28వ సామాన్య ఆదివారము, YEAR C

28వ సామాన్య ఆదివారము, YEAR C
2 రాజు. 5:14-17; 2 తిమో. 2:8-13; లూకా. 17:11-19

సాధారణంగా, ఎవరైనా, ఒక సహాయం చేసినప్పుడు, ఒక మేలు చేసినప్పుడు, మేలు పొందుకున్నవారు, దానిని గుర్తెరగాలని, కృతజ్ఞతు తెలుపుతారని ఆశిస్తూ ఉంటారు. ఇది సహజము! ఈ విధంగా జరిగితే, వారిరువురి మధ్య, ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది. అలాగే, వారి మధ్యనున్న బంధం కొనసాగుతుంది. కృతజ్ఞత తెలిపే స్వభావము లేనివారితో బంధమును కొనసాగించడం కష్టమగును. ప్రస్తుత కాలంలో, సమాజంలో, గురుదక్షిణ అనేది కనుమరుగవు చున్నది. కని, పోషించి, పెంచి పెద్దవారిని, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు పట్ల బిడ్డలు చాలామంది కృతజ్ఞతారహితంగా, విశ్వాస ఘాతుకంగా ఉండుట సమాజంలో, కుటుంబములో చూస్తూ ఉన్నాము. ఈనాటి పరిశుద్ద గ్రంథ పఠనాలు కృతజ్ఞాతాభావం గూర్చి తెలియ జేస్తూ ఉన్నాయి.

నామాను దేవునికి, దేవుని ప్రవక్తకు కృతజ్ఞతలు తెలుపుచూ, కానుకలను ఇచ్చుటకు సిద్ధమయ్యాడు (2 రాజు. 5:15). పొందుకున్న మేలుకు గుర్తుగా కానుకలిచ్చుట ఒక ఆచారము (మత్త. 8:4, లేవీ. 14:1-32). కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుట ద్వారా మేలు చేసిన వ్యక్తి యొక్క గొప్పదనమును (2 రాజు. 5:15), ఉదార స్వభావమును (లూకా. 1:46,48) గుర్తెరిగి అంగీకరించినట్లు భావము.

మనకున్నదంతయు దేవుడిచ్చిన దానము (1 కొరి. 4:7). ఆయన నుండియే దీవెనలను పరంపరముగా పొందుచున్నాము (యోహాను. 1:16). తల్లి గర్భమునుండి మనమేమియు తీసుకు రాలేదు. అంతయు దేవుడిచ్చిన దానము (యోబు. 1:21).

దేవుడిచ్చిన దానములకు, మేలుకు స్తుతులు స్తోత్రములు అర్పించాలి (కీర్తన. 103:1-2, లూకా. 17:18, మత్త. 8:4, యోహాను. 15:27). ఈ విషయమును ప్రభువే తెలియ జేసియున్నారు (లూకా. 17:18, మత్త. 8:4). మనం అర్పించే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు దేవునికి అవసరం లేదు. కాని, మన రక్షణకుపకరించును. దేవుని యెదుట తగ్గింపు స్వభావము వలన మనకు మేలు కలుగును (యాకో. 4:10).

ఈనాటి సువార్తలో సాక్ష్యమిచ్చుటను మనం చూస్తున్నాము. ఇది ప్రభువు ఆశించునది (యోహాను. 15:27). భక్త సమాజమున సాక్ష్యం చెప్పుట కూడా మంచిదే! (కీర్తన. 111:1). కాని, దేవునకు సాక్ష్యం ఇచ్చుట అనునది కేవలం మాటకే పరిమితం కాకూడదు. బదులుగా, క్రియారూపంగాను, మారిన జీవిత విధానం ద్వారా సాక్ష్యం ఇచ్చుట శ్రేష్టం. ఎందుకనగా, క్రియలు లేని విశ్వాసం నిర్జీవము (యాకో. 2:17). ఈ విషయమునే పునీత పౌలుగారు తన లేఖల ద్వారా తెలియ జేయుచున్నారు. నిజమైన కృతజ్ఞతా భావమును, సాక్షిగా జీవించుటకును కావలసిన వరముకై ప్రార్దించుదాం!

No comments:

Post a Comment