10.3. మూడవ ప్రేషిత ప్రయాణం
పౌలు యొక్క మూడవ ప్రేషిత
ప్రయాణము గురించి అ.కా. 18:23-21:16లో చూడవచ్చు. ఇది క్రీ.శ. 53-58 మధ్యకాలములో
జరిగింది. ఈ ప్రయాణములో పౌలు అనుచరులు: సిలాసు, తిమోతి, లూకా. ప్రదేశాలు: అంతియోకియా (ప్రారంభం), గలితీయ, ఫ్రిగియా
ప్రాంతములు, ఎఫెసు (3 సంవత్సరాలు), అకయా, గ్రీసు,
మాసిడోనియా, ఫిలిప్పీ, త్రోయ, అస్సోసు, మితిలేను, కియోసు, సామొసు, మిలేతు, కోసు, రోదు, పతరా, తూరు, ప్టోలమాయిసు,
కైసరియా, యెరూషలేము (ముగింపు).
పౌలు గలతియా, ఫ్రిగియా ప్రాంతములతో తన మూడవ ప్రేషిత ప్రయాణమును ప్రారంభించెను. ఒక చోటునుండి మరొక చోటుకు వెళ్ళుచూ, విశ్వాసులందరను దృఢపరచెను (అ.కా. 18:23). పౌలు తన లేఖలలో ఎక్కువ వాటిని ఈ సమయములోనే వ్రాసెను.
ఆసియాకు రాజధాని అయిన ఎఫెసుకు పౌలు
చేరుకొనెను. అచట అపొల్లో అను ఒక యూదుడుని కలుసుకొనెను. పౌలు అచట మూడు సంవత్సరములు
సువార్తను బోధించెను అచట ఎన్నో అద్భుతములను కూడా చేసెను (అ.కా. 19:1-41).
పౌలు ఎఫెసు నుండి మాసిడోనియాకు వెళ్ళెను. అచట పౌలును కలుసుకొనుటకు తీతు కొరింతు నుండి వచ్చెను. అకయాలో ప్రజలను ప్రోత్సహించి, గ్రీసు దేశమునకు వచ్చి మూడు మాసములు ఉండెను. ఫిలిప్పీ నుండి త్రోయకు వెళ్ళెను. అక్కడనుండి అస్సోసుకు, మితిలేనుకు, కియోసునుకు సామొసుకు, మిలేతుకు వెళ్ళెను (అ.కా. 20:1-16).
మిలేతు నుండి కోసుకు వచ్చి ఆ మరునాడు రోదుకు చేరుకొంటిరి. అక్కడనుండి పతరాకు వెళ్ళిరి. ఆ తరువాత తూరు రేవుకు వెళ్ళిరి. తూరు నుండి ప్టోలమాయిసు వెళ్ళిరి. మరుసటి రోజు కైసరియాకు చేరుకొనెను. అక్కడ కొంతకాలము గడిపిన పిదప యెరూషలేము వెళ్ళిరి (అ.కా. 21:1-16).
ఈ ప్రేషిత ప్రయాణాలలో పౌలు ఎన్నో కష్టాలను, బాధలను, ఎంతో వ్యతిరేకతను యూదులు మరియు యూదేతరునుండి పొందాడు. “క్రీస్తు నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలయునో’’ (అ.కా. 9:16) అని పౌలు గ్రహించాడు. అయినప్పటికిని, పౌలు నిరాశపడలేదు. ఇతర అపోస్తలులను, విశ్వాస సంఘాలను కలుసుకున్నాడు. క్రీస్తు పరమ రహస్యాలను, సంప్రదాయాలను నేర్చుకున్నాడు. ‘చారిత్రాత్మక’ యేసును గూర్చి అనేక సత్యాలను తెలుసుకున్నాడు (1 కొరి. 15:3-7).
మూడవ ప్రేషిత ప్రయాణం
ముగించుకొని పెంతకోస్తు పండుగకు యెరూషలేము చేరుకొనిన (అ.కా. 20:16) పౌలు అచ్చట
ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాడు. ఆసియా మండలపు యూదులు కొందరు పౌలు దేవాలయ మందుండుట
చూచి, జనసమూహమును
రెచ్చగొట్టి పౌలును పట్టుకున్నారు. మోషే చట్టమునకు, దేవాలయమునకు వ్యతిరేకముగా
బోధించుచున్నాడని, దేవాలయమును
అపవిత్రము చేసియున్నాడని అరిచారు. పౌలును దేవాలయము నుండి ఈడ్చుకొని వచ్చిరి, హింసించిరి.
రెండు గొలుసుతో గట్టిగా బంధించిరి. పౌలును చంప ప్రయత్నించారు (అ.కా. 21:27-36) కాని, సైన్యాధిపతి
పౌలును అక్కడనుంచి తప్పించెను (అ.కా. 23:24, 31).
No comments:
Post a Comment