ఆరవ సామాన్య ఆదివారము. 12 ఫిబ్రవరి 2023
సీరా. 15:15-20; 1 కొరి. 2:6-10; మత్తయి 5:17-37
జీవితంలో అన్నీ సానుకూలంగా జరుగునపుడు, జీవితం ఆనందకరంగా ఉన్నంతవరకు మానవుడు దానికి కారణం నేనే అని, నా శక్తియుక్తులద్వారా నేనే నా జీవితమును విజయవంతముగా మార్చుకున్నానని గొప్పులు పోతూయుంటాడు. కాని, అదే మానవుడు ఆ అనుకూల పరిస్థితులు కాస్తా ప్రతికూల పరిస్థితులుగా మారి తన జీవితం అస్తవ్యస్తంగా మారినట్లయితే దానికి కారణం మాత్రం దేవుడే అంటాడు. అలా అంటూ దేవుని దూషిస్తూ ఉంటాడు. దేవుడు లేడు అని, ఒకవేళ ఉన్నా చేతకానివాడు అని దేవునినుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈవిధంగా జీవించుచున్న చాలామందిని మనం చూస్తూ ఉంటాము. వారిని కారణం అడిగితే ‘దేవుడు నాకు ఏం చేసాడు?’ అని తిరిగి ప్రశ్నిస్తారు. వారి జీవితంలో జరిగిన అన్ని అనర్థాలకు కారణం దేవుడే అని అంటారు. ఈవిధముగా వారు భక్తిహీనులుగాను, నాస్థికులుగా మారి దేవుడు అనే గొప్ప శక్తినుండి దూరంగా వెడలిపోయి తమ జీవితమును ఇంకా దుర్భలముగా మార్చుకుంటున్నారు.
ఈనాటి మొదటి పఠనములో (సీరా.15:15-20) గ్రంథకర్త దేవుడు మానవునికి ఒసగిన స్వేచ్ఛను గురించి చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. “ప్రభువు నిప్పును, నీళ్లను కూడా నీ ముందుంచెను. చేయి చాచి వానిలో నీకు ఇష్టము వచ్చినది తీసుకొనుము. మృత్యువు, జీవముకూడా నరుని ముందట యున్నది. అతడు తాను కోరుకొనునది తీసికోవచ్చును.’’ మనం దేనిని ఎంచుకుంటామో దాని ఫలితమునే పొందుతాము. దేవుడు మానవునికి శక్తిని, యుక్తిని జ్ఞానమును, తెలివిని బహుమతులుగా ఇచ్చి, ‘ఇదిగో మీరు అభివృద్ధి పొందుడి, భూమి అంతటా వ్యాప్తి చెందుడి’ అని దీవించి ఇహలోకానికి పంపిస్తున్నాడు. ప్రస్తుతకాల అభివృద్ధిని చూసినట్లయితే మనము దానిని గ్రహించగలము.
కావలసినవన్నీ సమకూర్చి, అన్నీ అనుగ్రహించి, చివరకు నిర్ణయించుకునే స్వేచ్ఛ మాత్రం మానవునికే ఇచ్చియున్నాడు. ఒకవేళ దేవుడు తానే మనము ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏమి తినాలో, అని అన్నీ నిర్ణయించి యున్నట్లయితే సకల జీవాజీవరాశులకు మానవునికీ ఎటువంటి వ్యత్యాసమూ ఉండేది కాదు. ఈ మానవ మనుగడ మరోవిధంగా ఉండేది. ‘నిర్ణయించుకోవడం’ అనే గొప్ప విషయం దేవుడు మనకు ఇచ్చిన గొప్పవరం. కొంతమందికి ఈ వరమును ఉపయోగించుకోవడం రాక గొర్రెమందలవలె ఏమీ నిర్ణయించుకోలేక, ‘అందరూ చేస్తున్నారు అందుకే నేను కూడా అలానే చేస్తాను’ అని తమకంటూ ప్రత్యేకతలేక, అభివృద్ధిలేక, ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్నట్లు పుట్టినప్పటినుంచి చనిపోయే వరకూ ఒకే విధమైన ఆర్థిక, సాంఘిక, మానసిక, ఆధ్యాత్మిక పరిస్థితులో జీవిస్తున్నారు. కొంతమంది చెడునిర్ణయాలను తీసుకుంటూ వారి జీవితమును దుర్భలము చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఇతరు ప్రభావముల వలన కూడా మన జీవితం నాశనం కావచ్చు. కానీ అది కొద్ది శాతం మాత్రమే. అధిక శాతం మన జీవిత విధానం మనం తీసుకునే నిర్ణయము మీదే ఆధారపడి ఉంటుంది. అది ఆధ్యాత్మిక జీవితమైనా, ఆర్థిక జీవితమైనా, శారీరక జీవితమైనా! నీ జీవితంలో మార్పు కోరుకుంటున్నావా? అభివృద్ధిని కోరుకుంటున్నావా? నిర్ణయించు కోవసినది నీవే! ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నావు? నిర్ణయించు కోవలసినది నీవే! ఏమి చేయాలను కుంటున్నావు? నిర్ణయించుకోవలసినది నీవే! దేవుడు మనకు శక్తిని, యుక్తిని, అన్ని వనరులను ఇస్తున్నాడు. నిర్ణయం మనదే! ఎటువంటి జీవితమును కోరుతున్నావు? జీవమా? మరణమా? అభివృద్ధా? పతనమా? మంచా? చెడా? పాపమా? పుణ్యమా? సోమరితనమా? చురుకుతనమా? దైవమా? దెయ్యమా? పరలోకమా నరకమా? దేవుడు మనలను ఏకాకులుగా వదిలిపెట్టలేదు. ప్రవక్తలద్వారా, బైబిల్ గ్రంథంద్వారా మనలను నడిపిస్తూ ఉన్నాడు. సరైన నిర్ణయము తీసుకోవటానికి మనలను నిరంతరమూ తన వాక్కుద్వారా బయలుపరచు చున్నాడు. తన దివ్యశరీర రక్తములతో మనకు ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించుచున్నాడు. జీవమును ఒసగుచున్నాడు. కాని తన వద్దకు వచ్చు నిర్ణయము నీదే.
Very meaningful. The best gift of God to humanity is FREE WILL
ReplyDeleteVery good father
ReplyDeleteThank you very much father for this meaning full preaching
ReplyDeleteThank you father
ReplyDelete