30వ సామాన్య ఆదివారము, YEAR C

30వ సామాన్య ఆదివారము, YEAR C
సీరా. 35:15-17, 20-22; 2 తిమో. 4:6-8, 16-18; లూకా. 18:9-14

వ్యాపార ప్రపంచంలో పోటీతత్వం ఉంటుంది. దీనిని మనం టీవిలో చూస్తున్నాము, రేడియోలో వింటున్నాము, పేపర్లలో చదువుతున్నాము. ఆకట్టుకునే ప్రకటనతో వినియోగ దారులను ఆకర్షించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతర కంపెనీ వస్తువులతో పోల్చుతూ ఎవరికివారు, వారి ఉత్పత్తియే ఉత్తమ మైనదని ప్రచారం చేస్తూ ఉంటారు. పోటీతత్వం మంచేదే కాని, అది ఇతరులను నాశనం చేస్తుందని గుర్తించాలి.

ఆధ్యాత్మిక జీవితంలో పోటీతత్వానికి, ఇతరుతో పోల్చడం లాంటి వాటికి తావు లేదు. ఒక వ్యక్తి ఇతరుతో పోల్చుకున్నపుడు, ఆ వ్యక్తి ఉత్తమం కాలేడు. తననుతాను ఇతరుతో పోల్చుకుంటూ, ‘నాకు శత్రువులు ఎవరు లేరు, నేను ఎవరిని నాశనం చేయడం లేదు, చాలా వినయంతో ఉన్నాను, ఎలాంటి తప్పు చేయడం లేదుఅని చెప్పుకునేవాడు అహంకారి, గర్విష్టి అని చెప్పవచ్చు. ఎప్పుడు విమర్శించేవాడు సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ఆలోచించలేడు. ఎప్పుడు తానే ఒప్పు అని ఇతరుకు చూపించుకొంటూ ఉంటాడు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో లేదా దేవున్ని విశ్వసించేవారు పోటీ, పోల్చుట అను పదాలకు తావు ఇవ్వకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైనది: ‘‘నేనే ఘోరపాపిని’’ అంటూ వినయం కలిగి జీవించాలి.

ఇదే విషయాన్ని ఈనాడు మనం సువార్తలో చూస్తున్నాము. పరిసయ్యుడు తననుతాను పొగడుకొను చున్నాడు. అందరిలోకెల్ల, తానే నీతిమంతుడని, మంచివాడని భావించాడు. వారానికి రెండుసార్లు ఉపవాస ముందునని, నా ఆదాయం అంతటిలో పదియవ వంతు చెల్లించు చున్నానుఅని తననితాను ప్రచారం చేసుకున్నాడు. ఇతరువలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడను కానుఅని సుంకరితో (ఇతరుతో) తననుతాను పోల్చుకున్నాడు. కాని, సుంకరి దూరంగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక, రొమ్ము బాదుకొనుచు, ‘ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుముఅని ప్రార్ధించాడు. ఇద్దరిలో దేవుని ఎదుట నీతిమంతునిగ పరిగణింపబడి, ఇంటికి వెళ్ళినది సుంకరియే!

పరిసయ్యుడు ధర్మశాస్త్రమును తు.చ. తప్పక పాటించాడు. కాకపోతే, గర్విష్టి, అహంభావి, స్వార్ధపరుడు. అతనిలో వినయము అసలు లేదు. సుంకరి పాపాత్ముడే, దుష్టకార్యాలు చేసేవాడే, కాని, వినయంతో, దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మార్పు చెందుటకు సిద్ధపడ్డాడు.

‘‘దేవుడు అహంకారులను ఎదిరించి, వినయశీలురులను కటాక్షించును’’ (1 పేతు. 5:5).

మనం కూడా దేవునితో సఖ్యపడి, క్షమించబడిన వారిగా తిరిగి ఇంటికి వెళ్ళాలంటే, మనలోనున్న స్వార్ధాన్ని, అహంను, గర్వాన్ని తీసేద్దాం. మన పాపాన్ని ఒప్పుకొని, దేవుని దయవైపు చూద్దాం. ఇతరులను నిందించక, వారికి మన వంతు సహాయం అందిద్దాం.

ప్రార్ధించునప్పుడు, సుంకరివలె వినయంతో ప్రార్ధించాలి. దేవుని ఎదుట మనం భిక్షగాళ్ళం అని పునీత ఆగుస్తీన్‌ వారు అన్నారు. మన ప్రార్ధన హృదయాంతరాళము నుండి రావాలి. ఆత్మయే ఎటుల ప్రార్దించాలో మనకు నేర్పును (రోమీ. 8:26). మన ప్రార్ధన మన దేవునికి అర్పించే గొప్ప అర్పణ. వినయంతో చేసే మన ప్రార్ధన దేవునికి మహిమను, వైభవమును చేకూర్చాలి.

ఈనాటి రెండవ పఠనంలో వినయానికి చక్కటి ఉదాహరణను పౌలుగారిలో చూడవచ్చు. పౌలు ఎప్పుడు కూడా తనను తాను గొప్పలు చెప్పుకోలేదు. మన అనుదిన జీవితంలో కూడా, ఏమి చేయక పోయిన, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. కనుక, వినయమనే సుగుణాన్ని అలవర్చుకుందాము.

No comments:

Post a Comment