07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 03

07. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ - 03
7.8. యేసు నందు విశ్వాసము వలన దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును (3:21-4:25)
7.8.1. యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా దేవుని రక్షణాత్మకమైన నీతి/ తీర్పు (3:21-31)
7.8.2. విశ్వాసము వలన నీతిమంతులగును -  పవిత్ర గ్రంథ సాక్ష్యము (4:1-25)
7.8.2.1. అబ్రహాము విశ్వాసము వలన నీతిమంతునిగా ఎంచబడెను (4:1-8)
7.8.2.2. అబ్రహాము సున్నతి పొందక పూర్వమే నీతిమంతునిగా ఎంచబడెను (4:9-12)
7.8.2.3. ధర్మశాస్త్రము పాటించినందుకు అబ్రహాము నీతిమంతునిగ ఎంచబడ లేదు (4:13-17)
7.8.2.4. అబ్రహాము విశ్వాసం – క్రైస్తవ విశ్వాసానికి ఆదర్శం (4:18-25)

యూదులుగాని మరియు అన్యులుగాని నీతిమంతులుగ పరిగణించ బడుటకు, ధర్మశాస్త్రము గాక ఇంకేదో అవసరమని పౌలు ఇప్పటి వరకు తన వాదనలతో తెలియ జేశాడు. ఆ వాదనయే, “యేసు క్రీస్తు నందు విశ్వాసము.”

7.8.1. యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా దేవుని రక్షణాత్మకమైన నీతి/ తీర్పు (3:21-31)

అందరూ అనగా సర్వమానవాళి పాపాత్ములే. ఎవరునూ నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రమును కలిగియున్న యూదులు కూడా నీతిమంతులు కారు. తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మానవాళిని నీతిమంతులుగ చేయుటకు దేవుడు జోక్యం చేసుకొనెను. అందరూ పాప ప్రభావమునకు లోనై నీతిమంతులు కారు కనుక సిలువపై క్రీస్తు రక్షణాత్మకమైన మరణమును విశ్వసించుట వలన, దేవునితో సఖ్యపడి తిరిగి పూర్వపు బంధాన్ని పొందుటకు, అంగీకార యోగ్యులుగా చేసుకొనుటకు మరియు నీతిమంతులుగా చేయుటకు దేవుడు మానవాళికి అవకాశమును కల్పించు చున్నాడు. దేవునిచేత నీతిమంతులుగ పరిగణించ బడుటకు కావలసినది ‘యేసు క్రీస్తు నందు విశ్వాసమును కలిగి యుండుట’. దీనిలో ధర్మశాస్త్రమునకు ఎలాంటి సంబంధము లేదు.

దేవుడు క్రీస్తును ప్రాయశ్చిత్తముగ ఏర్పరచి, మానవుల పాపములను క్షమించి, వారిని నీతిమంతులుగ చేయును. “యేసు క్రీస్తు నందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడిరి. మానవులకు ఆయన యందు గల విశ్వాసముచే, ఆయన మరణము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగ ఏర్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయునో ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. ఏలయన, గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించెను” (రోమీ. 3:24-25).

పాపపు లోకములో సహజమైన పరిణామం దేవుని శిక్ష మరియు వినాశనము, కాని, తన కుమారుడు యేసు క్రీస్తు రక్షణాత్మకమైన మరణములో చిందించిన రక్తము ద్వారా, పాపములో నున్న మానవాళిని రక్షణ వైపునకు నడిపించుటకు దేవుడు ఈ ఉపాయమును, ప్రణాళికను ప్రవేశ పెట్టియున్నాడు. మానవులు చేయవలసినది, యేసు క్రీస్తు రక్షణ కార్యములను విశ్వసించడమే!

మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసము వలన గాని ధర్మశాస్త్రాను క్రియల వలన కాదు. విశ్వాసము ద్వారా అందరిని (సున్నతి పొందిన వారిని, సున్నతి పొందని వారిని) దేవుడు నీతిమంతులను చేయును. యూదులు ధర్మశాస్త్రమే రక్షణకు మార్గమని తలంచిరి. కాని, దేవుడు యేసు క్రీస్తు నందు విశ్వాసము వలన సకల మానవాళికి రక్షణ మార్గమును సుగమం చేసాడు.

రోమీ. 3:31లో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తాడు: “అయినచో విశ్వాసము వలన ధర్మశాస్త్రమును ధ్వంసము చేసినట్లుగా?” ‘అవును’ అనే సమాధానం సహజంగా మనకు తట్టవచ్చు, కాని పౌలు “ఎంతమాత్రమును కాదు. ధర్మశాస్త్రమును మనము నెలబెట్టుదము” అని సమాధాన మిస్తున్నాడు. దీనిని అర్ధం చేసుకోవడం ఎలా? విశ్వాసము ధర్మశాస్త్రమును ధ్వంసము చేయక, దానిని ఎలా నిలబెట్టును?

(అ). నీతి యందు నడిపించుటకు జీవిత మార్గముగా విశ్వాసము ధర్మశాస్త్రమును నిలబెట్టదు. కాని, ధర్మశాస్త్రమును “పవిత్ర దేవుని వాక్యము”గా విశ్వాసము నిలబెడుతుంది. ఇచ్చట పౌలు ‘ధర్మశాస్త్రము’ను “దేవుని వాక్యము / పవిత్ర గ్రంథము”గా ఉపయోగించాడు.

(ఆ). విశ్వాసము పాపాత్ములను ఖండించి, క్రీస్తు మార్గములో నడచుటకు మార్గమును సిద్ధము చేయుటకు ‘ధర్మశాస్త్రము’ను ఏర్పాటు చేయును. అనగా, పాపాత్ములు శిక్షకు లోనగుదురు, ధర్మశాస్త్రము బోధించునది క్రీస్తులో పరిపూర్ణమగును అన్న ధర్మశాస్త్రము యొక్క తీర్పును విశ్వాసము సమర్ధించును.

(ఇ). ఇచ్చట “ధర్మశాస్త్రము” అనగా క్రీస్తు నందు విశ్వాసము వలన పరిపూర్ణమైన దానిని సూచిస్తుంది.

7.8.2. విశ్వాసము వలన నీతిమంతులగును -  పవిత్ర గ్రంథ సాక్ష్యము (4:1-25)

ఇచ్చట పౌలు “విశ్వాసము వలన దేవుడు ఒకనిని నీతిమంతినిగ చేయును, కాని ధర్మశాస్త్ర కార్యము ద్వారా కాదు” అన్న తన వాదనను బలపరచు కొనుటకు ‘విశ్వాసము వలన నీతిమంతునిగా పరిగణింప బడిన’ అబ్రహామును ఉదాహరణగా చూపుచున్నాడు (అ.కా. 15-16 అధ్యాయాలు).

7.8.2.1. అబ్రహాము విశ్వాసము వలన నీతిమంతునిగా ఎంచబడెను (4:1-8)

“అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను” (అ.కాం. 15:6). కనుక, పౌలు ప్రకారం, అబ్రహాము దేవుని యందు ఉంచిన విశ్వాసము వలననే నీతిమంతునిగా ఎంచబడెను (రోమీ. 4:1-8). దేవుని వాగ్దానమందు (ఆ.కాం. 15:5 “సంతతి”) విశ్వాస ముంచిన అబ్రహామును దేవుడు నీతిమంతునిగ ఎంచిన తరువాతనే (ఆ.కాం. 15:6), దేవుడు అబ్రహాముతో మరో వాగ్ధానము చేసెను (ఆ.కాం. 15:7 “దేశము”).

కీర్తన. 32:1-2 నుండి పౌలు మరో ఉదాహరణను తెలియజేయు చున్నాడు:

“ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింప బడినవో,
ఎవరి పాపములు పరిహరింప బడినవో, వారు ధన్యులు.
ఎవని పాపములు ప్రభువు లెక్కపెట్టడో అతడు ధన్యుడు!” (రోమీ. 4:7-8).

దీనిని బట్టి మనకు అర్ధమగు చున్నదేమనగా, దేవుడు ఒకనిని ‘నీతిమంతునిగ ఎంచుట’ దైవ స్వతంత్ర కార్యము. ఆ వ్యక్తి యొక్క కార్యాలపై దేవుడు ఆధార పడట లేక ఆ వ్యక్తి కార్యాలను బట్టి దేవుడు నీతిమంతునిగా ఎంచడు. నీతిగా ఎంచబడుటకు ‘పాప క్షమాపణ’ ప్రధానమైన భాగము.

7.8.2.2. అబ్రహాము సున్నతి పొందక పూర్వమే నీతిమంతునిగా ఎంచబడెను (4:9-12)

ఆది కాండములో చెప్పబడి నట్లుగా, అబ్రహాము దేవుని వాగ్దానములను విశ్వసించే సమయానికి సున్నతి పొంది యుండలేదు. సున్నతి పొందక పూర్వమే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను. రోమీ. 4:1లో యూద జాతికి మూలపురుషుడుగా అబ్రహాము గూర్చి చెప్పినను, ఇచ్చట సున్నతి పొందకయే, దేవునిని విశ్వసించుట వలన, ఆయనచే నీతిమంతులుగ అంగీకరించ బడిన వారందరికిని అబ్రహాము తండ్రి అని తెలియజేయు చున్నాడు.

7.8.2.3. ధర్మశాస్త్రము పాటించినందుకు అబ్రహాము నీతిమంతునిగ ఎంచబడ లేదు (4:13-17)

అబ్రహామునకు రెండవ వాగ్ధానము (ఆ.కాం. 15:7 “దేశము”) చేయబడిన సమయానికి, దేవుడు అతనిని నీతిమంతునిగ ఎంచెను. కనుక విశ్వాసము వలన నీతిమంతులగు వారందరికి అబ్రహాము తండ్రి. “అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్ధానము చేసెను. ఈ వాగ్ధానము ధర్మశాస్త్రము పాటించి నందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము వుండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్ధానము చేసెను” (రోమీ. 4:13).

7.8.2.4. అబ్రహాము విశ్వాసం – క్రైస్తవ విశ్వాసానికి ఆదర్శం (4:18-25)

అబ్రహాము దేవుని వాగ్ధాన మందు (ఆ.కాం. 15:5 “సంతతి”) ఉంచిన విశ్వాసం గొప్పది. అబ్రహామునకు వయసు మళ్ళినది. సారా గొడ్రాలు. అయినను అబ్రహాము దేవుని వాగ్ధాన మందు విశ్వాసముంచాడు. దేవుని వాగ్ధానమును అనుమానించ లేదు. “ఆ కారణముచే విశ్వాసము ద్వారా దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింప బడెను” (రోమీ. 4:22). అబ్రహాము వలె యేసు క్రీస్తు నందు మన విశ్వాసమును బట్టి దేవుడు మనలను కూడా నీతిమంతులుగా ఎంచును.

No comments:

Post a Comment