జేసు తిరుహృదయ పండుగ
జూన్ మాసములో మరో నూతన విద్యా / కార్మిక సంవత్సరమును ప్రారంభిస్తున్నాము. ప్రభువు మనందరికీ మరో గొప్ప అవకాశమును ఇచ్చియున్నాడు. దీనిమూలముగా, దేవునకు కృతజ్ఞతలు తెలుపుకొందాము. అలాగే, ఈ అవకాశమును నూరుశాతం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయుదాం. లూకా సువార్తలోని (12:16-21) లోభివాని వలె, స్వార్ధముగా ఆలోచిస్తూ, సుఖముగా ఉండి, తిని, త్రాగి ఆనందించాలనిగాక, ఈ నూతన సంవత్సరాన్ని ఒక ఆలోచనతో ముందుకు సాగిద్దాం!
జూన్ మాసములో యేసు తిరుహృదయము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము. యేసు తిరు హృదయం సున్నితత్వానికి, ప్రేమకు, కరుణకు గురుతుగా ఉన్నది, అలాగే యేసు తిరుహృదయం సరళతకు చిహ్నముగా కూడా ఉన్నది.
యేసు తిరుహృదయం సాధువైనది, దయగలది, సున్నితమైనది, సకల మానవాళిని క్షమించ గలిగి, దేవుని ప్రేమను పంచే హృదయము. యేసు హృదయం మనలను ప్రేమించుటకు ఎల్లపుడు తెరిచే ఉంటుంది. తన తెరచిన హస్తముతో మనలను ఎల్లపుడు కౌగిలించుటకు ఆహ్వానిస్తూ ఉంటాడు. అలాగే తన తిరుముఖము దయాకనికరముతో మనలను ఎల్లపుడూ మన్నించుటకు మనవైపే చూస్తూ ఉంటుంది. ఈవిధముగా, ప్రప్రధముగా, తిరుహృదయం, యేసు ప్రభుని ప్రేమకు, క్షమకు, శ్రద్ధకు సూచికగానున్నది. మత్తయి సువార్తలో (11:25-30) ప్రభువు ఇలా అంటున్నారు: ‘‘సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని మీరు నానుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మయందు విశ్రాంతి పొందుదురు.’’ ప్రభువుయొక్క సాధుశీలతను, వినమ్రతను అనుసరించినచో మనలో శాంతిని, ఆనందమును పొందెదము.
యేసు తిరుహృదయం, ఎల్లపుడూ క్షమించమని, వినమ్రులై ఉండవలెనని, సాధుశీలతను కలిగియుండవలెనని, దయాకనికరము కలిగియుండవలెనని నేర్పిస్తున్నది. జేసు తిరుహృదయ సందేశము గాంధీజీగారు అహింసా మార్గమును అనుసరించునట్లుగా ప్రేరేపించినది.
పొప్ ఫ్రాన్సిస్ గారు ఇలా చెప్పియున్నారు: దైవాంకిత జీవితమును సంపూర్ణముగా జీవించుటకు, అలాగే మానవ సేవా ప్రేషిత కార్యములో, దయగల ప్రేమను కలిగి యుండటం క్రైస్తవ జీవితానికి పునాది. ఈ విధముగా తల్లితిరుసభ అంతయుకూడా దయగల ప్రేమతో నిండియుండవలయును. కాని, ఈనాటి శ్రీసభ అలా లేదు. అది శక్తివంతమైన ‘నిర్మాణము’గా మారినది. కనుక, పొప్ ఫ్రాన్సిస్, ‘‘తిరుసభ ఎక్కడ ఉన్నను, తండ్రియొక్క దయగల కరుణను ప్రదర్శింపవలయును. మన విచారణలోగాని, మేత్రాసణములోగాని, సమూహములోగాని, మఠములోగాని, గృహాలలోగాని, సంఘాలలోగాని, ఉద్యమాలలోగాని, ఒక్కమాటలో చెప్పాంటే, క్రైస్తవులు ఎక్కడ ఉంటే అక్కడ వారు కరుణగల ఊటను కనుగొనవలయును. యేసు తిరుహృదయము చేత మనము తాకబడినప్పుడు, మనము రాయితో కూడిన హృదయమునుగాక, మాంసముతో కూడిన హృదయమును కలిగి యుంటాము, అనగా, సాధువైన, వినయముగ, క్షమించగల హృదయాన్ని కలిగి యుంటాము.
శాంతి అనేది క్షమించడము వలన, సమాధానముగా జీవించుట వలన, నిరంతర సంప్రదింపు వలన కుగుతుంది (రైమండ్ పణిక్కర్). శాంతియనగా, పోయినదానిని తిరిగి కుదిరించుట. అయితే, పాతదాన్ని కుదర్చటం శాంతి కాదు, కాని నూతన పద్ధతిని సృష్టించడం!
జేసు తిరుహృదయ సందేశము ఏమనగా, చిన్న బిడ్డ మనస్తత్వమును కలిగియుండటము. సాధుశీలత యనగా నీతి, నిజాయితీగా, పారదర్శకతను కలిగి యుండటము. పరిసయ్యులవలె కపటము కలిగి యుండక, చిన్నబిడ్డ నిరాడంబరతను కలిగి యుండవయును.
నిరాడంబరత యనగా పారదర్శకతను కలిగి యుండటము. బయట ఒకటి లోపల ఒకటిగా యుండుట కాదు. కపటం అనే ముసుగు వేసుకొని జీవించడం కాదు. ప్రభువు పరిసయ్యులను ‘సున్నము కొట్టిన సమాధులవలె ఉన్నారు’ అని చెప్పాడు, అనగా బయటకు నీతిమంతులవలె కనిపిస్తారు కాని లోపల కపటముతో, కలుషముతో నిండియున్నారు (మత్తయి 23:27-28). ఇలాంటి వారు కపటవేషధారులు. బయటకు కనిపించే వేషధారణ మాత్రమే కనిపిస్తుంది, కాని వాస్తవ రూపము దాగి యుంటుంది. చిన్నబిడ్డల మనస్తత్వము కలిగినవారు కపట వేషము వేయరు. వారి వాస్తవ స్వరూపమే బాహ్యముగా కనబడుతుంది.
నాతో, ఇతరులతో, ప్రకృతితో నేను నిజాయితిగా ఉంటానో, అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు సత్యస్వరూపి. సత్యమే దేవుడు అని అంటాడు మాహాత్మ గాంధిజీ. దేవునితో, ఇతరులతో నా నిజ వాస్తవముతో నిజాయితీగా ఉండటమే మతము. బయటకు కనిపించే కపట వేషధారణ మతము కాదు.
మనము ‘కపట వేషము’ అనే సంస్కృతిలో బ్రతుకుతున్నాము. ఈ ‘కపట వేషము’ మతాలను కూడా దాడి చేసింది. దీనినుండి మనము బయట పడాలి. జేసు తిరుహృదయం ఇలా బిగ్గరగా అరుస్తున్నది, ఆలకించుదాం: ‘‘నా అనంతమైన ప్రేమను మీపై కృమ్మరించుటకు నా హృదయం పూర్తిగా తెరచియున్నది. నేను ఎలాంటి కపటము లేకుండా నన్ను నేను మీకు చూపెదను.’’ సత్యమునకు బయపడినప్పుడు, ఏదో కపట వేషముతో దాగుకొనుటకు ప్రయత్నం చేసి, అవినీతి పరులుగా జీవిస్తూ యుంటాము. అక్కడే సౌకర్యము ఉన్నదని భావిస్తాము. కరుణతో మనవైపు చూసే జేసు తిరుహృదయమువైపు గాంచెదము. ఆ హృదయమునుండి నేర్చుకుందాము.
No comments:
Post a Comment