మూడవ తపస్కాల ఆదివారము, Year A

మూడవ తపస్కాల ఆదివారము, Year A
నిర్గమ కాం. 17:3-7. రోమా 5:1-2, 5-8. యోహానుT 4:5-15, 19-26, 39, 40-42

తపస్సు కాలము లేదా పాస్కాయత్తకాలము అనగా మన తల్లి తిరుసభ తన ఆధ్యాత్మిక సంతానమైన మనకు ఒసగిన అనుగ్రహ సమయము, పాపహితులమైన మనము పాపరహితులుగా మారుటకు ప్రయత్నించతగు మంచి సమయము, పలురకాల ఉన్నత నిర్దేశమును తీసుకుని వాటిని నిష్టగా పాటించి, పరిపూర్తి చేయ చక్కని సమయము. అన్ని చెడు అలవాట్లనుండి మనలను మనము కాపాడుకొన పరిశుద్ధ సమయం. ఇటువంటి పవిత్ర సమయములో తిరుసభ బోధించే ఈనాటి సందేశం: ‘‘క్రీస్తే జీవజలము’’.

మానవుని తిరుగుబాటుతత్వం: ఈ నాటి మొదటి పఠనములో (నిర్గమ17: 3-7) ఇస్రాయేలు ప్రజలు దేవున్ని పరీక్షకు గురిచేస్తూ ఉన్నారు. వారిని అద్భుత రీతిన ఫరో బానిసత్వము నుండి విముక్తి చేసిన దేవుని మీద అపనమ్మకంతో, అవిశ్వాసముతో తిరుగుబాటు చేస్తున్నారు. వారి నాయకుడు, మోషేను దూషిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ భక్తి కీర్తనలో (కీర్తన 95: 8-9) కూడా ‘‘మెరీబా చెంత మీ పితరులవలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరులవలె మీరును హృదయమును కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యమును చూసిన పిదపకూడా మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురిచేసిరి’’ అని గ్రంథకర్త దేవునియొక్క బాధను మరలా గుర్తుచేస్తూ ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యములు చేసి చివరికి శక్తివంతమైన ఫరో సైన్యమును నాశనం చేసి అద్భుతరీతిన వారిని కాపాడిన ఆ దేవునియొక్క శక్తిని ప్రత్యక్షముగా చూసిన తరువాతకూడా వారు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. బానిసత్వములో మ్రగ్గుచున్న వీరిని ప్రేమతో స్వాతంత్రములోనికి నడిపించు దేవున్ని పరీక్షిస్తున్నారు. వారి హృదయములను కఠినము చేసికొనియున్నారు. ఇదిగో దేవుడు మనలను ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు, మనము ఎన్ని సందర్భాలలో మన హృదయములను కఠినము చేసుకొని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసియున్నాము? చేస్తున్నాము?

మానవుని విచక్షణ కొరత: వాగ్దాన భూమి అనగా గొప్ప జీవితం, ఆనంద జీవితం, స్వేచ్ఛా జీవితం, పాలు తేనెలతో కూడిన అందమైన జీవితం. ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానం. అయితే ఇశ్రాయేలు ప్రజలు తమ చిన్న సమస్య అయిన నీటి కొరతను భూతద్దంలో చూస్తూ గొప్ప లక్ష్యమైన వాగ్దాన భూమిని చిన్నదిగా చేసి గొడవ చేస్తున్నారు. తిరిగి ఐగుప్తుదేశం అనగా బానిసత్వమే ఎరుగని మమ్మును ఎందుకు తీసుకొచ్చావు అని మోషెపై తిరుగుబాటు చేస్తున్నారు. గోరంత సమస్యను కొండంత చేసి కొండంత శక్తిగల దేవున్ని గోరంత చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు వారి దృష్టిలో చిన్నబోయాడు. ఇదిగో దేవుడు మరల మనలను ప్రశ్నిస్తున్నాడు. నీ చిన్నచిన్న సమస్యలముందు దేవుని గొప్పశక్తిని గుర్తించలేక పోవుచున్నావా? నీ సమస్య కారణమున నీవు దేవుని వదిలిపెట్టి దూరంగా వెళ్లి పోవుచున్నావా? సర్వశక్తిమంతుడైన దేవున్ని చిన్నచూపు చూస్తున్నావా? వాటి మూలమున నీ విశ్వాసమును కోల్పోవుచున్నావా?

దైవ శక్తి ప్రభావము: పై ప్రశ్నన్నిటికీ సమాధానంగా, బలహీనులైన ఇస్రాయేలీయుల యొక్క అవిశ్వాసమును తొలగించుటకై దేవుడు రాతినుండి వారికి జలమును ప్రసాదించుచున్నాడు (నిర్గమ 17:6). అలాగే సువిశేష పఠనములో (యోహాను 4:5-42) కూడా యేసు క్రీస్తు ప్రభువు సమరీయ స్త్రీని శిథిమైన తన పాత జీవితములో నుండి నూతనమైన అనుగ్రహ జీవితములోనికి నడిపిస్తున్నాడు, సాధారణ నీటి కొరకై వచ్చిన ఆ స్త్రీకి జీవజలము అనుగ్రహిస్తున్నాడు, బహీనురాలైన ఆమెను బపరచుచున్నాడు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువునకును, సమరీయ స్త్రీకిని మధ్య జరిగిన సంభాషణను మనము చదువుతున్నాము. ఈ సంఘటన జరిగిన కాలంయొక్క చారిత్రక నేపధ్యమును గుర్తించినట్లయితే సమరీయులను అల్పులుగాను, పాపులుగాను, తక్కువవారిగాను యూదులు పరిగణించేవారు. ఆ స్త్రీని పలు కారణముల వలన ఒక బలహీనురాలుగా మనము పరిగణించవచ్చు. మొదటిగా ఆమె ఒక స్త్రీ (స్త్రీలను క్రీస్తు కాలములో అసలు వ్యక్తులుగా పరిగణించేవారు కాదు, మత్త 14:21), రెండవదిగా ఆమె ఒక సమరీయ జాతి మహిళ (యూదులు సమరీయుతో సంభాషించేవారు కాదు, యోహాను 4:9), మూడవదిగా చిన్నాభిన్నమైన ఆమె వివాహ జీవితం (ఐదుగురు భర్తలు, వేరొక పురుషుడు, యోహాను 4:18), నాలుగవదిగా ఇతరుల చేత దూషింపబడడం (అందువననే ఆమె ఒంటరిగా మిట్ట మద్యాహ్నవేళ బావి వద్దకు వచ్చెను).

అయితే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు ఈ సమరియ స్త్రీని కలవడం అనేది యాదృచ్ఛికంగా జరిగిన విషయమైతే మాత్రం కాదు. ఆ స్త్రీ యొక్క విచ్ఛిన్నమైన జీవితమును సరిదిద్ది, ఆమెను తన శిష్యురాలిగా చేసుకొని, ఆమెకు జీవజలము ఒసగటానికి యేసు క్రీస్తు నిర్ణయించుకొని ఆమెను రక్షింప వచ్చిన తరుణమది.

యేసు క్రీస్తు ప్రభువు అనాటి సాంఘిక నియమములకు వ్యతిరేకముగా (అతీతముగా) ప్రవర్తించి సమరయ స్త్రీని రక్షించుచున్నాడు. ఆమె యొక్క బహీనతలను, పాపమును తెలియజేసి ఆమెను పవిత్రురాలుగా మారుస్తూ ఉన్నాడు. బలహీనురాలిని బలవంతురాలుగా చేస్తున్నాడు. చివరకు ఆమెనే తన శిష్యురాలిగా ఉపయోగించుకుని ఆమెద్వారా ఆ గ్రామ ప్రజందరినీ కూడా తన దగ్గరకు ఆకట్టుకోగలిగాడు.

రెండవ పఠనములో కూడా పునీత పౌలుగారు రోమాపత్రిక 5:8 లో ‘‘మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించెను కదా! ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు’’ అని తెలిపాడు. ఇలా దేవుడు బహీనులైన మానవులను తన దివ్యశక్తి ద్వారా, ప్రేమ ద్వారా బలపరుస్తూనే ఉన్నాడు. జీవజలము ద్వారా అందరి దప్పికను తీర్చుతాడు. “యేసు ఆమెతో ఈ నీటిని త్రాగువాడు మరల దప్పిక గొనును. కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పిక గొనడు” (యోహాను 4:13) అని పలికారు. ఈ అనుగ్రహ కాలములో మనము ఆ జీవజలము ప్రభువునుండి పొందుకొనుటకు అరుదెంచుదాం. ఆయన మనలను క్షమించే దేవుడు, మనలను బలపరిచే దేవుడు, మన కోసం ప్రాణము అర్పించిన దేవుడు. మనలోని అవిశ్వాసమును, అంధకారమును, చెడును, బలహీనతను, దురలవాట్లను విడిచిపెట్టి జీవజలముతో పరిశుద్ధ పరచబడి ఆయన యొక్క ఆనందంలో పాలుపొందుదాం.

No comments:

Post a Comment