ఉపోద్ఘాతం
నేడు ఆగమన కాల రెండవ వారములోనికి ప్రవేశించాము. ఈనాటి ప్రధాన ధ్యానాంశం: దేవుని రాజ్యము - హృదయ పరివర్తనము. ప్రతీ సంవత్సరం, ఆగమనకాల రెండవ వారమున, ‘దేవుని రాజ్యము - హృదయ పరివర్తనము’ గూర్చి ఎడారిలో బోధించు బప్తిస్మ యోహానును కలుసుకుంటాము. యెషయ ప్రవక్త ప్రవచన నేపధ్యములో, బప్తిస్మ యోహాను బోధనను ధ్యానించుదాం.
ఏదెను తోటలో దేవునితో మానవుని జీవితం
స్వర్గతుల్యముగా ఉండేది. దేవునితోను, సకల జీవరాశులతోను మానవుడు సత్సంబంధము కలిగి శాంతి, సమాధానముతో
స్వేఛ్ఛగా జీవించేవాడు. దేవుడు అతనికి “తన నిర్ణయములను తాను చేసికొను స్వేఛ్ఛనొసగాడు” (సిరా. 15:14).
తన ఆజ్ఞను మీరవద్దని, మీరినచో
“తప్పక
చనిపోదువు” అని
దేవుడు ఆజ్ఞాపించారు (ఆది. 2:17, 3:1-3). ఆదిలో దేవుడు సృష్టించినపుడు మానవుడు పాపరహితుడు.
జన్మపాపముగాని, ఏ యితర
పాపముగాని అతనికి సోకలేదు. దేవుడు మానవుని శ్రేష్టమైనదిగా సృష్టించాడు. ‘ఆది
తల్లిదండ్రులను పరిశుద్ధమును, భాగ్యమునైన స్థితిలో సృష్టించాడు’ (సత్యోపదేశ
సంక్షేపము). కాని, మానవుడు
దేవుడిచ్చిన స్వేఛ్ఛను దుర్వినియోగముచేసి పాపమును కట్టుకున్నాడు. పాపము వలన ఆ
స్థితిని పోగొట్టుకున్నాడు. పాపమనగా, సర్వేశ్వరుడు ఆజ్ఞాపించిన దానిని బుద్ధి, వివరము, తెలిసిన
తరువాత మనసొప్పి (స్వేచ్చ) మీరుటయే పాపము (సత్యోపదేశ సంక్షేపము). పాపియగు వ్యక్తి
దేవుని చట్టమును అతిక్రమించి దోషియగును. ఏలయన, చట్ట ఉల్లంఘనమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము (1
యోహా. 3:4) “ప్రభువు
ఏ నరుని పాపము చేయుమని ఆజ్ఞాపింపడు” (సిరా. 15:20).
పాపముయొక్క ఫలితముగా దేవునితో స్నేహబంధమును, సాన్నిహిత్యమును, సహచర్యమును
మానవుడు కోల్పోయాడు. ఆత్మశాంతిని, మనశ్శాంతిని కోల్పోయాడు. ప్రకృతి వైపరీత్యం వెల్లివిరిసింది.
సకల జీవరాశులతో సమాధాన జీవితాన్ని కోల్పోయాడు. తుదకు పాపముయొక్క ఫలితంగా
మరణాన్ని ఆహ్వానించాడు (ఆది. 2:17; రోమీ. 6:23). ‘మోక్షమును పోగొట్టుకొని, పిశాచికి
దాసులై మరణమునకును, ఇతర
బాధలకును పాత్రులైరి’
(సత్యోపదేశ సంక్షేపము).
దేవునితో సాన్నిహిత్యం, తోటి
మానవులతోనూ, సకల
జీవరాశులతోను శాంతియుతముగాను, సమాధానముతోను జీవించాలంటే పాపక్షమాపణము, పాపనిర్మూలనము
జరగాలి. అందునిమిత్తము మానవుడు ఎన్నోప్రయత్నాలు చేసి, విఫలుడయ్యాడు.
పాపనిర్మూలనము మానవునికి అసాధ్యమైనది. ఫలితముగా, మానవుడు దేవుని ఆశ్రయించి, దేవునిపై ఆధారపడుచున్నాడు.
ఏలయన, మానవునకు
ఆసాధ్యమైనది దేవునకు సాధ్యమే (లూకా. 18:27). దేవునికి సమస్తమును సాధ్యమే (మత్త.
19:26; లూకా.
1.:37). ఈ నేపధ్యములో,
దేవుడు దివినుండి భువికి దిగిరావాలి (యోహాను. 11:27; మత్త. 16:16).
పాపనిర్మూలనము చేయాలి,
పాపులను క్షమించాలి (మత్త. 1:21). శాంతి స్థాపన చేయాలి, శాంతికరుడు
కావాలి, రావాలి
(యెషయ 9:6, 11:1-10).
మొదటి పఠనం
యెషయ ప్రవక్త తన ప్రవచనముద్వారా ఇశ్రాయేలు ప్రజలలో
ఒక నూతన ఆశను చిగురింప జేయుచున్నాడు. నేటి పఠనములో, శాంతియుతుడైన రాజు గురించి
చదువుచున్నాము. యేసు క్రీస్తువే ఈ శాంతియుతుడైన రాజు. ఏలయన, ఈషాయి మొద్దు
(దావీదు) నుండి పిలక పుట్టును. ఈషాయి దావీదు తండ్రి. అతని (దావీదు) వేరునుండి ఒక
కొమ్మ (యేసు క్రీస్తు) ఎదుగును (2 సమూ. 7:12-13; మత్త. 9:27; 20:30-31; మార్కు.
10:47-48). దేవుని ఆత్మ అతనిపై (యేసు క్రీస్తు) నిలుచును (యెషయ. 11:2; లూకా. 4:16-21).
ఆయన ద్వారా దేశమున (కీర్తన. 72:7), భూలోకములో (లూకా. 2:14) శాంతి నెలకొల్ప బడుతుంది.
అది పాపక్షమాపణము, పాపనిర్మూలనముద్వారా
మాత్రమే సాధ్యమగును. యేసు క్రీస్తువే లోకరక్షకుడు, పాపుల రక్షకుడు (మత్త. 1:21). పాపమును, దాని
ప్రభావమును, శాపమును
తొలగించువారు (యెషయ. 53:10;
ఎఫెసీ. 1:7). ఆయనద్వారా, ఆయన కాలములో అంత:రంగికమైన మార్పు చేకూరుతుంది. ఇట్టిమార్పు
మానవులలో మాత్రమే కాకుండా ప్రకృతిలోనూ, సకలజీవరాశులలోను వచ్చును (యెషయ. 11:6-9). ఆయన
దైవాత్మపూరితుడై న్యాయమును, ధర్మబద్ధమైన పరిపాలనము చేయును (యెషయ. 11:2-5). శాంతిని
నెలకొల్పును.
సువిశేష పఠనం
బప్తిస్మ యోహాను యూదయా దేశపు ఎడారిలో చేసిన
ప్రబోధమును వినుచున్నాము: “పరలోక
రాజ్యము సమీపించినది. మీరు హృదయ పరివర్తనము చెందుడు” (3:2). ఎడారి కేవలము ఒక స్థలము మాత్రమే
కాదు, అది
ఒక వ్యక్తిగత అనుభవము. ఎడారి, కేవలము శోధనలకు నిలయము మాత్రమే కాదు, ఏకాంతమునకు, ప్రార్ధనకు, ధ్యానమునకు, దివ్యావిష్కరణమునకు, సంపూర్ణమైన
మార్పునకు నిలయము.
బప్తిస్మ యోహాను ప్రభువు మార్గమును సిద్ధముచేయ
పంపబడిన ప్రవక్త (మత్త. 3:1-3; యెషయ. 40:3-5). యోహానుకుముందు, ఇశ్రాయేలు
చివరి ప్రవక్త మలాకీ. బప్తిస్మ యోహానును గూర్చిన ప్రవచనాన్ని మలాకీ. 3:1లో
చూడవచ్చు: “ఇదిగో
నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును.” అలాగే, 4:5-6లో, “నేను ఏలియా
ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. హృదయ పరివర్తనమునకు పిలుపునిచ్చును.” మెస్సయాకు
ముందుగా ఏలియా వచ్చునని యూదులు నమ్మేవారు. సువార్తలో యేసు, ‘ఏలియా’ను బప్తిస్మ
యోహానుగా గుర్తించాడు (మత్త. 11:11-14; 17:10-17). మలాకీ ప్రవచనాలు నాలుగు శతాబ్దాల తరువాత
బప్తిస్మ యోహాను రాకతో నెరవేరాయి.
బప్తిస్మ యోహాను తన ప్రబోధములో శాంతియుతుడైన
రాజును, పాపుల
రక్షకుడును, లోకరక్షకుడైన
యేసుక్రీస్తు ఆగమనం (మత్త. 3:11), మానవుల హృదయ పరివర్తనముతో (మత్త. 3:8) తిరిగి దేవుని
యొద్దకు రావాలని ప్రబోధించుచుండెను. రక్షకుని రాకడ దగ్గరలోనే యున్నదని, ఆయనకు ఎదురేగి
కలుసుకొనుటకు సిద్ధపడమని (మత్త. 25:1), అందునిమిత్తము, హృదయపరివర్తనం చెందాలని, లేకుంటే ఆయన
కోపాగ్నికి గురియగుదురని (మత్త. 3:7, 10, 12; యోహాను 15:2) ప్రజలను ఆహ్వానించుచుండెను. ఆయన
ఆగమనమునకై సిద్ధపడి ఓపికతోను, సహనముతోను ఎదురుచూడాలి (మత్త. 25:1, 5).
పరలోక / దేవుని రాజ్యము
బప్తిస్మ యోహాను, తన బోధనలో, మొదటిగా పరలోక
(దేవుని) రాజ్యమును పరిచయం చేయుచున్నాడు (3:1-2). ‘పరలోక (దేవుని) రాజ్యము’ అనగా, తన ప్రజలపై
చురుకైన, సమర్ధవంతమైన
‘దేవుని
పరిపాలన’. ‘దేవుని
రాజ్యము’ వచ్చును
అని గాఢముగా విశ్వసించేది క్రైస్తవత్వం. దీనిని బప్తిస్మ యోహాను (మత్త. 3:2), యేసు (మత్త.
4:17) బోధించారు. ‘దేవుని
రాజ్యము’ పాత
నిబంధనలోని ప్రవక్తల బోధనలనుండి, ముఖ్యముగా, ‘యావే దినము’ లేదా ‘తీర్పు రోజు’ (యోవే. 2:11, 3:14; జెఫ. 1:7; యెషయ. 13:6)
నుండి ‘పరలోక
రాజ్యము’ అనే
భావన ఉద్భవించినది. యూదులు రాజకీయ, నైతిక, రాబోవు రాజ్యము గురించి కలలు కన్నారు. దావీదు
వంశమునుండి మెస్సయా ఆ రాజ్యానికి రాజు అని
తలంచారు. రాజు అనుచరులు దేవుని చిత్తము ప్రకారం, ఆయన ప్రమాణాల ప్రకారం జీవించాలి. పౌలు
రెండు రాజ్యాల గురించి 1 కొరి. 15:23-28లో చెప్పుచున్నాడు: మొదటగా, ‘మెస్సయా
రాజ్యము’. యేసు
క్రీస్తు దానిని పరిపాలించును. ఆ తరువాత ‘దేవుని నిత్యరాజ్యము’. దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును.
దేవుని రాజ్యము మనలనుండి ఏమి కోరుచున్నది? కేవలము
చట్టానికి విధేయులమై యుండుట మాత్రమేగాక, దేవునితో సంబంధాన్ని కలిగి జీవించాలి. హృదయపరివర్తన
కలిగి, మన
జీవితాలను దేవునికి అంకితం చేసుకోవాలి. దేవుని రాజ్యము అనగా దేవునిపట్ల, ఇతరులపట్ల
అనంతమైన ప్రేమను కలిగియుండటం. పాపమునుండి పరిపూర్ణతలోనికి మారడం. దేవుని రాజ్యము
సాక్షాత్కారము కావాలంటే,
విశ్వాసుల స్వభావములో,
ప్రవర్తనలో, అన్నింటికంటే
ముఖ్యముగా హృదయములో సమూలమైన మార్పు రావాలి. పశ్చాత్తాపపడి, పవిత్రులుగా, నీతిగా
జీవించుటకు ప్రయత్నం, కృషిచేయాలి.
బప్తిస్మ యోహాను, యేసు
ఇరువురుకూడా దేవుని రాజ్యమునకు అవసరమైన హృదయపరివర్తనను బోధించారు.
యేసు ప్రభువే ఆ దేవుని రాజ్యము. ఎందుకన ఆయన దేవుని
కుమారుడు. ఆయన మనుష్యావతారమై దేవునిరాజ్య సువార్తను బోధించుటకు, దేవుని
రాజ్యముకొరకు సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. దేవుని రాజ్యము గురించి
తనద్వారా, బోధనలద్వారా
బహిర్గతమొనర్చాడు. దైవరాజ్య సంపూర్ణతను తన శ్రమలు, మరణము, ఉత్థానముల (దేవుని అనంతప్రేమకు
చిహ్నాలు) ద్వారా ప్రారంభించాడు. “సకల జాతిజనులను, తనకు శిష్యులను చేయండి” అని తన
శిష్యులకు ఆజ్ఞాపించాడు (మత్త. 28:19-20). దేవుని రాజ్యములో శిష్యులు కావాలంటే, జ్ఞానస్నానము
మొదటి మెట్టు. “హృదయ
పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను” (3:11). తరువాత, యేసు ఇచ్చిన
ఆజ్ఞలను అన్నింటిని తప్పక పాటించాలి.
హృదయ పరివర్తనము
దేవుని వైపుకు అంత:ర్గతమైన మలుపు హృదయ పరివర్తనము.
ఇది పాపమునుండి మరలుట. హృదయ పరివర్తనతోపాటు, ప్రవర్తనలోకూడా పరివర్తన యుండాలి. కేవలం గతమును
తలంచుకొని దు:ఖించడం, చింతించడం, విచారించడం
కాదు. ‘హృదయపరివర్తనము’కు గ్రీకులో
వాడబడిన పదము (Metanoia)
‘మెటనోయ’ (హీబ్రూ
పదం Teshuvah ‘తెషువః’). దీనిఅర్ధం
సంపూర్ణ మార్పు. మనస్సు,
బుద్ధియొక్క సంపూర్ణ మార్పు. ఒక వ్యక్తియొక్క మనస్సు, బుద్ధి, హృదయము, జీవనశైలియొక్క
సంపూర్ణ మార్పు. పాపమునువీడి, హృదయపూర్వకముగా, దేవునివైపుకు మరలడం. దేవుని ఉద్దేశం ప్రకారం
జీవించడం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. పరిశుద్దులుగా జీవించడం, నిబద్ధత కలిగి
జీవించడం. హృదయ పరివర్తనమునకు తగిన పనులను చేయాలి (3:8): తమ జీవితాలద్వారా, విశ్వాసులు
ఫలించాలి. హృదయ పరివర్తనము,
మంచి కార్యాలు (ఫలాలు) చేయునట్లుగా నడిపించును. హృదయపరివర్తనము ఒకసారి జరిగేది
కాదు. మన జీవితములో ప్రతీరోజు హృదయపరివర్తనము చెందాలి.
రెండవ పఠనం
ఆగమన కాలమును నిరీక్షణ కాలమనియు, ఎదురుచూచే
కాలమనియు అంటాము. ఈనాటి రెండవ పఠనంలో పునీత పౌలుకూడా ‘‘ప్రభువు కొరకు
నిరీక్షించాలని’’ బోధించుచున్నారు.
పాపమును క్షమించి, పాపనిర్మూలనము
చేసి, ఫలితంగా
శాంతిని స్థాపించువారును,
శాంతియుతుడును, శాంతికాముడును, న్యాయమును
పాటించుచు పరిపాలనము చేయువారునైన క్రీస్తు ప్రభువు రెండవ రాకడకై మనమంతా నిరీక్షించాలి. ఈ క్రమంలో సహనంతో
జీవించుచూ, ఒకరినొకరు
ప్రోత్సహించుకొనుచూ వేచియుండాలి (రోమీ. 15:4). అందునిమిత్తము, సహనమునకును, ప్రోత్సాహమునకును
కర్తయగు దేవుని (రోమీ. 15:5) మీద ఆధారపడాలని పౌలు బోధించుచున్నారు. ఓర్పు, సహనము, ప్రోత్సాహము
మనకు పరిశుద్ధగ్రంథ పఠనం ద్వారా (రోమీ. 15:4) లభించును.
కావున, ఈ ఆగమన కాలములో ప్రభువు రాకడకై ఎదురుచూచు క్రమంలో
మన సమయమును ప్రార్ధనలోను,
పరిశుద్ధ గ్రంథ పఠనములోను గడుపుచూ, తుచ్ఛవిషయాసక్తిని వదిలి (లూకా. 21:34), సహనము కలిగి, ఒకరినొకరు
ప్రోత్సహించుకొనుచూ దేవునిపై ఆధారపడి, మన రక్షకునికై ఎదురు చూద్దాం. జ్ఞానస్నానము
తీసుకున్నాము, మేము
దేవుని బిడ్డలము అని అనుకుంటే సరిపోదు. మన పాపానికి పశ్చాత్తాపపడి, హృదయ పరివర్తనము
చెందాలి. మంచి కార్యాలద్వారా దేవునికి తగిన ఫలవంతమైన జీవితాన్ని జీవించాలి. మంచి
పండ్లను ఇవ్వని వృక్షములను వ్రేళ్ళతో నరికి వేయుటకు గొడ్డలి సిద్ధముగా నున్నది
(దేవుని తీర్పు దినము). కనుక మంచి పండ్ల నీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో
పారవేయబడును (మత్త. 3:10). అలాగే, తూర్పార బట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగా నున్నది.
గింజలను గిడ్డంగులయందు భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును (మత్త. 3:12).
యోహాను బోధనలు సూటిగా,
స్పష్టముగా ఉన్నాయి. కనుక, హృదయ పరివర్తన చెంది, దేవుని వైపుకు మరలుదాం!
మన రక్షకుడు, లోక రక్షకుడైన యేసు క్రీస్తు, మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక!
No comments:
Post a Comment