దేవుడు మన గొప్ప తండ్రి

దేవుడు మన గొప్ప తండ్రి

    దేవుడు మన (పరలోక) తండ్రి. ఆయన పరిపూర్ణ తండ్రి. మనలను అనంతముగా ప్రేమించే తండ్రి.

    ఒకసారి ఒక తండ్రి తన మూడు సం.ల కవల పిల్లలతో పార్కునకు వెళ్ళాడు. వారికి కావలసిన ఆహారపదార్దాలను, ఆటవస్తువులను మొదలగు వాటినన్నింటిని తీసుకెళ్ళాడు. పార్కులో సరదాగా ఆడుతూ, పాడుతూ గడుపుతున్నారు. కింద పడతారేమోనని, తండ్రి చాలాజాగ్రత్తగా వారిని గమనిస్తూ  ఉన్నాడు. తన చూపును పక్కకు తిప్పుకోకుండా వారినే కనిపెట్టుకొనియున్నాడు. కొద్దిసేపటి తరువాత, తెచ్చిన ఆహారపదార్దాలను వారికి తినిపించాడు. బట్టలనిండా పడిన ఆహార పదార్దాలను, మురికిని ఓపికగా శుభ్రంచేసాడు. కారుతున్న చీమిడిని తుడిచాడు. మూతిని, మొఖమును కడిగాడు. ఇలా వారి అవసరాన్నింటిని తీర్చాడు.

    ఇలాచేస్తుండగా, ఆ తండ్రి తన మనస్సులో ఎంతో ప్రశాంతతను పొందాడు. తన హృదయములోనుండి విన్నటువంటి స్వరమునకు ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ స్వరం ఏమంటే, ‘‘నీవు కుడా నాకు అంతే, నిన్నుకూడా నేను అలానే చూసుకుంటున్నాను.’’ 

    ఈ తండ్రి తను చేసే ప్రతీ తప్పుకు ఎంతగానో బాధపడతాడు, పశ్చాత్తాపపడతాడు. అయితే, ఆ క్షణములో తన తండ్రి దేవుడు తనను ఎలా చూస్తున్నాడో చూడగలిగాడు. తన పిల్లలు ఎన్నిసార్లు తమ చేతులను, కాళ్ళను, బట్టలను మురికిచేసుకున్నప్పటికిని, అన్నిసార్లు శుభ్రం చేసాడు. అలాగే, ‘‘నేను ఎన్నిసార్లు, ఎన్నితప్పులు చేసినప్పటికిని, నా తండ్రి దేవుడు సంతోషముగా వాటిని తుడచివేయుటకు సంతసించుచున్నాడు’’ అని గుర్తించాడు. ‘‘దీనికి నేను అయోగ్యుడనని భావించడం లేదు, కాని నేను తండ్రి దేవుని ప్రియమైన చిన్న బిడ్డను కనుక.’’ 

    దీనిని చదువుచున్న ప్రతిఒక్కరికి, భూలోకములో మన తండ్రులతోనున్న బంధాన్నిబట్టి, ‘‘తండ్రి’’ అనే మాటపై ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఏది ఏమైనప్పటికిని, మనందరికీ పరలోకములో ఒక ప్రియమైన, గొప్ప, పరిపూర్ణ తండ్రి ఉన్నాడు.

ఆయన కళ్ళలో, మనం ఎల్లప్పుడూ చాలు
    కొన్నిసార్లు తండ్రి దేవుడు మనలను, మన జీవితాలను పట్టించుకోవడం లేదని భావిస్తాము. కాని, ఆయన మన తండ్రి, నాన్న. మనలను ఎల్లప్పుడూ కనిపెట్టుకొనే ఉంటాడు. మనలను ఎన్నటికి ఎడబాయడు, అనాధులుగా విడచిపెట్టడు. మన ప్రతీ విజయములో, ఆయనకూడా గర్వపడుతూ ఉంటాడు. ప్రతీ అపజయములో మనను ఓదారుస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటాడు.

    ఒక నాలుగు సం.ల చిన్నపాపకు బొమ్మలు గీయడం అంటే ఎంతో ఇష్టం. తను వేసిన బొమ్మను తన తల్లిదండ్రుకు చూపి ఎంతో సంబరపడేది. ఒకరోజు, పాప వాళ్ళ నాన్న ఇంటికి రాగానే, ఆరోజు తను వేసిన బొమ్మను (తెల్లని  పేపరుపై కొన్ని గీతలు) చూపించింది. అది చూసిన తండ్రి వెమ్మటే, ‘‘చాలా అందంగా ఉంది, చాలా బాగా గీసావు’’ అని చెప్పాడు. అయితే, బొమ్మ బాగాలేకపోయినను, కూతురుని మనస్పూర్తిగా మెచ్చుకున్నాడు. పాప టాలెంట్‌నిబట్టి బొమ్మ బాగాలేదనిగాక, అది గీసింది తన కూతురు అని సంతోషముతో అభినందించాడు. భూలోక తండ్రులు తమ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. అయితే కొన్నిసార్లు, కొన్నిసందర్భాలో ఆ ప్రేమను చూపించలేకపోవచ్చు. కాని తండ్రి దేవుడు ప్రేమస్వరూపుడు. ఆయనే ప్రేమ. మనం చేసే ప్రతీదానిని ఆయన అభినందిస్తాడు. అది మన టాలెంట్‌ అని కాదు గాని, మనం ఆయనకు ఎంతో విలువైన బిడ్డలము కనుక.

ఆయన దరి చేరుటకు మన పరలోక తండ్రి మనకొరకు ఏమైనా చేస్తాడు
    తన ఇంటికి, ఒడిలోనికి చేర్చుకోవడానికి, తండ్రి దేవుడు మనకోసం ఏమైనా చేస్తాడు. మన తండ్రి ఎల్లప్పుడూ మన యోగక్షేమాలు పరీక్షిస్తాడు. తన సమయాన్ని మనకోసం వెచ్చిస్తాడు. ఆయన ఎన్నటికీ  అసిపోడు. ఆయన నేడు, రేపు, నిత్యము మనతో ఉండటానికి ఇష్టపడతాడు.

    తండ్రి దేవుడు, సర్వశక్తిమంతుడైనప్పటికిని, ముందుగా తననుతాను మనకు తండ్రిగా తెలియబరచడమే ఎక్కువగా ఇష్టపడతాడు. మన తండ్రి దేవునకు, మన భాంధవ్యం సహవాసం కావాలి, మన హృదయాలు కావాలి. భూలోక తండ్రులు ‘‘తండ్రి’’ బాధ్యతతోపాటు, అనేక ఇతర బాధ్యతలను (భర్త, స్నేహితుడు, వ్యాపారి...మొ.వి) పోషిస్తున్నారు కనుక ‘‘తండ్రి’’ బాధ్యతలకు నూరుశాతం న్యాయంచేయలేరు. కాని దేవుడు నూరుశాతం న్యాయంచేస్తాడు. ఆయన మన పరిపూర్ణ తండ్రి.

    దేవుడు మన తండ్రి. అలాగే మన సృష్టికర్త!. మనము ఆయనకు ఎంతో విలువైనవారము. ఆయన రాజ్యముకొరకు మనము పిలువబడినాము. మనము ఆయన ఆలోచన. ఆరంభమునుండి మనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు.

    ‘‘తండ్రి మనను ఎంతగా ప్రేమించెనో చూడుడు! ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్ధముగా మనము అట్టి వారమే... ప్రియులారా! మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని, ఇక ఏమికానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చునప్పుడు ఆయన యథార్ధ రూపమును మనము చూతము. కనుక, ఆయనవలె అగుదుము అని మాత్రము మనకు తెలియును’’ (1 యోహాను 3:1-2).

No comments:

Post a Comment