ఐదవ సామాన్య ఆదివారము, Year A

ఐదవ సామాన్య ఆదివారము, 05 ఫిబ్రవరి 2023
యెషయా 58:7-10; 1 కొరి. 2:1-5; మత్తయి 5:13-16

ఉదయం నిద్రలేచినప్పటినుండి రాత్రి నిద్రపోయేవరకు ఎన్నోమాటలు మాట్లాడుతూ ఉంటాము. వాగ్దానాలు, ప్రమాణాలు చేస్తూ ఉంటాము. ఇచ్చిన మాటను నెరవేర్చినప్పుడు, మనకు, మన మాటలకు విలువ, గౌరవము ఉంటుంది. క్రైస్తవజీవితం మాటల్లోగాక, చేతల్లోనున్నదని, ఏవో కొన్నిసత్యాలను నమ్మి, కొన్నిచట్టాలను పాటించుట మాత్రమే కాదని, మనం ప్రకటించే విశ్వాసానికి జీవిత విధానానికి మధ్య సంబంధంయున్నదని, ప్రార్ధనకు ప్రవర్తనకుమధ్య పరస్పర సంబంధంయున్నదని పరిశుద్ధ పఠనాలు తెలియజేయు చున్నాయి.

మొదటి పఠనము: ప్రార్ధనకు జవాబు దొరుకుటలేదు ఎందుకని? సామాజిక విలువలగురించి, మానవత్వపు విలువలగురించి, చాలాసార్లు వినియుంటాము: ‘ఆపదలోనున్న వారిని ఆదుకొనుట మానవ ధర్మమని’, ‘ఆకలితో ఉన్నవానికి అన్నమే పరమాత్మ’ అని, ‘అన్నదాత సుఖీభవ’ అని, ‘ఆకలితోనున్నవానిని ఆపదలోనున్నవానిని ఆదుకునేవాడే మనిషి’ అని, ‘మానవ సేవే మాధవ సేవ’ అని ‘చేసుకున్నవానికి చేసుకున్నంత మహాదేవ’ అని, ‘మనము ఇతరుకు చేసిన పుణ్యం మనకే తిరిగి వస్తుంది’. కాని చాలా వరకు ఇవన్నియు మాటలకు మాత్రమే పరిమితం, మనస్సులో ఉండవు (మత్త.15:8). సోదర ప్రేమ లేనివాడు దేవుడిని ప్రేమింపలేడు (1 యో.4:20). దైవ ప్రేమ, సోదర ప్రేమ అనునవి రెండు ప్రధానమైన ఆజ్ఞలు (మ. 22:36-40). ఇవి పాటించకుండా ఎంతగా ప్రార్దించినను ఫలితము మాత్రము శూన్యము, దేవుడు చెప్పినట్లు చేయకుండా ఎంతగా ప్రార్దించినను ఫలితం శూన్యము (లూకా.6:46). ప్రార్ధించే పెదవులకన్న సాయం చేసే చేతులు మిన్న (మదర్‌ తెరెసా). ఆపదలో ఉన్నవారిని, మన సహాయము అర్ధించిన వారిని ఆదుకోకుండా, సహాయం చేయకుండా తియ్యని మాటలు చెప్పినా, ప్రార్ధించినా ఫలితం శూన్యము (యాకో.2:14-17). దేవుడు చెప్పిన పుణ్య క్రియలు (యెష.58:7,10) చేయకుంటే దేవుడు మన ప్రార్ధనకు సమాధానం ఇవ్వరు. ఇతరును ఆదుకుంటే, దేవునిని ఆదుకున్నట్లే (లూకా.10:36-37). దయామయులు దేవుని దయను పొందుదురు (మత్త.5:7). పేదవానిని ఆదుకున్నచో ప్రభువునకే అప్పు ఇచ్చినట్లు. ఆ అప్పును ఆయన తప్పక తీర్చును (సామె.19:17). ప్రవక్తకులకు దేవుని సేవకులకు సహాయం చేస్తే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది (మత్త.25:34-40). అడిగిన ప్రతివానికి ఇస్తే (లూకా.6:30), బాప్తిస్మ యోహాను చెప్పినట్లుగా (లూకా 3:10-14) చేస్తే అప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది (యెష.58:8), మన ప్రార్ధనను ఆకించి (యెష.58:9), అంగీకరించి, ఆశీర్వదించి జవాబు ఇస్తారు.

సువార్త పఠనము: ఉప్పు, దాని సహజగుణము అందరికి తెలిసినదే! ఉప్పుకు మూడు గుణాలుంటాయి: రుచినిచ్చేగుణం: క్రైస్తవుడలుకూడా మానవ జాతికి రుచినివ్వగగాలి. కష్టాలు, శ్రమలు, బాధల కారణంగా చాలామందికి జీవితంపై విరక్తిపుడుతుంది. జీవితం దుర్భలంగా మారుతుంది. పరిస్థితులు ఎలాయున్నా, క్రైస్తవ విశ్వాసం జీవితానికి రుచినివ్వలగదని (యోబు మాదిరిగా) నిరూపించాలి. శుభ్రపరచేగుణం: జ్ఞానస్నాన సాంగ్యములో నీటిని ఆశీర్వదించుటలో, నీటి-ఉప్పు కయికద్వారా, గురువు ప్రార్ధనద్వారా దేవునిశక్తిని తీర్దాలు పొందుకుంటాయి. ఈ తీర్ధమును ఉపయోగించినప్పుడు ప్రజలు, వస్తువులు, స్థలాలు పవిత్రపరపబడతాయి. ఈ తీర్ధమును చిలకరించినప్పుడు, సైతానుశక్తులు నశించిపోతాయి. ప్రస్తుత సమాజములో ప్రజలమధ్య నైతికవిలువలు దిగజారిపోతున్నాయి. అపరిశుద్దత పేరుకుపోతుంది. పాపం పండిపోతుంది. క్రైస్తవులు పరిశుద్ధమైన ప్రవర్తనతో, ఆధ్యాత్మిక, నైతిక విలువలను పరిరక్షించాలి. దేవునిద్వారా పరిశుభ్రపరచే శక్తిలా యుండాలి. నిలువపరచేగుణం: ఉప్పుకి ఆహారపదార్ధమును పాడవకుండా కాపాడేగుణం, నిలువచేసేగుణం యున్నది. క్రైస్తవులుకూడా తాము పాడవకుండా తమ చుట్టూ మంచి వాతావరణాన్ని కలుగజేసి, పతనంగాకుండా ఉండేటట్లు చూడాలి. వెలుగు: ‘‘మీరు లోకమునకు వెలుగైయున్నారు’’ (మత్త.5:14). “మీ వెలుగును ఇతరులముందు ప్రకాశింపనిండు’’ అని ప్రభువు పలుకుచున్నారు. ఈ వెలుగును మనమందరం జ్ఞానస్నానములో స్వీకరించి యున్నాము. ప్రభువు జగతికి జ్యోతి (యోహా.8:12-20). “క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు’’ (జ్ఞానస్నాన సాంగ్యం). ఈ వెలుగు (క్రీస్తు) అన్యులకు దేవుని మహిమను ఎరుకపరచే వెలుగు (లూకా.2:32). “నీ వాక్యము (ప్రభువు) నా పాదములకు దీపము. నాత్రోవకు వెలుగు’’ (కీ.119:105). జ్ఞానస్నానములో మనం స్వీకరించిన దీపిక - విశ్వాస దీపిక, విజ్ఞాన దీపిక. ఈ దీపిక ఎల్లప్పుడూ వెలుగుతూ యుండాలి. ప్రభువునందు విశ్వాసముంచి ఆయన త్రోవకు వెలుగుగా (కీ.119: 105) మనలను నడిపిస్తుండాలి. ప్రభువునకు లోబడి జీవిస్తూ ఆయననుండి ఆదరణ పొందుకుంటూ జీవించాలి. సత్కార్యము-దేవుని మహిమ: ఏదైనా ఒక మంచి పనిని చేస్తే వచ్చేటువంటి పేరు మనకు, మన తల్లిదండ్రులకు, మన కుటుంబమునకు వస్తుంది. అదేవిధముగా, దేవుని బిడ్డలుగా ఆయనను మహిమపరచాలి. అందుకుగాను, దేవుడు చేయమని చెప్పిన పుణ్యక్రియలు, సత్కార్యములు కొన్ని (యెష.58:7,10; లూకా.3:10-14; 6:30, మత్త. 25:34-40) చేయుటద్వారా మనం దేవుని మహిమ పరచెదము. మన కర్తవ్యము: దేవుని మహిమార్ధము సత్క్రియలు చేయాలి (మత్త.5:16). మనద్వారా దేవుడు చేసే మేలులకుగాను, దేవుని స్తుతించాలి. మనద్వారా దేవుని ఆత్మశక్తిని పనిచేయనివ్వాలని ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు ప్రబోధిస్తున్నారు. మన క్రియలు, ఉపన్యాసము మరియు విశ్వాస ప్రకటన అంతయు దైవాత్మ శక్తిద్వారానేనని, మన విశ్వాసము మానవ వివేకముపైగాక, దేవునిశక్తిపై నిలిచియున్నదని ప్రకటించాలి. మానవ ప్రేమను, సోదర ప్రేమను కలిగి జీవించాలి. మన విశ్వాసమును మాటలకు మాత్రమే పరిమితంగాకుండా క్రియారూపకముగా ప్రకటించాలి.

No comments:

Post a Comment