ఆగమన కాలము

ఆగమన కాలము

ఉపోద్ఘాతము

క్రీస్తు మనుష్యావతారుడైనది మొదలుకొని పెంతకోస్తు మహోత్సవము వరకును, అప్పటినుండి ప్రభుని రాకడ నిరీక్షణ వరకునుగల క్రీస్తు పరమరహస్యమును శ్రీసభ ఒక సంవత్సరకాలం వ్యవధిలో స్మరించుకొనుచున్నది. మానవుని రక్షించు దేవునికి, సంపూర్ణ మహిమను చేకూర్చు కార్యములను క్రీస్తుప్రభువు తన పాస్కత్రయాహమును అనగా ప్రభు శ్రమలు, మరణము, ఉత్థానమును పాస్కత్రయాహ పరమరహస్యముద్వారా ఘనముగా నేరవేర్చును. దీనిని మూములుగా అతడు మరణించి, మన మరణమును వినాశము చేసెను. పునరుత్థానుడై మనలను ఉద్ధరించెను. కావున, అతని శ్రమలను, ఉత్థానమును స్మరించు పాస్కత్రయాహము దైవార్చనా సంవత్సరమునకు మకుటముగా పరిగణింపబడును. అనంతరము పాస్కపరమరహస్య వార్షిక మహోత్సవము తరువాత ప్రభు జననము, అతని ప్రధమ సాక్షాత్కారమును అతిపురాతనమైన వేడుకగా శ్రీసభ జరుపుకొనుచున్నది. ఇవి ప్రభుని జనన కాలములో జరుపుకొను సంస్మరణలు. ప్రభువు జనన మహోత్సవము ప్రధమ సంధ్యా వందనము మొదలుకొని సాక్షాత్కార మహోత్సవము లేక జనవరి 6వ తేదీకి తరువాత ఆదివారముతో సహా వచ్చు దినము ప్రభుని జనన కాలముగా పరిగణింపబడును. ప్రభువు జనన జాగరణ పూజను డిసెంబరు 24వ తేదీన సాయంకాలము ప్రధమ సంధ్యావందనమునకు ముందుగాని, లేక దాని తరువాతగాని కొనియాడవలయును. పండుగరోజు రోమీయ పూర్వపు పారంపర్యను అనుసరించి అర్దరాత్రి, వేకువఝామున, పగటిపూట మూడుసార్లు పూజలు సమర్పింప వచ్చును.

ఆగమన కాలము

ఆగమన కాలమునకు రెండు స్వభావములు కలవు. అవి ప్రభు జననమునకు ఆయత్తముగా దైవకుమారుడు మొదటిసారిగా మానవుల మధ్యకు వచ్చిన సంఘటనను స్మరించు కాలము. ఈ స్మరణద్వారా, యుగాంతమున జరుగు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుటకు హృదయమును, మనస్సును ప్రేరేపించు కాలమునుకూడా ఇదియే! ఈ రెండు కారణముల చేత ఆగమన కాలము భక్తిపూర్వక, ఆనంద భరితమైన నిరీక్షణా కాలముగా వెలుగొందుచున్నది. ఆగమన కాలము నవంబరు 30వ రోజునగాని, లేక దాని సమీప ఆదివారము ప్రధమ సంధ్యావందనముతోగాని ప్రారంభమగును. ప్రభు జనన మహోత్సవము ప్రధమ సంధ్యావందనమునకు ముందుగా ముగియును. ఈ కాలములోని ఆదివారములు ఆగమనకాలపు 1,2,3,4వ ఆదివారములుగా పరిగణింపబడును. డిసెంబరు 17 నుండి 24 వరకు (24తో సహా) వచ్చు ఆదివారము ప్రభు జననమునకు అతి సమీప ఆయత్త కాలముగా రూపొందింపబడినది.

ఆగమనకాల మొదటి ఆదివారము

ఈ ఆదివారమునుండి మనము ఆగమన కాలములోనికి ప్రవేశిస్తున్నాము. ఆగమన కాలమనగా రక్షకుని రాకకోసం సిద్ధపడు కాలము. అదే మన విశ్వాసానికి పదును పెట్టుకునే కాలము. మన విశ్వాసాన్ని పరీక్షించుకునే కాలము. ప్రస్తుతము మనము జరుపుకునే ఆగమనకాలం వేరు. నాడు యిస్రాయేలు ప్రజలు జరుపుకున్న ఆగమనకాలం వేరు. యిస్రాయేలు ప్రజలు, రక్షకుడు జన్మిస్తాడు, అతనిద్వారా రాజ్యపాలనము చేయబడుతుంది; మనందరి జీవితాలు బానిసత్వంనుండి స్వతంత్ర జీవితంలోనికి ప్రవేశిస్తాయి అని మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. కాని, ప్రస్తుత కాలమునకు చెందిన మనము జరుపుకునే ఆగమన కాలం రెండవ రాకడకు సబంధించినది. మొదటి ఆగమనం దీనాతి దీనమైనది. పూరిపాకలో జన్మించి, పశువుల గాటిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడినారు. కాని, ఆయన రెండవ ఆగమనం మహిమాన్వితమైనది. కాంతికిరణాలను వెదజల్లుతూ రాజకిరీటాన్ని ధరించి, దేవదూతల సమేతంగా విచ్చేస్తాడు. ఆ ఆగమన మొదటి ఆదివారంరోజు శ్రీసభ మనలను కోరేది - క్రీస్తుప్రభు మొదటి రాకతో తృప్తిపడి, ఊరకుండక, ఆయన రెండవరాకకై మనం వేచియుండాలి. ఇటువంటి జీవితానికై సిద్ధపడాలి. క్రీస్తుప్రభువు రెండవరాకడతో రక్షణ పొందడానికి ఈ లోకంలో నాలుగు విషయాల మీద దృష్టి పెట్టాలి: 1. ప్రార్ధన (మత్త.6:6; లూకా.21:36) 2. పశ్చాత్తాపం (యోహా.1:8-10) 3. ఉపవాసము (మత్త.6:17-18) 4. దానధర్మాలు (మత్త.6:3-4). ఈ నాలుగు విషయాలు పాటిస్తే దేవుని రక్షణ భాగ్యాన్ని పొందుతారు. ఈ నాలుగు విషయాలలోకూడా శ్రద్ధచూపలేనివాడు దేవుని శిక్షకు లోనవుతాడు. ఈ నాలుగు విషయాలు మన జీవితంలో నెరవేరాలంటే దివ్యపూజలో పాల్గొని, యేసుప్రభువు యొక్క దివ్య శరీరరక్తాలను స్వీకరించడంద్వారా దివ్యసత్ప్రసాద రూపంలోనున్న ప్రభువు ఆయన మార్గంలో నడవటానికి శక్తిని యిస్తారు. తద్వారా ఆయన రాకకు సిద్ధపడగలం. దేవుని దీవెనలను పొందగలం.

ఆగమనకాల రెండవ ఆదివారము

ఈనాటి ఆదివారంనుండి మనము పాపక్షమాపణ, పశ్చాత్తాపంతో దేవునివైపు మరలడం వంటి అంశాలపై ధ్యానం చేసేలాగున మనలను ప్రోత్సహిస్తాయి. అలా జ్ఞానస్నానము పొందిన వారిపై దేవుని ఆత్మ ప్రవహించి శుద్ధులను చేసి, రాజ్యవ్యాప్తికై పాటుబడేలా చేస్తుంది (లూకా.4:18-19). మారుమనస్సు పొందిన ప్రతి వ్యక్తి ప్రభుమార్గాన్ని సుగమం చేయాలి. రాచరికపు బాటవేయాలి. ఆ బాట పూర్తిగా పరిశుద్దాత్మతో నిండిపోవాలి. ఆ బాటే హృదయపు బాట. హృదయమే రహదారిగా మారిపోవాలి. ప్రభుమార్గాన్ని సిద్ధమొనర్చుడు. ఆయన త్రోవను తీర్చిదిద్దుడు (లూకా.3:4). ప్రభువు ఆ రహదారిపై పయనిస్తుంటే, అయన రాజ్యం, నామం విస్తరింప బడుతుంది. ఆ సమయములో ప్రభువు తేజస్సు ఎల్లరకునూ విధితమై, అందరూ ఆ తేజస్సును దర్శిస్తారు (యెష.40:5). దేవుని రక్షణ మన కుటుంబమంతటికిని లభించాలి. కుటుంబమంతా దివ్యపూజలో పాల్గొనాలి. అప్పుడే కుటుంబం, బిడ్డలతో సహా రక్షణ లభిస్తుంది. పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను నడిపించును (బారూకు.5:5-6). ఆయన కరుణే నడిపిస్తుంది.

ఆగమనకాల మూడవ ఆదివారము

దైవజ్ఞానము దాని క్రియలనుబట్టి నిరూపింపబడును.’’ ఈ మాటలు దైవప్రేరణ, దైవభయం లేనిదే అవి నిరూపింపబడవు. దేవునియెడల భయంఉంటె, ఆత్మ ప్రేరిపితముతో మాత్రమే అలాంటి దైవజ్ఞానమును పొందుకోగలం. అందుకే, అ.కా.2:37లో చూస్తున్నట్లుగా, ప్రజలందరుకూడా పేతురు ప్రసంగానికి ఆత్మప్రేరణ చెంది ‘‘మేమేమి చేయవలెను’’ అని అడుగుచున్నారు. చేయవలసి ప్రధమమైన పని సకల వస్తువుకంటే (డబ్బు, పదవులు, అధికారం, ఆస్తులు) సర్వేశ్వరున్నే అధికంగా ప్రేమించాలి. జనులు మేమేమి చేయాలి అని ప్రశ్నించినప్పుడు, బప్తిస్మ యోహాను (లూకా.3:11),రెండు అంగీలున్నవారు ఒక దానిని దానము చేయవలయును అని చెప్పారు. వస్త్రాలను దానము చేయడమనేది క్రియాపూర్వకమైన విశ్వాసము. అది మాటలతోకాక, చేతలతో నిరూపింపబడే అసలు సిసలైన ఉత్తమ విశ్వాసము (యాకో.2:15-17). నాకు విశ్వాసమున్నది, దేవుడంటే చాలా నమ్మకం కూడా ఉన్నది. ప్రతిదినము దివ్యపూజలో తప్పని సరిగా పాల్గొంటాను. దివ్యసత్ప్రసాదం తీసుకొంటాను అని చెప్పుకొంటూ, తన సాటిసహోదరుని కష్టములో పాలుపంచుకొనని విశ్వాసము ఉపయోగము లేనిది (యూకో.2:14). ఇతరుల కడుపు కొట్టి భోజనం సంపాదించుకోవడం మంచిది కాదు. బలాత్కారంగాగాని, అన్యాయారోపణ వలనగాని, ఎవ్వరిని కొల్లగొట్టవలదు. మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు’’ (లూకా.3:14). ప్రస్తుత సమాజంలో ఆనాటి సుంకరులుగా, రక్షకభటులుగా అనేకులు అన్యాయంగానే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, రక్షకభటులు, పెట్టుబడిదారులు, వ్యాపారులు ఇలా అనేకులు ప్రజలను భయపెట్టి, మోసం చేస్తున్నారు నీ పొరుగువాని ఆస్థిని, ఇంటిని, భార్యను, దాసుని, ఎద్దును, గాడిదను, దేనినీ ఆశించరాదు (నిర్గ.20:17). దొంగతనము, మోసము, అబద్ద ప్రమాణము చేయకూడదు (లేవీ.19:11). మనము జీవిస్తున్న మానవ జీవితంలో ఇలాంటి సంఘటను కోకొల్లలు! కాబట్టి క్రైస్తవులుగా మనకు చేతనయిన సహాయము చేస్తూ, ఇతరుల అవసరాలకు స్పందిస్తూ నిజమైన క్రీస్తు అనుచరులుగా జీవించేందుకు తీర్మానించుకుందాం.

ఆగమనకాల నాలుగవ ఆదివారము

నాలుగవ ఆగమాన ఆదివారంలో ప్రవేశించబోయే ముందు గత మూడువారాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నిజముగ, క్రీస్తు రాకడకొరకు ఎదురుచూస్తున్నామా? మన ఎదురుచూపులో సత్యం ఉన్నదా? ప్రభువు కోసము ఎదురు చూస్తున్నామా? పండుగ సంబరంకోసం కనిపెట్టుకొని కూర్చున్నామా? పండుగకోసం చూస్తే ఈ సంవత్సరం, రేపటి సంవత్సరం, ఇలా ప్రతీ సంవత్సరం క్రిస్మస్‌ వస్తుంది. కాని, రక్షణరాదు. అందుకే, మీకా ప్రవక్త 5:3లో నీవు నేడు శత్రువు (సాతాను) వ్యామోహాలు, మోహము, పగ, కుతంత్రము, వీటన్నిటి ఆధీనమున ఉన్నావు అని నుడువుచున్నారు. కాని, రక్షకుడు వచ్చినప్పుడు, నీవు నిజంగా రక్షకునికోసం ఎదురుచూస్తే క్షేమంగా ఉందువు. అలాగే శాంతిని స్వీకరించెదవు (మీకా.5:4,5). మనకు కావాల్సింది సంబరమా? క్షేమమా? పండుగ వాతావరణమా? శాంతియా? ప్రభువు కోరుకొనేది పశ్చాత్తాప పూరిత హృదయమే! ప్రభువునకు ఇష్టములేని కార్యాలు చేసి, ఏవగింపు పనులు చేసి, జంతు బలులను, అర్పణలను ఎన్ని చేసినా ఉపయోగం లేదు (హెబ్రీ.10:5, కీ.51:16). ప్రభువునకు అవసరమైనది వినయాత్మము, పశ్చాత్తాపపూరిత బలి (కీ.51:17). నిజాయితీతో కూడిన జీవితము (సీరా.5:10). అలాగే డాంబికమునకు పోకుండా, అన్యాయపు సొమ్ముకోసం ఆశించకుండ సామాన్యునిలా రోజువారి సంపాదనతో జీవించడం ఉత్తమము (సామె.12:9).

దేవుని దృష్టిలో నీతిమంతంగా, గొప్పగా జీవించాలంటే, మరియతల్లి ఏవిధంగా స్త్రీలందరిలోకెల్లా గొప్పగా కీర్తించబడినదో (లూకా.1:42), మనముకూడా మన గ్రామంలో, వీధిలో, పట్టణాలలో గొప్పగా కీర్తించబడాలంటే దేవునికిష్టమైన మూడు కార్యాలను చేయగలగాలి. అవి (సీరా.25:1): 1. సోదరులతో ఐకమత్యంగా జీవించడం, 2. ఇరుగుపొరుగు వారితో స్నేహంగా జీవించడం, 3. భార్యా భర్తలు పొందికగా జీవించడం. ఇలా దేవాధి దేవుడు మన కుటుంబాలలో గొప్ప మేలులు చేసేలాగున ప్రయాస పడుదాం.

No comments:

Post a Comment