ఆగమనకాల 1వ ఆదివారము (Year A)
యెషయ. 2:1-5; రోమీ. 13:11-14; మత్త. 24:37-44
ఈరోజు మనం ఆగమనకాల మొదటి ఆదివారములోనికి, అలాగే మరో నూతన దైవార్చన కాలములోనికి ప్రవేశిస్తున్నాం. ఆగమనకాలం గొప్ప నిరీక్షణకాలం, ప్రభువు రెండవ ఆగమనమునకై సంసిద్ధపడుకాలం. మొదటి ఆగమన ఆదివార ముఖ్యాంశం: ‘ఆగమనం’ లేదా ‘రావడం’. యెషయ గ్రంథమునుండి రాబోవు మెస్సయ గురించిన ప్రవచనాలను ఆలకించియున్నాము. ఆ ప్రవచనాలు క్రీస్తులో నెరవేరియున్నాయి. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖలో మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరయైనది. రాత్రి ముగియవచ్చినది, పగలు (‘వెలుగు’, ‘క్రీస్తు’) సమీపించినది. కనుక, క్రీస్తును ధరించండి అని బోధిస్తున్నాడు. సువిశేషం ‘క్రీస్తు రెండవ రాకడ’ గురించిన భాగములోనుండి వినియున్నాము.
‘ఆగమనం’ అంటే (మరల) ‘తిరిగిరావడం’. మానవరక్షణార్ధమై యేసుక్రీస్తు ఈ భువిపైకి ఏతెంచారు. పాపప్రక్షాళనము గావించి, పరలోకద్వారాలు తెరచి, రక్షణపొందుటకై పరలోకానికి ప్రేమమార్గాన్నిచూపి, ‘నేను మరల వస్తాను’ అని అభయం ఒసగియున్నారు. క్రీస్తు మరణమును ప్రకటించి, ఆయన ఉత్థానమును చాటి, మారుమనస్సు పొంది నూతన జీవితమును జీవిస్తూ, ఆయన రాకకై ఎదురు చూడటమే క్రైస్తవ ధర్మం. కనుక, ఆగమనకాలం క్రీస్తు మన జీవితాలలోనికి రావాలని ఎదురుచూసేకాలం. ఈ రక్షణ నిరీక్షణ / ఆగమన కాలమును ఎలా జీవించాలి? మనము చేయవలసిన రెండు ప్రధాన కార్యాలు: మెలకువతో యుండటం మరియు సంసిద్ధత కలిగియుండటం.
మెలకువ:
క్రీస్తు రెండవ రాకడ అనూహ్యమైన గడియలో వచ్చును అని మత్తయి సువార్తలో వినియున్నాము. మత్తయి మూడు సంఘటనలను మనకు గుర్తుచేస్తున్నాడు: మొదటిది, నోవా దినములందు వచ్చిన ప్రళయం. ప్రజలు ధర్మమును, నీతిని మరచి, తినుచు, త్రాగుచు, వివాహములాడుచు, విచ్చలవిడి జీవితమును జీవించునప్పుడు ప్రళయము సంభవించింది. అలాగే, మనుష్యులు ఊహించని దినమునందు రెండవ రాకడ వచ్చును (మత్త. 24:37-39). రెండవది, “ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండ ఒకరు కొనిపోబడును, మరియొకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకతె కొనిపోబడును, మరియొకతె విడిచిపెట్టబడును’. కనుక రెండవ రాకడ కొరకై జాగరూకులై యుండాలి (మత్త. 24:40-42). మూడవది, రెండవ రాకడ లేదా ప్రభువు దినము దొంగవలె వచ్చును (మత్త. 24:43-44; 2 పేతు. 3:10). అందుకే, ప్రతి క్రైస్తవుడు ఒక కావలివాడు. కనురెప్ప మూయక (నిదురించక) గస్తికాయునట్లు మెలకువతో నిరీక్షించాలి. మెలకువగా యుండటం, క్రైస్తవ గొప్పలక్షణం. ఆగమనకాలం, మెలకువతో ఉండి ప్రభువు కొరకు వేచియుండు కాలము. మెలకువగా యుండుట యనగా, రక్షకుడైన యేసుపట్ల మనకున్న చురుకైన విశ్వాసం (ఆధ్యాత్మిక జీవితం). ఈ విశ్వాసం ఎల్లప్పుడు ఆయన రాకకొరకు ఎదురుచూసేలా చేయును.
ప్రభువు రెండవ రాకడకై మన సంసిద్ధతకు రెండు కారణాలు: మొదటిది, ప్రభువు రెండవ రాకడ సమయము, గడియ, రోజు ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. కనుక, “మేలుకొని ఉండుడు. అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండుట చూడవచ్చును. జాగరూకులై ఉండుడు” (మార్కు. 13:35-37). అందుకే, పౌలు, “నిద్రితుడా! మేల్కొనుము. మృతులనుండి లెమ్ము! క్రీస్తు నీపై ప్రకాశించును” (ఎఫెసీ. 5:14) అని హెచ్చరిస్తున్నాడు. “కనుక ఇతరులవలె, మనము నిద్రించుచుండరాదు. మేల్కొని జాగరూకులమై ఉండవలెను (1 తెస్స. 5:6). ప్రభువు రాకడ ఎప్పుడు సంభవించునో మనకు తెలియదు కనుక, మనము ఎల్లప్పుడూ మేల్కొని, జాగరూకులమై యుండాలి. ఈ క్షణములోనే వచ్చును అన్న భావనతో మనం సంసిద్ధపడాలి.
“ఆయన వచినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్నవారు ధన్యులు! అతడు నడుము కట్టుకొని, వారిని భోజనమునకు కూర్చుండబెట్టి, తానే వచ్చి వారలకు వడ్డించును” (లూకా. 12:37). మత్తయి 25లో ‘పదిమంది కన్యలు’ ఉపమానములో, సిద్దముగనున్నవారు అతని వెంట వెళ్ళిరి. మిగతా వారికి తలుపులు మూయబడెను. కనుక, మెలకువతో ఉండుడు. ఆరోజును, ఆ గడియను మీరెరుగరు (25:1-13). రెండవది, రోమీయులకు వ్రాసిన పత్రికలో పౌలు చెప్పినట్లుగా, “నిద్రనుండి మేల్కొనవలసిన సమయమైనది. ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరయైనది” (13:11). కనుక, చీకటికి చెందిన పనులను మనము మానివేయాలి. పగటివేళ పోరాట మొనర్చుటకు ఆయుధములు ధరించాలి. సత్ప్రవర్తన కలిగి జీవించాలి. క్రీస్తును ధరించాలి (12-14). “ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు” (ఫిలిప్పీ. 4:5). “ఇంక ఎంతో సమయము లేదు” (1 కొరి. 7:29). యాకోబుకూడా తన లేఖలో, “ఓపికతో ఉండవలయును. ప్రభువు విచ్చేయు దినము సమీపించినది. కనుక ధైర్యముతో ఉండుడు” (5:8) అని చెప్పుచున్నాడు. “అన్నిటికిని తుదిసమయము ఆసన్నమైనది. స్వబుద్ధి గలిగి, మెలకువతో ప్రార్ధింప గలిగి ఉండవలెను” (1 పేతు. 4:7) అని పేతురు తెలియజేయుచున్నాడు.
సంసిద్ధత
1. ప్రార్ధన:
(చూడుము. 1 పేతు. 4:7). ప్రార్ధన అంటే తనువు, మనసు, మన అంత:కరణము భగవంతునియందు లగ్నంచేసి ఉంచడం. ప్రార్ధన అంటే ప్రభు ప్రేమయందు బంధీయులై అనుదినము పాపపంకిలమును శుద్ధికావించుకొంటూ, మనస్సును, హృదయమును, ఆత్మశరీరములను మెరుగుపరచుకోవటం. ప్రార్ధనకు సోపానము పరిశుద్ధ జీవితం. ప్రభువే స్వయముగా అప్రమత్తత గురించి ఇలా చెప్పారు: “మీరు రానున్న సంఘటనలనుండి రక్షింప బడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువ బడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడును జాగరూకులై ప్రార్ధన చేయుడు” (లూకా. 21:36). ప్రార్ధనతోపాటు బైబులు (దేవుని వాక్యము) గ్రంథ పఠనము ఎంతో ముఖ్యం. “ఇవి అన్నియు అనతి కాలములోనే సంభవింపనున్నవి. కనుక ఈ గ్రంథము పటించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు” (దర్శన. 1:3).
2. పరిశుద్ధ జీవితం:
పాపపు, చీకటి పనులు వదిలి, పుణ్యం అను వెలుగు జీవితమును జీవించమని పునీత పౌలు రోమాప్రజలను అర్ధించియున్నారు. పాపచీకటి పనులు అనగా విపరీతమైన విందులుచేయటం, పేదలయెడల ఆదరణ మరిపించు అంధబుద్ధి కలిగియుండటం. తాగుబోతుతనం, భోగలాసత్వం, అసభ్యత కలిగిన ప్రవర్తన, అసూయ, ద్వేషాలు కలిగిన జీవితం (రోమీ. 13:13-14). చీకటి పనులు వదిలి క్రీస్తు యేసుని ధరించి క్రీస్తువలె యోచించి, క్రీస్తువలె జీవించడం పుణ్యజీవితం. “వారు తమ కత్తులను కఱ్ఱలగా సాగగొట్టు కొందురు, తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకొందురు” (యెషయ. 2:4). కత్తులు, ఈటెలతో యుద్ధమునకు, గొడవలకు ఉపయోగించు విధ్వంసకర వస్తువు. కఱ్ఱలు, కొడవళ్ళు భూమిని సాగుచేసి, పంటను స్వీకరించు వస్తువు. అనగా, ఈ మానవ జీవితం నాశనమవడానికికాక, ఎదుగుదలకు ఉపయోగించాలి. కత్తిలాంటి మన నాలుక, ఈటెలాంటి మన చూపులు, పొలము అనే మనిషి గుండెను దున్నేకర్రు, ప్రేమ, శాంతి, సమాధానమును స్వీకరించు కొడవలి కావాలి. ఎముకేలేని నాలుక ఎముకను విరగగొట్టు శక్తికలది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఇదే మన సంసిద్ధత. ప్రభువు రాకడ గురించిన విషయాలను వ్రాస్తూ, పేతురు ఇలా చెప్పుచున్నారు, “మీ జీవితములు దేవునకు సంపూర్ణముగా అంకితములై ఉండవలయును” (2 పేతు. 3:11). క్రీస్తు రెండవ రాకడ మన జీవితాలలో ఆనందాన్ని నింపుతుంది. క్రీస్తు రెండవ రాకడ అనగా, మన సంపూర్ణ రక్షణ. కనుక, క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగియుండాలి. అందరూ రక్షింపబడాలనేది దేవుని కోరిక. క్రీస్తుద్వారా, సర్వమానవాళిని తన రక్షణకు ఆహ్వానించాడు. కనుక, అందరి రక్షణ కొరకు ప్రార్ధన చేయాలి.
ఆగమనకాల శోధనలు రెండు: మొదటిది, క్రిస్మస్ పండుగకొరకు వేచియుండు క్రమములో బాహ్యపరమైన ఆర్భాటాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ, అంత:రంగిక సంసిద్ధతను నిర్లక్ష్యం చేయడం. రెండవది, ప్రభువు రెండవ రాకడ ఇప్పుడే రాదు, దానికి ఇంకా చాలా సమయమున్నదని భావిస్తూ నిర్లక్ష్యం చేయడం. ఈ శోధనలకు దూరముగా ఉందాము. పేతురు చెప్పినట్లుగా, “మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శతృవు సైతాను గర్జించు సింహమువలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు” (1 పేతు. 5:8). ఈ ఆగమనకాలములో మనం క్రీస్తుకోసం ఎదురుచూస్తున్నట్లుగానే, దేవుడు మనకోసం ఎదురుచూస్తున్నాడు. దేవుడు మన మార్పుకోసం ఎదురుచూస్తున్నాడు. మన కొత్త జీవితంకోసం ఎదురుచూస్తున్నాడు. క్రీస్తును మనలో, ఇతరులలో కనుగొందాం. అలాగే మారిన మన జీవితాలను దేవునికి కానుకగా అర్పిద్దాం.
సంసిద్ధత, జాగరూకత కలిగి ఉండటం, ప్రతిపనిలో ఉండవసిన కనీస ధర్మం. క్రైస్తవ సంసిద్ధతలో ప్రార్ధన, పరిశుద్ద జీవితం అను రెండు ప్రాధమిక విషయాలు ఇమిడి యున్నవి.
No comments:
Post a Comment