ఆగమన కాల 4 వ ఆదివారము, Year A

ఆగమన కాల 4వ ఆదివారము
యెషయ. 7:10-14; రోమీ. 1:1-7; మత్త. 1:18-24

 గత మూడు వారాలనుండి మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా క్రిస్మస్‌ పండుగను, క్రీస్తు జన్మదినమును జరుపుకొనుటకు సిద్ధపడుతూ ఉన్నాము. నేడు ఆగమనకాల నాలుగవ వారములోనికి ప్రవేశించి యున్నాము. కొన్నిరోజులలో, మన ప్రభువగు యేసుక్రీస్తు జన్మదిన మహోత్సవాన్ని కొనియాడబోవు చున్నాము. ఈ చివరి దినాలలో మనం ఎలా సిద్ధపడుచున్నాము? మన ఆలోచనలకు, అవగాహనకు మించి విశ్వాసము కలిగి యుండాలని నేటి పఠనాలు బోధిస్తున్నాయి, సవాలు చేస్తున్నాయి. దేవుని ఆలోచనలు, మార్గములు, మన మార్గముల వంటివి కావు” (యెషయ. 55:8).

మొదటి పఠన సందర్భం

ఈనాటి వాక్యభాగమును సరిగా అర్ధం చేసుకోవాలంటే, యెషయ 7వ అధ్యాయమును మొదటినుంచి చదవాలి. ఈ భాగమును అర్ధం చేసుకోవాలంటే ఆనాటి ప్రాంతీయ, అంతర్జాతీయ, రాజకీయ పరిస్థితులను గురించి వివరంగా తెలుసుకోవాలి. యెషయా ప్రవక్తద్వారా ఈనాడు మనం విన్న ప్రవచనం ప్రవచింపబడే సమయానికి, దావీదుద్వారా స్థిరపరచబడిన ఇశ్రాయేలు దేశం, సోలోమోను కాలం వరకు స్థిరంగా ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి, యూదా, ఇశ్రాయేలుగా (క్రీ.పూ. 930) విడిపోయింది. యూదా రాజ్యపు రాజధాని యెరూషలేముకాగా, ఇశ్రాయేలు రాజధాని సమరియా. యూదా దక్షిణ దేశంగా, సమరియా ఉత్తర దేశంగా చలామణి అయ్యేవి. ఉత్తర దేశంలో ఇశ్రాయేలీయులోని 10 తెగలు, దక్షిణ రాజ్యమైన యూదాలో 2 తెగలు నివసించేవి. ఆకాలమున యూదాను ఆహాసు రాజు, ఇశ్రాయేలును పెకయు రాజు పరిపాలించుచుండేవారు.

ఆ కాలమున ఇశ్రాయేలు ప్రక్కన ఉన్న అస్సీరియా (నీనెవె రాజధాని) ఒక గొప్ప సామ్రాజ్యంగా ఎదుగుతుంది. గొప్ప సైన్యము కలిగిన దేశంగా, సంపద కలిగిన దేశంగా, శక్తివంతమైన దేశంగా, అభివృద్ధి చెందుతూ ఉన్నది. అస్సీరియా ఎదుగుదలను, సైనిక బలమును గురించి విన్న పొరుగు దేశాలకు భయం పట్టుకుంది. అస్సీరియా తమను కబలించి వేస్తుందేమోనని ఆందోళన చెందారు. అస్సీరియాను ఎదుర్కొనుటకై సిరియా, ఇశ్రాయేలు (సమరియా) ఒక్కటైపోయారు. యూదాకూడా తమలో కలిస్తే అస్సీరియాకు బలమైన పోటీ ఇవ్వవచ్చునని భావించారు. యూదా తమలో కలవనందులకు ప్రతీకారంగా సిరియా, ఇశ్రాయేలు కలిసి యూదాపై యుద్ధానికి పిలుపునిచ్చాయి. ఒకవైపు ఇశ్రాయేలు, సిరియా, మరియొకవైపు అస్సీరియా. యూదా పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యిలా అయ్యింది. యూదారాజు, ప్రజల హృదయాలు అరణ్యంలోని చెట్లు పెనుగాలికి తల్లడిల్లినట్లు తల్లడిల్లినాయి. వారి మనసు భయభ్రాంతులకు గురియైనాయి. అస్సీరియాలో కలిసి స్థిరంగా ఉండాలా లేక ఇశ్రాయేలు, సిరియాతో కలిసి ముందుకు వెళ్ళాలా అనే సందిగ్ధావస్థలో పడిపోయింది.

ఆవిధముగా భయంతో బ్రతుకుతున్న యూదారాజైన ఆహాసు వద్దకు యెషయా ప్రవక్త తన కుమారునితో (షార్యాషూబు. ఈ పేరు అర్ధం మిగిలినవారు తిరిగి వచ్చెదరు’). యూదా రాజైన ఆహాసు దగ్గరకు వచ్చి, ప్రభువైన యావేనుండి, ఒక సంకేతమును, సూచనను కోరుకోమని చెబుతున్నాడు. కాని ఆహాసు దానిని తిరస్కరిస్తున్నాడు. ప్రభువు సహాయమును, సలహాను, సందేశమును, నడిపింపును పొందుటకు నిరాకరించాడు. అతడు తన ఆలోచనమీద, బలముమీద, సైన్యముమీద, నమ్మకం, విశ్వాసం ఉంచాడు. సైన్యములకు అధిపతియైన యావేను మరచి, తన స్వశక్తిమీద ఆధారపడ్డాడు. అప్పుడు ప్రభువే ప్రజలకు ఒక చిహ్నమును, సంకేతమును యిస్తున్నాడు. అదేమనగా, ‘‘యువతి (హీబ్రూ Almah) గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును’’ (7:14). యుద్ధం ముంగిటనున్న యూదా ప్రజలకు, రాజుకు ఈ సందేశం, సంకేతం అర్ధం కాలేదు.

యేసుక్రీస్తు, మానవుడిగా దావీదు సంతతిలో జన్మించాడని పౌలు నేటి రెండవ పఠనములో స్పష్టం చేసాడు (రోమీ. 1:3). దేవుని వాగ్దానాల గురించి, పునరుత్థానం గురించి ఈ పఠనం చర్చిస్తుంది.

సందేశం

నిజంగా ఒక శిశువు జననం కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగింప జేయాలి. ఆశను చిగురింప జేయాలి. కాని యుద్ధసమయంలో ఈ సందేశం యూదా రాజుకు, ప్రజలకు అర్ధం కాలేదు. ఈ యుద్ధసమయమున శిశువు, అతని జననం ఏమి చేయగలదు? వారిని యుద్ధంనుండి తప్పించగలదా? యుద్ధం ముంగిటనున్న వారి భయాలను తొగించగలదా? అసలు ఈ శిశువు జననం, అతని పేరుకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? శిశువు జననం ఒక నూతన అధ్యాయాన్ని, నూతన ఆరంభమును కలిగింప జేస్తుంది. నూతన ఆరంభం, ప్రారంభం పునరుద్ధరణకు, నవీకరణానికి నాంది. ఈ యుద్ధసమయములో, భయం, ఆందోళన కూడిన సమయంలో, ఈ శిశువు జననం నూతన ఆరంభానికి గుర్తుగా ఉంది. అతని పేరు ‘‘ఇమ్మానుయేలు’’ అంటే దేవుడు మనతో ఉన్నాడుఅని అర్ధం. దేవుని హస్తం, ఆలోచన, సహకారం, సాన్నిధ్యం లేకుండా ఆహాసు ముందుకు వెళ్లాలని, తన పేరును, ప్రతిష్టను, పలుకుబడిని, అధికారమును, సింహాసనమును నిలుపుకోవాలని ప్రయత్నించాడు. కాని, సాధ్యపడలేదు. అతని అధికారం, రాజ్యం నిలువలేదు. దేవుని సహకారం, నడిపింపు లేకుండా ఏదీ నిలువలేదు. దేవుని తోడు, సహకారం, నడిపింపు మానవునికి కావాలి. అందుకే, ఈ శిశువు పేరు దేవుని నడిపింపునకు, దేవుని తోడునకు చిహ్నంగా ఉన్నది.

యూదారాజు, ప్రజలవలె నీ హృదయం భయంతో నిండియున్నదా? భారంతో నిండియున్నదా? నీకున్న స్థితి, నీ జీవిత పరిస్థితి, పదిలంగా ఉండాని కోరుకుంటున్నావా? దానికి నీ మీద ఆధారపడుతున్నావా లేదా ప్రభువుపై ఆధారపడటం నేర్చుకున్నావా? ప్రభువు నడిపింపు పొందటం అలవాటు చేసుకున్నావా? ప్రభువుయొక్క వాగ్దానం ఈనాడు కూడా అదే - ‘‘దేవుడు మనతో ఉన్నాడు’’. ఇంకా వివరంగా చెప్పాలంటే, ‘నీకు నేనున్నాను, నీతో ఉంటానుఅని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఆహాసువలె కాకుండా ప్రభువుమీద ఆధారపడి జీవించడం నేర్చుకుందాం! ఆయనతో నడవడం నేర్చుకుందాం! అప్పుడే ఇమ్మానుయేలు’ (El = God; Emmanu = With us) నామమునకు సార్ధకత చేకూరుతుంది.

సువిశేష  పఠనం

నేటి మొదటి పఠనములో దావీదు వంశానికి వాగ్దానం చేయబడిన గుర్తు నేటి సువార్తలో నెరవేర బడినది. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య’ (గ్రీకు Parthenos) మరియమ్మ గర్భము ధరించినది” (1:18). పాత నిబంధనలో, ‘ఆత్మజీవము (సృష్టి) కలుగజేయునదిగ చూస్తున్నాము. నూతన నిబంధనలో, ‘పవిత్రాత్మఅనగా దైవసాన్నిధ్యం’. మరియమ్మ గర్భము ధరించినదని విని, యోసేపు ఆమెను రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు (1:19). అప్పటికే, మరియకు యోసేపుతో నిశ్చయమైనది (1:18). అయితే, యోసేపు దేవున్ని సంపూర్ణముగా విశ్వసించాడు. నిజముగానే, మరియమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించినదని, కలలో దేవదూతద్వారా దేవుని పలుకులనుబట్టి విశ్వసించాడు. మరియమ్మ గర్భమున జన్మించేది యేసుఅనగా ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడుఅని, ఆయన ఇమ్మానుయేలుఅనగా దేవుడు మనతో ఉన్నాడుఅని యోసేపు  విశ్వసించాడు (1:21-23). అందుకే, తన భార్య మరియమ్మను స్వీకరించాడు (1:24). వేదాంత సత్యము ఏమనగా, దేవుడే స్వయముగా యేసును ఈ లోకమునకు పంపాడు. మనుష్యావతారియైన యేసు స్వయముగా సజీవ దేవుని కుమారుడు. ఆయనే మెస్సయా. యేసు (గ్రీకు Iesous; హీబ్రూ Yehoshua) అనగా యావే రక్షించునులేదా యావే రక్షణ’. యేసు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు’.

యోసేపు నీతిమంతుడు’ (1:19). నీతిమంతుడుఅనగా దేవుని ఆజ్ఞలను విధేయించువాడు. సత్యవంతుడు. మంచి స్వభావము, గుణము కలవాడు. పవిత్రుడు. దేవుని చిత్తమును నెరవేర్చువాడు. హీబ్రూ భాషలో, ‘నీతిమంతుడుఅనగా, చట్టమును గౌరవించువాడు, దయగలవాడు. అందుకే, మరియమ్మ మంచితనమును ఎరిగిన యోసేపు, ఆమెకు కష్టం కలిగించకూడదని, ఆమెను రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. మనము, యోసేపువలె దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నామా? నీతిమంతులముగా జీవిస్తున్నామా? దయగలిగి జీవిస్తున్నామా? విశ్వాసము కలిగి జీవిస్తున్నామా? పవిత్రముగా జీవిస్తున్నామా? మరియ, యోసేపులవలె దైవప్రణాళికతో సహకరిస్తున్నామా? విశ్వాసపు చెవులతో దైవసందేశాలను వినగలుగు చున్నామా? నీతిమంతులు ఎప్పుడుకూడా దేవునితోను, తోటివారితోను సత్సంబంధము కలిగియుంటారు. నీతిమంతుడైన యోసేపు దేవుని వాక్కును హృదయములో మననం చేసాడు. దేవుని వాక్కును విని విశ్వాసముతో ప్రతిస్పందించాడు.

ఆగమనకాల చివరి వారములో, ‘ఇమ్మానుయేలురాకకొరకై వేచి చూస్తున్నాము. క్రిస్మస్ కొరకు, అలాగే ప్రభువు రాకడ కొరకు సిద్ధమవుచున్నాము. ఈ సమయములో, బాహ్యపరమైన ఆర్భాటాలు కాక, మన హృదయాలను పశువులతొట్టిగా మలచి, ఆ దివ్య బాలయేసును మన జీవితాలలోనికి ఆహ్వానించునట్లుగాతిరుసభ పాలక పునీతుడైన యోసేపు ప్రార్ధన సహాయాన్ని కోరుకుందాం. శాంతినొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక! మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహిత మొనర్చునుగాక!” (1 తెస్స. 5:23).

No comments:

Post a Comment