తపస్కాల రెండవ ఆదివారము Year A
ఆది. 12:1-4, 2 తిమో. 1:8-10,
మత్త. 17:1-9
మొదటి పఠనములో దేవుడు అబ్రహామును పిలుచుట, అబ్రహాముని ప్రత్యుత్తరమును గురించి, సువార్త పఠనములో యేసు క్రీస్తు దివ్యరూపధారణమును గురించి, మనం పొందుకున్న రక్షణము మన కృషి ఫలితము కాదని అది దేవుని ఉచితానుగ్రహమేనని పౌలుగారు రెండవ పఠనములో చెబుతున్నారు.
అబ్రహాముకు పిలుపు
క్రైస్తవ
విశ్వాసం ప్రకారం అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. అబ్రహాము అనగా అనేక జాతుల వారికి
తండ్రి. నమ్మకానికి, విశ్వాసానికి
అబ్రహాము ప్రతీక. దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది విశ్వాసమే.
ఫలితముగా, అబ్రహాము
గొప్పవాడు అగుటను చూస్తున్నాము. మనంకూడా అబ్రహామువలె దేవుని పిలుపును అంగీకరించి,
దేవునిపై భారమునుమోపి, దేవునిపై నమ్మకం ఉంచి జీవిస్తే ఆయన మనను అధికముగా
ఆశీర్వదించుతారు. దేవునియందు విశ్వాసం కారణముగా అబ్రహాము శోధింపబడ్డాడు. కాని విశ్వాసమును
పోగొట్టుకొనలేదు. మనంకూడా శోధింపబడినప్పుడు విశ్వాసమును నింపుకుంటే దేవుడు గొప్పగా
బహుకరిస్తారు.
దివ్యరూపధారణ
ఈనాటి
సువార్త పఠనము ‘‘ఆరు దినములు
గడచిన పిమ్మట’’ అను వాక్యముతో
ప్రారంభమగుచున్నది. కావున ఆరు దినముల ముందట ఏమి జరిగిందో తెలుసుకొనుట ముఖ్యము! ‘పేతురు అపోస్తులందరి తరుపున యేసు క్రీస్తుని రక్షకునిగా
ఒప్పుకోవడం’. అప్పుడు ‘పేతురుపై తన శ్రీసభను స్థాపిస్తానని ప్రభువు వాగ్దానం చేయుట’.
అటుతరువాత, ప్రభువు తన పాటుల గురించి ప్రస్తావించడం.
శిష్యులు ఈ వైవిధ్యాన్ని అర్ధం చేసుకొనలేక పోయారు. యేసు నాధునికి రెండు స్వభావములు
కలవు. దైవస్వభావము, మానవస్వభావము. దివ్యరూపధారణ సమయమందు ఆయన దివ్య తేజస్సు
ధరించెను. దైవతేజస్సును చూచి ఎవరును జీవించలేరు (నిర్గమ. 33:20),
తట్టుకొని నిలువలేరు. నేలపై బోరగిల పడుదురు (మత్త. 17:6.
అ.కా. 9:3-4. నిర్గమ. 34:29-30. 33-35). అనేక సందర్భములలో, దేవుడు పర్వతముపై మేఘమువలె (నిర్గమ. 19:9,
24:15-18), అగ్నివలె (నిర్గమ. 19:18),
దిగివచ్చినట్లుగానే దివ్యరూపధారణ సమయములో కూడా
మేఘమువలె (మత్త. 17:5) దిగివచ్చెను.
దివ్యరూపధారణలో దాగియున్న పరమార్ధము
ఇప్పటి
వరకు శిష్యులచేత ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా,
మెస్సయాగా, పరిగణింపబడిన యేసు, తన నిజ స్వరూపమును తెలియపరచడం ఎంతో ముఖ్యం. ఫలితముగా,
శిష్యుల విశ్వాసము దృఢపరచబడినది. ప్రభువులోనున్న
దైవత్వమును చూపించి, ఫలితముగా, శిష్యులను బలపరచి యున్నాడు. తండ్రి తనకు
అప్పగించిన పనిని నెరవేర్చుచున్నాడు (యెషయ 42:1-4. లూకా. 9:35. యోహాను. 4:34). తాను మోషేతోను,
ఏలియాతోను మాట్లాడుటద్వారా తాను ప్రవక్త ప్రబోధమును,
ధర్మశాస్త్రమును కొల్లగొట్టక, సంపూర్ణ మొనర్చుటను తెలియ జేయుచున్నారు.
ఈయనను ఆకింపుడు
‘‘ఈయనను ఆకింపుడు’’ అని పరమ తండ్రి, ‘‘ఆయన
చెప్పినట్లు చేయుడు’’ అని కన్నతల్లి
(యోహాను. 2:5), ‘‘నా మాటను
పాటించువాడు నిత్య జీవమును పొందును’’ అని యేసు (యోహాను. 5:24) చెప్పుచున్నారు. ఇంతకీ మరి ఆయన ఎవరు? ఎందుకు మనం ఆయన మాట వినాలి? ఆయనయే ఇహపరముందు సర్వాధికారి (మత్త. 28:18). ఈయన మూలమున, సమస్తమును సృష్టించబడెను (యోహాను. 1:3),
ఆయన మూలమున, ఆయన కొరకే సమస్తములున్నవి. ఆయనకే సదా స్తుతి కలుగునుగాక (రోమీ. 11:36).
ఆయన మాటలో జీవము (ఫిలిప్పీ. 2:9-11), దేవుడు ఆయనపై అంగీకార ముద్రను (యోహాను. 6:27)
వేసియున్నారు. కావున ఆయనను ఆకించాలి. రెండవ పఠనములో,
పౌలుగారు చెప్పినట్లుగా మనము అనుభవించుచున్న రక్షణ మన కార్యము వలనగాక దేవుని
ఉచితానుగ్రహము వలననే. ఈ సత్యమును, అందరికి బోధింప కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యతగా గుర్తెరిగి,
నెరవేర్చాలి, ప్రకటించాలి.
మన బాధ్యత
అబ్రహామువలె
దేవుని విశ్వసించి, విశ్వాసాన్ని
పాటించి దీవెనలు పొందుకోవాలి. క్రీస్తులోనున్న దివ్యస్వభావమును మనకు ఆయనయే
ఇచ్చారని గుర్తెరిగి అటువంటి దివ్యరూపమును ప్రదర్శిస్తూ ఇతరులను విశ్వాసమందు బలపరచాలి.
ఆయన కృపచేత రక్షింపబడ్డామని గుర్తెరిగి, వినయంకలిగి జీవిస్తూ, నమ్మిన విశ్వాసాన్ని ప్రకటిస్తూ జీవించాలి. ఎంచుకున్న మార్గము దేవునికి
సమ్మతమేనా, కాదా అని
తెలుసుకొనుటకు దివ్యరూపధారణ మొందెను. యెరూషలేములో తాను పొందబోవు మరణమును,
తాను ఎంచుకొనిన మార్గము, తాను చేయబోవు కార్యము సరైనదా? కాదా? అని తెలుసుకొను నిమిత్తము దివ్యరూపధారణమున మోషేతోను, ఏలియాతోను చర్చించినట్లుగా చూస్తున్నాము. మరి మనము చేయు పనులు
దేవునికి సమ్మతమా? కాదా?
అని తెలుసుకొనుచున్నామా? తెలుసుకొనుటకు ప్రార్ధించుచున్నామా? మన పనులు దైవనిర్ణయమేనా? అవి దేవుని చిత్తమునకు అనుగుణముగా ఉన్నవో?
లేవో? అని తెలుసుకొనుటకు మనలో ఎంతమందిమి ప్రార్ధించు చున్నాము?
మనలోకూడా
దివ్యరూపం ఉన్నది. దివ్యాత్మ ఉన్నది. జ్ఞానస్నానములో ఆత్మను స్వీకరించుటద్వారా,
దేవుడు మట్టి ముద్ధలోనికి తన శ్వాసను ఊదుటద్వారా,
దివ్యసత్ప్రసాదమును స్వీకరించుటద్వారా,
దేవద్రవ్యానుమానమును స్వీకరించుటద్వారా,
దివ్యగ్రంథ పఠనముద్వారా దైవశక్తిని,
దివ్యరూపమును పొందుకొనుచున్నాము. క్రీస్తులోని
దివ్యరూపమును చూచినవారు విశ్వాసమునందు బలమును పొందుకున్నారు. మరి మనలో ఎంతమంది
మనలోనున్న దివ్యరూపమును చూపుచున్నాము. ప్రార్ధన జీవితంద్వారా,
విశ్వాస జీవితంద్వారా మన ఆత్మీయ,
ఆధ్యాత్మిక జీవితమును చూచి ఎంతమంది విశ్వాసంలో
బపడుచున్నారు? కనీసం మనమైనా
బలపడినామా?
No comments:
Post a Comment