ఈనాటి మొదటి పఠనంలో యావే దేవుడు, గొర్రెల కాపరియైన దావీదును, తన స్థానంలో ప్రజల ప్రతినిధిగా, ఇశ్రాయేలు రాజుగా దేవునిచే ఎన్నుకోబడి, సమూయేలుచే అభిషేకింప బడుటను గూర్చి వింటున్నాం. సౌలు దేవుని మాటను పెడచెవిన పెట్టి, తనకు యిష్టము వచ్చినట్లు వ్యవహరించుట వలన, దేవుడు అతనిని నిరాకరిస్తున్నాడు. అతని స్థానంలో దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. దేవుని ఎన్నిక బాహ్యపు రూపురేఖు, దేహ ధారుడ్యం కాకుండా, అంత:రంగిక స్వభావమును, హృదయమును, దేవుడు పరికించి చూస్తున్నాడు. హృదయమును అవలోకించి దేవుడు చూస్తాడని మనకు రూఢీ అవుతుంది. ఆ సందర్భమును, సందేశమును ఈనాడు మనం తెలుసు కుందాం.
సందర్భం: ఇశ్రాయేలీయులను కానాను దేశమునకు వెళ్ళు మార్గమున హింసించిన కారణమున, దుర్మార్గములో నడచుచున్న అమాలేకీయును మట్టి కరిపింపుమని, వారి సంపదను శాపము పాలు చేయుమని యావే సౌలును ఆజ్ఞాపించెను. సౌలు మరియు అతని సైన్యము అమాలేకీయులను వధించిరి, కాని వారి సంపద మేలిమిదై యుండుట చూచి, దానిని శాపము పాలు చేయక, తమతో పాటు వారి దేశమునకు తెచ్చుకొనిరి. ఈ కార్యము యావే దృష్టిలో అవిధేయతగా పరిగణింపబడెను. ఏ కారణమున ఈ నిర్ణయం తీసుకున్నావని సమూయేలు అతనిని అడుగగా, మేలిమి జాతికి చెందిన పశుసంపదను దేవునికి బలి అర్పించుటకు తీసుకొని వచ్చానని ఒకసారి, సైనికులు వధించకుండా తీసుకొని వెళ్దామంటే, వద్దని చెప్పలేక పోయానని మరొకసారి చెబుతున్నాడు. దీనిని బట్టి అతని హృదయం దేవునివైపు కాకుండా సంపదవైపు మరల్చ బడినదని రూఢీ అగుచున్నది. సంపదను చూచి అతని హృదయం, ఆలోచన, నడవడిక, దేవునితో అతనికున్న సంబంధం మారినది. సంపాదనకు దగ్గరవుతూ, దేవునికి దూరమవసాగాడు.
సౌలును నిరాకరించిన దేవుడు, అతని తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించే నాయకుని ఎన్నుకొని, అతనిని అభిషేకించుటకు, ప్రవక్తయైన సమూయేలును బెత్లెహేమునకు పంపి, జెస్సె కుమారులలో ఒకనిని ఎన్నుకొని, తన తరపున అభిషేకించమని పురమాయిస్తున్నాడు. అర్హుడైన వాని కోసం సమూయేలు వెదుకుతున్నాడు. దేహధారుడ్యమును, కండలు గలిగిన వీరుని కోసం సమూయేలు చూస్తున్నాడు. కానీ సమూయేలు చూస్తున్న అర్హతను దేవుడు అంగీకరించలేదు. నరుడు చూసిన దృష్టితో దేవుడు చూడడు. నరుడు బాహ్యపు రూపురేఖను చూస్తే, దేవుడు అంత:రంగమును, హృదయమును అవలోకించును అని యావే దేవుడు తెలియజేస్తున్నాడు. హృదయం మానవ ఆలోచనకు, క్రియకు మూల కేంద్రము (మార్కు 7:15-16, 18-23). ఈ మూల కేంద్రం బాగుంటే, రాజవ్వడానికి జేష్టుడు కానవసరం లేదు. హృదయం శుద్ధముగా ఉంటె, మంచి కుటుంబ వంశావళి చెందినవాడు మాత్రమే ఉండాల్సిన పని లేదు. దేవుడు ఎన్నుకునేప్పుడు, పలుసార్లు సాంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తాడు. సాంప్రదాయ మును కాకుండా దేవుడు సహృదయమును చూస్తాడు.
సందేశం: దేవునిచే ఎన్నుకోబడటానికి, ఆయన సేవకు అభిషేకించ బడటానికి నీకున్న తాలెంతు మాత్రమే సరిపోవు. నీకున్న మంచి కుటుంబ చరిత్ర మాత్రమే ముఖ్యం కాదు. నీకున్న అందం, రూపం, దేహధారుడ్యం, బలము కలిగిన బాహువు, నేర్చిన విలువిధ్యలు, సాధనాలు, వాక్చాతుర్యం, నేర్పరితనము, ఆలోచనాశక్తి మాత్రమే సరిపోవు. దేవుని కృప, కనికరం, నడిపింపు కావాలి. దేవుని ఆలోచనకు అనుకూలంగా స్పందించే హృదయం, విధేయత, వినయం, అన్నింటికీ మించి దేవునితో అనుబంధం, సహవాసం కలిగియుండటం చాలా ముఖ్యం. దేవుని మాటను ధ్యానించే, ఆచరించే, నడిచే, హత్తుకొనే హృదయం మనకు కావాలి. అటువంటి హృదయం మనం కలిగియుంటే, దేవుని కృప మన బహీనతను బలంగా మారుస్తుంది. అనర్హతను అర్హతుగా మారుస్తుంది. దేవుని కృప మనలో వ్యక్త పరచ బడుతుంది. ఆయనతోడు ఎండలో నీడలాగ, రాత్రిలో వెలుగులాగా మనను వెంబడిస్తుంది. ఆయన మాటను వినే హృదయాన్ని, ఆయన బాటలో నడిచే హృదయాన్ని కోరుకుందాం!
No comments:
Post a Comment