ఆగమన కాల 3వ ఆదివారము, Year A

ఆగమనకాల 3వ ఆదివారము
యెషయ 35:1-6, 10; యాకో. 5:7-10; మత్త. 11:2-11
ప్రభువు నందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను. ఆనందింపుడు!” (ఫిలిప్పీ. 4:4).

 ఆగమన కాలములో క్రీస్తురాకకై ఎంతో ఆశగా ఎదురుచూచు చున్నాము. మనం ఎదురుచూసే సంఘటన సంతోషకరమైనది. అందుకే, నేటి ధ్యానాంశం: పవిత్రాత్మ ఫలమైన ఆనందము’. ఈ ఆదివారము చాలా ప్రత్యేకమైనది, దీనిని GAUDETE SUNDAY అని అంటారు. ఆనందించండిఅని దీని అర్థము. ప్రభువునందు మీరు ఎల్లప్పుడు ఆనందించుడి. మరల చెప్పుచున్నాను ఆనందించుడి” (ఫిలిప్పీ. 4:4) అను వచనము ఆధారముగా ఈరోజు దివ్యార్చన జరుపబడుతుంది. అందుకే ఆనందమునకు చిహ్నముగా గురువు గులాబిరంగు పూజావస్త్రము ధరిస్తారు. అదే రంగు ఆగమన కాల క్రొవ్వత్తి వెలిగించబడుతుంది. దీనిని గొల్లల క్రొవ్వత్తి లేక ఆనందపు క్రొవ్యత్తి’ (Shepherd's Candle) అని అంటారు. ఆగమనకాల మొదటి ఆదివారము ప్రభువు మరల రానున్నాడు అనే నమ్మకమును గురించి ధ్యానించి, రెండవ ఆదివారము, యెషయ ప్రవక్తద్వారా ప్రవచించబడిన దైవకుమారుడే బెత్లెహెములో జన్మించాడు అను విశ్వాసమును బలపరచుకుని, “ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు, ఆయనలో ఉంటే కలదు ఆనందంఅని ధ్యానించమని ఈ మూడవ ఆగమనకాల ఆదివారమున, తల్లి శ్రీసభ మనలను ఆహ్వానించుచున్నది.

రాబోవు వాడవు నీవా! (మత్త. 11:3)

చెరసాలలోనున్న బప్తిస్మ యోహాను, క్రీస్తు కార్యకలాపములను, అనగా కొండమీద బోధనలు (మత్త. 5-7 అధ్యాయాలు), అద్భుతాలు (మత్త. 8-9 అధ్యాయాలు) గూర్చి విని, శిష్యులను యేసు వద్దకు పంపి, “రాబోవు వాడవు నీవా! లేక మేము మరియొకని కొరకు చూడవలెనా?” అని ప్రశ్నించాడు. క్రీస్తుఅనగా అభిషిక్తుడుఅని అర్ధము. హీబ్రూలో మెస్సయాఅని అర్ధము. పాత నిబంధనలో రాజులు, యాజకులు ప్రత్యేక విధినిర్వహణ కొరకు ఎన్నుకోబడి అభిషేకింపబడేవారు. యూదులు, రక్షణ కొనివచ్చు మెస్సయా’ (అభిషిక్తుడు) కోసం ఎదురు చూసారు. అయితే, దావీదువలె గొప్ప రాజుగావస్తాడని భావించారు. ఈ నేపధ్యములోనే, యేసును, పైప్రశ్న అడగటం జరిగింది.

అయితే, ఇలాంటి ప్రశ్న బప్తిస్మ యోహాను అడగటం ఒకింత ఆశ్చర్యమే! ఎందుకన, “ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు” (3:3) అని ఎలుగెత్తి పలికాడు. యేసును వారించుచు, “నేనే నీచేత బప్తిస్మము పొందవలసిన వాడను. అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా?” (మత్త. 3:14) అని అన్నాడు. యేసు బప్తిస్మము పొందినప్పుడు, ఆకాశమునుండి వినిపించిన దివ్యవాణికి (మత్త. 3:17) యోహాను సాక్ష్యమయ్యాడు. యేసు తన వద్దకు వచ్చుట చూచి, “ఇదిగో! లోకపాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల” (యోహాను. 1:29) అని పలికాడు. అలాంటి యోహాను, “రాబోవు వాడవు నీవా?” అని యేసును ఎందుకు ప్రశ్నించాడు? కారణం, మెస్సయా గూర్చిన యూదుల అంచనాలు నెరవేరకపోవడం! (హింసలు, శ్రమలు రూపుమాపడం, పేదరికాన్ని నిర్మూలించడం, రోమనులను జయించి, నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం). అలాగే, యేసు యెరూషలేములోగాక, గలిలీయ ప్రాంతములో తన ప్రేషితకార్యమును కొనసాగించడం (మత్త. 4:12). ఈ నేపధ్యములో యేసు నిజముగా మెస్సయాయేనా అని యోహాను అడగటం జరిగింది.

సమాధానముగా యేసు, “పోయి, మీరు వినుచున్న దానిని, చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. కుష్టరోగులు శుద్దులగుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. మృతులు పునరుత్థానులగుచున్నారు. పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు” (మత్త. 11:4-6) అని ప్రత్యుత్తర మిచ్చారు. మొదటి పఠనములోని యెషయ ప్రవచనాలు (35:4-5) యేసు ప్రేషిత పరిచర్యలో నెరవేరాయి. యేసు మెస్సయాగా, తీర్పు తరువాత వచ్చు దేవుని కృప, దయను ముందుగానే స్వస్థత ప్రేషితకార్యముద్వారా తెలియజేయుచున్నాడు. హింసలను, శ్రమలను ప్రేమ, కరుణలతో జయిస్తున్నాడు (యుద్ధము, హింసతో కాదు). ప్రభువు చెప్పినట్లుగా, నేడు మనము సువార్తలో చెప్పబడిన దానిని వినాలి. యేసు క్రీస్తే సత్యము, దేవుని జ్ఞానము. క్రీస్తులో రక్షణకార్యము ప్రారంభమైనది. తన రెండవ రాకడతో అది పరిపూర్ణమవుతుంది.

నిరాశలోనూ ఆశావహ జీవితం

ఇహలోక జీవితము క్షణభంగురమే అయినా, అందులో ఎన్నో ఇక్కట్లు-ఇబ్బందులు, ఒడుదుడుకులు, కష్టనష్టములు, రోగబాధలు తిష్టవేసుకుని ఉంటాయి. చివరికి దైవకుమారుడు మానవుడిగా అవతరించినపుడు తప్పలేదు, తనకుకూడా ఈ తిప్పలు. అయితే ఎక్కువశాతం మానవులు ఇటువంటి పరిస్థితులు ఎదురైనపుడే దేవుని ఆశ్రయిస్తారు. ఏదేమైనా కష్టములో ఉన్న వారందరికీ, ఈనాటి మొదటి పఠనమే ఒక చక్కని ఓదార్పు సందేశము. ఎండిన ఎడారి సంతసించునుగాక. మరుభూమి ప్రమోదముచెంది పుష్పించునుగాక” (యెషయ. 35:1). ఎడారి నిరాశకు చిహ్నము. ఎడారి ఎండ తీవ్రత, దాహం, నీటికొరత, నీడకొరత, తిండికొరత మొదలగు లోటుపాటులతో ఉంటుంది. కాని ప్రభువు అటువంటి నిర్జీవ ఎడారిలో సహితము, జలములు పారించు శక్తిగలవాడు. వారు సంతోషముతోను, ప్రమోదముతోను వత్తురు. వారి దు:ఖ విషాదములెల్ల తొలగిపోవును” (యెషయ. 35:10). మన ప్రభువు దయగలవాడు, సాధుశీలుడు, వినమృడు, అత్యంత సున్నిత హృదయుడు (మత్త. 11:29). ఆయనను విశ్వాసముతో ఆశ్రయించు వారిని విడువక రక్షించు గొప్పదేవుడు. వానిని నేనెన్నడూ త్రోసివేయను” (యోహాను. 6:37). నిరాశ సమయములో ఆశగలిగి జీవించడమే క్రైస్తవ జీవితం. ఎందుకంటే, మన దేవుడు సజీవుడు. ప్రతి క్రైస్తవుడూ దేవునిలో ఆనందించాలి, ఆనందించి తరించాలి.

సహనము-సంతోషము

ప్రస్తుత కాలములో అన్నీ వేగము అనే ఇరుసు చుట్టూ పరుగిడుచున్నవి. రానురానూ మనిషిలో సహనము నశించిపోవుచున్నది. ఎదురుచూడడం అనేది కష్టమగుచున్నది. ఈనాటి రెండవ పఠనములో యాకోబు (5:7-10) రైతు పంటకొరకు ఎదురు చూచునట్లు ఓపికతో వేచియుండుడి, సహనమును పాటింపుడుఅని బోధించుచున్నాడు. ప్రపంచము అభివృద్ధి చెందాలి, ఉత్పత్తి, సరఫరా వేగవంతమవ్వాలి. అది నిజమే! కాని ఆధ్యాత్మిక జీవితములో, కుటుంబజీవితములో సహనము, ఓర్పు అనే పవిత్ర గుణము చాలా అవసరము. అత్యంత పవిత్రుడైన దేవుడే పాపులమైన మనపట్ల సహనము కలిగి, మనకోసం అవతరించి, మరణిస్తే, అన్ని దుర్గుణములుగల మానవుడు ఇతరులపట్ల చివరకు తన సొంత కుటుంబ సభ్యులపట్ల ఓర్పును పాటించలేడా? గొప్పగొప్ప సంగతులు నెమ్మదిలోనే సాధ్యపడును. సహనము కలిగినపుడే పరిపూర్ణ ఆనందమును సాధ్యమవుతుంది. సహిస్తేనే సంతోషించగలము.

బప్తిస్త యోహాను గొప్పతనం - సాక్ష్యం

ఈనాటి సువిశేషములో (మత్త. 11:2-11) బప్తిస్త యోహాను గురించి, క్రీస్తు ఇచ్చే సాక్ష్యమును చూస్తున్నాము. అతడు మానవులందరిలో గొప్పవాడు (మత్త. 11:11). నా దూత! నా మార్గమును సిద్ధము చేయువాడు (మత్త. 11:10). ఓ క్రైస్తవా! నిజముగా అతడు బహు గొప్పవాడు. ఎందుకంటే, అతడు ప్రభువు మార్గమును సిద్ధము చేస్తున్నాడు. ప్రభువు సాక్షిగా జీవించుచున్నాడు.

అయితే, పరలోక రాజ్యములో మిక్కిలి తక్కువయైనవాడు అతనికంటె గొప్పవాడు (మత్త. 11:11). ఆయనయే ఈనాడు మనకు ఆదర్శం. మనం క్రైస్తవులుగా మన మాటలో, చేతలో, మన సంఘములో, మన కుటుంబములో, మన పని స్థలములో క్రీస్తు అనుయాయులుగా, అనుచరులుగా, శిష్యులుగా ఉండగలుగుచున్నామా? ఇతరులకు మంచి ఆదర్శమును మన ప్రవర్తనద్వారా చూపించగలుగు చున్నామా? మన కార్యములే మనకు పరలోక ప్రాప్తిని కలుగజేస్తాయి. కావున ప్రభువుని విశ్వసించే మనము, క్రీస్తు అడుగుజాడలలో, ఆయన మార్గములో, సత్యములో, జీవములో జీవించినట్లయితే పరలోకరాజ్య వారసులమవుతాము. అందుకు ఆనందించుదాం! ప్రభు సాక్షులుగా జీవించ ప్రయత్నించుదాం!

క్రైస్తవులముగా, క్రీస్తు రాకడపట్ల మనం ఎంతో ఆనందిస్తాము. దేవుడు మనుష్యావతారుడై మన మధ్య వసించుచున్నందున, నిజముగా మనం ఆనందపడాలి. ఆయన రాకకై, ఆగమనకాలం మనలను సంసిద్ధం చేయుచున్నది. ఆయన వచ్చినప్పుడు, మనకు సంపూర్ణ జీవితమునొసగును.

No comments:

Post a Comment