దివ్య కారుణ్యము - సందేశము
ప్రియ సహోదరి, సహోదరులారా! ఈరోజు దివ్య కారుణ్య మహోత్సవం. లతీనులో ‘misereri’ అనగా కనికరము చూపుట లేదా కరుణ కలిగి యుండుట అని అర్ధం. “Cor” అనగా హృదయం. హృదయములో నుండి మనం ఇతరులపై దయను, కరుణను చూపటం అని భావం. దైవ కారుణ్యం అలాంటిదే. గ్రీకులో ‘eleison’ అని అంటారు. అనగా దయ అని అర్ధం. హీబ్రూలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ‘rachamim (racham, rachim) శబ్దార్ధ ప్రకారం, 'గర్భం' అని అర్ధం. గర్భం నూతన జీవితానికి, నూతన సృష్టికి సూచిక. దేవుని కారుణ్యము అంత లోతైనదని అర్ధం. రెండవది hesed స్థిరమైన (దేవుని) ప్రేమ అని అర్ధము. వీటన్నింటికి అర్ధం మనం చేసే ప్రార్ధన – “ప్రభువా, నాపై దయ చూపుము. నీ కారుణ్యమును నాపై కుమ్మరించుము. నీ దయను, కృపను, ప్రేమను నాపై కుమ్మరించుము.” మరోవిధముగా చెప్పాలంటే, మనలను తన “గర్భము”లో దాచుకొని నూతన సృష్టిగా మనలను చేయుమని ప్రార్ధిస్తున్నాము.
“దయ” అనగా రెండు విధాలుగా మనం అర్ధం చేసుకోవచ్చు: మొదటిది, చెడును పొందుటకు అర్హులమైన మనం పొందక పోవడం: మన పాపాలను (పాపము అనగా, దేవున్ని తృణీకరించడం లేదా దేవుని నుండి వెడలిపోవడం) బట్టి మనం శిక్షార్హులము. దేవుని కోపానికి గురికావలసిన వారము. కాని దేవుడు మన పాపాలను బట్టి మనలను శిక్షకు గురి చేయడం లేదు. “మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు. మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు” (కీర్తన. 103:10). ఇది దివ్య కారుణ్యము, దయ, కనికరము, ప్రేమ. దీనిని మనం పాపసంకీర్తనము అను దివ్య సంస్కారము ద్వారా పొందుచున్నాము. రెండవదిగా, మంచిని పొందుటకు అర్హులము కాకున్నను పొందటం: ఇదే దైవ కృప, దైవానుగ్రహము, దైవాశీర్వాదము. ఇదియే దివ్య కారుణ్యము. మనం దేవుని వైపుకు తిరిగిన ప్రతీసారి దీనిని పొందుచున్నాము.
ఈరోజు మనం ఉత్థాన పండుగను ముగిస్తున్నాం. అనగా గత ఆదివారమునుండి, ఈ ఆదివారము వరకు ఈస్టర్ పండుగను కొనియాడుతున్నాము. అందుకే ఉత్థాన పండుగ, పండుగలలోకెల్ల గొప్ప పండుగ. రెండవ పాస్కా ఆదివారమున లేదా దివ్య కారుణ్య పండుగ (30 ఏప్రిల్ 2000 న జాన్ పౌల్ జగద్గురువులు ఈ పండుగను స్థాపించారు) రోజున మనం సువార్తా పఠనము యోహాను 20:19-31 నుండి వింటున్నాము. ఈ ఒక్క ఆదివారమే సువార్త పఠనము మూడు సంవత్సరాలకు మారకుండా ఉంటుంది. ఉత్థానమైన రోజుననే యూదుల (మరణ) భయముతో తలుపులు మూసుకొని గదిలోనున్నప్పుడు ప్రభవు శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆపుడు ప్రభువు వారికి తన చేతులను, ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారి ఆనందించిరి” (యోహాను. 20:20). అప్పుడు వారితో అపోస్తలుడు తోమా వారితో లేకుండెను. మరల ఎనిమిదవ రోజున (ఈరోజు) మరల ప్రభువు వారికి దర్శనమిచ్చెను. ఈసారి తోమా కూడా వారితో ఉండెను. తోమా, “నా ప్రభువా! నా దేవా!” అని తన విశ్వాసాన్ని ప్రకటించెను. కనుకనే ఈ పఠనము ఈ రోజుకి సరిగ్గా సరిపోతుంది.
ప్రభవు శిష్యులకు కనిపించి, “మీకు శాంతి కలుగును గాక!” అని పలికిన తరువాత, ప్రభువు ఈరోజు మూడు ప్రాముఖ్యమైన కార్యాలను చేసియున్నారు:
(అ). ఉత్థాన ప్రభువు శిష్యులకు ప్రేషిత పరిచర్య కార్యాన్ని అప్పగించాడు: “నా తండ్రి నన్ను పంపినట్లు, నేను మిమ్ము పంపుచున్నాను (యోహాను 20:21).
(ఆ). దీని తరువాత, ప్రభువు వారిపై శ్వాస ఊది “పవిత్రాత్మను పొందుడు” (యోహాను 20:22) అని పలికెను. ఇక్కడ మనం ముఖ్యముగా గమనింప వలసిన విషయం ఏమనగా, సువార్తీకుడు యోహాను ప్రభువు ఉత్థానమును మరియు పవిత్రాత్మ రాకడను వేరు వేరుగా చూడటము లేదు. ఉత్థానమైన రోజునే ప్రభువు శిష్యులకు కనిపించినప్పుడు, పవిత్రాత్మను ఒసగాడు. యోహానుగారు మనకు బోధించే చక్కటి విషయం ఏమిటంటే, ఉత్థానక్రీస్తు అనుభూతిని పొందినప్పుడు, మనం పవిత్రాత్మను పొందెదము.
(ఇ). చివరిగా, ఉత్థాన ప్రభువు దివ్య సంస్కారమైన “పాపసంకీర్తనము”ను స్థాపించినాడు. ప్రభువు శిష్యులతో, “ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింప బడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని యెడల అవి క్షమింప బడవు” (యోహాను 20:23). “పాపసంకీర్తనము” అను ఈ దివ్య సంస్కారము ద్వారా, మనము దైవ కారుణ్యమును పొందుచున్నాము. మన పాపములను దేవుడు క్షమిస్తున్నాడు.
“పాపసంకీర్తనము” దివ్యసంస్కారమును మనం పొందిన గొప్ప వరము. దేవుడు మాత్రమే మన పాపములను క్షమిస్తాడు. ఆ అధికారాన్ని ప్రభువు తన శిష్యులకు ఇచ్చియున్నాడు. నేడు తిరుసభలో అభిషేకించబడిన గురువులకు ఇవ్వబడినది. గురువులు శిష్యుల స్థానములో ఉంటున్నారు. అయినప్పటికిని, పాపములను క్షమించేది మాత్రము దేవుడే. గురువులు యేసు ప్రభవు స్థానములో ఉండి దైవ క్షమాపణను మాటలద్వారా మరియు చేతలద్వారా విశ్వాసులకు అందిస్తున్నారు. దేవుడు మన పాపములను క్షమించాడని గురువు ‘పాప విమోచన ప్రార్ధన’ ద్వారా మనకు తెలియజేయు చున్నాడు.
నేను “పాపసంకీర్తనము” చేసినప్పుడు స్వస్థతతో కూడిన దేవుని దయను నేను పొందు చున్నానా? పొందలేకపోతే కారణాలు ఏమిటి? సరైన సంసిద్ధత లేక నియమిత చర్యగా (routine) పాపసంకీర్తనము చేస్తున్నానా? భయము వలన, సిగ్గువలన నా పాపములను మనస్పూర్తిగా ఒప్పుకొనలేక పోవుచున్నానా? కనుక దివ్య కారుణ్య పండుగ రోజున, ఇకనుండైనా “మంచి” పాపసంకీర్తనము, “స్వచ్చమైన” పాపసంకీర్తనము, “నిష్కపటమైన” పాపసంకీర్తనము చేస్తానని నిర్ణయం చేసుకుందాం.
బర్తిమయి గుడ్డివాడు, "దావీదు కుమారా! యేసు ప్రభూ, నన్ను కరుణింపుము" అని అరిచాడు, ఫలితముగా, చూపును పొందాడు.
కననీయ స్త్రీ "ప్రభూ, దావీదు కుమారా! నాపై దయ చూపుము" అని మొరపెట్టుకున్నది. ఫలితముగా, ఆమె కుమార్తె స్వస్థత పొందినది.
పది మంది కుష్ఠ రోగులు, "ఓ యేసు ప్రభువా! మమ్ము కరుణింపుము" అని కేకలు పెట్టారు. ఫలితముగా, వారు శుద్ధి పొందారు.
సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, "ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము" అని ప్రార్ధించాడు. ఫలితముగా, దేవుని ఎదుట నీతి మంతునిగా పరిగణింప బడి ఇంటికి వెళ్ళాడు.
దివ్య కారుణ్య మహోత్సవమున, మనము కూడా, "ప్రభువా, నాపై దయచూపుము, క్రీస్తువా, నాపై దయచూపుము, ప్రభువా, నాపై దయచూపుము అని ప్రార్ధిద్దాం. ఫలితముగా, దివ్య కారుణ్యమును పొందుదాం. దేవుని దయను, కరుణను, ప్రేమను, శాంతిని, స్వస్థతను, దైవ అనుగ్రహములను పొందుదాం. ఈ రోజు, కీర్తనాకారుడితో జతకలిసి పాడుదాం: “ప్రభువు మంచి వాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును” (కీర్తన. 118:1).
అందరికి, దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు! పునీత ఫౌస్తీనమ్మ గారా! మాకొరకు ప్రార్ధించండి. ఆమెన్.
No comments:
Post a Comment