34వ సామాన్య ఆదివారము – క్రీస్తురాజు మహోత్సవము, Year C

34వ సామాన్య ఆదివారము – క్రీస్తురాజు మహోత్సవము, Year C

మనం క్రీస్తురాజు మహోత్సవమును జరుపుకొనుచున్నాము. ఈ సందర్భంగా మనం విన్న మొదటి పఠనమును ధ్యానించుకుందాం! ఈ పఠనము యొక్క సందర్భమును, సందేశమును తెలుసుకుందాం!

సందర్భం: ఇస్రాయేలీయులకు ఫిలిస్తీయులకు మధ్య జరిగిన యుద్ధంలో సౌలురాజు, అతని కుమారులు మరణించారు (1 సమూ. 31). ఇస్రాయేలీయులు తమ గొప్ప నాయకులను, వారి మొదటి రాజుని (సౌలు) కోల్పోయినారు. సౌలు తరువాత తమను కాపాడగల నాయకుడు దావీదేనని, అతడు దేవునియొక్క కృపను పొందినాడని వారు గట్టిగా నమ్మారు. అందుకే, ఇస్రాయేలీయుల తెగల నాయకులందరూ కలిసి దావీదు యొద్దకు వచ్చి తమకు రాజుగా, నాయకుడుగా, కాపరిగా ఉండమని ప్రాధేయపడ్డారు. దావీదు మాత్రమే ఈ పదవికి అర్హుడని వారందరు గట్టిగా నమ్మారు. దానికి వారు కారణాలు తెలిపారు: (i) దావీదు వారి రక్త సంబంధుడు గనుక (2 సమూ. 5:1). (ii) పౌలు పరిపాలన సమయంలో ఇస్రాయేలు సైన్యనాయకుడు గనుక (2 సమూ. 5:2, 1 సమూ. 16:13). దావీదు వారి విన్నపమును మన్నించి, వారికి నాయకుడుగా రాజుగా, కాపరిగా యుండుటకు అంగీకరించాడు. దేవుని సమక్షంలో వారితో ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నాడు. ఈవిధంగా, 7 సం.లు. హేబ్రోనులో రాజుగానున్న దావీదు యెరూషలేముకు రాజుగా వచ్చి ఇస్రాయేలీయులందరి మీద ముప్పదిమూడు సం.లు. రాజుగా ఉండి వారిని పాలిస్తున్నాడు. క్రీస్తురాజు మహోత్సవంను జరుపుకొనుచున్న మనం దావీదు ఎలా రాజు అయ్యాడో తెలుసుకొని సందేశాన్ని ఆలకించుదాం.

సందేశం: దావీదు ఇస్రాయేలీయుల రాజగుటకు, వారిని సుదీర్ఘకాలం పరిపాలించుటకు ముఖ్య కారణం - అతడు దేవునకు ప్రీతికరమైన వాడగుటచే, దేవునకు నచ్చినవాడగుటచే (1 సమూ. 13:14, అ.కా. 13:22). దావీదు ఎలా దేవునికి ప్రియమైన వాడయ్యాడు? దేవుడు తనకు చూపిన కృపకు ఎలా స్పందించాడు? దావీదు రాజుకు, క్రీస్తు రాజుకు ఉన్న సామీప్యము, వ్యత్యాసాలు ఏమిటి?

దావీదు మొదటినుండి దైవభయముగలవాడు. ఆ దైవభీతితో దేవుని సహవాసమును పొంది, దేవుడిచ్చిన శక్తితో అతనికి అడ్డు వచ్చిన శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడాడు. దేవునియొక్క సహవాసమే (దైవభయం) అతనికి విజయాన్ని చేకూర్చింది. దేవునికి, దేవుని మాటకు దావీదు చూపిన వినయ, విధేయతలే అతన్ని సింహాసనంపై కూర్చుండబెట్టింది. విధేయతే అతని సుదీర్ఘకాలం రాజుగా, దేవుని ప్రతినిధిగా, సేవకుడిగా మన్ననను పొందగలిగేలా చేసింది. దేవుడు అతనికి చేదోడువాదోడుగా ఉండటం వలెనే అతడు కీర్తిప్రతిష్టలు సంపాదించగలిగాడు. ఎప్పుడైతే, అతడు దేవునితో సంప్రదింపులు మానివేశాడో, అప్పుడే అతని పతనం మొదలైంది. ఎప్పుడైతే, స్వతంత్రంగా రాజ్యాన్ని పాలించడం ఆరంభించాడో, అప్పుడే అతని జీవితం మసకబారి పోయింది. ఎప్పుడైతే, ఇశ్రాయేలు రాజ్యం, అధికారం తన సొత్తు అనుకోవడం ఆరంభించాడో అప్పుడే దేవున్ని, దేవుని అధికారాన్ని నిర్లక్ష్యం చేయడం ఆరంభించాడు. నిజమైన అధికారం దేవునిది! తనకు ఇష్టంవచ్చినట్లు జీవించడం ఆరంభించాడు. పాపం చేశాడు. తన పతనానికి తన అధోగతికి తానే కారకుడయ్యాడు. తన ఐశ్వర్యంలో, అధికారంలో దేవున్నే నిజమైన రాజుగా, కాపరిగా, ప్రజలకు అండగా గుర్తించలేకపోయాడు. గుర్తించ లేనంతగా అతని హృదయదృష్టి మందగించింది. అందుచేత, దేవున్ని మరచిపోయి తనకు యిష్టము వచ్చినట్లుగా తన ఆలోచనలకు అనుగుణంగా నడచుకున్నాడు. ఆవిధంగా, దేవుని నుండి, తన నుండి దూరమయ్యాడు.

దానికి భిన్నంగా, క్రీస్తురాజు అన్ని సందర్భాలలో దేవున్ని అంటిపెట్టుకొని యున్నాడు. సర్వదా అతనికి విధేయుడై యున్నాడు (ఫిలిప్పీ. 2:5-11). కష్టమైనా, నష్టమైనా దేవుని చిత్తాన్ని ఇష్టపడ్డాడు. అందుకే అతడు ‘‘తండ్రీ, నీ చిత్తమైనచో ఈ పాత్రను నానుండి తొలగింపుము. కాని నా యిష్టము కాదు. నీ చిత్తమే నెరవేరును గాక’’ (లూకా 22:42) అని ప్రార్ధన చేయగలిగాడు. తండ్రి చూపిన సిలువమార్గమునకు వెళ్ళగలిగాడు. ఈ బాధాకరమైన శ్రమలమార్గంలో తండ్రిచిత్తాన్ని దైవనిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. సైనికులు హింసిస్తున్న, యూదులు గేలిచేస్తున్న, దారిన పోయేవారు వెక్కిరిస్తున్న, తండ్రి దేవుని ప్రణాళికను, చిత్తమును తప్ప మరేమీ ఆయనకు కనబడలేదు. అందుకే, యేసుతోపాటు సిలువ వేయబడిన దొంగ, సిలువమీద దిగంబరంగా కొనఊపిరితో ఉన్న యేసులో రాజును చూడగలిగాడు (లూకా. 23:36-43). 

రాజంటే పరులను అధికారముతో, ఆదిపత్యముతో పాలించడం కాదు. తండ్రి దేవుని మాటను, చిత్తాన్ని పాటించడం’. రాజంటే అధికారం చెలాయించడం కాదు. అందరి ఆదరణ, తండ్రియొక్క ఆత్మీయతను పొందడం. రాజంటే స్వతంత్రంగా వ్యవహరించడం కాదు, స్వతంత్రంగా తండ్రిచిత్తానికి అప్పగించుకోవడం. రాజంటే సేవలు చేయించుకోవడం కాదు, సేవలు చేయడం అని క్రీస్తురాజు మనకు నేర్పించాడు. అందుకే, యేసు తండ్రికి ప్రియమైనవానిగా నిలిచియున్నాడు. కాని దావీదు దానిని పోగొట్టుకున్నాడు.

క్రీస్తు, రాజుగా, మనకు నిజ స్వాతంత్ర్యమును, స్వేచ్చను ఒసగాడు, అదియే పాపక్షమాపణ. అంధకార శక్తులనుండి విడుదల చేసియున్నాడు. దేవునిలో భాగస్థులను చేసాడు. దేవునితో తిరిగి మనలను [సిలువ బలిద్వారా] సమాధాన పరచాడు. తండ్రి దేవుని రాజ్యములో చేర్చాడు.

క్రీస్తురాజు మహోత్సవ సందర్భంగా, మనందరికీ ప్రభువు ఇచ్చే పిలుపు ఇదే: సంపూర్ణంగా, దేవునికి మనల్ని మనం సమర్పించు కోవాలి. దేవుని పాలన, రాజ్యము భూలోకములో రావాలి. అది మనందరిద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. 

మన స్పందన (లూకా 23:42): "యేసూ, నీ రాజ్యములో ప్రవేశించునపుడు నన్ను జ్ఞాపకముంచు కొనుము." ప్రభువు సమాధానం (లూకా 23:43): "నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు."

No comments:

Post a Comment