భాగము 1: బైబులు పరిచయం: ఉపోద్ఘాతము

 భాగము 1: బైబులు పరిచయం - ఉపోద్ఘాతము



"పవిత్ర బైబులు గ్రంథము గురించి తెలియనట్లయితే, క్రీస్తు గురించి తెలియనట్లే" అని బైబులును లతీను భాషలోనికి అనువాదం చేసిన పునీత జెరోము అన్నారు. జెరోముగారు బైబిలు అధ్యయనానికి మరియు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యతనిచ్చారు. "పవిత్ర బైబులు గ్రంథము తన ప్రజలకు దేవుడు వ్రాసిన ప్రేమ లేఖ" అని పునీత అగుస్తీనుగారు అన్నారు. దేవునికి మానవాళిపైనున్న ప్రేమను తెలియజేసే గ్రంథముగా అగుస్తీను గారు వివరించారు. "పవిత్ర బైబులు గ్రంథము దైవశాస్త్రమునకు మూలమైన గ్రంథము" అని పునీత థామస్ అక్వినాస్ గారు పేర్కొన్నారు. "శ్రీసభకు, ప్రపంచానికి, మన ఆత్మలకు ఎన్నో సమస్యలు పవిత్ర బైబులు గ్రంథమును అధ్యయనం చేయక పోవడము వలన వస్తాయి" అని పునీత అవిలాపురి తెరెసా గారు పలికారు. "పవిత్ర బైబులు గ్రంథము ఒక నదిలాంటిది. వినమ్రులకు తేలికైనది. జ్ఞానులకు లోతైనది" అని పునీత గ్రెగరీ ది గ్రేట్ గారు అన్నారు. "సువార్తను ఎల్లప్పుడూ బోధించండి. అవరమైన చోట మాత్రమే మాటలను ఉపయోగించండి" అని పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు పలికి యున్నారు.

పవిత్ర బైబులు గ్రంథము దేవుని వాక్కు. ఆ వాక్కు దేవుడే. “వాక్కు దేవుడై ఉండెను” అని యోహాను 1:1లో చదువుచున్నాము (చూడుము 1 యోహాను 1:1-3). ఆ వాక్కు క్రీస్తువే. "ఆ వాక్కు మానవుడై (యేసుక్రీస్తు) మనమధ్య నివసించెను” అని యోహాను.1:14, 17:2-3లో చదువుచున్నాము.

ఈ వాక్కు రక్షణ సందేశం. సర్వమానవాళిని తండ్రియైన దేవుని యొద్దకు చేర్చు గొప్ప రక్షణ సందేశం. బైబులు రక్షణకు సంబంధించిన దేవుని ప్రణాళికను వెల్లడిస్తుంది. ఈ రక్షణ ప్రణాళిక యేసుక్రీస్తులో పరిపూర్ణం అవుతుంది. “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు” అని యోహాను 14:6లో యేసు తోమాతో పలికి యున్నారు. “నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక గొనడు” అని యోహాను. 6:35లో యేసు పలికి యున్నారు. మరల, “కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు, నిత్యజీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును” అని యోహాను. 6:40లో యేసు పలికి యున్నారు. దేవుడు తననుతాను ప్రత్యక్షపరచుకొని, తన రక్షణ ప్రణాళికను మనకు వెల్లడించారు. ఈ రక్షణ ప్రణాళికను పరిశుద్ధ బైబులు గ్రంథముద్వారా మనం తెలుసుకొన వచ్చును.

ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడవలయుననియు, సత్యమును గూర్చిన జ్ఞానమును కలిగి యుండవలయుననియు రక్షకుడైన దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే! దేవునకు మానవులకు మధ్యన ఒకే మధ్యవర్తి యేసుక్రీస్తు. మానవాళి రక్షణకై యేసు క్రీస్తు తననుతాను అర్పించుకొనెను అని 1 తిమో 2:4-6లో చదువుచున్నాము. దీనినిమిత్తమై, “నేను ప్రచారకునిగాను, అపోస్తలునిగాను, బోధకునిగాను నియమింప బడితిని” అని 1 తిమో 2:7లో పౌలుగారు తెలియజేస్తూ, సువార్తా బోధనను తన ప్రధాన బాధ్యతగా స్వీకరించాడు.

కనుక ఈ రక్షణ సందేశాన్ని సాధ్యమైనంత వరకు మనం లోతుగా అర్ధంచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులకు, పవిత్ర బైబులు గ్రంథమును శ్రద్ధగా పఠనం చేయాలి. ఉత్సాహపూరితముగా అధ్యయనం చేయాలి. బైబులు కేవలం అధ్యయనం చేయాల్సిన గ్రంథము మాత్రమే కాదు. ఎందుకన, అది మనలను విశ్వాసములోనికి, పరివర్తన జీవితములోనికి ఆహ్వానించే సజీవవాక్కు. పవిత్ర గ్రంథమైన దేవుని పరిశుద్ధ వాక్కు సందేశము, మనలను రక్షకుడి దరికి చేర్చగలదు. పాపాత్ములకు ఏకైక రక్షకుడు క్రీస్తు! కనుక పవిత్ర గ్రంథమును చదవడం, నేర్చుకోవడం, అధ్యయనం చేయడం, ప్రతీ క్రైస్తవ విశ్వాసి యొక్క బాధ్యత.

పవిత్ర గ్రంథము తరగని సత్యనిధి. అది మనకు లభించిన గొప్ప కృపానుగ్రహము, ఆశీర్వాదము. మనం ఏమి చేయవలయునో, ఎలా జీవించవలయునో తెలుసుకోవాలంటే తప్పక పవిత్ర బైబులు గ్రంథమును (దేవుని వాక్కు) చదవాలి. దేవునివాక్కు మనకు ఏమి బోధించునో తెలుసుకోవాలంటే, మన గురించిన దేవుని ప్రణాళికను, చిత్తమును తెలుసుకోవాలంటే, దేవుని వాక్కును శ్రద్ధగా చదవాలి, ఆలకించాలి, ధ్యానించాలి, మన జీవితాలకు అన్వయించుకోవాలి. అలాగే సువార్తను విశ్వాసముతో ప్రకటించాలి, బోధించాలి. వివరించాలి.

ఈ పవిత్ర బైబులు గ్రంథ పాఠాల ద్వారా, ప్రతీ క్రైస్తవ విశ్వాసి పవిత్ర బైబులు గ్రంథమును క్షుణ్ణముగా, లోతుగా అర్ధం చేసుకోవాలనేదే నా ఆశ! నా ప్రార్ధన! ఈ నా చిన్ని ప్రయత్నాన్ని రక్షకుడైన యేసు దేవుడు దీవించునుగాక! అలాగే, చదువరులందరిని మరియు శ్రోతలందరిని త్రిత్వైక దేవుడు తన ఆత్మతో నింపి, దేవుని వాక్కు తో పవిత్ర పరచును గాక!

No comments:

Post a Comment