మూడవ సామాన్య ఆదివారము, Year A
చీకటిని చీల్చే వెలుగు!
మొదటి పఠనంలో యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను
గురించి ప్రస్తావించిన
ప్రవచనాలను వింటున్నాము. వారి సామాజిక, ఆర్ధిక, మరీముఖ్యంగా ఆధ్యాత్మిక స్థితిగతులను ప్రతిబింబిస్తుంది.
వారి మనసులు, హృదయాలు
కల్మషం చెందడం వలన వారి జీవితాలు అధోగతిని సూచిస్తున్నాయి. ఈ అంశాన్ని మనం అర్ధంచేసుకోవాలంటే,
సందర్భం తెలుసుకోవాలి. ఆ స్థితిగతులను మనం అవగాహన చేసుకోవాలి.
అది మన జీవితాలకు మార్గదర్శకం కావాలి.
ఈనాటి వాక్యభాగం యెషయా గ్రంథంలోని మొదటిభాగం (1:1-35, 36:1-39:8, 40:1-66:24) నుండి
తీసుకోబడినది. ఈ భాగములో ప్రజల మరియు రాజు అధోగతిని తెలియజేస్తూ, దేవునివైపు మరలమని యెషయ ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. కాని అతని మాటలను
ప్రజలు, రాజు పెడచెవిన పెడుతున్నారు.
తద్వారా దేవుని ఆగ్రహమునకు గురవుతున్నారు. వీరు దేవునిమాట వినకుండా, లక్ష్యపెట్టకుండా, దేవుని మాటను, ప్రవక్తలను అలక్ష్యముచేసి దేవుని మార్గమును విడచిపెట్టి ఆలోచనా
రాహిత్యముతో జీవిస్తున్నారు. అంతేకాదు, దైవాజ్ఞకు
విరుద్ధంగా, వారు తమ భవిష్యత్తును తెలుసుకొనుటకు
సోదెకాండ్రను, మాంత్రికులను, భూతములను,
మృతులను (8:19) సంప్రదిస్తున్నారు. కష్ట, క్లిష్ట
పరిస్థితులలో వారు దేవుని వైపునకు మరలకుండా, దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా, దేవునికి
మొరపెట్టుకొనక, ప్రవక్తలను సంప్రదించకుండా, వారి ఇష్టము వచ్చినట్లుగా చేస్తున్నారు.
వారు పదేపదే ఈవిధముగా చేయటం వలన దేవుని ఆగ్రహానికి గురవుతున్నారు. ఎప్పుడైతే, వారు దేవుని తిరస్కరించడం
ఆరంభించారో, తమ ఇష్టం వచ్చినట్లు జీవించడం ఆరంభించారో, అప్పుడే వారికి కష్టాలు ఆరంభమయ్యాయి.
అసంతృప్తి, ఆందోళన,
నిరుత్సాహం వారి జీవితాలను, హృదయాలను
పూరించాయి. కష్టాలలో కలుగు ఆవేదనలో,
పాలకులను, దేవుని శపిస్తున్నారు (8:21).
ఈ పరిస్థితులలో వారికి విషాదము, చీకటితప్ప
ఇంకేమి కనిపించటం లేదు (8:22). ఈ కారణమున వారు అంధకారమున
చిక్కుకున్నారు. వారి
జీవితాలలో, హృదయాలలో
చీకటి అలుముకున్నది. చీకటిలోనున్న వ్యక్తిని తాను ఎక్కడ ఉన్నాడో, ఎటు వెళ్తున్నాడో, ఏ దారిలో నడుస్తున్నాడో తెలియదు. ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. అంతా
అయోమయం, గందరగోళం. ఇటువంటి దుస్థితిలో 8వ అధ్యాయం ముగుస్తుంది. కాని దేవుని ఆగ్రహం కలకాలం ఉండదు. ఆయన అనుగ్రహం చిరకాలం ఉంటుంది. (కీ.30:5) అందుకే, యెషయా ప్రవక్త 9వ అధ్యాయం ఆరంభములోనే అంధకారంలో
నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచెదరు (9:2), గాడాంధకారములోనున్న వారికి ఒక జ్యోతి ప్రకాశించును అని గొప్ప ఆశను కలిగిస్తున్నాడు. దేవుని
రక్షణ ప్రణాళికను ప్రవక్త వారికి తెలియజేస్తున్నాడు. వెలుగులోనికి రమ్మని వారిని
ఆహ్వానిస్తున్నాడు. వెలుగులాంటి మాటను విని,
మార్గదర్శకంగా మార్చుకోమని వారికి పిలుపునిస్తున్నాడు. ఈ యెషయా ప్రవక్త
ప్రవచనము యేసు రాకతో నెరవేరింది. “అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును
చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను” (మత్త. 4:16).
ఇశ్రాయేలీయుల జీవితం మనకు పాఠము కావాలి. సందేశం
కావాలి. వారు అంధకారంలో ఎందుకు కూరుకుపోయారో మనం తెలుసుకోవాలి. మన జీవితాలు
నిరుత్సాహముతో, అసంతృప్తితో,
ఆలోచనా రాహిత్యముతో నిండకుండా చూసుకోవాలి. కలహములు, వర్గములు
లేకుండా చూసుకోవాలి. ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి యుండాలి (1 కొరి. 1:10-11). అలా జరగాలంటే, దేవుని వాక్యమును విధిగా
ప్రతిదినం చదవటం, వినటం అలవాటు చేసుకోవాలి. కష్ట, క్లిష్టపరిస్థితులలో దేవునిని సంప్రదించటం, ఆశ్రయించటం, దైవసన్నిధికి రావటం, నిశబ్దంలో దేవుని స్వరాన్ని ఆకించడం నేర్చుకోవాలి. మన శక్తికి మించిన
భారం ఉన్నప్పుడు, దేవుని సహకారాన్ని,
సలహాలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు కష్టంలోనున్నప్పుడు దేవున్నితప్ప అందరిని
(సోదెకాండ్రను, మాంత్రికులను,
భూతములను, మృతులను) సంప్రదించారు.
అందుకే అంధకారంలో మునిగిపోయారు. మనం
దేవుని వాక్యాన్ని పాదములకు, జీవితానికి దీపంగా మార్చుకోవాలి (కీ.119:105). ప్రవక్తల
సందేశమును ఆలకించాలి, ఆచరించాలి. క్రీస్తు అనుగ్రహించు వెలుగును మనం
పొందువరకు ప్రవక్త సందేశము మనకు దీపికలుగా,
చీకటిలో దారిచూపు జ్యోతులుగా ఉండును (2 పేతు. 1:19).
No comments:
Post a Comment