12. పౌలు రోముకు ప్రయాణం, సువార్త ప్రచారం, వేదసాక్షి మరణం

 12. పౌలు రోముకు ప్రయాణం, సువార్త ప్రచారం, వేదసాక్షి మరణం

‘అపోస్తలుల కార్యములు’లోని చివరి రెండు అధ్యాయాలు (27, 28) పౌలు రోము ప్రయాణం గూర్చి తెలియజేయు చున్నాయి. ఈ ప్రయాణం అనేక ఆందోళనలతో, ప్రమాదాలతో కూడి యున్నది. కైసరియా నుండి సీదోను, అంతియోకు, తార్సు, మీరా, కీదు, సెయ, మాల్టా, ఫిరకుసె, రేజీయము, పుతెయోలిపురము మీదుగా రోము నగరమునకు కొనిపోబడ్డాడు.

కైసరియా చెరలోనున్న పౌలును గొలుసులతో బంధించి రోమను శతాధిపతి సంరక్షణలో రోము నగరమునకు తరలించారు. రోము నగరములో పౌలు రెండు సంవత్సరముల పాటు (క్రీ.శ. 61-63) గృహ నిర్భంధం గావింప బడ్డాడు. అందువలన, తన దగ్గరికి వచ్చిన ప్రజలను ఆయన స్వేచ్ఛగా కలుసుకో గలిగాడు. రోము నగరములో నున్న యూదులు పౌలును కలుసుకున్నారు. పౌలు బోధన ద్వారా వారిలో కొంతమంది యేసు ప్రభువును విశ్వసించారు. రోములోని అన్యులకు కూడా పౌలు సువార్తను ప్రకటించాడు. బహుశా, రెండు సంవత్సరముల పాటు తన బోధనను కొనసాగించినట్లు తెలియుచున్నది (అ.కా. 28:30). పౌలు బహిరంగంగా, నిరాటంకంగా దేవుని రాజ్యం గురించి, ప్రభువైన యేసు క్రీస్తు గురించి వారికి బోధించు చుండెను (అ.కా. 28:31).

ఈ రెండు సంవత్సరముల తరువాత, క్రీ.శ. 63 నుండి పౌలు జీవితంలో జరిగిన సంఘటన గురించి మనకు స్పష్టంగా తెలియదు. బహుశా, గృహ నిర్బంధం తరువాత కొంతకాలం పాటు పౌలు చెరసాలలో బంధింపబడి యుండవచ్చు. చరిత్రకారుడు యుసేబియుస్‌, నీరో చక్రవర్తి పాలనలోని హింసలలో, క్రీ.శ. 64-68 సం.ల మధ్యకాలమున పౌలును విచారణ జరిపించి, మరణ శిక్ష విధించారని సాక్ష్యమిచ్చాడు. సంప్రదాయం ప్రకారం, పౌలు క్రీ.శ. 67లో వేదసాక్షి మరణం పొందాడు.

No comments:

Post a Comment