బాలయేసు సమర్పణ పండుగ (నాలుగవ సామాన్య ఆదివారం), Year A

సమర్పణ జీవితం - దైవీక జీవితం 


ఈలోక ప్రజ జీవితం రెండు రకాలుగా ఉంటుంది. ఒకరకమైన జీవితమేమనగా శరీరానుసారముగా జీవించి, లోక ఆశలకు గురియై, ఒక దినమున మట్టిలో కలిసిపోయి ఏ ప్రత్యేకత లేకుండా జీవించే జీవితం. రెండవ రకమైన జీవితమేమనగా దేవునికి మన జీవితాలను సంపూర్ణముగా సమర్పించుకొని, ఆత్మానుసారముగా నడిపించ బడినట్లయితే, దివ్యలోకపు జీవితమును ఈలోకములోనే జీవించవచ్చును. పవిత్ర లేఖనాల్లో ఇలా జీవించిన కొందరు వ్యక్తులను గూర్చి ధ్యానం చేద్దాం.

అన్నా తన కుమారుడైన సమూయేలును సమర్పించుట
కుమారుడైన సమూయేలును దేవునికి సమర్పించిన అన్నా, ‘‘నేను ఈ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువునకే ఊడిగము చేయుచుండును’’ అని పలికింది. ఈ అర్పణద్వారా సమూయేలు, దేవుడు తన పేరు పెట్టి పిలిచే ఆ స్వరమును వినగలిగాడు (1 సమూ. 3:8). ఆ గొప్ప అర్పణద్వారా ఆ చిన్న సమూయేలు, గొప్ప ప్రవక్తగా మారాడు.

యేసు ప్రభుని దేవాయములో సమర్పించుట
యేసు ప్రభువు, దేవుడే అయినప్పటికిని, శరీరరూపం దాల్చారు. కావున దేవునికి సమర్పించుటకు, ఆయన దేవాలయమునకు కొనిపోబడ్డారు (ూకా 2:22). తల్లిదండ్రులు యేసు ప్రభుని దేవునికి సమర్పించినప్పుడు సిమియోను, అన్నా అనే ఇద్దరు ప్రవక్తలు పరలోకమునకు చెందినటువంటి ప్రవచనమును యేసు ప్రభువు పొందగలిగారు. తత్ఫలితముగా, ‘‘యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుచు దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానమును పొందుచుండెను’’ (లూకా 2:52) అని పరిశుద్ద గ్రంథం పలుకుచున్నది.

యేసు ప్రభువు యొక్క అర్పణ జీవితం
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక తెలియ జేయునదేమనగా, ‘‘భూలోకమున ప్రవేశించినపుడు, నీవు జంతు బలులను, అర్పణలను కోరలేదు. కాని నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి...ఓ దేవా! నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చియున్నాను (10:5-7). అది మొదలుకొని యేసు ప్రభువు తన ఇహలోక శారీరక జీవితమంతా నిరంతరము తండ్రికి అర్పించుచూనే ఉన్నారు. అందుకు బహుమానముగా, ‘‘పవిత్రాత్మతో, శక్తితో దేవుడు నజరేయుడు యేసును అభిషేకించుట వలన ఆయన అంతటను పర్యటించుచు, మేలు చేయుచు, పిశాచ శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరచెను’’ (అ.కా. 10:38).

సజీవ యాగముగా మనను మనం సమర్పించుకొనుట
పునీత పౌలుగారు మనకు విన్నవించునదేమనగా, ‘‘పరిశుద్ధమును, దేవునికి ప్రీతికరము అయిన సజీవయాగముగ మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడు’’ (రోమీ 12:1). పరిశుద్ధ గ్రంథంలో యేసు మరియు ఇతర పునీతులు ఉదాహరణను అనుసరిస్తూ, మన శిరస్సునుండి అరికాళ్ళ వరకు మన శరీరమును దేవునికి సమర్పించుటకు మనం కృషి చేద్దాం. మనలను మనం దేవునికి సమర్పించు కొనినప్పుడు, ఆయన తిరిగి మన శరీరమును, పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి, పైనుండి అన్ని ఆధ్యాత్మిక బహుమానములను ఒసగి, దైవీక జీవితములో మనకు భాగస్వామ్యమును ఒసగుతారు. ఈ ప్రపంచ జీవితములో, దైవీక ప్రపంచముతో మన సంబంధమును ఏర్పరచుకొనుటకు మన శరీరమును దేవునికి అర్పించుకొంటూ, మన ప్రభువగు యేసుక్రీస్తు రాకడ వరకు మన ఆత్మను, ప్రాణమును, శరీరమును సమస్త వ్యక్తిత్వమును దోషరహిత మొనర్చుకుందాం (1 తెస్స 5:23). తద్వారా, ఈలోకములో మనమందరం దేవునికి ప్రీతిపాత్రమైన జీవితాన్ని అవలంబిస్తూ, మన సమయాన్ని, మన శక్తిని ఇతరుల కొరకు సమర్పించుకుందాం. అంతిమంగా, మన జీవితాలను దేవునికి, ఆయన విశ్వాసులకు సమర్పించుకుందాం. మన జీవితాన్ని ఈ లోకములో దైవీకరణం చేసుకుందాం.

No comments:

Post a Comment