07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 04

07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 04 
7.9. “నీతిగా ఎంచబడుట” – రక్షణ:  క్రీస్తు ప్రేమద్వారా దేవుని మహిమలో పాలుపంచుకొనుట (5:1-8:39)
7.9.1. క్రీస్తునందు నీతిమంతులుగా చేయబడితిమి (5:1-11)
7.9.2. ఆదాము-క్రీస్తు (5:12-21)
7.9.3. పాపమునకు మరణము (6:1-14)
7.9.4. పాపమునుండి విముక్తి (6:15-23)
7.9.5. ధర్మశాస్త్రము నుండి విముక్తి (7:1-6)
7.9.6. ధర్మశాస్త్రము యొక్క కర్తవ్యము (7:7-13)
7.9.7. అంత:రంగిక పోరాటం (7:14-25)
7.9.8. ఆత్మగతమగు జీవితము (8:1-13)
7.9.9. దేవుని వారసులు (8:14-17)
7.9.10. రానున్న వైభవము (8:18-27)
7.9.11. క్రీస్తు ప్రేమద్వారా దేవుని మహిమలో భాగస్థులగుట (8:28-39)

క్రీస్తునందు విశ్వాసము వలన నీతిమంతులుగా చేయబడిన క్రైస్తవుల రక్షణకు, దేవుని ప్రేమ మరియు ఆత్మవరము వాగ్ధానము. నీతిగా ఎంచబడుట నుండి రక్షణకు, విశ్వాసము నుండి నిరీక్షణకు మార్పు ఉన్నది. శరీర ఉత్థానము మరియు నిత్యజీవము పొందుటకు విశ్వాసము నుండి వచ్చు నిరీక్షణయే నమ్మకము. ఈ భాగములో నీతిగా ఎంచబడుట నుండి రక్షణకుగల మార్పును, క్రీస్తు ప్రేమద్వారా దేవుని మహిమలో పాలుపంచుకొనుట అను అంశములను చర్చించుదాం.

7.9.1. క్రీస్తునందు నీతిమంతులుగా చేయబడితిమి (5:1-11)

క్రీస్తునందు విశ్వాసము వలన మనము నీతిమంతులుగా చేయబడితిమి. తద్వారా, మన ప్రభువగు యేసు క్రీస్తుద్వారా దేవునితో సమాధాన పడితిమి. క్రీస్తుద్వారా దేవుని అనుగ్రహమునకు తీసుకొని రాబడితిమి. క్రీస్తుద్వారా దేవుని మహిమలో పాలుపంచుకొను భాగ్యమును పొందితిమి (రోమీ. 5:1-2).

మన బాధలలో కూడా మనము ఆనందించాలి. ఎందుకన, కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలనమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణయే దేవుని మహిమలో పాలుపంచు కోవటం. కనుక, కష్టాలు, శ్రమలు, నిరాశ, చేదు అనుభవం మిగుల్చునని తలంచ రాదు. ఎందుకన, విశ్వాసులు పవిత్రాత్మ ద్వారా దేవుని ప్రేమతో వారి హృదయాలను నింపెను (రోమీ. 5:3-5). క్రీస్తు శ్రమలు ఆయనకు మహిమను చేకూర్చెను. ఆయనలో ఐఖ్యమగు విశ్వాసులు కూడా క్రీస్తు మార్గములోనే దేవుని మహిమను పొందెదరు. కనుక, మన బాధలలో కూడా మనము ఆనందించ వలయును.

7.9.2. ఆదాము-క్రీస్తు (5:12-21)

మానవాళి రక్షణలో క్రీస్తు పాత్రను చూస్తున్నాము. ఆదాము - క్రీస్తునకు మధ్యగల వ్యత్యాసమును గురించి పౌలు తెలియజేయు చున్నాడు.

ఆదాము ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినది. పాపము ద్వారా మరణము వచ్చినది. ఫలితముగా, మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఎందుకన, మానవులందరు పాపము కట్టుకొనిరి. ఆదాము పాపము మరియు ఎవరికివారి వ్యక్తిగత పాపము మానవాళిని దేవునికి దూరం చేసింది.

ఆదాము నుండి మోషే వరకు ధర్మశాస్త్రము లేకుండెను, కాని పాపము ఉండినది. మోషే నుండి మెస్సయా వరకు ధర్మశాస్త్రము ఉండినది, కాని పాపమును, మరణమును తొలగించలేక పోయినది.

యేసు క్రీస్తు ద్వారా మానవాళి పాపము నుండి, మరణము నుండి విముక్తి గావింప బడెను. జీవమును అనుగ్రహించ బడెను. నీతిమంతులుగా చేయబడెను. పాపము, పరాధీనము, మరణములకు బదులుగా, విశ్వసించు వారికి అనుగ్రహము, సమాధానము, నిత్యజీవము ఒసగబడెను.

పాపము అనగా దేవున్ని ధిక్కరించడం, సృష్టికర్త యైన దేవునిపై తిరుగుబాటు చేయడం, స్వార్ధము మరియు దేవుని పట్ల అవిధేయత. ఆదాము పాపము ఇతరులకు ఎలా సంక్రమించినదో పౌలు వివరించ లేదు. అయితే, పాపఫలితమే, మరణము అని పౌలు తెలియజేయు చున్నాడు. ఆదాముతో, ఆయన తరువాత వచ్చిన వారందరు పాపము చేసారు, కనుక మానవాళికి మరణము ప్రాప్తించినది.

పౌలు ప్రకారం, మరణము దేవుని ప్రణాళికలో లేదు. పాపము వలన లోకములో మరణము వచ్చెను. క్రీస్తుద్వారా, శారీరక మరణం తొలగక పోయినప్పటికిని, దేవుని నుండి శాశ్వత ఎడబాటు నుండి రక్షింప బడితిమి. ధర్మశాస్త్రము పాపము అధికమగునట్లు చేసెను (రోమీ. 5:20) అని పౌలు తెలియజేయు చున్నాడు.

7.9.3. పాపమునకు మరణము (6:1-14)

ఇచట పౌలు జ్ఞానస్నానము గురించి మాట్లాడుచున్నాడు. జ్ఞానస్నానము విశ్వాసులలో మార్పును తెచ్చి క్రీస్తులో ఐఖ్యమగునట్లు చేయును. మన పాత స్వభావము క్రీస్తుతో సిలువపై చంపబడినది. పాపము నశించినది. మన పాత స్వభావముతో క్రీస్తుతో మరణించుట ద్వారా, ఆయనతో లేవనెత్తబడి జీవింతుము. “ఆయన మరణము, పాపమునకు శాశ్వతమగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము” (రోమీ. 6:10). జ్ఞానస్నానము ద్వారా పాపమునకు మరణించి, యేసు క్రీస్తుతో ఏకమై దేవుని కొరకు విశ్వాసులు జీవించు చున్నారు (రోమీ. 6:10).

కనుక శారీరక వాంఛలకు లొంగక, పాపము ఇక ఎంత మాత్రము పాలన చేయకుండ, శరీరములో ఏ అవయవములను పాపమునకు అర్పించక, దేవునికి అర్పించుకొనుమని, దేవుని అనుగ్రహమునకే గాని, ధర్మశాస్త్రమునకు లోబడ రాదని పౌలు రోము నగర క్రైస్తవులను కోరుచున్నాడు (రోమీ. 6:12-14).

7.9.4. పాపమునుండి విముక్తి (6:15-23)

పాపము నుండి విముక్తులైన విశ్వాసులు పూర్తిగా స్వతంతృలు కాదు. వారు దేవునికి దాసులు. దేవున్ని యజమానునిగా అంగీకరించుట. వారు పాపము నుండి విముక్తిని పొంది, దేవునికి దాసులైతిరి. పవిత్రతకు చెందిన ఫలితమును వారు స్వీకరించితిరి. చివరకు వారికి శాశ్వత జీవము లభించును.

7.9.5. ధర్మశాస్త్రము నుండి విముక్తి (7:1-6)

క్రైస్తవులు ఏవిధముగా యూదుల ధర్మశాస్త్రము నుండి, చట్టము నుండి, విముక్తి పొందారో, పౌలు తెలియజేయు చున్నాడు. మరణముతో చట్టము ద్వారా పాటించు బాధ్యతలు రద్దగునని “వివాహ ఉదాహరణ” ద్వారా పౌలు తెలియజేయు చున్నాడు. భర్త మరణిస్తే, భార్య చట్టము నుండి విముక్తిని పొంది, స్వాతంత్ర్యము గల స్త్రీగా, మరియొక పురుషుని వివాహ మాడును.

అలాగే, జ్ఞానస్నానము ద్వారా క్రీస్తుతో మరణించిన క్రైస్తవులు ధర్మశాస్త్రము నుండి విముక్తి గావింపబడి, ఇకనుండి వారు క్రీస్తునకు చెందిన వారగుచున్నారు.

7.9.6. ధర్మశాస్త్రము యొక్క కర్తవ్యము (7:7-13)

క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రము నుండి విముక్తి గావింపబడి జీవము నొసగబడిన యెడల, ధర్మశాస్త్రము యొక్క పాత్ర ఏమిటి? ధర్మశాస్త్రము అర్ధరిహితమైనదా? అహి పాప భూయిష్టమా?

పౌలు ప్రకారం, ధర్మశాస్త్రము మంచిదే మరియు పవిత్రమైనదే. ఎందుకన, అది దేవుని చిత్తమును మనకు తెలియజేయును. అయితే, రక్షణ చరిత్రలో అది విఫలమైనది, ఎందుకన, ధర్మశాస్త్రమును కలిగియున్న యూదులు కూడా ఇతరులవలె పాపములో జీవించిరి.

నీతిమంతులుగా చేయుటలో ధర్మశాస్త్రము శక్తిహీనమైనది. ధర్మశాస్త్రము కేవలం సమాచారమును ఇచ్చును. ఆధ్యాత్మిక బలమును అది ఇవ్వలేదు. అది పాపమును అరికట్టక, మరింత పాప భూయిష్టమైనది. పౌలు ప్రకారం, పాపమును గురించి తెలియ జేయుటయే ధర్మశాస్త్రము యొక్క కర్తవ్యము. దేవుడు ఏది నిషేధించునో, ఏది ఆజ్ఞాపించునో అది మాత్రమే ధర్మశాస్త్రము ఎరుక పరచును. కాని, దేవుడు కోరునది, వలదనునది నివారించే శక్తి ధర్మశాస్త్రము మానవులకు ఇవ్వదు.

దేవుడు ఆదామును ఆజ్ఞాపించాడు. ఎప్పుడయితే, ఆదాము దేవుని ఆజ్ఞను అవిధేయించాడో, అతను పాపిగా మారాడు. అనగా, దేవుని ఆజ్ఞ లేదా చట్టం మీరుట వలన మరణాన్ని శిక్షగా పొందాడు (ఆ.కాం. 3:19). ధర్మశాస్త్రము పవిత్రము, నీతియుక్తము, ఉత్తమము అయినను, మానవాళికి పాపము ద్వారా మరణమును తీసుకొని వచ్చినది.

7.9.7. అంత:రంగిక పోరాటం (7:14-25)

ధర్మశాస్త్రము యొక్క స్వభావమును, పాత్రను గురించి చెప్పిన తరువాత, వాస్తవానికి ధర్మశాస్త్రము అన్నదు ఏ సమస్య లేదని పౌలు అంగీకరించు చున్నాడు. అసలు సమస్య శారీరకముగ బలహీనుడై, పాపమును వ్యతిరేకించు శక్తిహీనుడైన మానవులలో ఉన్నది. మానవునిలో నున్న పాపము వలన దేవుడు కోరునది చేయలేక పోవుచున్నాడు. శరీరము ఆత్మకు విరుద్ధమైనది.

మానవులు ఆత్మద్వారా దేవుని చట్టమును గుర్తించినను, బలహీనమైన మానవ భౌతిక శరీరం పాపము యొక్క శోధనలో పడకుండా ధర్మశాస్త్రము అడ్డుకొనలేదు. పాపముతో నున్న భౌతిక శరీరము ధర్మశాస్త్రముతో ఆవరించిన మనస్సు మధ్యన మానవుడు అంత:రంగిక పోరాటం చేయుచున్నాడు. మానవులు గొప్ప సందిగ్ధతలో నున్నారు. మంచిని చేయగోరుచున్నను, చ్వరకు చెడు చేయుటయే వారికి మిగులుచున్నది. పౌలు ప్రకారం, ఈ అంత:రంగిక పోరాటమును యేసు క్రీస్తు మాత్రమే పరిష్కరించ గలడు.

7.9.8. ఆత్మగతమగు జీవితము (8:1-13)

క్రీస్తులోనున్న వారు, జ్ఞానస్నానము ద్వారా పొందిన ఆత్మద్వార, ధర్మశాస్త్ర పాపము నుండి మరియు మరణము నుండి విముక్తి గావింప బడియున్నందునఖండన లేదా శిక్ష నుండి స్వతంత్రులైరి. ఇచట పౌలు ఆత్మగతమగు జీవితము మరియు శరీరగతమగు జీవితములను పోల్చుతూ, రెంటింట మధ్యనున్న భేదములను గురించి మాట్లాడు చున్నాడు.

శరీరాను సారముగా జీవించువారు:

- శరీరమును అనుసరించి జీవించు వారు, శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు (రోమీ. 8:5): మరణము మరియు దేవునితో శతృత్వము. శరీర వాంఛలు మరణమునకు దారితీయును (రోమీ. 8:6). శరీరేచ్చపై నెలకొనిన మనస్సు దేవుని శతృవు (రోమీ. 8:7).

- శరీరేచ్చపై నెలకొనిన మనస్సు దేవుని ధర్మమునకు లొంగలేరు (రోమీ. 8:7).
- శరీరాను సారముగా జీవించువారు దేవుని సంతోష పెట్టలేరు (రోమీ. 8:8).
- క్రీస్తు ఆత్మ తన యందు లేని వాడు ఆయనకు చెందడు (రోమీ. 8:9).
- శరీరానుసారులై జీవించినచో, తప్పక మరణింతురు (రోమీ. 8:13).

ఆత్మాను సారముగా జీవించువారు:

- ఆత్మానుసారులైన వారు, ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు (రోమీ. 8:5): జీవము మరియు శాంతి. ఆత్మైక వాంఛలు జీవమునకు, శాంతికి దారితీయును (రోమీ. 8:6).
- నిజముగ దేవుని ఆత్మ వసించు చున్నచో, ఆత్మయందు ఉందురు (రోమీ. 8:9).
- క్రీస్తు మీ యందు ఉన్నచో, మీ శరీరము పాపము విషయమై మరణించును, కాని ఆత్మ నీతి విషయమై జీవము కలిగి యున్నది (రోమీ. 8:10).
- క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీయందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ శరీరములకు కూడా జీవమును ఒసగును (రోమీ. 8:11).
- ఆత్మచే పాప క్రియలను మీరు నశింప జేసినచో మీరు జీవింతురు (రోమీ. 8:13).

పాపము, మరణము, మానవ బలహీనత నందు ధర్మశాస్త్రము బలహీన మైనది. అసాధ్యమగు దానిని దేవుడు క్రీస్తు నందు నెరవేర్చును. కనుక, విశ్వాసులను క్రీస్తు నుండి వేరుచేయడం ఏ శక్తికి సాధ్యపడదు.

7.9.9. దేవుని వారసులు (8:14-17)

దేవుని ఆత్మద్వారా క్రైస్తవులు దేవుని బిడ్డలుగా అవుదురు, దేవుని మహిమలో భాగస్థులగుదురు. దేవుని బిడ్డలు కనుక దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. శరీరానుసారముగ ఆదాము బిడ్డలమైనప్పటికిని, దేవుని ఆత్మద్వారా మనము ఆయన బిడ్డలముగ, వారసులమైనాము. అయితే, క్రీస్తు బాధలలో మనము పాలుపంచుకొనిన యెడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదము.

7.9.10. రానున్న వైభవము (8:18-27)

నూతన జీవితమునకు సాక్ష్యమిచ్చుటకు పౌలు మూడు విషయముల గురించి మాట్లాడు చున్నాడు. (అ). సృష్టి అంతయు బాధతో మూలుగు చున్నది, (ఆ). క్రైస్తవుల నిరీక్షణ, (ఇ). ఆత్మ.

మొదటిగా, నాశనమునకు, దాస్యమునకు మరియు మరణమునకు లోనైయున్న ఈ లోకములో జీవించుచున్న క్రైస్తవులు, శరీరము యొక్క విముక్తిని పొందుటకు ఎంతో ఆతురతతో ఎదురుచూచు చున్నారు (రోమీ. 8:23). రెండవదిగా, విశ్వాసముద్వారా నీతిమంతులుగ పరిగణింపబడి, క్రీస్తులో జ్ఞానస్నానము పొందిన వారికి, క్రీస్తు సాధించిన నిత్య రక్షణ కొరకై నిరీక్షణ (రోమీ. 8:24-25). మూడవదిగా, బలహీనమైన మానవ స్థితిని అధిగమించుటకు ఆత్మ సాయపడును. నీతిమంతులుగ పరిగణింపబడిన వారును మరియు క్రీస్తుతో సఖ్యపడినవారును, ఆత్మ సాయము లేనిదే ప్రార్ధన కూడా చేయలేరు (రోమీ. 8:26-27). నిరీక్షణ కొరకై సరియైన ప్రార్ధన చేయుటకు క్రైస్తవులకు ఆత్మయే సాయపడును.

7.9.11. క్రీస్తు ప్రేమద్వారా దేవుని మహిమలో భాగస్థులగుట (8:28-39)

దేవుని మహిమలో భాగస్థులగుటకు క్రైస్తవులు పిలువబడెను (రోమీ. 8:28-30). సువార్త ద్వారా దేవుడు తన రక్షణ ప్రణాళికను ఎరుకపరచి, తద్వారా నీతిమంతులుగ పరిగణింపబడిన క్రైస్తవులు అందరు దేవుని మహిమలో పాలు పంచు కొనెదరు.

“తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగ చేసెను. నీతిమంతులనుగ చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను” (రోమీ. 8:30). దీని అర్ధం, క్రైస్తవుల జీవితాలలో జరిగే ప్రతీ విషయము కూడా దేవుని ఏర్పాటు చేత పాలించ బడుచున్నది. అందులకే దేవుడు వాగ్దానం చేసిన మహిమలో భాగస్థులయ్యే మార్గములో క్రైస్తవులు ఎదుర్కొను శ్రమలు, హింసలు వారికి హాని చేయలేవు.

క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమకు స్తుతి గీతం (రోమీ. 8:31-39). క్రీస్తు ప్రేమ నుండి క్రైస్తవులను ఎవరు కూడా వేరుచేయలేరు. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనలను పాపము, మరణము, ధర్మశాస్త్రము, దుష్ట శక్తుల నుండి విముక్తి గావించెను. తన రక్షణను సర్వమానవాళికి ఒసగు క్రమములో, దేవుడు తన సొంత కుమారుని కూడ మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. కనుక, దేవుడు మన పక్షమున ఉన్నచో, ఎవరుకూడా మనకు విరోధముగ ఉండలేరు. క్రీస్తు ప్రేమ నుండి ఎవరును, భూలోక శక్తులుగాని, పరలోక శక్తులుగాని మనలను వేరుచేయలేవు.

పౌలు ఐదు ప్రశ్నల ద్వారా క్రైస్తవులు దేవుని కాపుదలలో సురక్షితముగా ఉన్నారని, దానిని దృఢముగా నమ్మాలని పౌలు తెలియజేయు చున్నాడు. ఆ ఐదు ప్రశ్నలు ఏమనగా:

(అ). దేవుడు మన పక్షమున ఉన్నచో, ఇక మనకు విరోధి ఎవడు? (రోమీ. 8:31).
(ఆ). దేవుడు తన సొంత కుమారుని కూడ మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడ మనకు ఉచితముగా ఇచ్చివేయడా? (రోమీ. 8:32).
(ఇ). ఎన్నికయైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణ చేయును? (రోమీ. 8:33).
(ఈ). శిక్ష విధించు వాడు ఎవడు? (రోమీ. 8:34).
(ఉ). క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరుచేయగలరు? (రోమీ. 8:35).

క్రైస్తవులు దేవుని కాపుదలలో సురక్షితముగా ఉన్నప్పటికిని, కొన్ని అపాయముల ద్వారా వారు సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏడూ అపాయములను పౌలు తెలియజేసి యున్నాడు: బాధలు, కష్టాలు, హింసలు, క్షామము, వస్త్రహీనత, ప్రమాదము మరియు యుద్ధము (రోమీ. 8:36). కీర్తన 44:22ను ప్రస్తావిస్తూ క్రైస్తవులు వీటిని ఇప్పటికే అనుభవించు చున్నారు అను వాస్తవమును పౌలు తెలియజేయు చున్నాడు. “నీ కొరకై మేము దినమంతయు మరణాపాయములో ఉన్నాము, చంపబడనున్న గొర్రెల వలె ఎంచబడు చున్నాము” (కీర్తన 44:22, రోమీ. 8:36). ఇవన్నియు కూడా క్రీస్తు ప్రేమనుండి వారిని వేరుపరపనీయ కూడదు. నిరాశ చెందక, దేవుని సహాయముతో ఈ ఆపాయములను జయించవచ్చు.

రోమీ. 8:36లో చెప్పిన అపాయములను రోమీ. 8:38-39లో కొనసాగిస్తున్నాడు: “మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులుగాని, పైలోకముగాని, అధోలోకము గాని, సృష్టిలో మరి ఏదియు మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను వేరుచేయ జాలదు.

No comments:

Post a Comment