07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 05

07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 05 
7.10. రక్షణ చరిత్రలో యిస్రాయేలు, ఎన్నుకొనబడిన ప్రజలు (9:1-11:36)
7.10.1. యిస్రాయేలు ప్రజల విశేషాధికారములు (9:1-5)
7.10.2. దేవుని వాగ్దానాలు - పూర్వ నిబంధన విశ్లేషణ (9:6-29)
7.10.3. యిస్రాయేలు వైఫల్యం (10:1-4)
7.10.4. యేసునందు విశ్వసించు ప్రతివానికి రక్షణ (10:5-13)
7.10.5. యిస్రాయేలుకు మన్నింపు లేదు (10:14-21)
7.10.6. యిస్రాయేలుపై దేవుని కృప (11:1-10)
7.10.7. యిస్రాయేలు భవిష్యత్తు పునరుద్ధరణ (11:11-15)
7.10.8. ఎన్నుకొనబడిన ప్రజలుగా యిస్రాయేలు స్థాయి (11:16-24)
7.10.9. యూదుల మారుమనస్సు (11:25-32)
7.10.10. దైవ స్తుతి (11:33-36)

7.10. రక్షణ చరిత్రలో యిస్రాయేలు, ఎన్నుకొనబడిన ప్రజలు (9:1-11:36)

యూదులు ధర్మశాస్త్రము నందు గర్వపడ్డారు. అన్యులకు ధర్మశాస్త్రము లేకుండెను. అయినప్పటికిని, ఇరువురు కూడా పాపము చేసితిరి. ధర్మశాస్త్రము ఉన్నను, లేకున్నను పాపము విషయములో ఎలాంటి బేధము లేకుండెను.

సర్వమానవాళి పాపము చేసెను. కనుక రక్షణ అందరికి అవసరమై యుండెను. దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ రక్షణను సాధ్యమయ్యేలా చేసెను. పౌలు చెప్పునది ఏమనగా, యూదులు మెస్సయ్యను నిరాకరించి నందున, దేవుని యందు వారికి వారే నిరాకరింపబడి యున్నారు.

మెస్సయ్య రాకతో, రక్షణ చరిత్ర పరాకాష్ట చేరుకున్నది. రక్షణ మార్గము అందరికి తెరువబడి యున్నది - యూదులకు మరియు అన్యులకు. ఒకే ఒక్క నియమం ఏమనగా, విశ్వాసముతో మెస్సయ్యను అంగీకరించడం. ఇస్రాయేలు ప్రజలు (యూదులు) విశేషాధికారములను కలిగి యుండి, దేవుని వాగ్దానములను పొంది యుండిరి. కాని మనకు అర్ధమగు విషయం ఏమిటంటే, చివరికి యూదులు దేవుని రక్షణ ప్రణాళికకు స్పందించడములో విఫలమైరి. కనుక, వారి వైఫల్యానికి కారణాలు దేవునికి చెప్పడానికి వారి వద్ద ఏమీ లేవు.

“ఎన్నుకొనబడిన ప్రజలు” అను స్థాయిని కోల్పోయే ప్రమాదములో వారు పడిపోయిరి.

రోమీ. 9, 10, 11 అధ్యాయాలలో యూదుల స్థాయిని మరియు వారి పరిస్థితిని గురించి పౌలు చర్చిస్తున్నారు.

7.10.1. యిస్రాయేలు ప్రజల విశేషాధికారములు (9:1-5)

1. దేవుడు వారిని తన పుత్రులుగ (sonship) చేసికొనెను.
2. తన మహిమను (glory) వారితో పంచు కొనెను.
3. వారితో నిబంధనలు (covenants) చేసుకొనెను.
4. వారికి ధర్మశాస్త్రము (law) నొసగెను.
5. నిజమైన ఆరాధన (worship) వారిదే.
6. దేవుని వాగ్దానములను (promises) పొందినది వారే.
7. వారు మన పితరుల (patriarchs) వంశీయులే.
8. క్రీస్తు (christ) మానవరీత్యా వారి జాతివాడే.

ఇంతవరకు యిస్రాయేలు ప్రజలు పొందిన ఏడు విశేషాధికారములు, వారి జాతినుండే వచ్చిన “క్రీస్తు” అను ఎనిమిదవ విశేషాధికారమును అంగీకరించు నట్లుగా చేయలేక పోయాయి. తన జాతివారైన యూదులు “క్రీస్తు”ను నిరాకరించిన విషయములో ఎంతగానో విచారించు చున్నాడు, ఆయన హృదయ వేదనను అనుభవించి యున్నాడు. వారి రక్షణ కొరకు తన రక్షణను పణంగా పెట్టడానికి కూడా సిద్ధమయ్యాడు.

7.10.2. దేవుని వాగ్దానాలు - పూర్వ నిబంధన విశ్లేషణ (9:6-29)

దేవుని పిలుపు, వాగ్దానాలు విఫలము కాలేదు (రోమీ. 9:6-29). కాని యిస్రాయేలు ప్రజలు విఫలమైతిరి. (రోమీ. 9:30-33) అని పౌలు స్పష్టము చేయుచున్నాడు. యిస్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రమును నెరవేర్చుట యందు విఫలమైతిరి.

నీతిని పొంద ప్రయత్నింపని అన్యులు దేవుని నీతిని పొందితిరి. దేవునిచేత నీతిమంతులుగా పరిగణింప బడితిరి. ఇది వారి విశ్వాసము వలన కలిగినది. ధర్మశాస్త్రముపై ఆధారపడి యున్న నీతి కొరకై ప్రయత్నించిన యిస్రాయేలు ప్రజలు దేవుని నీతిని పొందలేక పోయిరి, ఎందుకన వారు ధర్మశాస్త్రమును నెరవేర్చుట యందు విఫలమైతిరి (రోమీ. 9:30-31). వారి వైఫల్యానికి కారణం నీతిని పొందుటకు వారి ప్రయత్నం విశ్వాసముపై కాక, క్రియలపై  ఆధారపడి యుండెను (రోమీ. 9:32). దేవుని కృపను, రక్షణను పొందుటకు మిగతా వారివలె వారుకూడా పాపములో ఉన్నారని అంగీకరించ వలసి ఉన్నది. వారి వైఫల్యము గురించి యెషయ పలికిన ప్రవచనములో (28:16) నెరవేరినట్లు రోము క్రైస్తవులకు పౌలు తెలియజేయు చున్నాడు: “ఇదిగో! ప్రజలు కాలు జారిపడునట్లు ఒక రాతిని, తొట్రుపడు నట్లు ఒక బండను నేను సియోనులో ఉంచుచున్నాను. కాని ఆయన యందు విశ్వాసము కలవాడు సిగ్గు పరుపబడడు” (రోమీ. 9:33). ఆ రాయి ఎవరో కాదు, అది క్రీస్తు ప్రభువే! క్రీస్తునందు విశ్వాసము లేనందున వారు జారిపడిరి, తొట్రు పడిరి, సిగ్గుపరుప బడిరి.

7.10.3. యిస్రాయేలు వైఫల్యం (10:1-4)

యూదులు కూడా యేసు క్రీస్తు నందు రక్షింప బడవలెనని పౌలు హృదయ పూర్వకముగా ఆశించాడు. ఎందుకన, యూదులు దేవుని పట్ల ఎంత ఆసక్తిని కలిగి యున్నారో పౌలుకు బాగా తెలుసు కనుక! అయితే వారి ఆసక్తి, జ్ఞాన పూర్వకమైనది కాదు. స్వనీతిని నెలకొల్ప ప్రయత్నించి, దేవుని నీతిని తెలుసుకొనలేక పోయారు. మెస్సయ్య రాకతో ధర్మశాస్త్ర యుగము ముగిసినది. కనుక ఇక ధర్మశాస్త్రము చేతగాక, యేసు క్రీస్తు నందు విశ్వాసము చేత నీతిమంతులగుదురు.

7.10.4. యేసునందు విశ్వసించు ప్రతివానికి రక్షణ (10:5-13)

దేవుని నీతిని పొందుటకు ఉన్న రెండు మార్గాలు, ఒకటి ధర్మశాస్త్ర మూలమున మరియు రెండవది విశ్వాస మూలమున గురించి చర్చిస్తూ, ఇకనుండి ఒకేఒక్క మార్గమున్నదని పౌలు స్పష్టము చేయుచున్నాడు. ఆ ఏకైక మార్గము విశ్వాసము వలన మాత్రమే నీతిమంతులు గావింప బడుదురు. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన వారందరు రక్షింప బడుదురు. తన వాదనను బలపరచుకొనుటకు పౌలు పాత నిబంధన గ్రంథము నుండి పలు ప్రస్తావనములను ప్రస్తావించడం చూస్తున్నాము:

1. “ధర్మశాస్త్ర మూలమైన నీతి” (రోమీ. 10:5). దీనిని లేవీ. 18:5 నుండి ప్రస్తావిస్తూ, ధర్మశాస్త్రమును పాటించు వారికి అది జీవమును ఒసగును అని పౌలు తెలియజేసాడు. “మీరు నా ఆజ్ఞలను చట్టములను  అనుసరింతురేని వాని వలన జీవనము బడయుదురు. నేను ప్రభువును” (లేవీ. 18:5).

2. “విశ్వాస మూలమైన నీతి” (రోమీ. 10:6-8).  ఇచట పౌలు ద్వితీయ. 30:12-14 నుండి ప్రస్తావిస్తూ, విశ్వాస మూలమైన నీతికి దేవుని వాక్కే సాక్ష్యం ఇస్తున్నదని పౌలు తెలియజేయు చున్నాడు. “ఆదెక్కడనో ఆకాశమున ఉన్నట్టిది కాదు. కనుక ‘మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశమునకెక్కి పోయి దానినిచటకు కొనివత్తురు?’ అని మీరు అడుగనక్కరలేదు. అదెక్కడనో సముద్రములకు ఆవలనున్నట్టిది కాదు. కనుక ‘మేము ఆ ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి దానినిచటకు కొనివత్తురు?’ అని మీరు అడుగనక్కరలేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనము పాటింపుడు (ద్వితీయ. 30:12-14).

3. నోటితో ఒప్పుకొని, హృదయమున విశ్వసించినచో రక్షింప బడుదువు (రోమీ. 10:9-10). “నీ నోటితో యేసు ‘ప్రభువు’ అని ఒప్పుకొని, మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు” (రోమీ. 10:9). “ఏలయన, మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును. నోటితో ఒప్పుకొని రక్షణ పొందును” (రోమీ. 10:10).

4. అందరికి రక్షణ (రోమీ. 10:11-13). క్రీస్తును విశ్వసించువాడు, ఆయన నామమున ప్రార్ధించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. పౌలు మొదటగా, యెషయ 28:16ను ప్రస్తావించాడు: “విశ్వసించు వాడు చలింపడు.” తరువాత యావే. 2:32ను ప్రస్తావించాడు: “ప్రభువు తనను శరణు వేడిన వారి నందరిని కాపాడును.”

7.10.5. యిస్రాయేలుకు మన్నింపు లేదు (10:14-21)

యిస్రాయేలు వైఫల్యానికి క్షమాపణ, మన్నింపు లేదు. దేవుడు వారి యొద్దకు బోధకులను పంపెను, వారికి సువార్త ప్రకటించ బడెను. కాని వారు ప్రతిస్పందించుటలో విఫలమైతిరి (రోమీ. 10:16-17). సువార్తను వినలేక పోయిరి. అవిధేయులుగ, తిరిగుబాటు దారులుగ ఉండిపోయిరి.

7.10.6. యిస్రాయేలుపై దేవుని కృప (11:1-10)

పౌలువలె సువార్తను విశ్వసించిన వారు (యూద-క్రైస్తవులు) దేవుని కృపకు సాక్ష్యమిచ్చిరి. ఇతరులు కఠిన హృదయులై సువార్తను నిరాకరించిరి. యిస్రాయేలు ఒక జాతిగా చరిత్రలో దేవుని కృపకు స్పందించడంలో విఫలులైరి. ఇప్పుడు మెస్సయ్య సువార్తను నిరాకరించిరి.

7.10.7. యిస్రాయేలు భవిష్యత్తు పునరుద్ధరణ (11:11-15)

యిస్రాయేలీయుల వైఫల్యమే అంతిమం అని పౌలు భావించడం లేదు. భవిష్యత్తులో వారి పునరుద్ధరణ అవకాశమునకై ఎదురుచూచు చున్నాడు. వారు సువార్తను నిరాకరించి నందున, అది అన్యులకు ఒసగబడినదనేది వాస్తవము. వారి సువార్త నిరాకరణ అన్యులకు దేవునితో సఖ్యతను చేకూర్చినది. పౌలు ప్రకారం, వారు సువార్తను అంగీకరించినచో, సర్వలోకానికి జీవము లేదా రక్షణ ఒసగబడును.

7.10.8. ఎన్నుకొనబడిన ప్రజలుగా యిస్రాయేలు స్థాయి (11:16-24)

భవిష్యత్తులో యిస్రాయేలు పునరుద్ధరణను రెండు వృత్తాంతముల ద్వారా పౌలు తెలియజేయు చున్నాడు:

7.10.8.1. ప్రధమ ఫలాలు

“పిండిలో దేవునికి సమర్పింప బడిన మొదటి పిడికెడు పవిత్రమైనదైనచో మిగిలిన దంతుయు పవిత్రమే” (రోమీ. 11:16). ఇది ప్రధమ ఫలాలను దేవునికి అర్పించుట (చదువుము. సంఖ్యా. 15:17-21). భూమి దేవుడు ఒసగిన వరమని గుర్తించి అంగీకరించుటకు, ప్రధమ ఫలాలను యిస్రాయేలు దేవునికి అర్పించినది. మొదటి ఫలాలు పవిత్రమైనచో, మిగిలవి కూడా పవిత్రమే. అదేవిధముగా, ప్రధమ ఫలాలు అయిన “పితరులు” పవిత్రులు కనుక అదే పవిత్రత మిగతా వారికి కూడా ఆపాదించును అని పౌలు వాదన. “వేరు పవిత్రమైన దైనచో కొమ్మలును అట్టివే” (రోమీ. 11:16), అనగా “పితరులు” (వేరు) పవిత్రులు కనుక అదే పవిత్రత యిస్రాయేలు” (కొమ్మలు)కు కూడా ఆపాదించవచ్చు. ఈ పవిత్రతయే భవిష్యత్తులో యిస్రాయేలు పునరుద్ధరణ - క్రీస్తు నందు విశ్వాసము ద్వారా సాధ్యమగును.

7.10.8.2. ఓలివు అంటుకట్టుట (11:17-24)

యిస్రాయేలు వైఫల్యం క్రీస్తు నందు విశ్వసించిన అన్యులకు ఒక హెచ్చరికగా ఉండాలి. అన్యులైనవారు పొందిన స్థాయిని బట్టి వారు గర్వపడరాదు. యిస్రాయేలు ప్రజలు ఎండిన పెరటి ఓలివు చెట్టు కొమ్మలవలె విరువ బడినారు. అడవి ఓలివు చెట్టు కొమ్మలు అయిన అన్యులు విరువ బడిన కొమ్మల స్థానములో అంటు కట్టబడినారు. ఈవిధముగా, అన్యప్రజలు యూదుల ఐశ్వర్య జీవితమున “దైవ ప్రజలు”గా పాలుపంచుకొను చున్నారు.

అంటుకట్టబడిన కొమ్మలు (అన్యులు), చెట్టుపై ఆధారపడవలెనని మరువరాదు. కనుక యూదులు వారి అవిశ్వాసము వలన విరువ బడితిరి. అన్యులు వారి విశ్వాసము వలన అంటుకట్ట బడితిరి లేదా అంగీకరింప బడితిరి. ఇక్కడ గమనింప వలసిన విషయం ఏమంటే, అవిశ్వాసులైన యూదులకు జరిగినట్లే, నూతన విశ్వాసులకు కూడా జరగవచ్చు సుమీ! “సహజ కొమ్మల వంటి వారగు యూదులనే దేవుడు శిక్షింపక విడిచి పెట్టలేదు. అటులైనచో మిమ్మును విడిచి పెట్టునను కొందురా? దేవుడు ఎంతటి దయను చూపునో, ఎంతటి కాఠిన్యమును ప్రదర్శించునో గమనింపుడు. భ్రష్టులైన వారి విషయమున ఆయన కఠినాముగా ఉన్నాడు. కాని మీరు ఆయన దయ యందే నిలిచి యున్నచో, ఆయన మీపై దయచూపును. కాకున్నచో మీరును నరికి వేయ బడుదురు” (రోమీ. 11:21-22). అటులనే సహజమైన కొమ్మలైన యూదులు చెట్టునుండి విరువ బడితిరి. అడవి కొమ్మలైన అన్యులు ఇప్పడు విశ్వాసము వలన అంటుకట్ట బడినను, అవిశ్వాసులుగ మారితే, వారును విరువ బడెదరు. అలాగే విరువ బడిన యూదులు మరల తిరిగి అంటుకట్టబడ వచ్చును.

7.10.9. యూదుల మారుమనస్సు (11:25-32)

ఇచట పౌలు యూదులు మారుమనస్సు, అందరి రక్షణ గూర్చి మాట్లాడు చున్నారు. పౌలు అర్ధము చేసుకున్న ప్రకారముగా, యూదులు, అన్యుల రక్షణ ఒక పరమ రహస్యము. ఈ పరమ రహస్యాన్ని ఈవిధముగా తెలియజేయు చున్నాడు: “సోదరులారా! ఒక పరమ రహస్యము ఉన్నది. అది మీరు తెలుసుకొన వలెనని కోరుచున్నాను. అది మిమ్ము గర్వింప కుండునట్లు చేయును. ఇస్రాయేలు ప్రజల మొండి తనము శాశ్వతమైనది కాదు. చేర వలసిన అన్యులు అందరు దేవుని చేరువరకే అది నిలుచును.ఇట్లు యిస్రాయేలు అంతయు రక్షింప బడును” (రోమీ. 11:25-26).

ఈ పరమ రహస్య ప్రవచనములను కూడా తెలియజేయు చునాడు” యెషయ 59:20-21, యిర్మీ. 31:33, యెషయ 27:9. ఒక రక్షకుని ద్వారా యిస్రాయేలు పాపము తీసివేయ బడునని ఈ ప్రవచనములు తెలియజేయు చున్నాయి. ఆ రక్షకుడుని పౌలు క్రీస్తులో చూచుచున్నాడు. ఇప్పుడు వారు దేవునికి దూరముగ నున్నను, “దేవుని చేత ఎన్నుకొన బడుటచే పితరులను బట్టి వారు ఆయన ప్రియులు” (రోమీ. 11:28).

సర్వమానవాళికి దేవుని కృపావరమైన రక్షణ అవసరమని పౌలు ముగిస్తున్నాడు.

7.10.10. దైవ స్తుతి (11:33-36)

దేవుని యొక్క విజ్ఞానము, వివేకము, నిర్ణయాలు ఎంత లోతైనవో, ఘనమైనవో ఈ స్తుతి గీతం తెలియజేయు చున్నది (చూడుము. కొలొస్సీ. 2:3).

దేవుని జ్ఞానం లోతైనది, ఎవరును ఆయన మనసును ఎరుగలేరు. ఆయనకు సలహాదారులు ఎవరు అవసరం లేదు. తిరిగి ఆయనచే ఇచ్చివేయ బడుటకు, ఆయనకు ఎన్నడును ఏదైనను ఎవరు ఇవ్వజాలరు. పౌలు ప్రకారం, మానవులు కేవలం పుచ్చుకొను వారు మాత్రమే!

ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నది.

No comments:

Post a Comment