పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 02

07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 02 

7.6. శుభాకాంక్షలు, కృతజ్ఞతలు (1:1-15)
7.7. క్రీస్తు లేని మానవ జాతి (1:18-3:20)
7.7.1. అన్యుల స్థితి (1:18-32)
7.7.2. యూదుల స్థితి (2:1-3:20)
7.7.2.1. దేవునకు పక్షపాతము లేదు (2:1-11)
7.7.2.2. ధర్మశాస్త్రము యూదులను రక్షించలేదు (2:12-24)
7.7.2.3. సున్నతి యూదులను రక్షించ లేదు (2:25-29)
7.7.2.4. దేవుని వాగ్దానాలు యూదులను రక్షించ లేదు (3:1-8)
7.7.2.5. ఎవరును నీతిమంతులు కారు (3:9-20)

పౌలు తనను తాను యేసు క్రీస్తు సేవకుడు”, “అపోస్తలుడు” మరియు “సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడుగా పరిచయం చేసుకొను చున్నాడు (1:1, ఫిలిప్పీ. 1:1). “యేసు క్రీస్తు సేవకుడు” (గ్రీకు పదం δούλος - doúlos) అనగా ‘క్రీస్తుకు చెందినవాడు’, ‘క్రీస్తు ఆజ్ఞాపించిన దానిని మాత్రమే చేయువాడు’ అని భావం.

అపోస్తలుడు” (గ్రీకు పదం απόστολοςapóstolos) అనగా వార్తాహరుడుగా లేదా ప్రతినిధిగా పంపబడినవాడు’, ‘అధికార బాధ్యతను మోసేవాడుఅని అర్ధం. గ్రీకు పదానికి సమాంతర హీబ్రూ పదానికి (שליח - shalákh) ‘రాయబారిఅని అర్ధం (యోహాను. 13:16 “పంపబడినవాడు”, 2 కొరి. 8:23 “ప్రతినిధి”, ఫిలిప్పీ. 2:25 “దూత”). నూతన నిబంధన గ్రంథములో అపోస్తలుడుఅనే పదం అనేకసార్లు వాడబడినది. కొన్ని సార్లు క్రీస్తు ఎన్నుకొనిన పన్నెండ్రు మందిని సూచిస్తుంది (మత్త. 10:2, అ.కా. 1:26, 2:37, 1 కొరి. 15:7, దర్శన. 1:8). కొన్నిసార్లు సాక్ష్యము ఇచ్చువారుఅని సూచిస్తుంది (అ.కా. 1:8). “అపోస్తలుడుఅనగా సువార్తను బోధించుటకు పంపబడినవాడుఅని సూచిస్తుంది (రోమీ. 16:7, 1 కొరి. 12:28, ఎఫెసీ. 2:20, 3:5, 4:11). పౌలు పన్నెండ్రు మంది అపోస్తలులలో ఒకరు కాకపోయినను, ఉత్థాన క్రీస్తానుభవము మరియు అన్యులకు అపోస్తలుడుగా నియమింప బడటం (రోమీ. 11:13, అ.కా. 26:17, 1 కొరి. 9:2, గలతీ. 2:8, 1 తిమో. 2:7), “ఉత్థాన క్రీస్తు అపోస్తలుడుఅని చాటుకునేలా (రోమీ. 1:1, 1 కొరి. 1:1) మరియు పన్నెండ్రు మంది అపోస్తలులుకు సమానముగా (అ.కా. 10:41) చేసింది. పౌలు అపోస్తలుడుఅని తన పక్షాన వాదించు కున్నాడు (1 కొరి. 9:1-2, 2 కొరి. 11:5, 13, 12:11-12).

సువార్త” (గ్రీకు పదం εὐαγγέλιον - evangélio) అనగా శుభవార్త’, ‘మంచి లేదా ఆనందకరమైన వార్తఅని అర్ధం. హీబ్రూ పదానికి ( בשורה లేదా בשרה - bes·ō·rä') ‘ప్రకటించడం’, ‘తెలియజేయడం’, ‘చెప్పడం’, ‘శుభవార్తను తెచ్చుటఅని అర్ధం. యెషయా ప్రవక్త గ్రంథములో, “ఇశ్రాయేలు ప్రజలను బాబిలోనియ బానిసత్వమునుండి విడిపించుటకు దేవుడు తన రక్షణాత్మకమైన జోక్యమును కలుగ జేసుకొనును అను శుభవార్తను ప్రకటించుటఅను అర్ధముతో ఉపయోగించ బడినది (చూడుము. యెషయ 40:9, 41:27, 52:7, 60:6, 61:1).

నూతన నిబంధనలో “సువార్త” అనగా “ఇప్పటికే యేసు క్రీస్తు నందు ప్రారంభించబడిన ‘మరణానంతరం మానవాళి యొక్క విముక్తిని’ (eschatological liberation of humankind) ప్రకటించుట” అని అర్ధము. పౌలుకు సువార్త యేసు-కేంద్రీకృతమయ్యెను. ‘వాగ్ధానము చేయబడిన మెస్సయా’గా యేసు ఎలా అని పౌలు వివరిస్తున్నాడు: (అ). మానవుడుగా, దావీదు సంతతిలో జన్మించెను (1:3), (ఆ). పవిత్ర పరచు ఆత్మ శక్తితో, మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారుడుగా నియమింప బడెను (1:4).

అన్నిజాతుల ప్రజలు యేసు క్రీస్తు నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు, ఉత్థాన క్రీస్తునుండి పౌలు అనుగ్రహమును మరియు అపోస్తలత్వమును స్వీకరించెను (1:5). అపోస్తలుడుగా అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించుటకు పంపబడినాడని తన గురించి తెలియజేసిన తరువాత, రోము నగర మందలి క్రైస్తవుల గురించి చెబుతూ, వారు “పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారని” తెలియజేయు చున్నాడు. ఈ లేఖను తను అన్య-క్రైస్తవులకు వ్రాయుచున్నట్లు పౌలు స్పష్టము చేయుచున్నాడు. పౌలు, “మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృప, సమాధానము కలుగును గాక!” అంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేయు చున్నాడు (1:6-7).

రోము నగర క్రైస్తవుల విశ్వాసమును ప్రపంచము అంతయు పొగడుచున్నందున దేవునకు కృతజ్ఞతలు చెప్పుకోను చున్నాడు (1:8). ఆ తరువాత, వారిని సందర్శించాలనే తన కోరికను తెలియజేయు చున్నాడు. వారిని ఎల్లవేళల తన ప్రార్ధనలో జ్ఞాపకముంచు కొనుచున్నాడని మరియు వారిని చేరుకొన గలుగుటకై ప్రార్ధించు చున్నాడని చెప్పుచున్నాడు (1:9-10).

పౌలు ఎందుకు వారిని సందర్శించాలని కోరుచున్నాడో కారణాలను తెలియజేయుచున్నాడు:

- ఆధ్యాత్మిక కృపావరమును ఇచ్చుటకు (1:11)
- ఒకరి విశ్వాసము వలన ఒకరు ప్రోత్సాహము పొందుటకు (1:12)
- రోము నగర అన్యులలో మార్పును తీసుకొని రావడానికి (1:13)
- గ్రీకులు, అనాగరికులు, జ్ఞానులు, అజ్ఞానులు అగు అందరి పట్ల తన బాధ్యతను నెరవేర్చడానికి (1:14).

7.7. క్రీస్తు లేని మానవ జాతి (1:18-3:20)

పౌలు ఇచట ప్రధానముగా రెండు విషయాలను తర్కించు చున్నాడు: అన్యుల స్థితి (1:18-32) మరియు యూదుల స్థితి (2:1-3:20).

“నీతిమంతుడు ఎవడును లేడు, ఏ ఒక్కడును లేడు” (రోమీ. 3:10). ఎవరును నీతిమంతులు కారు. అన్యజనులును, యూదులును ఒకేవిధముగా పాప ప్రభావమునకు లోనై యున్నారు. అందరు పాపాత్ములే. అందరును దేవునికి దూరమైన వారే. ఈ వాదనను నిరూపించుటకు పౌలు అన్యుల స్థితిని (1:18-32) మరియు యూదుల స్థితిని (2:1-3:20) ప్రస్తావిస్తున్నాడు.

7.7.1. అన్యుల స్థితి (1:18-32)

దేవున్ని తెలుసు కొనుటలో విఫలమైన అన్యజనుల గురించి, వారి స్థితిని గురించి పౌలు వివరిస్తున్నాడు. వారు ప్రకృతి నుండి, సృష్టి నుండి దేవున్ని తెలుసు కొనుటలో విఫలమైరి.

దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటినుండి, ఆయన యొక్క అగోచర గుణములు, ఆయన శాశ్వత శక్తి, దైవత్వము, సృష్టి వస్తుజాలములో స్పష్టముగ విశదపరచినను వారు దేవున్ని ఎరుగలేదు. ఆయనకు ఈయవలసిన గౌరవమును వారు ఈయలేదు. ఆయనకు కృతజ్ఞత చూపలేదు (1:20-21).

వారు తమ హేతువాదములందు వ్యర్దులైతిరి, వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించెను. వారు బుద్ధిమంతులము అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైతిరి (1:21-22).

వారు అమరుడైన దేవుని మహిమను మరణమొందు మనుష్యుని స్వరూపముగా, పక్షుల, జంతువుల, సర్పముల రూపములుగా మార్చిరి (1:23).

వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింప బడిన వస్తువును వారు పూజించి సేవించిరి (1: 25).

ఈ కారణముల వలన, దేవుడు వారిని వారి హృదయముల దురాశలకును, వారి శరీరములను అగౌరవపరచు పరస్పర జుగుప్సాకర ప్రవర్తనలకును వదిలి వేసెను. దేవుడు వారిని తుచ్ఛ వ్యామోహముల పాలొనర్చెను. దాని ఫలితముగా, వారు తమ తప్పునకు తగిన శిక్షను తన శరీరములందు అనుభవించిరి (1:24, 26-27).

దేవుని గూర్చిన సత్యమగు జ్ఞానమును వారు తమ మనసులలో ఉంచుకొనలేదు. కనుకనేం చేయరాని పనులు చేయునట్లుగ దేవుడు వారీ భ్రష్ట మనస్సుకు అప్పగించెను (1:28-32).

ఈవిధముగా, అన్యులు దేవుని తెలుసుకొనుటలో విఫలమైనందున వారిపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గత మయ్యెను.

పౌలు ప్రకారం, ఇట్టి ప్రవర్తన కలవారికి ‘చావే తగినదను దేవుని చట్టము’ వారికి తెలియును ఐనను వారు ఈ పనులను చేయుచునే ఉందురు. క్రీస్తు సువార్త లేకుండా మనుష్యులు నీతిమంతులుగ, పాపరహితులుగ ఉండలేరని పౌలు రోము నగర క్రైస్తవులకు తెలియజేయు చున్నాడు.

7.7.2. యూదుల స్థితి (2:1-3:20)

ఈ క్రింది భాగాలుగా అధ్యయనం చేద్దాం:

- దేవునకు పక్షపాతము లేదు (2:1-11)
- ధర్మశాస్త్రము యూదులను రక్షించలేదు (2:12-24)
- సున్నతి యూదులను రక్షించ లేదు (2:25-29)
- దేవుని వాగ్దానాలు వారిని రక్షించ లేవు (3:1-8)
- ఎవరును నీతిమంతులు కారు (3:9-20)

7.7.2.1. దేవునకు పక్షపాతము లేదు (2:1-11)

యూదులైన, అన్యులైన ఎవరి విషయములోనైనా దేవుడు ఎలాంటి పక్షపాతము చూపడు. యూదులకు ప్రత్యేకమైన ప్రయోజనాలు గాని, పాపమునకు ఫలితముగా ఎలాంటి మినహాయింపులు గాని ఉండవు. ఇతరులకు తీర్పు చెప్పుచూ, వారే అట్టి కార్యములు చేయుచున్న వారికి, దేవుని తీర్పు తప్పదు. దేవుడు వారికి అనుకూలముగా ఉంటాడని యూదులు ఆశిస్తున్నారు. కాని దేవుని ఆగ్రహమునకు మరియు న్యాయ తీర్పునకు గురికావలసినదే! ఎందుకన, వారి హృదయములు కఠినమైనవి మరియు మొండివి.

యూదుల పట్ల దేవుని నిండైన దయ, సహనము, ఓర్పు వారికి అనుకూలమని, ప్రయోజనకరమని తప్పుగా భావింపరాదు. ఇదంతయు కూడా వారి పరివర్తన కొరకే. హృదయ పరివర్తన చెందని వారు, తీర్పు దినమున దేవుని ఆగ్రహమునకు గురియగును. “ఏలయన, వాని వాని క్రియలను బట్టియే దేవుడు ప్రతి వ్యక్తిని బహూకరించును” (రోమీ. 2:6):

(అ). ఓర్పుతో సత్కార్యములు చేయుచు, కీర్తి, ప్రతిష్ఠ, అమరత్వములను కోరు వారికి దేవుడు శాశ్వత జీవమును ఒసగును (రోమీ. 2:7).

(ఆ). విభేదములు కల్గించుచు సత్యమును అంగీకరింపక తప్పుడు మార్గమును అవలంబించు వారిపై దేవుడు ఆగ్రహమును, రౌద్రమును కురియించును (రోమీ. 2:8).

(ఇ). దుష్కార్యము లొనర్చు ప్రతి వ్యక్తికి, యూదులైన, అన్యులైన కష్టములు, బాధలు తప్పవు (రోమీ. 2:9).

(ఈ). సత్కార్యములు చేయు ప్రతి వ్యక్తికి, యూదులైన, అన్యులైన దేవుడు వైభవమును, గౌరవమును, శాంతిని ప్రసాదించును (రోమీ. 2:10).

7.7.2.2. ధర్మశాస్త్రము యూదులను రక్షించలేదు (2:12-24)

యూదులైన, అన్యులైన పాపఫలితమును అనుభవింతురు. ధర్మశాస్త్రము నందు, ధర్మశాస్త్రము వెలుపల పాపము ఉన్నదని పౌలు తెలియజేయు చున్నాడు. “ధర్మశాస్త్రము లేకయే పాపము కట్టుకొన్న అన్యులు, ఆ ధర్మశాస్త్రముతో సంబంధము లేకనే నాశన మగుదురు. మోషే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా పాపము కట్టుకొన్న యూదులు, ఆ ధర్మశాస్త్రము వలననే దండింప బడుదురు” (రోమీ. 2:12). తుది తీర్పునకు సంబంధించి, ధర్మశాస్త్రము ఉన్నదా లేదా అనునది అప్రస్తుతము. “ఏలయన, కేవలము ధర్మశాస్త్రమును వినుత మాత్రము కాక, ధర్మశాస్త్రము నందలి నియమములను అనుసరించుట వలననే మనుష్యులు దేవుని ఎదుట నీతిమంతులు గావింప బడుదురు” (రోమీ. 2:13). అయితే రోమీ. 3:20లో పౌలు ఇలా చెబుతున్నాడు, “ఏలయన, ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు.”

“నీతిమంతులు గావింప బడుట” యనగా, రక్షణ ఆశీర్వాదములను పొందుటకు, తీర్పు దినమున దేవుడు తన తీర్పు వలన ఒక వ్యక్తిని ఆమోదించడం లేదా అంగీకరించడం. “అన్యజనులకు ధర్మశాస్త్రము లేదు. కాని వారికై వారు స్వభావ సిద్ధముగా ధర్మశాస్త్రము నందలి శాసనములను పాటించినచో, వారు ధర్మశాస్త్రము లేనివారే యైనను, వారికి వారే ఒక ధర్మ ధర్మశాస్త్రమగుదురు” (రోమీ. 2:14). కనుక, దేవుని తీర్పునకు ధర్మశాస్త్రము కొలమానము మరియు ఆధారము కాదు అని స్పష్టమగు చున్నది. “ధర్మశాస్త్రము కోరునది వారి హృదయములపై ముద్రింపబడి యున్నదని వారి ప్రవర్తనయే చాటును” (రోమీ. 2:15).

యూదులకు మార్గనిర్ధేశకముగా ధర్మశాస్త్రము ఉన్నట్లే, అన్యులకు ప్రకృతి ధర్మము వారి హృదయాలలోనే ఉన్నది. రోమీ. 2:17-24 నందు ధర్మశాస్త్రమునకు సంబంధించి యూదులను పౌలు సవాలు చేయుచున్నాడు. యూదులు వారు చెప్పుకొనుచున్న దానికి, చేయుచున్న దానికి పొంతన లేదని పౌలు స్పష్టముగా తెలియజేయు చున్నాడు:

నీవు యూదుడవని చెప్పుకొను చున్నావు,
ధర్మశాస్త్రముపై ఆధార పడుచున్నావని గొప్పలు చెప్పుచున్నావు,
దేవుని చిత్తము తెలిసిన వానివైతే,
మంచిని ఎన్నుకొనుటను ధర్మశాస్త్రము నుండి నేర్చుకొంటివను చున్నచో (రోమీ. 2:17-18),
గృడ్డివారికి మార్గదర్శకుడ వైనచో,
చీకటిలో నున్న వారికి దీపమైనచో,
మూర్ఖులకు బోధకుడ వైనచో,
పిన్నలకు గురువైనచో,
విజ్ఞాన పరిపూర్ణత, సత్య సంపూర్ణత నీవు కలిగి యున్నచో (రోమీ. 2:19-20),
ఇతరులకు బోధించు నీవు, నీకు నీవే ఎందుకు బోధించు కొనవు?
దొంగలింపకుము అని బోధించు నీవు, దొంగలింతువా?
వ్యభిచరింపకుము అని చెప్పుచున్న నీవు, వ్యభిచరింతువా?
విగ్రహములను అసహ్యించు కొనుచున్న నీవు, దేవాలయమును దోచుకొందువా?
నీకు దేవుని ధర్మశాస్త్రమున్నదని గొప్పలు చెప్పుకొనుచున్న నీవు, ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా దేవుని అవమానింతువా? (రోమీ. 2:21-23).

రోమీ. 2:24లో పౌలు యెషయ 52:5 మరియు యెహెజ్కె. 36:20లను ప్రస్తావిస్తూ ముగిస్తున్నాడు: “... నిరంతరము నా నామమును వారు అవమానించు చున్నారు” (యెషయ 52:5). “... వారు పోయిన తావులందెల్ల నా నామమునకు అపకీర్తి తెచ్చిరి” (యెహెజ్కె. 36:20).

7.7.2.3. సున్నతి యూదులను రక్షించ లేదు (2:25-29)

నిజమైన యూదుడు ఎవరు? అని పౌలు నిర్వచనం ఇస్తున్నాడు. పౌలు ప్రకారం, ధర్మశాస్త్రమును పొంది, బాహి శారీరక సున్నతి పొంది, ధర్మశాస్త్రమును ఉల్లంఘించు వారు నిజమైన యూదుడు కాదు. అంతరంగమున యూదుడైన వాడు నిజమైన యూదుడు.

సున్నతి పొందక, ధర్మశాస్త్రమును కలిగి లేక, కాని, ధర్మశాస్త్ర నియమములను పాటించు అన్యుడు, కేవలం బాహ్యముగ మాత్రమే యూదుడైన వాడిని ఖండించును. కేవలం బాహ్యశారీరక సున్నతి యూదుడిని రక్షించ లేదు.

7.7.2.4. దేవుని వాగ్దానాలు యూదులను రక్షించ లేదు (3:1-8)

పౌలు తనకుతాను ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలిస్తున్నాడు. దేవుడు తన వాగ్దానాలకు విశ్వాసపాతృనిగా ఉన్నప్పటికిని, యూదులు వారి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాలను పొందే అవకాశమును పోగొట్టు కున్నారు.

(అ). అన్యజనుల కంటె యూదులకున్న గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? అధికమే! దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించెను (రోమీ. 3:1-2).

(ఆ). వారిలో కొందరు అవిశ్వాసులైనంత మాత్రమున ఏమి? వారి అవిశ్వాసము దేవుని విశ్వసనీయతను భంగపరచునా? (రోమీ. 3:3). ఎన్నటికిని కాదు! (రోమీ. 3:4). దేవుడు ఎన్నటికిని తన వాగ్దానములను మీరడు. నిబంధనకు ఎల్లప్పుడు విశ్వసనీయముగా ఉంటాడు. కాని మానవులు అవిశ్వసనీయముగా ఉంటారు. పౌలు కీర్తన 51:4ను ప్రస్తావిస్తున్నాడు: “నీవు మాటలలో సత్యవంతుడవని ప్రదర్శింప బడవలెను. నీవు తీర్పు చేయబడినపుడు గెలుపొందవలెను.”

(ఇ). మన అన్యాయము దేవుని ధర్మమును ప్రదర్శించుటకు తోడ్పడినచో అప్పుడు ఏమందురు? మనలను శిక్షించుటలో దేవుడు తన ధర్మమును అతిక్రమించెనని అందుమా? (రోమీ. 3:5). అది ఎన్నటికి కాదు! దేవుడు లోకమునకు (అందరికి) తీర్పరి కనుక మనకు తీర్పు చెప్పును (రోమీ. 3:6).

(ఈ). నా అసత్యపు దేవుని సత్యమును ప్రదర్శించుచు, ఆయన వైభవమునకు తోడ్పడుచున్నప్పుడు, ఆయన నన్ను ఏల ఇంకను పాపిగా తీర్పు చేయును? (రోమీ. 3:7). అటులైన మేలు కలుగుటకే కీడు చేయుదమని కొందరు మిమ్ము దూషించి చెప్పినట్లు మేము ఎందుకు చెప్పరాదు? అట్టివారు తగిన దండనను పొందుదురు (రోమీ. 3:8). ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమనగా, “మేలు కలుగుటకు కీడు చేయుము” అని పౌలు చెప్పుచున్నాడని తప్పుగా అర్ధం చేసుకొన రాదు.

దేవుడు నీతిమంతుడు, అయన తీర్పు చేయువాడు, యిస్రాయేలుతో నిబంధన వాగ్దానములకు నమ్మకముగా ఉన్నాడు అని పౌలు తెలియజేయు చున్నాడు. అయితే దేవుడు శిక్షించు వాడు మరియు రక్షించు వాడు!

7.7.2.5. ఎవరును నీతిమంతులు కారు (3:9-20)

అన్యజనుల కంటె యూదులు ప్రయోజన కరముగా ఉండిరి. ఎందుకన, దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించెను (రోమీ. 3:2). అయితే, యూదులు ఈ ప్రయోజనమును, వారికి అనుకూలముగా ఉపయోగించు కొనలేక పోయిరి. పాపము వలన దేవుని సందేశము లేని ఇతరుల వలె వారుకూడా పాప ప్రభావమునకు లోనైరి. ఈవిధముగా, అందరూ, యూదులును మరియు అన్యులును పాప ప్రభావమునకు లోనై యున్నారు.

ఈ వాదనను బలపరచుటకు కీర్తనల నుండి, ప్రవక్తల నుండి ఉదాహరణలుగా పౌలు ప్రస్తావించాడు.

రోమీ. 3:10-12 = కీర్తన. 14:1-3, 53:1-3
రోమీ. 3:13 = కీర్తన. 5:9, 140:3
రోమీ. 3:14 = కీర్తన. 10:7
రోమీ. 3:15-17 = యెషయ 59:7-8
రోమీ. 3:18 = కీర్తన. 36:1

కనుక, ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు (రోమీ. 2:13, 3:20). ఎందుకనగా, ధర్మశాస్త్రము యొక్క పని నీతిమంతులను చేయుట కాదు. కాని, పాపమనగా ఏమిటో మానవుడు గుర్తించునట్లు చేయుటయే! (రోమీ. 3:20).

No comments:

Post a Comment