ఏడవ సామాన్య ఆదివారము, Year A

ఏడవ సామాన్య ఆదివారము, 19 ఫిబ్రవరి 2023
లేవీ. 19:1-2, 17-18; 1 కొరి. 3:16-23; మత్తయి 5:38-48
పవిత్రత - దాని ప్రతిబింబము

ఈనాడు మనం విన్న లేవీయకాండములోని 19వ అధ్యాయం చాలా ప్రాముఖ్యతను కలిగియున్నది. ఈ అధ్యాయం లేవీయకాండము అంతటికీ గుండెకాయ వంటిది. ఎందుకంటే, ఆ అధ్యాయమునందు ఇశ్రాయేలీయుల (మన) జీవితాలకు విలువైన పది ఆజ్ఞలు వివరింపబడి యున్నవి. అందులో ఈనాడు మనం విన్న వచనాలు (1-2, 17-18) ఇశ్రాయేలీయులు (మనం) దేవునితో, ఒకరికొకరితో ఉండవసిన సంబంధాన్ని, బాంధవ్యాన్ని వివరిస్తున్నాయి. ఈ వాక్యముల సందర్భమును, సందేశాన్ని తెలుసుకుందాం.

సందర్భం: ‘‘మీ దేవుడును, ప్రభువుడనైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు’’ (1-2). లేవీయకాండము మొత్తం ఇశ్రాయేలీయుల జీవన విధానానికి అవసరమైన నియమాలను గూర్చి చర్చిస్తుంది. ముఖ్యంగా 17వ అధ్యాయంనుండి 27వ అధ్యాయం వరకు ‘‘పరిశుద్ధత’’కు సంబంధించిన నియమాలు ఉన్నాయి. “నేను పవిత్రుడను కనుక మీరు పవిత్రులుగా ఉండండి’’ అని దేవుడు పిలుపు నిస్తున్నాడు. దేవుడు స్వతహాగా పరిశుద్ధుడు. అంతర్లీనముగా దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనం చేరుకోలేము. అలాగైతే, ‘‘పవిత్రులుగా ఉండండి’’ అనే దేవుని పిలుపును మనం ఎలా అర్ధం చేసుకోవాలి? లేవీయకాండమునకు ముందు దేవుడు ఇశ్రాయేలీయులకు పరిచయం చేసుకున్నప్పుడు, ‘‘నేను మీ ప్రభువుడను, దేవుడను, మిమ్ము ఐగుప్తు బానిసత్వంనుండి విడిపించిన వాడను’’ అని పరిచయం చేసుకొనేవాడు. ఇప్పుడు దేవుడు ‘‘నేను పవిత్రుడను’’ అని పరిచయం చేసుకుంటున్నాడు. అనగా ఐగుప్తులో ఇశ్రాయేలీయు చాలాకాలం అణచివేయబడి ఉండగా, వారు ఐగుప్తీయుల ఆహారపు అలవాట్లను మాత్రమేగాక, వారి ఆరాధన అలవాట్లను కూడా అలవర్చుకున్నారు. వారి దేవుళ్ళకు అలవాటు పడ్డారు. ఐగుప్తీయుల ఆలోచన విధానం, సామాజిక విధానము వలన ప్రేరేపితులైనారు. ఐగుప్తీయుల మనస్తత్వం వారిలో నాటుకు పోయింది. అందుకే దేవుడు వారిని భౌతికంగా ‘‘వేరు’’ చేసినట్లు, ఆధ్యాత్మికంగా వేరుపరుస్తున్నాడు. పరిశుద్దులుగా జీవించటంకోసం, వారి పాత అలవాట్లనుండి, పాత ప్రవర్తననుండి, పాత నడవడినుండి, పాత దైవాలనుండి వారిని ప్రత్యేక పరుస్తున్నాడు. ఆ ప్రత్యేకతను వారు తెలుసు కోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ప్రత్యేకపరచటం, వేరుపరచటం, పరిశుద్ధతలో జీవించడం అంటే ఏమిటి? పవిత్రుగా జీవించటం అనగా దేవునితో ఒడంబడిక చేసుకొని, ఆయనతో సంబంధం కలిగి జీవించడం, దేవుడు వారి మధ్యనున్నారని తెలుసుకొని జీవించడం. దేవుని ఆజ్ఞలద్వారా సమాజంలో సమానత్వం, న్యాయం జరిగించటం, దైవారాధనలో శుద్ధికలిగి జీవించటం. ఇవి పరిశుద్ధతయొక్క, పవిత్రతయొక్క క్షణాలు. ఈ నాలుగింటిలోని మూడవ అంశం 17,18 వచనాలో వ్యక్తపరచబడినది. అంటే, పరిశుద్ధత కలిగిన జీవితం, పవిత్రమైన జీవితం అంటే దేవునితో మాత్రమే సంబంధం కలిగి జీవించడం కాదు. దేవునితో సత్సబంధం కలిగియున్నామనే భావన పరుల ప్రేమలో, సోదర ప్రేమలో వ్యక్తపరచ బడాలి. ఈ నియమమే ధర్మశాస్త్ర సారము (లేవీ.19:18; గలతీ.5:14; రోమీ. 13:9, 10; యాకో.2:8).

సందేశం: నీవు దేవునితో సంబంధం కలిగి జీవించాలని అనుకుంటున్నావా? నీకు నీ దేవునితో ఉన్న సంబంధం అనుబంధం నీవు నీ తోటివారితో ఎలా జీవిస్తున్నావు అనే దానిలో వ్యక్తపరచాలి. దేవుని ప్రేమ, సోదర ప్రేమలో ప్రతిబింబించాలి. పవిత్రమైన దేవునితోగల సంబంధం ప్రతిమాటలో, అడుగులలో, ఆలోచనలో స్ఫురించాలి. ఈ సామాజిక బంధాల నాణ్యతే మనకు దేవునితోగల సంబంధాన్ని నిర్దేశిస్తుంది. నీ పవిత్రతను, పరిశుద్ధతను ఇతరులు అనుభవించ గలిగినప్పుడే నీకు దేవునితో కలిగిన సంబంధం నిర్ధారణ అవుతుంది. అందుకే పరిశుద్ధత అనేది నీ దినచర్యలో భాగం కావాలి. పవిత్రత నీ క్రియద్వారా ప్రకాశించాలి. ప్రేమించటం నీ జీవన విధానానికి ప్రాతిపదిక కావాలి. నిన్ను ప్రేమించు వారిని మాత్రమే కాదు. నీవంటే ఇష్టంలేని వారినికూడా ప్రేమించాలి, ఆదరించాలి. నీ పరిశుద్ధ జీవితం నీ శత్రువుకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ పొరుగువానిపై ప్రేమ నీకు దేవునిపట్ల కలుగు కృతజ్ఞతా కార్యంలా ఉండాలి. దేవుడు నీపై చూపించే ప్రేమకు నిదర్శనంగా ఉండాలి. ప్రేమ అనేది భారంలా కాకుండా బాధ్యతలా ఉండాలి. అదే ఆశీర్వాదకరమైన జీవితం. దేవుడు నీనుండి నానుండి కోరుకొనే పవిత్ర ప్రేమ.

No comments:

Post a Comment