32వ సామాన్య ఆదివారము, Year C

32వ సామాన్య ఆదివారము, Year C
2 మక్క. 7:1-2, 9-14; 2 తెస్స. 2:16-3:5; లూకా. 20:27-38

‘‘దేవుడు జీవితులకే గాని, మృతులకు దేవుడు కాడు, ఏలయన ఆయన దృష్టికి అందరు సజీవులే.’’ ఈరోజు మనం సామాన్య కాలంలోని 32వ ఆదివారంలోనికి అడుగిడియున్నాము. సామాన్య కాలపు చివరి ఆదివారములలోను దైవార్చన సంవత్సరపు చివరి దినములలోను ఉన్నాము. ఈ దినములలో పరిశుద్ధ గ్రంథ పఠనాలు కడపటి దినముగురించి, ఆ దినములో సంభవింపనున్న సంగతుల గురించి తెలియజేయుచున్నాయి. మరణం, మరణానంతర జీవితం (పునరుత్థానం), తుదితీర్పు గురించి చదువుకుంటున్నాము. తల్లిశ్రీసభ నవంబరు మాసమంతా చనిపోయిన వారి ఆత్మల ఉత్తరింపు కొరకు, మోక్షప్రాప్తి పొందుట కొరకు ప్రార్దించుచూ మనలను కూడా ప్రార్ధించమని కోరుచున్నది.

ఈనాటి దివ్యపూజాబలిలో పఠనాలుకూడా పునరుత్థానం (మరణం తర్వాత జీవితం) గురించి మాట్లాడుచున్నాయి. క్రీస్తుప్రభువు కాలంలో సద్దూకయ్యులవలె నేటి సమాజంలోకూడా పునరుత్థానం గురించి విశ్వసింపనివారు చాలామంది ఉన్నారు. మరణానంతర జీవితం గురించిగాని, పునరుత్థానం గురించిగాని ఆలోచించేవారు తక్కువ. తుదితీర్పు గురించి జాగ్రత్త పడేవారు చాలా తక్కువ మంది.

మృతుల పునరుత్థానం సద్దూకయ్యులు విశ్వసించలేదు (లూకా. 20:27). వారు ఈ విషయమును గ్రహింపలేక పోయారు. మానవ దృక్పథంతోనే చూశారు. ఇందులో దాగియున్న రహస్యం అర్థంచేసుకోలేక పోయారు. ఇక పరమ రహస్యమును ఎలా అర్ధం చేసుకోగలరు? (యోహాను. 3:12). దేవుని ఆలోచనలుదేవుని జ్ఞానమును వారు గ్రహించలేక పోయారు (రోమీ. 11:33-34). వారు గ్రహింపలేక ప్రభువును అవమానించినట్లుగా (2 పేతు. 2:12) వారి మధ్య వాద ప్రతివాదనలో వినబడుచున్నది.

పునరుత్థానం: సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వసృష్టికర్తయై (ఆ.కా.1-2 అధ్యాయాలు, యోహాను. 1:3) మృత్యుంజయుడు (మార్కు. 16:1 నుండి), పునరుత్థాన ప్రభువైన (లూకా. 24:1 నుండి) యేసుక్రీస్తు నోటినుండి వెలువడిన మాటలో పునరుత్థానం రూఢీ పరచబడినది (యోహాను. 11:25, 6:40, 12:26, 14:2, మార్కు. 9:31,లూకా. 18:33). పునరుత్థాన విశ్వాసానికి మూలం - క్రీస్తు పునరుత్థానం. ఆయనతోపాటుగా మనలను లేపుదురని ఆయన చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం, మనం ఈ భూలోకములో నిరీక్షణతో జీవించేలాగునా చేయును. కష్టాలను, బాధలను భరించేలాగునా చేయును.

ఈనాటి మొదటిపఠనంలో, ఒక తల్లి తన ఏడుగురు కుమారులకంటేకూడా దేవుడు అనుగ్రహించు పునరుత్థానమును విశ్వసించి, వేదసాక్షి మరణాన్ని పొందుటకు సిద్ధపడింది. తన కుమారులుకూడా వేదసాక్షి మరణాన్ని పొందుటకు ప్రేరేపించింది. వారి జీవితంలో దేవుని ఆజ్ఞలకు ప్రధమ స్థానమిచ్చారు. వారి విశ్వాసానికి, సంప్రదాయాలకు కట్టుబడి జీవించారు. ఎలాంటి ప్రలోభాలకు, శోధనలకు, హింసలకు లొంగిపోలేదు. మరణం వరకు (7:9) దేవుడే మనకు అవయవమును దయచేయును (2 మక్క 7:11, 22-23, కీర్తన. 139:13). యోబు గ్రంథంలో కూడా పునరుత్థాన ప్రస్తానం ఉన్నది (19:25-26).

ఈ హతసాక్షులు తన ప్రాణాలను తృణప్రాయంగా ధారపోయడానికి కారణం, ప్రభువైన దేవుడే పునరుత్థాన భాగ్యాన్ని ప్రసాదిస్తారన్న ప్రగాఢ విశ్వాసం. దేవుని మహిమ పరచడం కోసం (ఫిలిప్పి. 1:20, రోమీ. 14:7-8), వారు దైవభయము కలిగి, దేవుని ఆజ్ఞలకు బద్ధులై మరణించారు (7:9, అ.కా. 4:19, లూకా. 12:4-7). దేవుడు తమకు పునర్జీవము ప్రసాదించి దివ్యదేహాత్మతో తనతో కలకాము జీవించే మహద్భాగ్యం అనుగ్రహిస్తారన్న దృఢమైన నమ్మకం (2 మక్క 7:11, కొలోస్సీ. 3:3, యోబు. 19:25-26).

దేవుడు జీవితులకేగాని, మృతులకు కాడు (లూకా. 2:38). ఎందుకనగా, ఆయన సజీవ దేవుడు (యోహాను. 11:27, మత్త. 16:16, రోమీ. 9:26, దర్శన. 1:19). ఆయన ప్రాణులను జీవించుట కొరకే చేయును (జ్ఞాన. 1:14), ప్రాణులలో మరణకరమైన విషయమేమియు లేదు (జ్ఞాన. 1:14), దేవుడు నరుని తనవలె నిత్యునిగా చేయును (జ్ఞాన. 2:23).

దేవుని దృష్టిలో అందరు సజీవులే (లూకా. 20:38, మార్కు. 6:39, దర్శన. 14:13). నేటి సమాజంలో విశ్వాసులలో దైవచింతన కొరవడి పోవుచున్నది. కుటుంబ పోషణ, పాలనలో చిక్కుకొని స్వార్ధంతో జీవించేవారు ఎక్కువ. వారిలో దైవచింతన, మరణానంతర జీవితం గురించి ఆలోచన తక్కువ. విశ్వాసులు శోధనలకు గురియైనప్పుడు భయభ్రాంతులై, విశ్వాస జీవితంలో బలహీనపడుచున్నారు. అటువంటి వారిని పౌలుగారు ప్రార్ధించినట్లు (2 తెస్స. 2:16-17), ఏడుగురు కుమారులను వారి తల్లి ధైర్యపరచి, బలపరచినట్లుగా (7:20-21), ప్రోత్సాహించినట్లుగా మనముకూడా కష్టాలలో, శోధనలలో ఒకరికొకరు బలపరచుకోవాని ధైర్యంగా ఉండాలని ఈనాటి రెండవ పఠనంలో చూస్తున్నాము. నిత్యజీవమునకు సిద్ధపడాలని పౌలు తెస్సలోనిక ప్రజలను ప్రేరేపిస్తున్నాడు.

విశ్వాస జీవితంలో శోధనలు తప్పవు (మత్త. 5:11-12, 10:16, 25). జీవితం ఒక పోరాటంవలె ఉండును (2 తిమో. 4:7), శోధనలను సహించి నిలబడితేనే రక్షింప బడుదము (మార్కు. 13:13), జీవ కిరీటము పొందెదము (యాకో. 1:12). మనలో దైవచింతన పెంపొందింపమని, శోధనలలో బలపరచమని, శోధింపబడుచున్న వారిని బలపరచే మంచి మనస్సుకై ప్రార్ధిస్తూ, మరి ముఖ్యంగా ఈ నవంబరు మాసమంతా మృతుల ఉత్థరింపుకై, మోక్షప్రాప్తికై ప్రార్ధించుదాం.

నేటి సువిశేష పఠనంలో, ప్రభువు మరణం తర్వాత జీవితం (పునరుత్థానం, నిత్యజీవం, నూతన జీవితము, మహోన్నత జీవితం) గురించి స్పష్టముగా వివరించుచున్నాడు. పునరుత్థాన వరాన్ని మనకు వాగ్దానం చేయుచున్నారు. "నేనే పునరుత్థానమును, జీవమును" అని ప్రభువు పలికియున్నారు. "ఆయన మనకు జీవమును సమృద్ధిగా ఇచ్చుటకు" వచ్చియున్నారు. విశ్వాసికి, మరణం అంతము కాదు. మరణం నిత్యజీవితానికి మెట్టు. క్రీస్తుతో మనం పునరుత్థానులై, దేవుని రాజ్యములో నిత్యం, కలకాలం, మహోన్నతముగా జీవించాలంటే, ఈ లోక జీవితములో ప్రేమగా, విశ్వాసముగా, నమ్మకముగా జీవించాలి. దైవకార్యములు చేస్తూ జీవించాలి. కనుక, ఈ భూలోక యాత్రలో, మన జీవితములో ఎన్ని రోజులు అని ముఖ్యం కాదు కాని, మనం జీవించే రోజులలో ఎంత ప్రేమగా జీవిస్తున్నాము అన్నది ముఖ్యం.

No comments:

Post a Comment