33వ సామాన్య ఆదివారము, Year C

33వ సామాన్య ఆదివారము, Year C

మానవుడు దేవుని సన్నిధికి సకల ఆపదల నుండి, దుష్ట శక్తుల నుండి  కాపాడమని మరియు తన దైనందిన జీవితంలో దేవుని యొక్క హస్తము తనకు తోడుగా ఉండాని దేవుని అర్థించడం కోసం వస్తాడు. మానవ జీవితమంటే ఎన్నో రకరకాల కష్టబాధలతోఒడిదుడుకులతో ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది. ప్రతీ మానవునికి ఏదో ఒక కష్టం ఉంటుంది. అప్పుల బాధలు, అనారోగ్య బాధలు, ఇతరులతో ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇలా రకరకాల కష్టములు మనలను వేధిస్తుంటాయి. అందుకే దేవుడుఅనే ఒక గొప్ప శక్తి తనకు తోడుగా ఉంటుందని నమ్మకంతో, విశ్వాసంతో ఆయన వద్దకు వస్తూ ఉంటాడు. అటువంటి ఒక విశ్వాసమే మానవుడిని ఒక భక్తుడిగా తయారు చేస్తున్నది. ఆ విశ్వాసమే గుడి- గోపురముకు, పూజ-పునస్కారములకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మానవుని తయారు చేస్తున్నది. ప్రకృతి వైపరీత్యము ముందు, ఇహలోక అనర్ధము ముందు మానవుని యొక్క శక్తి అత్యల్పం కాబట్టి మానవుడు దేవుని ఆశ్రయిస్తుంటాడు. ఈ విధంగా భయముతో నిండిన మానవుడు దేవునిపై ఆధారపడి మతమునకు ప్రాముఖ్యత నిస్తున్నాడు. ఈ మతమే భయమును పోగొట్టి దేవుని మీద ఆధారపడి జీవించ శక్తిని, అభయాన్ని ఇచ్చే ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

అదే మన తల్లి తిరుసభ తన బిడ్డందరికి దేవుని అభయాన్ని ఈనాటి దివ్య వాక్యార్చన ద్వారా గుర్తుచేస్తున్నది. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు: ‘‘కొలిమివలే మండు దినము రాబోవు చున్నది. ఆరోజు గర్వాత్ములు, దుష్టులు గడ్డివలె రాలిపోవుదురు. వారిలో వేరయినా, చిగురయినా లేకుండా పోవును. కానీ నా యెడల భయభక్తులు చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి, భాను కిరణమువలె మీకు ఆరోగ్యం కొనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగవలె గంతులు వేయుదురు’’ (మలాకీ. 4:2).

పై వాక్యములో నేను మిమ్మును కాపాడే దేవుడను, మీకు తోడుగా ఉంటానుఅని దేవుడు తన ప్రజలకు అభయమును ఇస్తున్నాడు. ఈనాటి సువిశేషములో కూడా ఎన్ని విపత్తులు సంభవించినా, ‘‘...మీ తల వెంట్రుక ఒక్కటియు రాలిపోదు’’ (లూకా. 21:18) అని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు.

క్రైస్తవ విశ్వాసీ! ఈనాటి అభయ-వచనము ద్వారా మనకు దేవుని మీద ఉన్న విశ్వాసం ఇంతకింతకు పెరగాలి. నిజమైన దేవుడైన క్రీస్తును విశ్వసించి ప్రకటించే క్రైస్తవ మతమును నమ్మి జీవించాలి. ఆధ్యాత్మిక జీవితమునకు మూలము విశ్వాసం. ‘‘విశ్వసించువానికి అంతయు సాధ్యమే’’ (మార్కు. 9:23). కనుక పరిపూర్ణ విశ్వాసపు కనులతో దేవుడు రక్షించే దేవుడని, మన దేవుడు మన ప్రక్కనే ఉండే దేవుడని మనం గుర్తించగలగాలి. దేవుడు రక్షించే దేవుడు కానీ ఎవరిని రక్షిస్తాడు?  పైవాక్యంలో చూసినట్లయితే, ‘‘నా యెడల భయభక్తులు చూపు మీపై నా రక్షణ సూర్యునివలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యం కొనవచ్చును’’ అని వ్రాయబడిరది. అనగా తన మీద భయభక్తులు గలవారిమీద మాత్రమే తన కరుణ, రక్షణ, ఆధరణ ఉంటుంది అని అర్థమవుతుంది. కాబట్టి ఒక భక్తునిగా దేవుని విశ్వసించి, దేవుని మీద ఆధారపడి, ఆయన యెడల భయభక్తులు కలిగి జీవించటమే మన యొక్క బాధ్యత. అప్పుడే మనము ఆయన కాపుదలను అనుభవించగలము.

ఒకవేళ దైవ-మానవ సంబధమును ఏర్పరచవలసిన ఆ మతమే, తనకు దేవునియొద్ద ఆశ్రయము దొరుకుతుందిఅనే నమ్మకాన్ని మానవునికి ఇవ్వకుండా తనను ఇంకా భయపెడుతూ, తన వద్ద ఉన్నదంతా దేవుని పేరిట దోచుకుంటే అది ఒక వ్యాపారమే అవుతుంది కాని మతము కాదు. మనలో కొంతమంది దేవుని విశ్వసిస్తూనే ఏదైనా ఆపద లేక అనారోగ్య సమస్య తలెత్తునప్పుడు వేరే దుష్టశక్తుల వద్దకు, మాంత్రికుల వద్దకు వెళ్తూ ఉంటారు. అది ఎటువంటి విశ్వాసం? ఇతర శక్తులు నిజముగా ఆపద నుండి రక్షిస్తాయా? రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయగలమా? ఒకే సారి దైవమును దయ్యమును ఆరాధించగలమా? ఒకవేళ మన విశ్వాసము నిజమైతే  ఇతరును ఎందుకు ఆశ్రయిస్తాముఇటువంటి చంచల విశ్వాసముతో ఎంత వరకు మనము జీవించగలము? నిజమైన ఆరోగ్యం, సంపూర్ణ అనుగ్రహం నిజదేవుడైన యావే వద్దనే అను విశ్వాసము మనలో పెరిగాలి. కనుక మన అల్ప విశ్వాసమును గొప్ప విశ్వాసముగా అచంచల విశ్వాసముగా మార్చమని ప్రభువు ప్రార్థించుదాం.

ఈనాటి రెండవ పఠనములో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు ఈ విధంగా వ్రాస్తున్నారు, ‘‘పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు’’. క్రమబద్ధమైన జీవితం గడపవలెనని, ప్రతి ఒక్కరూ సోమరితనమును పక్కన పెట్టి అపోస్తులుల వలే కష్టపడి జీవించాలని  పౌలుగారు కోరుతున్నారు (2 తెస్స. 3:10). క్రైస్తవ జీవితమనగా కేవలం ఆధ్యాత్మిక విషయమైన విశ్వాసమే కాదుభౌతిక క్రియలు కూడా. మనము విశ్వాసముతోపాటు క్రియలను చేర్చవలెను. మన విశ్వాసము క్రియారూపం దాల్చవలెనని మనము గ్రహించాలి. ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా, కష్టనష్టాలు ఎదురైనా సర్వేశ్వరుడు నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ఎప్పుడైతే క్రైస్తవుడు ముందు ముందుకు తన సత్క్రియలను తాను చేసుకుంటూ వెళ్తాడో, అప్పుడే క్రైస్తవ జీవితమునకు సార్థకత ఏర్పడుతుంది. ‘‘మీ సహనం వలన మీరు ప్రాణములు దక్కించు కుందురు’’ (లూకా. 21:19).

ఓ మా దయగల తండ్రి! ఈ అందమైన లోకంలో సంభవించు అనర్ధమును ధైర్యముగా ఎదుర్కొని జీవించ శక్తిని, విశ్వాసమును మాకు అనుగ్రహించమనినీ కుమారుడును, మా సోదరుడును అయిన క్రీస్తు ద్వారా ప్రార్థించు చున్నాము. ఆమెన్‌.

No comments:

Post a Comment