తిరుకుటుంబ మహోత్సవము, Year A

తిరుకుటుంబ మహోత్సవము, Year A
సీరా. 3:2-6, 12-14; కొలొస్సీ. 3:12-21; మత్త. 2:13-15, 19-23


ఉపోద్ఘాతం: నేడు మనం యేసు, మరియ, యోసేపుల తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. ఈనాడు మన తల్లి శ్రీసభ తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతు మనందరినీ తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించమని తెలియజేస్తున్నది. ఈ మేరకు తిరు కుటుంబ (మరియతల్లి, జోజప్ప, బాలయేసు) సుగుణాలను మనంకూడా ఆదర్శంగా తీసుకొని అలవర్చుకొని జీవించుటకు ప్రయాసపడదాం.

కాలం మారింది. పరిస్థితులు మారాయి. ఆశలు, ఆలోచనలు, అంతిమ లక్ష్యాలు మారాయి. జీవిత ప్రయాణం వేగవంతం అయింది. వైజ్ఞానిక పురోగమనంలో జీవితం ఓ యాంత్రికంగా మారింది. వ్యక్తులకు చూపించవలసిన గౌరవం, ఇవ్వవలసిన విలువ, వస్తువులోకి మారిపోయింది. స్నేహితునికంటే, సెల్‌ఫోన్‌ ముఖ్యమైంది. మిత్రుడు క్రిందపడిపోతే లేవనెత్తే సమయం లేదుగాని, మత్తుమైకంలో, వస్తువ్యామోహంలో పడిపోవడానికి సమయాన్ని వెదుకుతున్నాడు ఈనాటి మానవుడు. కుటుంబంలోని పరిస్థితులు ఇందుకు భిన్నమేమి కావు. అలా అని అన్ని కుటుంబాలు ఇటువంటి దుర్భరస్థితిలో ఉన్నాయని కాదు. అయితే, కుటుంబ విలువలు మారుతున్నాయని, ఆప్యాయత అనురాగాలు సన్నగిల్లుతున్నాయని, పరస్పర అవగాహన, అంగీకారం చేజారిపోతున్నాయని మాత్రం మనం నేటి ప్రస్తుత కామాన పరిస్థితును గమనిస్తే అర్ధం అయ్యే ఒక నిజ సత్యం! మరి, ఈ తరుణంలో మన కుటుంబాలు నజరేతు పవిత్ర కుటుంబమును పోలి జీవించడం ఎంతో ఆవశ్యకమైనది, ఉత్తమమైనది!

కుటుంబాలు సమాజానికి పట్టుకొమ్మలు, పునాదులు. కుటుంబాలు బాగుంటే, సమాజం బాగుంటుంది. కుటుంబ వ్యవస్థను దేవుడే స్వయముగా ఏర్పాటు చేసాడు (ఆది. 2:20-25, 4:1; నిర్గమ. 20:5-6; యెహోషు. 7:10,15,24-25; 2 రాజు. 13:23). ప్రతీ కుటుంబము కూడా, దేవుడు ఏర్పాటుచేసిన వివాహము అనే దివ్యసంస్కారముద్వారా ఏర్పడుతుంది. కుటుంబములోని వ్యక్తుల నిబద్ధత కలకాలంఉన్నప్పుడే ఆ కుటుంబాలు కలకాలం నిలుస్తాయి. నేడు విడాకులు తీసుకోవడం సాధారణం అయింది, కాని, మలాకీ ప్రవక్త ద్వారా, "నేను విడాకులను అసహ్యించు కొందును" (2:16) అని దేవుడు స్పష్టం చేయుచున్నాడు. కష్టాలు, అపార్ధాలు, శ్రమలు, సర్వసాధారణం. వాటిని ఎదుర్కొని నిలబడగలిగేదే, దేవుడు మెచ్చుకోదగ్గ కుటుంబం. నజరేతు తిరు కుటుంబం, ఏకైక పరిపూర్ణ కుటుంబం. ఆ కుటుంబమును ఆదర్శముగా తీసుకొని, జీవించుదాం!

పవిత్ర తిరుకుటుంబం
దేవుని ప్రియ కుమారుడు ఈ లోకంలో ప్రవేశించిన మరుక్షణమే మనకిచ్చిన వెకట్టలేని, అత్యంత విలువైన, అమరమైన బహుమానం, తిరుకుటుంబం. ఈ భువిలో దివ్యమైన దేవుని ఉచితమైన, ఉదారమైన ఓ కానుక, పవిత్ర కుటుంబం. ప్రియ కుమారుని అత్యంత ప్రియమైన మొట్టమొదటి బహుమానం, ముచ్చటైన బహుమానం మహిమగ బహుమానం, యేసు, మరియ, యోసేపుల నజరేతు పవిత్ర కుటుంబం. పరస్పర విశ్వాసమున్న సభ్యుమధ్య ఏర్పడే ఘనమైన అనురాగమే కుటుంబం. ఆ కుటుంబానికి ప్రేమ, ప్రతీక, విశ్వాసం పునాది. క్రీస్తు ప్రభువు మత్తయి 7:24లో ఇలా తెలియజేశారు: ‘‘తన ఇంటిని (కుటుంబాన్ని) రాతి పునాదిపై (విశ్వాసం) నిర్మించుకున్నవాడే బుద్ధిమంతుడు (ఆత్మ స్వరూపుడు). అటువంటి కుటుంబాన్ని ఇటుక గోడలు ఆపలేవు, ఇసుక పునాదు ఆదుకోలేవు. 

యేసు, మరియ, యోసేపుల కుటుంబం ఓ పవిత్ర కుటుంబం. కారణం, వారు ఇహలోక నివాసముపై ఆధారపడలేదు. కాని, పరలోక విశ్వాసంపై తమ జీవితాన్ని నిర్మించుకున్నారు. అదేవిధంగా, కుటుంబం ఒక ప్రార్ధనా సమాజం. ప్రార్ధన చేసుకోవడమే కాదు, కలిసి ప్రార్ధించడం చాలా ముఖ్యం. దివ్యబలిపూజ, దివ్యసత్ప్రసాదము, ఇతర దివ్యసంస్కారముల యెడ ముఖ్యముగా ఆదివారాలో కుటుంబసమేతముగా పాల్గొనాలి. నైతిక విలువలు, ఆధ్యాత్మిక ప్రభావాలు, సాంఘిక పుణ్యక్రియలు వంటివి మొదట నేర్చుకొనేది కుటుంబంలోనే! విశ్వమానంగ శక్తి, చనువుగ ప్రేమ కుటుంబంలోనే తప్ప ఆ అనుభవాన్ని మరెక్కడ పొందలేరు. ఇక్కడే వ్యక్తిగత, సాంఘిక కోణాలో జీవితం మొదలవుతుంది, బలపడుతుంది. ఇక్కడనే బిడ్డలు ఆరోగ్యకరమైన ఆత్మగౌరవాన్ని నేర్చుకుంటారు. తమ భావాను ఎలా వ్యక్తంచేయాలోనన్న తర్ఫీదు పొందేది, ఆధ్యాత్మిక సత్యాలను జీర్ణించుకొని, వంటబట్టించుకొనేది, దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొనేది కుటుంబములోనే!

యోసేపు: వండ్రంగి అతని వృత్తి. దీనితోనే, కుటుంబాన్ని పోషించాడు. కష్టజీవి. భర్తలకు, తండ్రులకు ఆదర్శమూర్తి! దేవునికి విధేయుడై జీవించాడు (మత్త. 1:24). యోసేపు ప్రేమగల తండ్రి. కుటుంబాన్ని అన్ని ఆటంకములనుండి సంరక్షించుకొనే తండ్రి. హేరోదునుండి, బాలయేసు ప్రాణాలను కాపాడిన తండ్రి. తన వృత్తిని కుమారునకు నేర్పి సమాజిక జీవనాన్ని నేర్పిన తండ్రి. యోసేపు నీతిమంతుడు. దేవుని చట్టాన్ని, ఆజ్ఞలను పాటించిన వ్యక్తి: జనాభా లెక్కలకోసం బెత్లెహేము వెళ్ళాడు. ఎనిమిది దినములు గడచిన పిమ్మట, శిశువుకు సున్నతి చేసిరి. దేవాలయములో కానుకగా బాలయేసును సమర్పించాడు. ప్రతీ సంవత్సరం, పాస్కా పండుగకు, కుటుంబ సమేతముగా యెరూషలేము దేవాలయమునకు వెళ్ళారు. యోసేపు, ఎల్లప్పుడు దేవుని చిత్తాన్ని పాటించాడు. భర్తగా, మరియకోసం ఎన్నో త్యాగాలు చేసాడు. ఎవరైతే  యోసేపువలె జీవిస్తూ తమ ఇల్లాలును ఎటువంటి కష్టంరాకుండా చూసుకుంటారో వారుకూడా దేవుని దృష్టిలో నీతిమంతులు అవుతారు, అధిక దీవెనలు పొందుతారు. కుటుంబంకూడా ప్రేమానురాగాలతో అలరారుతోంది.

మరియ: దేవుని చిత్తాన్ని ఎరిగి, దైవకుమారున్ని తన గర్భములో మోసింది. అందరి అమ్మలవలెనె, మరియకూడా బాలయేసును అల్లారుముద్దుగా పెంచింది. ప్రేమానురాగాలను పంచింది. అందరివలె కుటుంబాన్ని చక్కదిద్ధించి. మరియ గొప్ప తల్లి. బాలయేసు యెరూషలేములో తప్పిపోయినప్పుడు ఎంతగానో తల్లడిల్లి పోయింది. యేసు ప్రాయములోను, జ్ఞానములోను ఎదుగుటకు ఎంతో తోడ్పడింది (లూకా. 2:52). యేసు ప్రేషిత కార్య సంసిద్ధతలోకూడా మరియ తోడ్పడింది. సిలువ వరకు కుమారుని శ్రమలలో పాల్గొన్నది. ప్రధమ శిష్యురాలిగా యేసును అనుసరించినది.  కుమారుని చిత్తం ప్రకారం, ఆమె అందరికి (తిరుసభకి) తల్లి అయినది. నేటి కాలంలో గృహిణులందరికీ మరియతల్లి జీవితము ఒక ఆదర్శం. మరియతల్లి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలి. ఒక మంచి ఆదర్శ గృహిణిగా యోసేపుతో కలిసి జీవించారు. ప్రతి గృహిణి కూడా మరియతల్లి వలె ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. భర్తను పిల్లలను  ప్రేమించాలి.

యేసు: తన బహిరంగ జీవిత ప్రారంభం వరకు, తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. వారికి విధేయుడై జీవించాడు. కుటుంబ కష్టాలను పంచుకున్నాడు. యోసేపుతో కష్టించి పనిచేసి సహాయం చేశారు. అలాగే, ఆధ్యాత్మిక విషయాలలోకూడా ఎదిగాడు. సిలువ శ్రమలలో మరణించేముందు మరియతల్లిని ఒంటరిగా చూడటం ఇష్టంలేక తన ప్రియశిష్యుడు యోహానుకు తన తల్లి బాధ్యతలను అప్పగించారు. ఈరోజు ఎంతమంది క్రీస్తువలె తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వయసు పైబడిన తరువాత వారు ఉండవలసింది వృద్ధాశ్రమాలలో కాదు, మన హృదయాశ్రమాలలో అని గ్రహించాలి.

ప్రతి క్రైస్తవ కుటుంబం, తిరుకుటుంబాన్ని ఆదర్శముగా తీసుకోవాలి. భర్త యోసేపుగా, భార్య మరియగా, పిల్లలు యేసుగా ప్రవేశంచేయాలి. అనేక సమస్యలు, అవరోధాలు తిరుకుటుంబంలో వచ్చినట్లే మనం కుటుంబంలోకూడా వస్తాయని ఈ సందర్భంలో గుర్తించాలి. అనాడు ఏ కుటుంబం అనుభవించని కష్టనష్టాను, పవిత్రకుటుంబం అనుభవించినది. ఒక నిండు చూలాలు, అప్పుడే ప్రసవించిన స్త్రీ, ఎముకలు కొరికే చలిలో బెత్లెహేమునుండి ఐగుప్తుదేశానికి ప్రయాణం! హేరోదురాజు తన సామ్రాజ్యంలో పుట్టిన మగబిడ్డను చంపమని ఆజ్ఞ జారిచేసినప్పుడు, మరియ, యోసేపు లోకరక్షకుడైన క్రీస్తుని సంరక్షించి, మనకు రక్షణను ప్రసాదించడానికి దోహదపడ్డారు. కనుకనే, నజరేతు కుటుంబం ఒక వర్ణనాతీత కుటుంబం! ఒక సువర్ణ కుటుంబం! ఆ తిరుకుటుంబ లక్షణం - విశ్వాసం, ఆ తిరుకుటుంబ క్ష్యం - ఆత్మీయం, ఎందుకంటే, ఇహలోక కష్టాలు, ఇబ్బందులు, అజడులు, అపార్ధాలు, ఆ కుటుంబంలోని విశ్వాసాన్ని విచ్చిన్నం చేయలేవు. ఇహలోక ఆలోచనలు, ఆరాటాలు, అంతస్తు, అపవిత్రత, ఆశుద్ధత, ఆ కుటుంబంలోని ఆత్మీయతను అపహరించలేవు. తద్వారా, మన కుటుంబాలు ఈ తల్లియైన శ్రీసభలో నజరేతు కుటుంబమువలె విశ్వాస - ఆత్మీయతకు ఆయంగా నిలవాలి.

తిరు కుటుంబము నుండి నేర్చుకోవలసింది: మరియ యోసేపులు కష్టజీవులు. ఒకరికొకరు తోడుగా, సహాయముగా ఉన్నారు. ఒకరినొకరు అర్ధము చేసుకున్నారు. బాలయేసును ఎంతో ప్రేమగా, ఆప్యాయముగా పెంచారు. బాలయేసు ఆ కుటుంబమునకు పవిత్రతను ఆపాదించారు.

కుటుంబములో తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతలు
నేటి మొదటి పఠనము, తల్లితండ్రులను గౌరవించాలి అని బోధిస్తుంది. ఇది బిడ్డల బాధ్యత. తల్లిదండ్రులను గౌరవించువారికి, దేవుడు వరాలను వాగ్దానం చేసాడు. "తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసికొనినట్లే. తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే" తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే" (3:3-6).

"మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయిన మీ దేవుడయిన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు" (నిర్గమ. 20:12) అని పది ఆజ్ఞలలో చూస్తున్నాము. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో ఈ విధముగా తెలియజేయు చున్నాడు: (1). బిడ్డలారా! ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. (2). నీ తల్లిదండ్రులను గౌరవింపుము (ఇది వాగ్ధానముతో కూడిన ఆజ్ఞ) (3). ఆ వాగ్దానం: నీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిరకాలము వర్దిల్లుదువు. కుటుంబములో తల్లిదండ్రులుకూడా బిడ్డలకు ఆదర్శముగా ఉండాలి. (4). తండ్రులారా! మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను, ప్రభువు బోధనలోను పెంచుడు (ఎఫెసీ. 6:1-4). పౌలు కొలొస్సీయులకు వ్రాసిన లేఖలో ఇలా చెప్పుచున్నాడు, "బిడ్డలారా! మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోను విధేయులగుడు ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము" (3:20). దేవుని అనుమతితోనే ఇలాంటి అధికారాలు మనకు ఇవ్వబడినవని పౌలు రోమీ. 13:1లో తెలియజేయు చున్నాడు. మనకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు కనుక వారిని మనం గౌరవించాలి. 

కతోలిక సత్యోపదేశం: ఈ క్రింది తల్లిదండ్రుల బాధ్యతలను తెలియజేయు చున్నది: తల్లిదండ్రుల ప్రధమ బాధ్యత తమ బిడ్డలకు విద్యను అందించడం. సున్నిత హృదయం, క్షమాగుణం, గౌరవం, విశ్వాసం, నిస్వార్ధమైన సేవలనే నియమంగాగల గృహముగా ఇంటిని తీర్చిదిద్దాలి. పిల్లలకు సుమాతృక ఇవ్వడం తల్లిదండ్రుల ఘన బాధ్యత. పిల్లల ముందు తమ తప్పులను అంగీకరించడంద్వారా, పిల్లలను మంచిగా నడిపించగలరు, తప్పులను సరిదిద్దగలరు (నం. 2223).

క్రైస్తవ కుటుంబాలు ప్రభువు, రక్షకుడు అయిన క్రీస్తుతో సత్సంబంధం కలిగి యుండాలి. వారి కుటుంబాలకు అధిపతిగా అంగీకరించాలి. కుటుంబాలను ఆయన తిరు హృదయానికి అంకితం చేయాలి. భార్య భర్తల మధ్య సంబంధం గురుంచి పౌలు ఎఫెసీ. 5:22-26లో తెలియజేసారు. క్రీస్తు తిరుసభను ప్రేమించినట్లే, భర్త భార్యను ప్రేమించాలి. భార్య భర్తను గౌరవించాలి.

చివరిగా, లోకమంతా దేవుని కుటుంబమే! అందరూ మన సోదరులే అన్న భావన కలిగి జీవించాలి. అప్పుడే, మనలో శాంతిసమాధానం ఉంటుంది.

దేవుడు మన కుటుంబాలను దీవించును గాక!

No comments:

Post a Comment