రెండవ సామాన్య ఆదివారము
యెషయ 49:3,5-6; 1 కొరి. 1:1-3; యోహాను 1:29-34
యెషయ 49:3,5-6; 1 కొరి. 1:1-3; యోహాను 1:29-34
ఇదిగో! లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల!
ప్రియ చదువరీ, ‘‘క్రీస్తు బప్తిస్మ మహోత్సవం’’తో దివ్యార్చనలోని సామాన్య కాలములోనికి ప్రవేశించియున్నాము. తిరుసభ క్రమము ప్రకారము సామాన్యకాలపు ధ్యానాంశము ‘‘రక్షణ చరిత్ర’’. అది ఈనాటి దివ్యగ్రంథ పఠనములో మనకు చాలా స్పష్టముగా కనిపిస్తుంది. ఈ రెండవ సామాన్య ఆదివారమున క్రీస్తు మరియు బప్తిస్త యోహాను మధ్య జరిగిన చక్కని సన్నివేశమును సువిశేషము చిత్రీకరిస్తుంది. రక్షకునికి ఆయన యొక్క నిజసాక్షికి మధ్య జరిగిన సంభవం.
మెస్సయా గురించి ప్రవచనం
మొదటి పఠనములో, యెషయా ప్రవక్త పలికిన ‘భాదామయ సేవకుని’ రెండవ ప్రవచనమును మనము చదువుచున్నాము. ఈ ప్రవచనము ఇస్రాయేలీయులు బాబిలోనియా బానిసత్వములోనున్న సమయములో యెషయాద్వారా ప్రవచించబడినవి. యావేదేవుడు వారికి ‘‘మెస్సయా’’ద్వారా రక్షణను వాగ్ధానం చేయడంద్వారా తనమీద వారికి నమ్మకమును బలపరచుచున్నాడు. తరువాత కొద్దికాములోనే దేవుడు వారిని బాబిలోనియా చెరనుండి విముక్తి చేసాడు, ఆతరువాత అబ్రహామునకు వాగ్ధానము చేయబడిన ‘‘మెస్సయా’’ద్వారా కూడా విముక్తి చేయబోవుచున్నాడు.
యేసుక్రీస్తే ప్రవచింపబడిన మెస్సయా
రెండవ పఠనములో క్రీస్తునందు పరిశుద్ధులుగా చేయబడిన ఇస్రాయేలీయులకును, అన్యులకును అపోస్తుడైన పౌలుగారు దేవుని ఆశీస్సులను తెలియజేయుచున్నారు. అయితే ఆరంభ ఆశీర్వచనములో పాతనిబంధనలో తండ్రిచేత ప్రవచించబడిన ఆ యేసుక్రీస్తు ద్వారానే అందరూ రక్షింపబడి, పరిశుద్ధ పరచబడినారు’ అని వ్రాస్తూ మెస్సయాకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ‘‘మన తండ్రి దేవునినుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము, శాంతి భించునుగాక’’ (1 కొరి.1:3).
మెస్సయాకు ప్రత్యక్ష సాక్షి: బప్తిస్త యోహాను
ఈ విధంగా రెండు పఠనములు యేసు క్రీస్తే తండ్రిచేత ప్రవచించబడి, పంపబడిన ‘‘మెస్సయా’’గా మనకు తెలియ జేస్తున్నాయి. మరి సువిశేషములో బప్తిస్త యోహాను అధికార పూర్వకముగా, మెస్సయా గురించి పూర్తిగా తెలిసినవాడిగా, జనసంద్రములో ఒక సామాన్యుడిలా కసిపోయి, పాపులలో ఒకడిలా తనచేత బప్తిస్మము పొందుటకు వరుసలో నిల్చొనియున్న సాధుశీలుడు, వినమృడైన యేసు క్రీస్తును చూసి అతడే ప్రవచించబడిన మెస్సయాగా, రానున్న లోకరక్షకునిగా గమనించి, గుర్తించి, ఎలుగెత్తి సాక్ష్యమిచ్చుచున్నాడు. ‘‘ఇదిగో లోకపాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల’’ (యోహాను 1:29).
బప్తిస్త యోహానుయొక్క ఈ సాక్ష్యమును రెండు రకాలుగా దృఢపరచవచ్చు లేదా అది నిజసాక్ష్యమని నిరూపించవచ్చు. మొదటిగా అతని సాక్ష్య విషయముయొక్క స్పష్టత, రెండవదిగా అతడు సాక్ష్యమిచ్చే విధానము. మొదటగా అతడు సాక్ష్యమిచ్చే విషయమును గమనిస్తే, బప్తిస్త యోహాను యేసుక్రీస్తును ‘‘లోక పాపమును పరిహరించు దేవుని గొర్రెపిల్ల’’గా గుర్తించుచున్నాడు. క్రీస్తు చేయబోయే రక్షణ బలియాగమును ముందుగానే ప్రవచించుచున్నాడు (అందుకేనేమో నలుగురు సువిశేషకులు, మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను వారి సువిశేష గ్రంథమును బప్తిస్త యోహాను యొక్క వాక్కుతో ప్రారంభించు చున్నారు). ‘‘గొర్రెపిల్ల’’ రక్షణ అను అంశమును తెలియజేయును. ఎలా అంటే, ఇస్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వమునుండి పొందిన విముక్తికి చిహ్నముగా గొర్రెపిల్ల బలిగా అర్పించబడిరది. అదేవిధంగా గొర్రెపిల్లను మెస్సయాకు చిహ్నముగా యెషయా ప్రవక్త ప్రవచించియున్నాడు, ‘‘...అతడు వధ్య స్థానమునకు కొనిపోబడు గొర్రెపిల్లవలె, ఉన్ని కత్తిరింపబడు గొర్రెపిల్లవలె మౌనముగా ఉండెనేకాని, నోరు తెరువలేదు’’ (యెషయ 53:7). గొర్రెపిల్లను మరల విజయమునకు గుర్తుగా దర్శన గ్రంథములో లిఖించబడినది అని మనము గమనించవచ్చు. ‘‘చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది’’ (దర్శ. 5:1-13). యుగాంతమున ఆ గొర్రెపిల్ల పాపమును, చెడును పూర్తిగా ధ్వంసం చేయును.
ఒక సాధు, బలహీన జంతువైన గొర్రెపిల్ల ఎందుకు రక్షణ చిహ్నముగా తీసుకోబడినది అని మనకు సందేహము రావచ్చు. అది శాంతికి, సహనమునకు, వినయమునకు గుర్తు. అది ఎన్నడూ యుద్ధమునకు కాలు దువ్వదు, కోరలు చూపించి, పంజా విసరదు. వినయముతో తలదించుకొని ఉంటుంది.
‘గొర్రెపిల్ల’ అను పదం పలుసార్లు మనకు నూతన నిబంధనలో క్రీస్తును ఉద్దేశించినట్లుగా మనము గమనించవచ్చు. అతడు ఖయ్యముకు ఎన్నడూ కాలు దువ్వలేదు. తాను భరించాడే కాని ఇతరులకు భారము కాలేదు. తలవంచి సహించాడే కాని తలెత్తి దూషించలేదు. క్రీస్తు నిజముగా ఒక గొర్రెపిల్లవలె తననుతాను తగ్గించుకొని, చివరకు మరణము వరకు తలవంచి విధేయుడిగా, వినయముతో మన పాపముల పరిహారమునకై వధింపబడనున్న మెస్సయా అని బప్తిస్త యోహాను గుర్తించి సాక్ష్యమిచ్చాడు, ఎలుగెత్తి చాటాడు. అందుకే అతని సాక్ష్యము నిజమైనది, దృఢమైనది, పరిపూర్ణమైనది.
రెండవదిగా అతడు సాక్ష్యమిచ్చే తీరును గమనిస్తే: సువిశేషకుడు యోహాను, బప్తిస్త యోహానును పెండ్లికుమారుని స్నేహితునిగా మనకు చూపించుచున్నాడు. ‘‘నేను క్రీస్తును కానని, ఆయనకంటె ముందే పంపబడినవాడనని నేను చెప్పిన మాటకు మీరే సాక్ష్యులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లి కుమారుని మిత్రుడు ఆయన చెంతనుండి ఆయన చెప్పినట్లు చేయును. ఆయన స్వరమును వినినపుడు మిక్కిలి ఆనందము పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది’’ (యోహాను 3:28-29). బప్తిస్త యోహానుయొక్క సాక్ష్యము పూర్తిగా యేసుక్రీస్తు మీదనే కేంద్రీకరించబడినది. యేసుక్రీస్తును అందరికీ చూపించి తాను ప్రక్కకు తొలగుచున్నాడు. క్రీస్తును హెచ్చించి తాను తగ్గించుకొనుచున్నాడు. ‘‘ఆయన హెచ్చింప బడవలయును. నేను తగ్గింప బడవలయును’’ (యోహాను 3:30). అందుకే బప్తిస్త యోహానుయొక్క సాక్ష్యము దృఢమైనది. ఇదీ ఒక నిజసాక్షి సాక్ష్యమిచ్చు విధానము. సాక్షులు గొప్ప కాదు. వారి సాక్ష్యము గొప్పది.
ఈవిధంగా ఈనాటి సువిశేషము ప్రతి క్రైస్తవుడు అనుసరించవలసిన చక్కని ఉదాహరణను మనకు ఇచ్చుచున్నది. బప్తిస్త యోహానువలె యేసుక్రీస్తే నిజమైన, సజీవుడైన, లోకరక్షకుడైన మెస్సయా అని గుర్తించి, విశ్వసించడం. దివ్యగ్రంథము, సత్యోపదేశ పుస్తకము, తిరుసభ రచనలు, లేఖలు చదవడంద్వారా తగిన దైవజ్ఞానమును సంపాదించుకోవాలి. అపుడే మన సాక్ష్యజీవితమునకు బలము చేకూరుతుంది. అపుడే మనము నిజముగా, అధికారపూర్వకముగా మన సత్య, సజీవదేవునికి సాక్షులమవుతాం. మనము కేవలము పెండ్లికుమారుని స్నేహితులం మాత్రమేనని, క్రీస్తే మన ‘కేంద్ర బిందువు’ అని, మనం కేవలం సాక్షులమేనని, క్రీస్తు హెచ్చించబడి మనము తగ్గించబడాలని తెలుసుకొని, ఆచరించుదాం. మనము ఆయన అయోగ్య సేవకులమని గుర్తెరిగి ఆయనను, ఇతరును ప్రేమించుదాం. క్రీస్తు రక్షణలో భాగస్థులమవుదాం. రక్షణను పొందుకుందాం!
No comments:
Post a Comment