తపస్కాలము - ప్రాముఖ్యత
కతోలిక శ్రీసభలో ‘తపస్కాలం’ ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కాలము. ఇది ‘విభూతి బుధవారము’తో ప్రారంభ మవుతుంది. ఆదివారమును మినహాయించి, క్రీస్తు ఉత్థాన పండుగకు ముందు 40 రోజుల కాలము తపస్కాలము.
తపస్కాలములో విశ్వాసులు సంపూర్ణముగా దేవునివైపు మరలటంద్వారా, క్రీస్తు ఉత్థాన పండుగకు సంసిద్ధ పడాలని శ్రీసభ కోరుచున్నది. దీనినిమిత్తమై విశ్వాసులు పాటించవలసిన కొన్ని నియమాలను శ్రీసభ ప్రతిపాదించుచున్నది. అవియే ‘ప్రార్ధన’, ‘ఉపవాసము’, ‘దానధర్మములు’. తపస్కాలము మనలను దేవునినుండి దూరము చేసే విషయాలను త్యజించు కాలము, అలాగే దేవునిలో మనలను ఐఖ్యము చేయు పవిత్రమైన, ఆధ్యాత్మిక విషయాలను ఆలింగనము చేసుకొను కాలము.
శ్రీసభ తపస్కాలములో క్రీస్తు శ్రమలను జ్ఞాపక పరచుకొనుచున్నది. క్రీస్తు ప్రభువు 40 రోజులు ఎడారిలో చేసిన ఉపవాస ప్రార్ధనలను తపస్కాలములో క్రైస్తవులు అనుసరిస్తున్నారు. భోజనములో కొంత భాగమును త్యజించడం, అలాగే కొన్ని ఉత్సవాలను మానుకొనుట తపస్కాములో భాగమే!
శ్రీసభలో తపస్కా ఆచరణ అనాది కాలముగా వస్తున్న దైవార్చన ఆచరణయే! శ్రీసభ ఆరంభము నుండియే, ఉత్థాన పండుగకు ఆయత్తపడు విధానమును చూస్తున్నాము.
తపస్కాలము 40 రోజులుగా ఏర్పాటు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. యూదుల పవిత్ర గ్రంధములో 40 ముఖ్యమైన సంఖ్య. వినాశకరమైన వాన ‘నలువది పగళ్ళు, నలువది రాత్రులు ఎడతెగక కురిసెను’ అని ఆదికాండము 7:4, 12లో చూస్తున్నాము. వాగ్దత్త భూమికి చేరక ముందు ఇశ్రాయేలు ప్రజలు 40 సం.లు ఎడారిలో పయనించారు. సినాయి పర్వతముపై పది ఆజ్ఞలను పొందబోవు ముందు మోషే 40 రోజులు ఉపవాసం చేసాడు. బహిరంగ ప్రేషిత కార్యమును ప్రారంభించుటకు ముందు యేసు 40 రోజులు ఎడారిలో ఉపవాస ప్రార్ధనలో గడిపాడు.
తపస్కాలము, ప్రాపంచిక శోధనలను జయించుటకు, 40 రోజులపాటు ఉపవాసములో, ప్రార్ధనలో ‘ఏకాంతముగా ఎడారి’లో జీవించు కాలము. ఒక వ్యక్తి తనకుతానుగా ఆధ్యాత్మికముగా బలమును పుంజుకొను కాలము తపస్కాలము. దైవీక, మానవ సంబంధాలను మెరుగుపరచుకొను కాలము. దేవుని వాక్కుకు, ప్రార్ధనకు ఎక్కువ సమయాన్ని కేటాయించు కాలము. క్రీస్తు శ్రమలను ధ్యానించు కాలము.
ప్రార్ధన, ఉపవాసము, దానధర్మములు
ప్రార్ధన, ఉపవాసము, దానధర్మములు తపస్కాలములో ముఖ్యమైన మూడు స్తంభాల వంటివి. మన ప్రాయశ్చిత్తమునకు, పశ్చత్తాపమునకు, జ్ఞానస్నాన వాగ్దానములకు విశ్వాస జీవితాన్ని పునర్మించుటకు ఎంతగానో తోడ్పడతాయి.
ప్రార్ధన:
తపస్కాములో ఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో గడపాలి. అది ప్రభువునకు మనలను దగ్గరగా చేస్తుంది. మన జ్ఞానస్నాన ప్రమాణాలను జీవించుటకు కావసిన శక్తికోసం ప్రార్ధన చేయాలి. ఉత్థాన పండుగ దినమున జ్ఞానస్నానము పొందు వారి కొరకు ప్రార్ధన చేయాలి. పాపసంకీర్తనము చేయు వారి కొరకు ప్రార్ధన చేయాలి.
ఉపవాసము:
ఉపవాసము పవిత్రమైన కార్యము. ఉపవాసము కేవలం ఇంద్రియనిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమేగాక, ప్రార్ధన చేయుటకు సహాయ పడును. శారీరక ఆకలి, మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. అయితే, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఇదే: ‘‘నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడమీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు. పీడితులను విడిపింపుడు. వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు. మీ భోజనమును ఆకలి గొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు. బట్టలు లేనివారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు (యెష 58:6-7).
మన సమాజములో, ఎంతోమంది పేదరికము వలన రోజూ ఉపవాసము ఉంటున్నారని గుర్తించుదాం. సమానత్వము కొరకు, అందరూ క్షేమముగా ఉండటానికి కృషి చేద్దాం.
దాన ధర్మములు:
దానధర్మాలు \ తోటి వారిపట్ల మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన వరములకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అవసరములో నున్నవారికి సహాయం చేయాలి, దానధర్మములు చేస్తూనే, సమాజములో నీతి, న్యాయస్థాపనకు కృషి చేయాలి.
సిలువ మార్గము:
తపస్కాలములో ‘సిలువ మార్గము’నకు ప్రత్యేక స్థానము ఉన్నది. తపస్కాలములో మనం ముఖ్యముగా క్రీస్తు శ్రమలను, మరణముగూర్చి ధ్యానిస్తూ ఉంటాము. సిలువ మార్గముద్వారా, క్రీస్తు శ్రమలలో మనమూ పాలుపంచుకొనాలి. సిలువ మార్గము, క్రీస్తు శ్రమలను పొందిన విధముగా, దేవునకు విశ్వాస పాత్రులుగా ఉండాలంటే, మనముకూడా శ్రమలను పొందాలని గుర్తు చేస్తూ ఉంటుంది.
No comments:
Post a Comment