైనా వేశ్యలు అందుబాటులోనే ఉండేవారు. భార్యయొక్క బాధ్యత ఏమిటంటే గృహమును నిర్వహించడం, ఇంటిల్లిపాదిని చక్కబెట్టు కోవడం, చట్టబద్ధముగా పిల్లలను కనడం. ఈ అనాది గ్రీకు సంస్కృతి సంప్రదాయాలను వీడమని పౌలు తెస్సలోనిక క్రైస్తవులను కోరుచున్నాడు. వివాహ బంధములో భార్యతో మాత్రమే లైంగిక బంధాలు ఉండాలి. అందుకే పౌలు, “మీరు పవిత్రులై ఉండవలయును. భోగవాంఛలకు దూరముగా ఉండవలయును. మీలో ప్రతి వ్యక్తి పవిత్రముగ, గౌరవనీయముగ తన శరీరమును అదుపులో పెట్టుకొనవలయును. అన్యులవలె మీరు వ్యామోహ పూరితమగు కాంక్షతో మెలగరాదు” (1 తెస్స. 4:3-5) అని తెలియ జేశాడు.
అలాగే క్రైస్తవ అనుదిన జీవితములో ఒకరినొకరు పరస్పరము ప్రేమించుకొన వలయునని (1 తెస్స. 4:9), ప్రశాంతముగా జీవించ వలయునని, పరుల జోలికి పోక, స్వవిషయములను చూచికొన వలయునని, జీవనోపాధి కొరకు కష్టించి పని చేయ వలయునని (1 తెస్స. 4:11) పౌలు తెలియ జేశాడు.
1.5.3. ప్రభువు
రాకడ - మృతుల పునరుత్థానము (4:13-18)
ఆకాలములో ‘ప్రభువు రాకడ’ తెస్సలోనిక క్రైస్తవులు వారు సజీవులుగా ఉన్నప్పుడే వచ్చునని భావించారు. అందుకే, హింసలలో ‘ప్రభువు రాకడ’కు ముందే మరణించిన వారి స్థితి గురించి తెస్సలోనిక క్రైస్తవులు వేదనను వ్యక్తపరచు చున్నారు.
మరణించిన విశ్వాసుల గతి, స్థితి గురించి పౌలు ఇలా తెలియజేయు చున్నాడు. హింసలలో మరణించిన వారి గురించి శోఖింప వలదు. ఎందుకన, “యేసు మరణించి పునరుత్థానము చెందెనని మనము విశ్వసింతము. కనుక, మన విశ్వాసమును బట్టి, ఆయన యందు మరణించిన వారిని యేసుతోపాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు సజీవులకంటే ముందు పునరుత్థానమును పొందుదురు. ఆతరువాత ‘ప్రభువు రాకడ’ సమయమున అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును కలుసుకొని, సదా ప్రభువుతోనే ఉందురు (1 తెస్స. 4:14-15, 17).
ఈ మాటలతో ఒకరినొకరు ఊరడించు కొనవలయును (1 తెస్స. 4:18) అని పౌలు తెలియజేయు చున్నాడు. మరణించిన వారి గురించి ప్రస్తావిస్తూ, ఇది ఒక ‘పరమ రహస్యము’ (1 కొరి. 15:51) అని పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖలో చెప్పియున్నాడు. అలాగే, “మృతులు అమరులై లేవనెత్త బడుదురు” అని 1 కొరి. 15:52లో పౌలు చెప్పుచున్నాడు.
కొరింతీయులకు రెండవ లేఖ వ్రాసే
సమయానికి పౌలు భావనలో మార్పు వచ్చినది. 2 కొరి. 4:14లో ఇలా తెలియజేయు చున్నాడు,
“యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి,
మీతో సహా ఒకచోట చేర్చి, ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడు.” ఇచ్చట ‘ప్రభువు రాకడ’
ముందే తననుతాను మృతుల సమూహములో ఒకనిగా ఎంచుతున్నాడు. ‘ప్రభువు రాకడ’ వచ్చినప్పుడు,
తనను మృతులలోనుండి లేవనెత్తునని చెప్పుచున్నాడు.
No comments:
Post a Comment