యేసు క్రీస్తు నా ప్రియుడు
పరమ గీతం 1:2-4 (వ్యాఖ్యానము)
"నీ పెదవులతో నన్ను ముద్దు పెట్టుకొనుము
(1:2)
ప్రేమ, రైలు పట్టాలవలె కలువకుండా చేసెడి ప్రయాణము కాదు. ఇద్దరు
వ్యక్తుల ఐక్యతను దృఢపరచెడిది ప్రేమ.
ప్రేమ ఎంతో ఘనమైనది. ప్రియుడు ప్రియురాలు కలుసుకున్న ప్రతీ క్షణములో వారి
ఐక్యత దృఢపడుతూ ఉంటుంది. వారి కలయిక, సంభాషణలు, ఇచ్చుకోవడం,
పుచ్చుకోవడం, మొదలగు వానిలో ఇంతకు ముందెన్నడూ
అనుభవించనటువంటి తీవ్రతను అనుభవిస్తూ ఉంటారు. ఒక్కో క్షణం, ఒక్కో రీతిలో
నూతనోత్తేజముతో గడుస్తూ ఉంటుంది. ప్రియులకు కాలము ఎటుల గతించునో తెలియదు. ఒకరి
ఒడిలో ఒకరు సేద తీరుతూ, కష్ట సుఖాలను పంచుకొంటూ, ఆప్యాయతా
అనురాగాలను, మూగగా, తీయగా అనుభవిస్తూ ఉంటారు.
ఒకరి స్పర్శ ఒకరికి నూతన ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తూ ఉంటుంది.
నాకు తోడుగా నీవుంటే ఈ లోకాన్ని జయించగలను అని చెప్పుకొనే స్థితికి ప్రియులు
చేరుకుంటారు. వారి మధ్య ప్రేమ బలమైనది. మతం, కులం, ధనం, అధికారం, స్వార్ధం,
మొదలగు తుఫానులు వారిని చెదరగొట్టలేవు.
క్రీస్తుపై మన క్రైస్తవ ప్రేమకూడా ఇలాంటిదే. తండ్రి
అయిన దేవుడు క్రీస్తు ద్వారం పవిత్రాత్మ ద్వారా, నిన్ను, నన్ను ఇటువంటి
ప్రేమలో జీవించుటకు పిలచియున్నాడు. మన ప్రియుడు క్రీస్తు ప్రభువే! ఈ ప్రేమ ద్వారా
త్రిత్వైక సర్వేశ్వరునిలో గాఢమైన బంధాన్ని కలిగి ఉంటాము.త్రిత్వైక దేవునిలో ఐక్యము
కావలయునని మన జీవిత అభిలాష! ఆత్మ-జ్ఞానము ద్వారా, ఈ గాఢమైన ఐక్యతను
కలిగి యుండాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్రీస్తుతో ఒకటిగా అగుటకు, తద్వారా, తండ్రి దేవునితో
ఒకటిగా అవుతామనే దేవుడు మనలను ఇట్టి ప్రేమలో సృష్టించాడు.
మన ప్రియుడు క్రీస్తు ప్రభువు! మనమంతా ఆయన
ప్రియులము. మనలోనున్న దేవుని ఆత్మ శక్తి చేత మన ప్రియుడగు ప్రభువును పెదవులతో
ముద్దిడాలి. ఆత్మ ద్వారా క్రీస్తుతో ఏకము కావాలి. ఇదియే మన ప్రార్ధన! "దేవుడు
మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము" (1 యో 4:19). క్రీస్తు
ప్రభు ప్రార్ధన కూడా ఇట్టిదే, "వారందరు ఒకరుగా ఐక్యమై
ఉండునట్లు ప్రార్ధించుచున్నాను" (యో 17:21).
'ముద్దు' అనగా పవిత్రాత్మ
పునీత
బెర్నార్డు, యేసు ప్రభుని పెదములనుండి వచ్చు ముద్దులు ఆయన
ఒసగు పవిత్రాత్మాయే అని వ్రాసియున్నారు. దేవుడు, తన బిడ్డలమైన
మనపై క్రీస్తుని మృదువైన ముద్దుల ద్వారా, తన ప్రేమను
వ్యక్తపరస్తున్నారు. క్రీస్తు ఉత్థాన మహిమతో మనకి పవిత్రాత్మ ఒసగుట ద్వారా మనలను
ముద్దాడుచున్నారు. తద్వారా, వ్యక్తిగతముగా క్రీస్తుతో
ఐక్యమగుచున్నాము. కనుక, మనము క్రీస్తు ఒసగే ఆత్మ లేక ముద్దును
స్వీకరించుటకు సిద్దపడవలయును.
క్రీస్తునాధుని ముద్దులే పవిత్రాత్మ వరాలు. ఈ
వరముల ద్వారానే త్రిత్వైక దేవునిలో ఐక్యము కాగలము. అప్పుడు పునీత పౌలుగారితో,
"ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు
జీవించుచున్నాడు" (గలతీ 2:20) అని చెప్పగలము. ఆత్మ ద్వారా దేవుడు తన
రహస్యమును వెల్లడించును. ఆత్మ సమస్తమును వెదకును. "దేవుడు మనకొసగిన
పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను (రోమీ 5:5).
No comments:
Post a Comment