క్రీస్తు ఉత్థానం - పరమార్ధం

క్రీస్తు ఉత్థానం (Editorial, "Thamby Velugu" April 2019)
క్రీస్తు ఉత్థానం - పరమార్ధం

1. దేవునికి మన అంగీకరయోగ్యత

‘‘మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగించబడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యులముగ ఒనర్చుటకు గాను ఆయన లేవనెత్త బడెను’’ (రోమీ. 4:25). పాపము వలన మానవాళి దేవునినుండి వేరుపరపబడి ఆయనతో సత్సంబంధాన్ని కోల్పోయినది (యెషయ 59:2). పాపము వలన దేవుని ఆగ్రహమునకు గురికావలసిన వారమైతిమి (ఎఫెసీ. 2:3). దేవునితో తిరిగి సత్సంబంధమును కలిగియుండాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపియున్నాడు. మనము గురికావలసిన శిక్షను, సిలువలో క్రీస్తుపై మోపియున్నాడు. తద్వారా, మనము దేవునకు అంగీకార యోగ్యులమయ్యాము. మన పాపముల కొరకు క్రీస్తు సిలువపై అర్పించిన బలి తండ్రి దేవుడు అంగీకరించాడనడానికి క్రీస్తు ఉత్థానం దానికి నిదర్శనం.

2.  మరణముపై విజయం

‘‘మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియును. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు’’ (రోమీ. 6:9). మరణము మానవాళికి శతృవు. ఇది వ్యక్తిగతమైన పాపముకు శిక్ష. ‘‘పాపము యొక్క వేతనము మరణము’’ (రోమీ. 6:23). మరణాల రేటు ఎ్లప్పుడూ 100%. వైద్యసాంకేతికతద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బు ఉన్ననూ మరణకోరలలోనుండి ఎవరునూ తప్పించుకొనలేరు. క్రీస్తు మృతులలోనుండి లేచెను ఎందుకన, మృత్యువునకు ఆయనపై ఎట్టి ఆధిపత్యము లేదు. మరణం ఆయనను జయించలేక పోయినది. క్రీస్తు మరణాన్ని జయించాడు కనుక ఇక మనముకూడా మరణమునకు భయపడనవసరం లేదు. ఇక మరణమనేది శతృవు కాదు ఎందుకన, క్రీస్తులో మరణము తర్వాత వచ్చు శిక్షకు మనము భయపడనవసరం లేదు.

‘‘ఓ మృత్యువా! నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా! బాధకలిగింపగల నీ ముల్లు ఎక్కడ? మరణపు ముల్లు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కాని, మన ప్రభువగు యేసుక్రీస్తుద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు!’’ (1 కొరి. 15:55-57).

3. క్రీస్తునందు విశ్వాసుల ఐఖ్యత

‘‘యేసు ప్రభువును మృతులలోనుండి లేపిన దేవుడు, యేసుతోపాటు మమ్ములను లేవనెత్తి, మీతో సహా ఒకచోట చేర్చి, ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడు’’ (2 కొరి. 4:14). క్రీస్తును మనము విశ్వసించినప్పుడు, మనము ఆయనందు విశ్వాసములో ఐఖ్యమైయున్నాము. క్రీస్తునందు ఐఖ్యమై యుండుటయనగా, దేవుడు మన అయోగ్యతను పరిగణింపక, క్రీస్తు యోగ్యతను పరిగణిస్తాడు. ‘‘మనము క్రీస్తుతో మరణించియున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము’’ (రోమీ. 6:8).

ఈ ఐఖ్యత కేవలము క్రీస్తు ఉత్థానంద్వారా మాత్రమే సాధ్యమైనది. ఈ ఐఖ్యత వలన మనము దేవునకు అంగీకార యోగ్యులమగు చున్నాము. ‘‘ఆయన జీవము మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేగాక, ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తుద్వారా, మనము నీతిమంతులము, పరిశుద్దులము, విముక్తులము అయితిమి’’ (1 కొరి. 1:30). మనము ఇప్పుడు నూతన జీవితములో జీవించగలుగు చున్నాము. ఎందుకన, ‘‘మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలుపంచు కొంటిమి. ఏలయన తండ్రి ప్రభావముచే మరణమునుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే, మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను’’ (రోమీ. 6:4).

4.  దైవ వాక్కు వాస్తవం

యెషయ 53, కీర్తన 16 మొదలగు ఎన్నో ఉదాహరణలు ఉత్థానము గురించి చెప్పవచ్చు. ‘‘అయినను అతనిని బాధాభరితుని చేయవలెననియే నా సంకల్పము. అతని మరణము పాపపరిహార బలియయ్యెను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పాత్రులను జూచును. అతనిద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతి మంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని జూచి నేను వారి తప్పిదములను మన్నింతును’’ (యెషయ 53:10-12). ‘‘నీవు నన్ను పాతాళమునకు పంపవు. నీ పరిశద్ధుని గోతిపాలు చేయవు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడిచేతిలో శాశ్వత సుఖము కలదు’’ (కీర్తన. 16:10-11).

5.  సువార్తా వాస్తవం

క్రీస్తు సజీవుడు కనుక ఆయన మనలను రక్షింపగలడు. క్రీస్తు ఉత్థానమును పౌలు దృఢముగా ధృవీకరిస్తున్నారు, ‘‘క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే. మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే ఐనచో, ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయనీయులము’’ (1 కొరి. 15:14, 17-19). కనుక క్రీస్తు ఉత్థానం లేనిచో మన విశ్వాసము, నిరీక్షణ లేవు. నిజమైన సువార్త క్రీస్తు ఉత్థానమే! క్రీస్తు ఉత్థానం వలన మన విశ్వాసం, నిరీక్షణ సజీవముగా ఉన్నవి. మన పాపము క్షమింపబడు చున్నవి. క్రీస్తుద్వారా మనము నిత్యజీవమును పొందుచున్నాము.

6. యేసు దేవుని కుమారుడని నిర్ధారణ

‘‘ఆయన మృతులలోనుండి పునరుత్థానుడైనందున పవిత్ర పరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను’’ (రోమీ. 1:4). క్రీస్తు ఉత్థానమవనిచో సకల మృతులలో ఒకనిగా నుండెడివాడు. కాని, అలా జరగలేదు. ఆయన మృతులలోనుండి సజీవముగా లేచాడు. ఆయన దేవుని కుమారుడు అను వాస్తవాన్ని ధృవీకరిస్తున్నది.

7. పవిత్రాత్మ రాకడ

క్రీస్తు ఉత్థానమైన తరువాత, పరలోకమునకు కొనిపోబడిన తరువాత ఆయన వాగ్ధానము చేసిన పవిత్రాత్మను భూలోకమునకు పంపియున్నాడు. కనుక క్రీస్తు ప్రేషితకార్యము ఈనాటికిని భూలోకములో పవిత్రాత్మతో నింపబడిన వారితో కొనసాగుచున్నది. ఉత్థాన క్రీస్తు పవిత్రాత్మద్వారా తన ప్రజలతో తోడుగా ఉండి సహాయం చేస్తున్నారు, వారిని బపరచుచున్నారు, దేవునికి ఇష్టపూర్వకమైన జీవితమునకు నడిపించుచున్నారు. ‘‘ఆయన దేవుని కుడిప్రక్కకు చేర్చబడి, తన తండ్రి వాగ్ధానము ప్రకారము పవిత్రాత్మను పొంది, మీరిపుడు చూచుచు, వినుచున్న ఆత్మను కుమ్మరించి యున్నాడు’’ (అ.కా. 2:33).

8. సజీవమగు నిరీక్షణ

పాపములు క్షమింపబడుట, దేవునకు అంగీకార యోగ్యులముగా చేయబడుట క్రైస్తవులమగు మనకు ఒక గొప్ప సజీవమగు నిరీక్షణను ఒసగుచున్నది. పాపము వలన దేవునకు శతృవుగా ఉన్నటువంటి మనము, క్షమింపబడిన దేవుని బిడ్డలుగా మారియున్నాము. శిక్షకు బదులుగా నిత్యజీవమును పొందుచున్నాము. ఇది నిజముగా  క్రీస్తు ఉత్థాన ఫలితము, బహుమానము. ‘‘మృతులలో నుండి యేసు క్రీస్తును ఆయన పునరుత్థాన మొనరించి, దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీకొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు’’ (1 పేతు. 1:3-4).

9.  ఆయనతో జీవించుట

‘‘క్రీస్తు మృత్యువునుండి లేవనెత్తబడిన వారిలో ప్రధముడనుట సత్యము’’ (1 కొరి. 15:20). క్రీస్తు ఉత్థానం సకల విశ్వాసుల ఉత్థానమునకు సూచనగా ఉన్నది. ‘‘ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే, మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరు ఎట్లు మృతిచెందుచున్నారో, అటులనే క్రీస్తునందు అందరు బ్రతికింప బడుదురు’’ (1 కొరి. 15:21-22).

క్రీస్తువలె ఉత్థాన భాగ్య జీవితమును విశ్వాసులుకూడా ఆనందించెదరు. వారి శరీరము అక్షయమగునదిగా లేపబడును. ‘‘మృతులు పునర్జీవితులు చేయబడునపుడు ఇట్లుండును: శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును. అది గౌరవములేనిదిగా విత్తబడి, వైభవము గలదిగా లేపబడును. అది బహీనమైనదిగా విత్తబడి, బలముగలదిగా లేపబడును. భౌతిక శరీరముగా అది విత్తబడి, ఆధ్యాత్మిక శరీరముగా అది లేపబడును. భౌతిక శరీరము ఉన్నది కనుక, ఆధ్యాత్మిక శరీరమును ఉండవయును’’ (1 కొరి. 15:42-44). ఈ లోకముననుండగా మనము ఎన్నో బాధలకు, కష్టాలకు గురికావచ్చు కాని ఇహలోక జీవితము తరువాత పరిపూర్ణమైన ఆధ్యాత్మిక శరీరము కలిగి ఆనందముగా జీవిస్తాము.

10. నీతి ప్రకారం తీర్పు చేయుట

‘‘మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు. కాని ఇప్పుడు ఎల్లెడలా ప్రజలందరును హృదయ పరివర్తన చెందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలయన, ఆయన ఎన్నుకొనియున్న ఒక మనుష్యుని మూలమున ప్రపంచమునంతటిని నీతి ప్రకారము తీర్పు చేయుటకు ఒక రోజును నిర్ణయించియున్నాడు. ఆయన ఆ మనుష్యుని మృతులలోనుండి లేపుటద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢపరచెను’’ (అ.కా. 17:30-31). ఒకరోజున మనమందరము (లోకమంతయు) దేవుని సన్నిధిలో తీర్పునకు గురికావలసి యున్నది. మన జీవితమునకు జవాబు చెప్పవలసి ఉంటుంది. దీనికి సూచననే క్రీస్తు ఉత్థానం. క్రీస్తులో పాపక్షమాపణ పొంది, నిత్యజీవితమును పొందవచ్చు. క్రీస్తుని విశ్వసించుటలో ఉత్థాన భాగ్యమును పొందగలము. మన విశ్వాసము క్రీస్తునందు ఐఖ్యము చేసి పాపమునుండి మనలను రక్షించునట్లు చేయును.

‘‘నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా?’’ (యోహాను 11:25-26).

No comments:

Post a Comment