07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 06

07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 06 
7.11. సువార్త ప్రకారం జీవించాలని ప్రబోధం (12:1-15:13)
7.11.1. దేవునికి అంగీకార యోగ్యమైన స్వీయార్పణ (12:1-2)
7.11.2. ఔచిత్యము, సేవ మరియు ఆత్మ వరాలు (12:3-8)
7.11.3. ఆచరాత్మకమగు ప్రేమ (12:9-21)
7.11.4. అధికారులకు లోబడి ఉండవలయును (13:1-7)
7.11.5. పరస్పరము ప్రేమింపుడు (13:8-10)
7.11.6. వెలుతురులో జీవించు ప్రజలుగ ఉండుడు (13:11-14)
7.11.7. సహనము మరియు సేవ (14:1-15:13)
7.12. ముగింపు (15:14-16:27)

7.11. సువార్త ప్రకారం జీవించాలని ప్రబోధం (12:1-15:13)

ఇచట పౌలు ఆచరాణాత్మకమైన సలాహాలను, నిర్దేశాలను తెలియజేయు చున్నాడు. అనుదిన జీవితములో ప్రేమ మరియు చట్టముపై ఆధారముగల సువార్తా విలువలను పాటించాలని పౌలు కోరుచున్నాడు:

7.11.1. దేవునికి అంగీకార యోగ్యమైన స్వీయార్పణ (12:1-2)

దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగ మీ శరీరములను ఆయనకు సమర్పించు కొనుడు. ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగ జేయనిండు.

7.11.2. ఔచిత్యము, సేవ మరియు ఆత్మ వరాలు (12:3-8)

మీ ఆలోచనలో అణకువ చూపుడు. సేవ చేయుడు. ఇతరులను ప్రోత్సహించుడు. ఉన్న దానిని ఇతరులతో పంచుకొనుడు.

7.11.3. ఆచరాత్మకమగు ప్రేమ (12:9-21)

సంఘములో ఇతరులతో జీవించుటకు కావలసిన ఆచరాణాత్మకమైన సలహాలను పౌలు ఇచ్చు చున్నాడు:

- ప్రేమ నిష్కపటమైనది. చెడును ద్వేషింపుడు.
- మంచిని అంటిపెట్టుకొని ఉండుడు. ఒకరిని ఒకరు సోదరభావముతో ప్రేమించు కొనుడు.
- ఒకరిని ఒకరు గౌరవించు కొనుటకై త్వర పడుడు. సోమరులై ఉండక కష్టపడి పని చేయుడు.
- భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు.
- మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు.
- సర్వదా ప్రార్ధింపుడు. అవసరములో నున్న సోదరులను ఆదుకొనుడు.
- అతిధి సత్కార్యములను ఆచరింపుడు.
- మిమ్ము హింసించు వారిని శపింపక దీవింపుడు.
- ఆనందించు వారితో ఆనందింపుడు. దు:ఖించు వారితో దు:ఖింపుడు.
- అందరి యెడల సమతా భావము కలిగి యుండుడు. గర్వ పడకుడు.
- హెచ్చైన వానియందు మనస్సు ఉంచక, తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధి మంతులమని అనుకొనకుడు.
- తిరిగి అపకారము చేయకుడు. అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరింపుడు. అందరితో సౌమ్యముగా జీవింపుము.
- పగ తీర్చు కొనక, దేవుని ఆగ్రహమునకే వదలి వేయుడు.
- కీడు వలన జయింప బడక, మేలుచేత కీడును జయింపుము.

7.11.4. అధికారులకు లోబడి ఉండవలయును (13:1-7)

- పై అధికారులకు లోబడి ఉండవలయును. దేవుని అనుమహ్తి లేనిదే ఏ అధికారము ఉండదు.
- అధికారులను ఎదిరించు వాడు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లే. అట్లు చేయువారు తీర్పును కొని తెచ్చుకొందురు.
- పాలకులు మంచి కార్యములు చేయు వారికి భయంకరులు కారు. చెడు కార్యములు చేయు వారికి వారు భయంకరులు.
- అధికారికి భయపడకుండ ఉండవలనేని, సత్కార్యములను చేయుము. అట్లు చేసిన నిన్ను పొగుడును.
- నీవు చెడు చేసినచో భయపడ వలయును. చెడు కార్యములను చేయు వారిపై ఆగ్రహమును కనబరచును.
- అధికారులకు విధేయులు కావలెను. ఇది మనస్సాక్షిని బట్టియు మరియు దేవుని ఆగ్రహమును తప్పించు కొనుటకు.
- పన్నులు చెల్లించ వలయును. కర్తవ్య నిర్వహణలో అధికారులు దేవుని పరిచారకులు.
- ఎవరికి చెల్లింపు వలసినది వారికి చెల్లింపుడు: పన్నులు, కప్పములు, భయము, గౌరవము.

7.11.5. పరస్పరము ప్రేమింపుడు (13:8-10)

తోడివారిని ప్రేమిస్తే చట్టమును లేదా ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని పౌలు తెలియజేయు చున్నాడు. ప్రేమ అన్ని ఆజ్ఞలను పూర్తి చేయును. మనకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, ఒకరినొకరిని అన్యోన్యము ప్రేమించు కొనుటయే. “నిన్ను నీవు ప్రేమించు కొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము” (లేవీ. 19:18, మార్కు. 12:31, గలతీ. 5:14).

7.11.6. వెలుతురులో జీవించు ప్రజలుగ ఉండుడు (13:11-14)

క్రైస్తవులు ‘రక్షణ సమయ’ ఆగమమును గుర్తించి, మేల్కొని యుండవలయును. వారు చీకటికి చెందిన పనులను మానివేసి, పగటి వేళ పోరాట మొనర్చుటకు ఆయుధములు ధరింప వలయును. వెలుతురులో జీవించు ప్రజలుగ, సత్ప్రవర్తన కలిగి యుండ వలయును. అసభ్యకరమగు వ్యక్తిగత చెడు పనులను మానివేయ వలయును. శరీరేచ్చలను జయించుటకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించ వలయును.

7.11.7. సహనము మరియు సేవ (14:1-15:13)

విశ్వాసమున బలహీనులు మరియు బలవంతుల గురించి చర్చిస్తూ, వారు ఒకరిపట్ల ఒకరు ఎలా ప్రవర్తించ వలయునో పౌలు తెలియజేయు చున్నాడు. సంఘములోని అన్ని విషయముల పట్ల సహనము మరియు సేవ మార్గదర్శకాలుగా ఉండవలయును. రోమీ. 14:1-12లో క్రైస్తవులను పౌలు ఇలా కోరుచున్నాడు:

- విశ్వాసమున బలహీనుడైన వ్యక్తిని అంగీకరింపుము
- అన్నిటిని తిను వ్యక్తియైనను, తినని వ్యక్తియైనను, ఎవరిని కూడా నీచముగ భావింప రాదు.
- ఎవరిపై తీర్పు చేయరాదు

రోమీ. 14:13-23లో తోటివారికి ఆటంకము కులుగజేయ కూడదు, వారిని పాపాత్ముని చేయునది దేనినైనను చేయరాదు అని చదువరులను అపోస్తలుడు పౌలు కోరుచున్నాడు. ఒకడు తాను తినే విషయములో ఇతరులను బాధించరాదు. అన్నింటికన్న ముఖ్యమైనది సమాధానమును మరియు పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు విషయములనే ఆసక్తితో అనుసరించాలి. రోమీ. 15:1-6లో సహనము విషయములో క్రీస్తు జీవితము, క్రైస్తవుల సహనమునకు ఆదర్శముగా ఉండవలయునని పౌలు తెలియజేయు చున్నాడు. “సహనమునకును, ప్రోత్సాహము నకును కర్తయగు దేవుడు, క్రీస్తు యేసును అనుసరించుట ద్వారా మీకు పరస్పరము సామరస్యమును కలిగించునుగాక!” (రోమీ. 15:5). క్రీస్తు క్రైస్తవులను స్వీకరించినట్లే, వారు కూడా ఇతరులను స్వీకరించాలి (రోమీ. 15:7-13). “నిరీక్షణకు మూలమగు దేవుడు, ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణ ఆనందమును, సమాధానమును కలిగించును గాక! పవిత్రాత్మ ప్రభావమున మీ నిరీక్షణ సంపూర్ణ మగును” (రోమీ. 15:13).

7.12. ముగింపు (15:14-16:27)

ముగింపు భాగములోని 15:14-21లో ఇప్పటి వరకు పౌలు చేపట్టిన తన ప్రేషిత పరిచర్య కార్యములను చూడవచ్చు:

- క్రీస్తు యేసు సేవకుడై అన్యుల కొరకు పని చేసి యున్నాడు.
- సువార్తను బోధించుటలో ఒక అర్చకునిగా పని చేసి యున్నాడు.
- అన్య జనులను దేవునకు విధేయులగునట్లు చేసెను.
- సువార్తను సంపూర్ణముగా ప్రకటించాడు.

15:22-33లో పౌలు భవిష్యత్తు ప్రణాళికలను చూడవచ్చు:

- మాసిడోనియా, గ్రీసు దైవసంఘముల నుండి యేరూషలేము నందలి దైవప్రజలలోని పేదల సహాయర్ధమై ప్రోగుచేసిన ధనమును వారికి అప్పగించ వలయును.
- తరువాత, స్పెయిను దేశమునకు పోవుచు త్రోవలో రోము నగర క్రైస్తవులను చూచి, కొంత కాలము వారితో ఆనందముగ గడిపి, తన ప్రయాణానికి వారి తోడ్పాటును పొందవలయును.

చివరి అధ్యాయములో, పౌలు వ్యక్తిగత శుభాకాంక్షలు (16:1-16), తుది ఉత్తర్వులు (16:17-20), తుది శుభాకాంక్షలు(16:21-24) మరియు తుది స్తోత్రము (16:25-27)ను చూడవచ్చు.

No comments:

Post a Comment