క్రిస్మస్ అర్ధరాత్రి, Year A

క్రిస్మస్

శ్రీ యేసుని జన్మదినం లోకానికి పర్వదినం. శ్రీ క్రీస్తుని జన్మదినం మనుజాళికి శుభదినం. ఎందుకంటే, క్రిస్మస్‌ పండుగ ఈ లోకాన్ని మరియు మనుజాళిని బానిసత్వం నుండి స్వేఛ్ఛలోనికి, యుద్ధమార్గంనుండి శాంతిపధంలోనికి, కారుచీకటినుండి ఉజ్వల వెలుగులోనికి, తీరని బాధనుండి అంతుపట్టని సంతోషంలోనికి నడిపిస్తుంది. అందుకనే, చిన్నారి యేసుని జననం యావత్‌ క్రైస్తవ జనావళికి ఒక పర్వదినం, ఒక శుభదినం. నీలాల నింగిలో తార వెలుగగా పాపపు చీకటి తొలగిపోయెను. దూతలంతా గళము విప్పగా, పాపి గుండె ప్రజ్వరిల్లెను, కాపరులంతా కలసి ఆడగా, పాపభీతి చెదరి పోయెను. అందుకనే,
ఆ జననం పగలిన గుండెకు నవ్య కిరణాలు వంటిది,
ఆ జననం చెదరిన మనసుకు ప్రేమ గీతాలు వంటిది,
ఆ జననం విరిగిన వీణకు కోటిరాగాలు వంటిది.

దారి తెలియక తిరుగుచుండగా వింత చుక్క దారి చూపెను. స్థలము కోసము వెదకుచుండగా, పశువుల పాక పలకరించెను, రాజులంతా శిరము వంచగా, దూత వార్త శరణమిచ్చెను, కన్య మరియ కడుపు పండగా, క్రీస్తు ప్రభువు జన్మించెను. అందుకనే.
ఆ జననం వెదకిన వారికి దొరికిన వరాలు వంటిది,
ఆ జననం అడిగిన వారికి పొందిన ఫలాలు వంటిది,
ఆ జననం తట్టిన వారికి తెరచిన ద్వారాలు వంటిది.

ఆ కన్య మరియ కడుపు పండగ జన్మించిన క్రీస్తు ప్రభువే, చీకటిని చీల్చిన చిన్నారి యేసు. ఈ పుడమిన పుట్టిన ఈ చిన్నారి యేసే, పాప చీకటిని ప్రజ్వలింప చేసి ప్రకాశవంతంగా మలచింది. ఈ చిన్నారి యేసే, నిశిరాత్రి సమయాన నీతి సూర్యునిలా ఉద్భవించి, పాప చీకటిని పఠాపంచలు చేసింది. ఈ సంఘటనను ఉద్దేశించే దాదాపు క్రీ.పూ. 700 సం. క్రితమే యెషయా ప్రవక్త ప్రవచనం పలికాడు: ‘‘చీకటిలో నడచు జనులు పెద్ద వెలుగును చూచిరి. దట్టమైన నీడులుక్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను’’ (9:2). ఈ వచనం మనకు అర్ధం కావాంటే, మనకు కొంత చారిత్రక నేపధ్యం తెలిసి ఉండాలి.

బహుశ, యెషయా ఈ వచనాన్ని లేదా ఈ వృత్తాంతాన్ని రచించినపుడు, ఆ రోజులో చోటు చేసుకున్న ఒక భయంకర సంఘటన తన మదిలో ఉండవచ్చు. ఆ సంఘటన ఏమంటే, ఇశ్రాయేలీయుల శత్రువు వారి మీదకు దండెత్తి వచ్చారు. ఈ దండయాత్రలో ఒక గొప్ప విధ్వంసాన్ని వారు సృష్టించారు. గ్రామాలను తగల బెట్టారు. పంటలను నాశనం చేసారు. వేలాది మందిని బానిసలుగా తీసుకు వెళ్ళారు. శత్రువులు వారిని బానిసలుగా ఎలా తీసుకు వెళ్ళారంటే, పొలం దున్నే కాడికి ఆవును ఎలా కడతారో ఆ మాదిరిగా నలుగురైదు బానిసలును ఒక కొయ్యకు కట్టి తీసుకొని వెళ్ళేవారు. ఆ సంఘటనను మన కళ్ళముందు చిత్రీకరించుకుంటే, ఆ బాధ వర్ణణాతీతం!

ఈ సందర్భంలోనే యెషయా ప్రవక్త ఈ వచనాలను వ్రాసాడు: ‘‘నీవు వారి మెడమీద కాడిని విరుగ గొట్టితివి. వారి భుజము మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి’’ (9:4). ఇలా బానిసత్వ చీకటిలో పయనించే నాటి ఇశ్రాయేలును ఉద్దేశించి, ‘చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును గాంచిరి’ అని ప్రవక్త ప్రవచించాడు. చీకటిని చీల్చే చిన్నారి యేసును గురించి తెలియజేస్తూ, యెషయా ఈ ఊరట వచనాలను పలికారు: ‘మనకొక శిశువు జన్మించును’ అని, ‘అతడు రాజ్య భారమును వహించును’ అని, రాబోవు రాజు గుణగణాలను తెలియచేశారు. అందుకనే, యేసు జననం అలసిన వారికి ఆశ్రయ స్థానంగా మారుతుంది.

యేసు జననం తండ్రి దేవుని ప్రేమ వర్ణవిల్లు: 
పాత నిబంధనలో చూసినట్లయితే, తండ్రి దేవుడు పాప జగతిని ప్రక్షాళన చేయడానికి జలప్రళయమును పంపించారు. జప్రళయము తరువాత, ‘‘దేవుడు నోవాను, అతని కుమారును దీవించి పిల్ల పాపలతో పెంపొంది భూమండలము నందంతట వ్యాపింపుడు’’ (ఆ.కాం. 2:9) అని దీవించి, ‘ఇకపై ఇటువంటి ప్రళయము సంభవించదు’ అని నోవాతో ఒడంబడిక చేసుకొని దానికి గుర్తుగా ఇంద్రధనస్సును ఇచ్చారు. అదేవిధంగా, పాప ఊభిలోనున్న జనావళిని రక్షించడానికి తండ్రి దేవుడు తన కుమారున్ని పంపారు. అందుకనే, ఆ జననం తండ్రి దేవుని ప్రేమ వర్ణవిల్లు అయింది. దీని అర్ధం ఏమంటే, మరణం ఇకపై మనమీద ఎటువంటి ఆధిపత్యం చెల్లించదు. ఎందుకంటే, శాశ్వత మరణానికి మనకి మధ్య యేసు అనే రక్షణ చిహ్నమైన వర్ణవిల్లు ఉన్నది. దానిని  ఉద్దేశించి యోహానుగారు ఇలా వ్రాసారు: ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించారు. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందును’’ (3:16).

యేసు జననం దేవుని త్యాగ సిరిజల్లు: 
సాధారణంగా, ఎప్పుడు పుడతామో, ఎలా మరణిస్తామో, ఎవరికీ తెలియదు. కాని యేసు ప్రభువు విషయంలో ఆయన ఎప్పుడు పుట్టేది, ఎవరి కడుపున జన్మించేది, ఎలా మరణించేది అన్న విషయాలు ఆయనకు విదితమే! ఇది రక్షణ ప్రణాళికలో భాగం! తాను భూలోకంలోనికి వచ్చింది దైవరాజ్యాన్ని స్థాపించి తన మరణము ద్వారా మనలను తండ్రితో ఐఖ్యం చేయడానికి అని ఆయనకు తెలుసు. కాని ఆయన వెనకడుగు వేయలేదు. అందుకనే, రక్షకుడైన యేసు జననం దేవుని త్యాగ సిరిజల్లు అయింది.

యేసు జననం ఆత్మదేవుని వరాల పొదరిల్లు: 
మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, రక్షణ ప్రణాళికలోని ప్రతి ఘట్టంలో త్రిత్వైక సర్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. యేసు ప్రభుని జననం కూడా అదేవిధంగా సంభవించినది. పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి వలన మరియమాత గర్భం ధరించింది. ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలై, దైవ వరముతో పరిపూర్తిగా నింపబడినది. దానినే లూకా సువార్తికుడు ఇలా తెలియజేశారు: ‘‘పవిత్రాత్మ శక్తి నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును’’ (1:35). అందుకనే, యేసు జననం ఆత్మదేవుని వరా పొదరిల్లు. ఇంకొక్క మాటలో చెప్పాంటే, చిన్నారి యేసుని జననం త్రిత్వైక సర్వేశ్వరుని సమిష్టి వరదానం.

క్రీస్తు జననం త్రిత్వం ఒసగిన ఒక గొప్ప బహుమానం. ఈ పండుగను మనమందరం ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో, సంతోషంతో జరుపుకుంటాం. కాని క్రిస్మస్‌ పండుగ ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళే పండుగలా ఉండకూడదు. ప్రతి క్రైస్తవుని జీవితంలో మార్పు తీసుకొని రావాలి. పునీత పౌలుగారు తీతుకు రాసిన లేఖ ద్వారా ఇలా తెలియ జేయుచున్నారు: ‘‘శక్తిహీనతను, లౌకిక మోహమును విడనాడి, ఇంద్రియ నిగ్రహము కలిగి ఋజుమార్గమున, పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది’’ (2:12). కావున ప్రియ మిత్రులారా! చీకటిని చీల్చిన చిన్నారి యేసు, మన గుండెల్లో, మన జీవితంలో ఉంటే ఆయన అనుగ్రహించే కృపానుగ్రహము చేత మనము ఎట్టి కార్యమునైనను సాధింపవచ్చు. కనుక, మనమందరం, చిన్నారి యేసయ్యా, రావయ్యా అని ఆహ్వానిస్తూ, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వవయ్యా అని ప్రార్ధించుదాం!

No comments:

Post a Comment