29వ సామాన్య ఆదివారము, YEAR C

29వ సామాన్య ఆదివారము, YEAR C
నిర్గమ. 17:8-13; 2 తిమో. 3:14-4:2; లూకా. 18:1-8

ఈ విశ్వంలోని అనంత జీవాజీవరాశులు సర్వసృష్టి కర్తయగు దేవుని కళానైపుణ్యం నుండి ఆవిర్భవించినవే! మానవుడు ఈ అనంత సృష్టిలో ఒక అల్పజీవి మాత్రమే. దేవుడే లేకుంటే మానవ మనుగడ, విశ్వముయొక్క మనుగడ అసాధ్యమే! సర్వశక్తి సంపన్నుడైన సృష్టికర్త సర్వాన్ని కలిగించి దానిని సరైన పద్ధతిలో క్రమపరచుచూ నడిపిస్తున్నాడు. దేవుడు మానవునికి విచక్షణను అంటే, మంచి చెడు మధ్య ఉన్న వ్యత్యాసమును తెలుసుకొను బుద్ధిని ఇచ్చియున్నాడు. సృష్టిలోనున్న అన్ని జీవులలో దేవుడు మానవుని ఒక ఉన్నత స్థాయిలో ఉంచి ఉన్నాడు, అతనికి మహిమ, గౌరవ కిరీటమును ధరింప చేసియున్నాడు (హెబ్రీ. 2:6-8). అయితే ఈ మానవుని యొక్క ప్రయాణం ఎటువైపు? సృష్టికర్త వైపా? లేక తనవలే సృష్టించబడిన ఇతర వ్యక్తులవైపా లేక వస్తువుల వైపా? తనను కలిగించిన ఆ దేవుని మీద ఆధార పడుతున్నాడా? లేక తన సొంత శక్తి మీద ఆధార పడుతున్నాడా? అసలు ఆ సృష్టికర్తను విశ్వసిస్తున్నాడా? ‘‘మనుష్య కుమారుడు మరల వచ్చునపుడు అట్టి విశ్వాసము చూడగలుగునా?’’ (లూకా. 18:8).

సాధారణంగా బహీనులు బలవంతుల వద్ద, ధనము లేనివారు ధనవంతుల వద్ద, విధ్య లేనివారు  విధ్యావంతుల వద్ద, వారి వద్దలేనిది, ఉన్నవారి వద్ద పొందుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. మొదటి పఠనములో మోషే ప్రవక్త యావే వైపుకు చేతులెత్తి, తను తోడ్కొని వచ్చిన ఇస్రాయేలీయులను అమాలేకీయులతో జరుగు యుద్ధములో వారిని కాపాడి విజయమును అనుగ్రహించమని, ప్రార్థించుచున్నాడు (నిర్గమ. 17:11). ఈనాటి కీర్తనలో కూడా మనము వింటూ ఉన్నాము. ‘‘నేను నా కన్నులెత్తి కొండవైపు పారజూచుచున్నాను. నాకు ఎచట నుండి సహాయం లభించును? భూమ్యాకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును’’ (కీర్తన. 121:1-2) అని భక్తుడు విశ్వాసముతో కీర్తన ఆలపించుచున్నాడు. అంటే తాను బలహీనుడనని, తనకు బలము అవసరమని, తన జీవనాధారం సృష్టికర్తయేనని గ్రహించి ప్రార్థనచేస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేషంలో కూడా, తనకు న్యాయం చేయవలసిన న్యాయాధిపతి మూర్కుడు అని తెలిసీ, ఆ పేద స్త్రీ పదేపదే న్యాయం కోసం ప్రాధేయ పడుచున్నది (లూకా. 18:1-8). పవిత్ర గ్రంథములోని ప్రవక్తలు, రాజులు, భక్తిగల ప్రజలు, అపోస్తులు ఇంకా అనేకులు దేవుడే సర్వమునకు మూలాధారమని తెలుసుకుని ప్రార్థించి యున్నారు. స్వయాన దైవకుమారుడైన క్రీస్తు తన తండ్రితో అనుదినము నిర్జన ప్రదేశములో వేకువ జాముననే ప్రార్థనలో గడిపి ప్రార్థన విలువను మనకు తెలియ చేస్తున్నాడు. మన శ్రీసభ చరిత్రలో కూడా ప్రార్ధన విలువను గ్రహించి అనేక మంది పుణ్యాత్ములు దినదినమూ ప్రార్థించి తరించి యున్నారు. ఈనాటి అర్చనా క్రమములో ‘‘మన జీవితములో ప్రార్థన యొక్క పాత్ర’’ను గురించి ధ్యానించుటకు తిరుసభ మనలను ఆహ్వానించుచున్నది. 

ప్రార్ధన అనగానేమి? అని అడిగితే పెక్కు మంది, ‘భక్తి కలిగి దేవునితో సంభాషించుటయేఅని అంటారు. అది నిజమే కాని అంతకంటే అధికముగా దాని అర్థమును గ్రహించినట్లయితే ‘‘ప్రార్ధన అంటే కేవలము ఒక సంభాషణ మాత్రమే కాదు. అది దేవునికి మానవునికి మధ్య గల ఒక అనుబంధం’’. పునీత అసిస్సీపుర ఫ్రాన్సీసు వారు ప్రార్థించి, ప్రార్థించి చివరకు ఆయనయే ఒక ప్రార్థనగా మారిపోయారు అని చరిత్ర చెబుతుంది. ఆయన దేవునిలో అంతగా ఇమిడి పోయారు. అదే రీతిగా పునీతులు ధ్యానించేటపుడు ఎటువంటి మాటు లేకుండా అనగా నిశ్శబ్దంగా, ఏకాంతముగా దేవునితో సమయాన్ని వెచ్చిస్తారు. దైవ-మానవ సంబంధమును వారు అనుభవ పూర్వకముగా గ్రహించ గలుగుతారు. ఇదియే నిజమైన ప్రార్ధన, దేవునితో సత్సంబంధమును పెంచుకోవడం.

బిడ్డకు ఏదైనా అవసరం వచ్చి కొనవలసి నప్పుడు, ముందుగా ఎవరిని ధైర్యంగా అడుగుతారు? తన స్నేహితుని యొక్క తండ్రిని గాని, తన దూరపు బంధువును గాని లేక తన పొరుగు ఇంటివారిని గాని స్వేచ్చగా, భయపడకుండా ఆ వస్తువును కొని ఇవ్వమని అడగగలరా? అడుగలేరు, ఎందుకంటే వారి బంధము అత్యల్పము కాబట్టి. కాని తమ సొంత తల్లిదండ్రులను మాత్రము అది కొనేవరకు అడుగుతారు, కొన్నిసార్లు మారాం చేస్తారు. దానికి కారణం వారి అనుబంధమే. బిడ్డలు అడుగక ముందే తల్లిదండ్రులు వారి యొక్క అవసరమును ముందే గుర్తించి వాటిని తీరుస్తూ ఉంటారు. అదే తండ్రి తన బిడ్డకు కాకుండా  ఇతరులు పిల్లలకు ఈ అవసరాను తీర్చడు కదా! తనకూ తన బిడ్డకూ మధ్య ఉన్న అనుబంధమే ఈ వరమును అనుగ్రహించుటలో ముఖ్యపాత్ర వహిస్తుంది. బిడ్డలు తన తండ్రితో నివసిస్తూ, తన తండ్రి ప్రేమలో ఎదుగుతూ, తన తండ్రి మీద ఆధారపడుతూ ఉంటారు కాబట్టి తండ్రి తన బిడ్డకు అన్నీ సమకూరుస్తూ ఉంటాడు.

అదేవిధంగా దేవుడు కూడా మనము ఆయనతో అనుబంధమును కలిగియుండమని కోరుచున్నాడు. దేవుడు కూడా మనము అడుగక ముందే మన అవసరమును గుర్తిస్తాడు (మత్త. 6:8). అయితే  ‘‘అడుగుడి ఒసగబడును’’ (మత్త. 7:7-11) అని ఎందుకు క్రీస్తు ఆహ్వానిస్తున్నాడు అంటే మనము ఆయనపై ఆధార పడతామని, ఆయనతో  ప్రేమ బంధమును కలిగి ఉంటామని. మన స్నేహితులతో, మనం ప్రేమించు మన కుటుంబ సభ్యులతో అనుక్షణము కలిసి ఉండాని, వారితో మన భావోద్వేగమును వ్యక్తపరచ కోరుకుంటాం కదా! వారు దూరంగా ఉన్నట్లయితే దూరవాణి ద్వారా వారితో సంభాషిస్తూ ఆ బంధం తెగిపోకుండా కాపాడుకుంటాం కదా! అదేవిధంగా దేవుడు కూడా తన ప్రియమైన జనం తనపై విశ్వాసము కలిగి ఆయన అనుగ్రహము పొందుకుంటారని, ప్రార్థన అనే సాధనం ద్వారా తన ప్రజలు తనతో సరైన బంధాన్ని ఏర్పరుచు కుంటారని ఎదురుచూస్తూ ఉంటాడు.

దేవుడే నా సృష్టికర్త, నా సర్వస్వం, నా ఆధారం అని విశ్వసించు వాడు ప్రార్ధన ద్వారా దైవసంబంధుడై, అనుదినము దైవాను గ్రహములో ఎదుగుతాడు. మరియు మేలైన ఉన్నత జీవితమును అనుభవిస్తాడు, ఇహలోకములోనూ పరలోకములోనూ ఆనందమును పొందుకుంటాడు.  సృష్టికర్తను సజీవ దేవునిగా, రక్షకునిగా,  విశ్వసించి ఆయన మార్గములో నడిచి జీవించువాడు రక్షింపబడుచున్నాడు.

అటుకాకుండా, నాకు సమస్తమూ తెలుసు, నాకు అన్నియూ ఉన్నవి అని గర్వముతో విర్రవీగువాడు దేవుని ఎలా గుర్తిస్తాడు? దేవునిపై ఎలా ఆధారపడతాడు? ఎలా ప్రార్థిస్తాడు? అందుకే క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషములో అట్టి విశ్వాసము గురించి అనుమానము వ్యక్తపరచుచున్నాడు.

కనుక, ఈ అనుమానమును నిజం చేస్తావా లేక విశ్వాసము నిండిన ప్రార్థన ద్వారా ఆ సర్వేశ్వరునితో నిరంతర బంధం ఏర్పరచుకుంటావా? ఆలోచించు! నీకూ, నాకూ, మనందరికీ ఆయన కృప అవసరం. కనుక నిరంతరం ప్రార్థించుదాం! ఆయన మన సృష్టికర్త, కనుక ఆయనను కృతజ్ఞతాపూర్వకముగా  ప్రార్థించుదాం (స్తుతి ప్రార్థన: ఫిలిప్పీ. 4:6). మనమందరము ఒకే తండ్రి బిడ్డలము, కనుక మనము ఒకరి కొకరు ప్రార్థన చేసుకుందాం (మధ్యస్థ ప్రార్ధన: యాకో. 5 :16). మనలో పాపం అనే బలహీనత ఉంది కనుక మన పాపము క్షమించమని  ప్రార్ధించుదాం (పశ్చాత్తాప ప్రార్థన: 1 యోహా. 1:9). మనము లేని వారము, మన లేమిని తీర్చమని ఆయన మీద ఆధారపడుతూ ప్రార్థించుదాం (విన్నప ప్రార్థన: మత్త. 6:11). ఆమెన్‌.

No comments:

Post a Comment