యేసుకు సహాయం చేసిన అజ్ఞాత వ్యక్తులు

యేసుకు సహాయం చేసిన అజ్ఞాత వ్యక్తులు

యేసు చిన్నప్పటినుండి చేసిన సువార్త పర్యటనలు, పాదయాత్రలు, అద్భుతాలు జరిపినప్పుడు అనేకమంది వ్యక్తులు తోడ్పడినట్లు మనకు బోధపడుతుంది. గలెలియా, యూదయా, సమరియా ప్రాంత ప్రజలు యేసు వాక్యాన్ని ఆకించటంతో పాటు అద్భుత విధంగా వారి వ్యాధి బాధలు మాయమై స్వస్థత పొందుకోవడంతో అనేకమంది ప్రభువుకు తారస పడినారు.

తమ చివరిదినాల్లో అనామకులైన అజ్ఞాత వ్యక్తులు అనేక విధాలుగా తోడ్పడినట్లు క్రొత్త నిబంధనలో చదివి గ్రహింప గాలుగుతాం. యేసు జెరుసలేం పవిత్ర నగరంలోకి ప్రవేశించే ముందు అవసరపడిన ఒక గాడిద పిల్లను ఒక వ్యక్తి ఇచ్చి సహాయం చేశాడు. కొన్ని వందలమంది ప్రజలు ప్రభువు అభిమానులై వారిని ఊరేగిస్తూ ‘‘హోసాన్నా’’ అంటూ జయజయ ధ్వానాలు చేస్తూ నగరంలో ప్రవేశించి వారి ఘనతను చాటారు. అయిదు రొట్టెలు రెండు చేపలు దానంగా ఇవ్వడం ద్వారా ఓ కుర్రాడు పెద్ద అద్భుతం చేయడంలో ప్రభువుకు తోడ్పడ్డాడు. వారి పర్యటన బాటల్లో నీళ్లిచ్చినవారు అన్నం పెట్టినవారు తప్పకుండ ఉండి ఉంటారు.

యేసుప్రభువు పాస్క పండుగను ఆచరించడానికి జెరుసలేములో ఒక వ్యక్తి ఒక గదిని ఉచితంగా ఇచ్చాడు. యేసు రాత్రి వేళల్లో ప్రార్థన చేసుకోవడానికి తన స్వంత ఒలీవు తోటలోకి ప్రవేశించడాన్ని మరోవ్యక్తి ఉచిత తోడ్పాటు నందించాడు. యేసు సిలువ మోసేటప్పుడు కొంత దూరం ఆ సిలువ భారాన్ని సిరేనియా సీమోను మోశాడు, సాయపడ్డాడు. జెరుసలేము మహిళలు ప్రభువు సిలువ పాటు అన్యాయాన్ని చూసి ఏడ్చారు. ఓదార్పు మాటలు పలికారు. వెరోనిక అనే ఒక పుణ్య స్త్రీ ఉండబట్టలేక తన చేతి వస్త్రంతో ప్రభు ముఖారవిందాన్ని అద్దింది. అరిమత్తయ  యోసేపు అనే వ్యక్తి ఎంతో అభిమానంతో తనకోసం ముందుగా ఏర్పాటు చేసుకున్న సమాధిని యేసుప్రభు మృత కళేబరాన్ని ఖననం చేసేందుకు కానుక చేశాడు.

యేసు దివ్య శరీరాన్ని సిువపై నుండి జాగ్రత్తగా క్రిందికి దింపినవారు కొందరైతే, యూద సంప్రదాయానుసారం ప్రభు శరీరంకు పరిమళ ద్రవ్యాలు చల్లినవారు, పూసిన వారు మరికొందరు. నార వస్త్రం తెచ్చి భక్తితో ఆ పవిత్ర కాయంకు చుట్టిన భక్తులు మరి కొందరు. ఏమైతేనేమి యేసుపై కక్ష, ద్వేషం పెల్లుబికిన చోటనే అవ్యాజమైన ప్రేమ, సానుభూతి కూడ ప్రజల్లో మనం చూస్తాం.

అలాగే యేసు పవిత్ర ఆధ్యాత్మిక శరీరంగా ఉన్న శ్రీసభ పట్ల మన ఆదరణ ఆచరణ ఏమిటి? సహాయం సహకారాలేమిటి?

ధ్యానాంశం: నేను చెప్పునదేమన: మీరు ఆత్మయందు జీవింపుడు, శారీరక వాంఛను తృప్తిపరచుటకు యత్నింపకుడు. (గలతీ. 5:16-26 పఠింపుడు).

సోదరులారా! మంచి చేయుటయందు మీరు విసిగిపోరాదు (2 తెస్స. 3:13).

No comments:

Post a Comment