24వ సామాన్య ఆదివారము YEAR C
ప్రియ దేవుని ప్రేమకు, క్షమకు పాత్రులైన క్రైస్తవలారా! మానవుడు సహజముగా తన సొంత బహీనత వలన తరచూ పాపములో పడిపోతూ వుంటాడు. పౌలు గారు రోమా 7:15-20 లో ‘‘నేను చేయగోరు మేలు చేయక చేయగోరని చెడు చేయుచున్నాను’’ అని తన భౌతికదేహము యొక్క బలహీనత గురించి తెలియ చేస్తున్నాడు. ఇలా బలహీనతతో జీవించు మానవునికి బలం అవసరం లేక పాప కారణమైన మానవ బలహీనతను తొలగించే శక్తి అవసరం. కేవలము కల్మషరహితుడైన దేవుడు మాత్రమే మానవునికి శక్తిని, జారిపడునప్పుడు చేయూతను ఇవ్వగలవాడు. అంటే మనిషికి దేవుడు అవసరం కాని దేవునికి మనిషి అవసరం అసలు లేనే లేదు. కానీ అటువంటి బలహీనులమైన మనకు కావలసిన ఆ దేవుడే మన కోసం ప్రేమతో ఎదురు చూస్తే... మన కోసం ప్రాణతాగం చేస్తే... ఎంత అదృష్టం, ఎంత భాగ్యం!
రక్షణ చరిత్రలో గమనించినట్లైతే మన అత్యంత ప్రేమ గల దేవుడు పాపములో పడిపోతున్న మానవుని పలురకాలుగా రక్షిస్తూ, క్షమిస్తూ, ప్రేమిస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పఠనంలో కూడా యావే దేవుడు ఇస్రాయేలీయుల యొక్క విగ్రహారాధనను చూసి కోపోద్రిక్తుడై వారిని దండించ దలచాడు. కాని తరువాత మనసు మార్చుకుని వారిని శిక్షించక క్షమిస్తున్నాడు. ‘‘రక్షణ చక్రము’’లో దేవుడు చక్కని, అందమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని తన ప్రజలకు ఇచ్చినపుడు వారు కాలక్రమేణా పాపములో పడడం, తర్వాత దేవుడు ప్రవక్తను పంపి వారిని తిరిగి పిలవడం, ప్రజలు తమ తప్పును గ్రహించినప్పుడు దేవుడు వారిని క్షమించి, ప్రేమించి, వారిని తిరిగి తన బిడ్డులుగా చేసుకోవడం మనకు చాలా సార్లు కనిపిస్తుంది. దీనికి మంచి ఉదాహరణగా దావీదు రాజు యొక్క జీవితం అని చెప్పవచ్చు. మరియు ఇశ్రాయేలు ప్రజలు అనేకమార్లు అనేక మంది ప్రవక్త ద్వారా దేవుని క్షమాపణను పొందియున్నారు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపి, బలహీన మానవజాతికి తన ప్రేమను తెలియ పరచి, మంచిని బోధించి వారిని రక్షించ పూనుకున్నాడు (యోహా 3:16). క్రీస్తు రాకకు పూర్వము దేవుడు మహా శక్తిమంతుడని, మహా భయంకరుడని, కోపోద్రిక్తుడని మనుషులు భయపడి ఆయన దగ్గరకు వచ్చేవారు. అయితే క్రీస్తు వచ్చి దేవుడు భయంకరుడు కాదని, ప్రేమగల తండ్రి అని ఆయనను ‘‘పరలోకమందున్న మా తండ్రి’’ అని పిలవమని (మత్తయి 6:9) తన తండ్రి గురించి తెలియ జేశారు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఉపమానము ద్వారా ముఖ్యంగా తన యొక్క ప్రాణత్యాగము ద్వారా తన తండ్రి ప్రేమ మరియు తన ప్రేమ గురించి మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈనాటి సువిశేషములోని ఉపమానములో, తప్పిపోయిన తన కుమారుడు తిరిగి వస్తాడు, పాపమును వదిలిపెట్టి తండ్రి ప్రేమను పొందుతాడు అని ఆశతో, క్షమాపణ హృదయంతో, ప్రేమతో ఎదురుచూస్తున్న తండ్రిలాంటి వాడే మన దేవుడని క్రీస్తు మనకు తెలియ చేస్తున్నాడు.
క్రీస్తు ప్రభువు తన తండ్రి ప్రేమను తెలియజేయడంతో పాటు తాను కూడా బలహీన మనుజులకు బలమును ఇవ్వటానికి వచ్చియున్నానని ఈనాటి సువిశేష ఆరంభములో యూదుచేత బలహీనులుగా, పాపులుగా, అన్యులుగా పరిగణించ బడుతున్న సుంకరుతో కలసి భుజించుట (లూకా 15:1-2) ద్వారా తెలియ చేస్తున్నాడు. ‘‘హృదయ పరివర్తనను పొందుటకై పాపులను పిలుచుటకు వచ్చితిని కాని, నీతిమంతులను పిుచుటకు రాలేదు’’ అని యేసు క్రీస్తు ప్రభువు లూకా 5:32 లో చెపుతున్నారు. తాను చెప్పినట్టుగానే మన అందరి కోసం ఏ పాపము చేయని క్రీస్తు సిలువ మరణం పొంది మనను రక్షించి యున్నాడు. దీని ద్వారా మనకు, క్రైస్తవ మతం అంటే క్షమ, దయ, జాలి, ప్రేమ, ఆనందం మరియు ఆదరణ పొందుటకు ఒక మంచి మార్గమని తెలియుచున్నది. ఇచట రక్షణ, క్షమ ఉంటుంది కాని శిక్షతో కూడిన కష్టం కాదని మనము తెలుసుకోవాలి.
దేవుడంటే భయపడి దూరంగా పారిపోవడం కాదు గాని దేవుడు ప్రేమ గలవాడు అని ఆయన ప్రేమను పొందుటకు ఆయన చెంతకు రావడం మనం నేర్చుకోవాలి.
అయితే ఇక్కడ మనకొక ప్రశ్న ఎదురవుతుంది. దేవుడు శిక్షించడు కాని రక్షిస్తాడు కదా! ఎన్నిసార్లు పాపం చేసినా క్షమిస్తాడు! మన తిరుసభలో పాపసంకీర్తనం అనే దివ్యసంస్కారం ద్వారా ఎన్ని సార్లయినా పాపం క్షమాపణ పొందవచ్చు! అట్లయినచో, మానవుడు ఎన్ని సార్లయినా పాపం చేయవచ్చా? తాను దేవుని నుండి దూరంగా వెళ్లి పోతే దేవుడే రక్షిస్తాడు, దేవుడు ప్రేమగలవాడు అని తలచి తన ఇష్టం వచ్చినట్టు తాను జీవించవచ్చా? ముమ్మాటికి కాదు, కాదు, కాదు, ప్రియ క్రైస్తవా! ఎందుకంటే ఈ నాటి సువిశేషములో దుడుకుచిన్న వాడు తన ఆస్తిని తీసుకొని దూరదేశముకు వెళ్ళి, ఉన్నదంతా నష్టపోయి చివరికి తిండి లేక, గతిలేక పందుల కొట్టంలో పడి ఉన్నాడు. ఉన్నత స్థితిలో నుండి అత్యంత హీన స్థితిలోనికి జారిపడి పోయాడు. ఒక కుమారుని స్థితిలోనుండి సేవకుల కంటే హీనమైన స్థితిలోనికి జారిపోయాడు. కాని తండ్రి ప్రేమ మారలేదు, తండ్రి ప్రేమ అలాగే ఉన్నది. తన కుమారుని కోసం ఎదురుచూస్తూ ఉంది. కానీ కుమారుడు ‘నేను ఇక్కడ ఉండను, నా ఆస్థిని తీసుకొని వెళ్ళిపోతాను’ అని తానే తండ్రి నుండి వెళ్ళిపోయాడు. చివరికి తన క్రియకు తానే ఫలితమును అనుభవించవసి వచ్చింది. 1 కొరి 3:8 లో ‘‘వాని వాని క్రియలను బట్టి ప్రతి వ్యక్తి ప్రతి ఫలము పొందును’’ అని వాక్యము తెలుపుతుంది. దేవుడు మన క్రియలకు బట్టి ప్రతిఫలం ఇవ్వడు. ఎందుకంటే ఆయన నిష్పక్షపాతి, సజ్జనులకూ దుర్జనులకూ ఒకే విధంగా, తారతమ్యము లేకుండా అన్ని ప్రకృతి వనరులను సమకూరుస్తాడు (మత్తయి 5:45). దేవుడు, మంచి చేసినా చెడు చేసినా ఒక మనిషిని ఎప్పుడూ క్షమించి ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన అత్యంత ప్రేమ గలవాడు. అయితే మన చేతలే మన గతికి కారకము.
ఒక వ్యక్తి తన చేతిని తానే నరుక్కొని ‘దేవుడు నాకు వేదన ఇచ్చాడు, నాకు రక్తం కారుతుంది, నేను బాధలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడడం లేదు’ అని దేవుని దూషిస్తే అది సబబేనా? తప్పిపోయిన కుమారుడిని తన తండ్రే పందుల కొట్టంలో పడవేయలేదు కదా! కుమారుడు చేసిన ఆయా క్రియ యొక్క ఫలితమే ఆ దీన, హీన, ఘోర స్థితి. చెడు కార్యము రహస్యంగా చేసినా బహిరంగంగా చేసిన వాటి యొక్క ఫలితమును ఖచ్చితంగా మనం అనుభవించవసిందే! అదే మన శిక్ష. పాపము యొక్క వేతనం మరణము (రోమా 6:3). ఒక వ్యక్తి కన్నీటికి మన కార్యము కారణమైతే తప్పకుండా ఆ కన్నీటి (బాధ)యొక్క ప్రతిఫము (ఉసురు) మనము అనుభవించాలి. అదేవిధంగా మంచి రహస్యంగా చేసినను బహిరంగముగా చేసిననూ దాని ఫలితం కూడా ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అనుభవిస్తాడు (మత్త. 7: 16-18). అందుకే దేవుడు ఈ సత్యమును తెలియజేయడానికి, మనుషులను మంచి వైపు అనగా తన వైపు ఆకర్షించడానికి తన కుమారుని ద్వారా, ప్రవక్తల ద్వారా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మంచి విత్తనము నాటువాడు మంచి పంట కోస్తాడు. చెడు విత్తనము నాటువాడు చెడు పంట కోయును.
కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమూ మరియు ప్రతి ఒక్క మానవుడు కూడా ‘మార్గం, సత్యం, జీవం’ అని మనం విశ్వసించే ఆ దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించాలి. దేవుడు మనకు తన పవిత్ర గ్రంధము ద్వారా, గురువు ద్వారా బోధించు ప్రతి విషయాన్ని మనం పాటించ ప్రయత్నించాలి. మనము బహీనులమే కాని ప్రయత్నిస్తే మంచి కూడా అలవాటు అయిపోతుంది. ఎంత తప్పు చేసినా క్షమించే ఆ దేవుని యొక్క ప్రేమను అనుభవించటానికి రావాలి కానీ, అన్ని సద్గుణముల సంపన్నుడైన ఆ సర్వేశ్వరుని వదలి, పాపము వైపు, చెడు వైపు, దుర్గుణము వైపు పరుగులెందుకు? ఆనందమును ఇహమందు, పరమందు కోల్పోవడానికా? హీన స్థితిని పొందడానికా?
ప్రేమగల తండ్రి మన కోసం ఎదురు చూస్తున్నాడు. నిత్య ఆనందమును, అనుగ్రహమును ఒసగ ఎదురు చూస్తున్నాడు. అదే ఈనాటి సువిశేషములో చదువుతూ ఉన్నాము: ‘‘హృదయ పరివర్తన అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే పశ్చాత్తాపపడి, తిరిగి తండ్రి వద్దకు వచ్చే ఒక్క పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉన్నదని.’’ మనమందరము కూడా ఆ ప్రేమగల తండ్రి వద్దకు మన పాపమును విడిచిపెట్టి, దుష్ట కార్యములను, దుష్ట సాంగత్యమును వదలిపెట్టి ఆయన ప్రేమలో మనం మన జీవితాలను సార్థకం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేద్దాం. మనం చేసే ఈ పూజా పునస్కారములు అన్ని కూడా మనకు దేవునిలో లేక ఆ మంచిలో నిలిచి ఉండటానికి కావసిన శక్తిని ఇచ్చే సాధనములుగా మనకు ఉపయోగపడాలని మనము కోరుకుందాము. ప్రతి దినము దివ్య పూజలో క్రీస్తు ప్రభువు బలహీనుమైన మనకు అనంత శక్తిని ఒసగు తన శరీర రక్తమును సిలువ బలి ద్వారా ఇచ్చుచున్నారు. అయోగ్యుమైన మనము మన పాపమును తెలుసుకొని, తండ్రి ముందు క్షమాపణ కోరి ఆయన యొక్క రక్షణానందములో పాలు పంచుకుందాం.
No comments:
Post a Comment