తపస్కాల మొదటి ఆదివారం
ఆ.కాం. 51:1-2, 3-4, 10-11, 12, 15. రోమా 5:12-19. మత్తయి 4:1-11.
మొదటి పఠనము: ఈనాటి మొదటి పఠనాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటవ భాగంలో మానవుడు ఎలా సృష్టింపబడినది, మరియు మానవుని ఉంచుటకు ఏర్పరిచిన ఏదేను తోటను గూర్చి కనిపిస్తుంది. ఆ తోటలో రెండు చెట్లను ప్రత్యేక లక్షణాతో దేవుడు రూపొందించాడు. మొదటిది, ప్రాణమిచ్చు చెట్టు, ఇది అమరత్వాన్ని అంటే జీవాన్ని ప్రసాదించే చెట్టు. ఈ చెట్టు పండ్లను తినవద్దని దేవుడు నిషేధించలేదు. అయినా, వారు దాని ద్వారా అమరత్వం పొందలేదు. రెండవది, మంచి చెడు తెలివినిచ్చు చెట్టు. ఈ చెట్టు పండును తినవద్దని దేవుడు ఆదేశించినా, వారు తినడంతో, వారు వినాశకరమైన ఫలితాను చవిచూశారు. దీని ఫలితమే ఈ నాటి మొదటి పఠనపు రెండవ భాగం. అదే మానవుని పతనము. మానవుడు సర్పము మాట విని, దేవుని ఆజ్ఞను లెక్కచేయకుండా, అవిధేయతతో, కన్నుల పండుగగా ఉన్న ఆ చెట్టు పండును తిని, పాపాన్ని ప్రవేశపెట్టారు. వారు ఆ పండును తినిన వెంటనే వారి ఆనంద మయమయిన స్థితిని పోగొట్టు కున్నారు. ఇలా మానవుని పతనం ప్రారంభమయింది.
రెండవ పఠనము: రెండవ పఠనంలో, ఆదాము- క్రీస్తును పోలుస్తూ పౌలు గారు క్రీస్తు ప్రాముఖ్యతను వెలుగులోనికి తెచ్చారు. ఆదాము పాపాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, మానవాళి దానిలో పాలుపంచుకునేటట్లు చేస్తే, క్రీస్తు దానినుంచి విముక్తిని ప్రసాదించాడు. పాపంద్వారా మరణం వచ్చింది, కాని క్రీస్తు ఉనికి వలన మానవునికి జీవం ఒసగబడినది. పౌలుగారి ప్రకారం మానవులంతా ఆదాము పాపంలో పాలుపంచుకున్నారు. ఆదాము చేసిన పాపం మరణానికి కారణమయితే, యేసు మరణం, పాపాన్ని జయించి, మానవునికి శాశ్వత ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. మనిషి పాపంతో నాశనమై, క్రీస్తు చేత రక్షింపబడ్డాడు.
సువార్త పఠనము: శ్రీసభ, ఈ సువార్త పఠనం ద్వారా యేసు, సాతానుచే శోధింపబడుటను గూర్చి ధ్యానించమని, ఈ కృపాకాలంలో మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రభువు పొందిన శోధనలను, ఆనాడు ఎడారిలో యిశ్రాయేలు ప్రజలు పొందిన శోధనలతో పోల్చవచ్చు. అయితే యిశ్రాయేలు ప్రజలు శోధనలను ఎదుర్కొనలేక పాపములో పడిపోయారు. కాని క్రీస్తు, దైవవాక్కును ఉపయోగించి వచ్చిన శోధనను ఎదుర్కొని మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘‘మనవలెనే అన్ని విధములుగా శోధింపబడి, పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు, యేసు’’ (హెబ్రీ 4: 15)
1). మనుష్యుడు కేవం రొట్టె వలననే జీవింపడు:
పై వాక్యం, మొదటి శోధనకు, ప్రభువిచ్చిన సమాధానం. ఆనాడు ఎడారిలో ఉన్న యిశ్రాయేలు ప్రజలకు ఇలాంటి శోధన ఎదురయింది. వారు ఆకలిగొనినపుడు, వారిని ప్రభువు ఆశ్చర్యకరంగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వారిని దాటేటట్లు చేశాడన్న విషయం కూడా మరచిపోయి, ఈజిప్టులో మాంసం భుజించుచూ ఎంతో సంతోషముగా ఉండేవారమని సణుగుకున్నారు. అప్పుడు యావే, అద్భుత రీతిలో స్వర్గం నుంచి మన్నా కురిపించి, తనకు అసాధ్యమైనది ఏమీ లేదని నిరూపించాడు. యిశ్రాయేలు ప్రజల వలె కాక, యేసు నలభై రోజులు ఉపవాసముండి ఆకలిగొనినపుడు సణుగుకొనక, దేవుని వాక్కును ఉపయోగించి శోధనను ఎదుర్కొన్నాడు. మనం కూడా మన దేహాన్ని కాపాడుకొనుటకు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కాని ఈ కృపా కాలం మనకు గుర్తు చేసే విషయమేమిటంటే, దేహాన్ని మించినది ఆత్మ. ఆత్మని కూడా మనం పోషించాలి. Our hearts are restless, till they rest in you. పాఠం: మనం కోరుకొనే ఈ భూసంబంధమైన వస్తువుల కన్నా దేవుడు మనకు ముఖ్యమని, దీనినే ఉపవాసం (దగ్గరవ్వటం) చూపిస్తుందని యేసు మనకు నేర్పిస్తున్నాడు.
2). నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను:
రెండవ శోధనకు ప్రభువిచ్చిన సమాధానం. యిశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక ప్రకారం యావే వారిని వాగ్ధాన భూమి వైపు మోషేను నాయకునిగా ఉంచి నడిపిస్తున్నపుడు, వారు ఆ వాగ్ధాన భూమిని త్వరగా చేరుకోలేకపోతున్నారనే ఆలోచన వారికొచ్చి, యావేపై విస్వాసముంచక, మోషే సినాయి పర్వతంపై ఉన్నపుడు వారంతా బంగారు దూడను ఆరాధించారు (నిర్గమ 32: 8). ఇలా యావే కోపానికి పాత్రులయ్యారు. యేసునకు ఇలాంటి సందర్భం ఎదురైనపుడు తను ఏమియూ ఆలోచింపక, ఈలోక రాజ్యానికి ఆశపడక, సాతానును ఆరాధించకుండా, కేవలం ప్రభువైన దేవునినే పూర్ణ మనస్సుతో ఆరాధించాని తెలియజేస్తున్నారు. పాఠం: ప్రార్ధన మరియు ఆరాధనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని యేసు మనకు భోదిస్తున్నాడు.
3). ప్రభువైన నీ దేవుని శోధింపరాదు:
మూడవ శోధనకు ప్రభువిచ్చిన సమాధానం. యిశ్రాయేలు ప్రజలు, స్వర్గం నుంచి మన్నా పొందిన తర్వాత, యావే వారికి కావసిన కోరికలన్నింటిని తీర్చాలని వారు భావించారు. మన్నా దొరికిన తర్వాత నీటి కోసం సణుగుకున్నారు. తరువాత అసలు యావే వారి మధ్య ఉన్నాడా? లేదా? అని సందేహించారు (నిర్గమ 17: 7). మరి యేసు, యిశ్రాయేలు ప్రజల వలె కాక, మోషే ఆనాడు యిశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటలను, సాతానుతో అంటున్నాడు. ఆ మాటలే పైనున్న వాక్యం, ‘‘ప్రభువైన నీ దేవుని శోధింపరాదు. దీని ద్వారా మనం గ్రహించాల్సిన విషయమేమిటంటే, ‘‘అద్భుతం జరగనంత మాత్రాన విశ్వాసం లేదని అర్ధం కాదు’’. పాఠం: అవసరమున్న వాటిని చూసుకొనుటకు, దేవుడు జోక్యం చేసుకుంటాడని, మనకు ఆపద లేని సమయంలో కూడ, ఆపద కల్పించుకొని, మనకు సహాయం చేయమని దేవుని పరీక్షింప రాదని యేసు మనకు గుర్తు చేస్తున్నారు.
సాతాను శోధనను ఎదుర్కొనటం ద్వారా క్రీస్తు, తన తండ్రి పట్ల తనకున్న ప్రేమ అన్నిటికంటే బలమని నిరూపించారు. శ్రీసభ మన నుండి ఈనాటి దివ్య పఠనా ద్వారా కోరేది ఇదే. మనం, క్రీస్తును ఆదర్శంగా తీసుకొని, శోధనను అధిగమించి, ప్రభు ప్రేమను గుర్తించి, అతని ప్రేమ బాటలో, అతని చిత్త ప్రకారం జీవించి, అతని ప్రణాళికను జరిగింప చేయాలి. మనం అనారోగ్యంతో బాధపడినప్పుడు, వైద్యుని దగ్గరకు వెళితే ఒక చీటిలో మందు రాసి వాటిని వాడమంటాడు. అలాగే మన ఆత్మకు ఎదుగుదల కావాలని, శోధనలను ఎదుర్కొనే శక్తి కావాలని శ్రీసభ, కృపాకాలంలో ఒక మందు చీటిని మనందరికీ ఇస్తుంది. ఆ చీటిలో ఉన్న మందులే: ప్రార్ధన, ఉపవాసం, దానధర్మాలు. వీటిని సాధనాలుగా మలచుకొని ప్రభు చిత్తప్రకారం నడుచుటకు ప్రయత్నిద్దాం.
No comments:
Post a Comment