17వ సామాన్య ఆదివారము, YEAR C

17వ సామాన్య ఆదివారము, YEAR C
ఆది 18:20-32; కొలొస్సీ 2:12-14; లూకా 11:1-13
ప్రార్ధన


ఈ రోజు మొదటి పఠనం ఆదికాండము 18:25-26, 32 నుండి తీసుకోబడింది. ఈ భాగంలో అబ్రాహాము సొదొమ పట్టణం కొరకు దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రాహాము దేవునితో ఇలా అంటాడు: “మంచివారిని, చెడ్డవారిని కలిసి నాశనం చేయడం మీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించడం మీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరియైనవాడు ధర్మమును ఆచరించవలదా?” అబ్రాహాము విన్నపానికి దేవుడు ఇలా బదులిస్తాడు: “సొదొమ నగరంలో యాభై మంది మంచివారు ఉంటే వారినిబట్టి అందరినీ క్షమిస్తాను.” అబ్రాహాము పది మంది మంచివారు ఉన్నా క్షమించమని వేడుకోగా, దేవుడు “పది మంది మంచివారున్నా చాలు, దానిని నాశనం చేయను’ అని అంటాడు.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒకవైపు దేవుణ్ణి అంటిపెట్టుకుని, ఆయన మార్గంలో నడుస్తూ, నీతి న్యాయం పాటించే అబ్రాహాము కుటుంబం, మరొకవైపు దేవునికి దూరంగా, ఆయన మార్గాన్ని విడిచిపెట్టి, నీతి న్యాయం పాటించని సొదొమ వాసులు. అబ్రాహాము కుటుంబం దేవుణ్ణి తమ జీవిత కేంద్రబిందువుగా చేసుకొని, తోటివారికీ, పరాయివారికీ పరోపకారం చేస్తూ జీవిస్తున్నారు. సొదొమ వాసులు మాత్రం తమ జీవితాలకు తామే కేంద్రబిందువుగా మారి జీవిస్తున్నారు. తమ సంతోషం కోసం, ఆనందం కోసం తమ చుట్టుపక్కల ఉన్నవారిని పీడిస్తున్నారు. వారి హక్కులను కాలరాస్తున్నారు. వారిని హింసలకు గురిచేస్తున్నారు. దేవుని ఉద్దేశాలను తృణీకరించి, తమ ఆలోచనల ప్రకారం జీవిస్తున్నారు. అంతేగాదు, తమ తృప్తి కోసం ఇతరులను వాడుకుంటున్నారు, తమ శక్తితో అణగదొక్కుతున్నారు. వీరి అణచివేతకు గురైన వారి ఆక్రందనను, రోదనను ప్రభువు ఆలకించారు. అందుకే, ప్రభువు వారిమీద చర్యలు తీసుకొని, అణచివేయబడిన వారికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అబ్రాహాము దేవుణ్ణి “మంచివారిని, చెడ్డవారిని సమముగా శిక్షిస్తావా?” అని అడిగినప్పుడు, పరలోక తండ్రి దేవుడు పది మంది మంచివారు ఉన్నా దానిని నాశనం చేయనని అబ్రాహాము వేడుకోలును ఆలకించారు. ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు, తాను సృష్టించిన మట్టి మనుషులమైన మనం ఎంత పాపులమైనప్పటికీ, నీచులమైనప్పటికీ, ద్రోహులమైనప్పటికీ, మనకు క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. దేవుని అనంత ప్రేమ, కనికరం, క్షమా గుణాన్ని అబ్రాహాము, దేవుని సంభాషణ ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే, అక్కడ పదిమంది మంచివారు కూడా లేకపోవడం వల్ల సొదొమ నాశనమైంది. అబ్రాహాము "ఒక్క వ్యక్తి ఉన్నా నాశనం చేయకుండా ఉంటావా?” అని అడగడానికి సాహసించలేకపోయాడు.

ప్రియ సహోదరీ సహోదరులారా! దేవుని కనికరాన్ని, క్షమా హృదయాన్ని, ప్రేమను మనం గ్రహించాలి. దేవుణ్ణి మనస్థాపపెట్టి, మోసం చేసి, దుఃఖపెట్టి మనం సాధించేది ఏమీ లేదు. దేవుడు మనల్ని సృష్టించారు, మనం ఎల్లప్పుడూ ఆయనను అనుసరించే జీవించాలి. దేవుడు మన వంటి స్వభావి కారు, ఆయన అనంత ప్రేమామయుడు, దయామయుడు, క్షమాభిక్ష పెట్టే దేవుడు. కనుక, దేవుని అనుసరణలో మనం అందరం జీవించడానికి, మన చివరి గడియ వరకు ప్రయత్నం చేయాలి. ఇది మన బాధ్యత. మన ఆత్మ రక్షణ కొరకు మనం తాపత్రయపడాలి. ఈ లోకానందాలు, సంతోషాలు, సుఖాలు, భోగాలు మన ఆత్మను రక్షించలేవు. మన కుళ్ళిపోయే శరీరం గురించి ఆలోచించి, అంతం లేని, చావు లేని ఆత్మను శిక్షిస్తామా? సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి దేవుడై ఉన్నారు, మనల్ని కన్నతండ్రి. నిత్యము మన కన్న తండ్రి అయిన పరలోక తండ్రి దేవుని వద్దకు మనం చేరుకోవడానికి పాపులముగా కాకుండా పవిత్రముగా జీవించి, ఆ దేవుణ్ణి మహిమపరుద్దాం.

మొదటి పఠన సందేశం ఏమిటంటే, నీ జీవితాన్ని ప్రభువు మార్గములో, ఆయనను అంటిపెట్టుకొని దేవుని ఉద్దేశానుసారముగా ఆయనను కేంద్రబిందువుగా చేసుకొని, నీతి న్యాయము పాటిస్తూఇతరును గౌరవిస్తూ జీవిస్తున్నావా?

నీ తోటివారిని, పరాయివారిని, ప్రోత్సహిస్తూ దేవుని మార్గములో నడచుటకు ఉత్సాహపరుస్తూ జీవిస్తున్నావా

నీతో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు, నీ ఆనందం, సంతోషం కోసం కాదు, నీకు పనిముట్లు కాదు, దేవుని బిడ్డలు అని గుర్తించావా?

నీవు అందనంత ఎత్తుకు ఎదిగిపోయావని గర్వముతో, సొదొమ ప్రజలవలె విర్రవీగుతున్నావా?

నీకు అవసరమైన దానికంటే ఎక్కువగా దేవునినుండి పొందినప్పుడు, అవసరములో ఉన్న నీ తోటివారిని విస్మరిస్తున్నావా? వారి బాధను, రోదనను పెడచెవిన పెడుతున్నావా?

అబ్రాహామును అతని కుటుంబాన్ని ఎన్నుకున్న విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నుకొని, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా తన ఉద్దేశమును జరిగించుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. నీతి న్యాయమును నీ చుట్టూ జరిగించాలని అనుకుంటున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సొత్తును దేవుని ఉద్దేశాన్ని జరిగించడానికి వెచ్చించగలవా? ప్రభువును నీ జీవిత కేంద్ర బిందువుగా చేసుకొని, ఆయనకు, ఆయన సేవకు సంపూర్తిగా నిన్ను నీవు సమర్పించుకోగలవా? అలా చేయాలంటే, నీవు కష్టసమయములోనూ, క్లిష్ట సమయములోనూ, దేవుని ముందు అబ్రాహాము వలె నిలబడటం నేర్చుకోవాలి. నిలబడి, ఇతరుల కోసం విన్నవించడం నేర్చుకోవాలి.

ప్రియ సహోదరీ సహోదరులారా! నేడు మనం ప్రార్థన యొక్క విలువను గురించి తెలుసుకోవాలి. ప్రార్థన మన జీవితంలో ఒక భాగం కావాలి. నిత్యమూ ప్రార్థన చేయాలి. “నాకు అడగటానికి ఏమీ లేదు నేను ఎందుకు ప్రార్థన చేయాలి” అని కొందరు అనుకుంటారు. “నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, కాని నా జీవితంలో ఏదీ జరగడం లేదు, కనుక నేను ఇంకెలా ప్రార్థించాలి” అని కొందరు అనుకుంటారు. ప్రార్థన అనగా దేవునితో మన సహవాసాన్ని వ్యక్తపరచడం, దేవునితో సంభాషించడం. ప్రార్థించడం అందరికీ అవసరమే! పునీతులు ప్రార్థించారు. నిష్కళంక మరియ ప్రార్థన చేసింది. దైవకుమారుడైన క్రీస్తు కూడా తండ్రి దేవునికి ప్రార్థించాడు. మరి మనకింకా ఎంత అవసరమో తెలుసుకుందాం! అబ్రాహాము వలె ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం!

రెండవ పఠనంలో పునీత పౌలు గారు కొలొస్సీయులకు వ్రాసిన లేఖ 2:12-13 లో ఇలా అంటారు: “మీరు జ్ఞానస్నానము పొందినప్పుడు మీరు క్రీస్తుతోపాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతోపాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణమునుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యములవలనను, శరీరమందు సున్నతి చేయబడకపోవుటవలనను, ఒకప్పుడు మీరు ఆధ్యాత్మికముగ మరణించి ఉంటిరి. కాని దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతోపాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములను అన్నిటినీ క్షమించెను.” ప్రియ సహోదరీ సహోదరులారా! క్రీస్తు ప్రభువు మన పాపముల కొరకు సిలువ మరణమును పొందియున్నారు. తిరిగి పునరుత్థానులై, పాపులమైన మనల్ని రక్షించడానికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరినీ రక్షించడానికి రక్షణను తెచ్చారు. మన పాపములన్నింటికీ నిజ దేవుడైన క్రీస్తు ప్రభువు క్షమాభిక్ష పెట్టారు. ఇకనుండి మనము మన జీవితంలో పాపము జోలికి వెళ్లకుండా, పవిత్రముగా జీవించడానికి ప్రయత్నిద్దాం.

నేటి సువిశేషములో ప్రభువు అంటున్నారు: “మీరును అడుగుడు. మీకు అనుగ్రహింపబడును. వెదకుడు మీకు దొరకును. తట్టుడు మీకు తెరువబడును” (లూకా 11:9). దేవుడు తన వాగ్దానాలను తప్పక నెరవేర్చువాడు. ప్రతీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఆయన చిత్తమైతే తప్పక అనుగ్రహిస్తారు. మనకు ఏది అవసరమో, మనకన్నా దేవునికే బాగా తెలుసు!

ప్రభువు పరలోక ప్రార్ధనను నేర్పించారు: పరలోక ప్రార్థన! శక్తివంతమైనది: 1. మనల్ని సరిచేస్తుంది. 2. మన సకల అవసరతలను తీర్చుతుంది. 3. రక్షణ మార్గంలో మనల్ని నడిపిస్తుంది. మనకు రక్షణను దయ చేస్తుంది. 4. మన సమస్త వేడుకోలులను ఆలకిస్తుంది.

కీర్తనలు 138: 9

“నేను మొరపెట్టగా

నీవు నా వేడికోలును  ఆలించితివి

నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి.”

అవును మన దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. మనము దేవునికి మన అవసరతలలో మన అవసరతలను గూర్చి మొరపెట్టి ప్రార్థిస్తే దేవుడు మన మొరలను ఆలకిస్తారు.

కీర్తనలు 138:7

“నేను కష్టములలో చిక్కుకొనినపుడు

నీవు నన్ను కాచి కాపాడుదువు.

మనం చేసుకునే ప్రార్థనలో తప్పనిసరిగా మనము మొదటిగా పరలోక జపముతో ఆ దేవుని వేడుకుంటాము. పరలోక జపముతో మన ప్రార్థనలు పరలోకమున తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాధీసులైన క్రీస్తు ప్రభువు వద్దకు చేరుతాయి. ఆ ప్రభువు మన ప్రార్థనలను ఆలకించి, మనకు బలమును దయచేసి మనం హానికరమైన పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు మనల్ని కాచి కాపాడతారు. దేవుడు మనతో చేసిన వాగ్దానాలన్నింటినీ, ఆయన శాశ్వతమైన కృప ద్వారా నెరవేర్చుతారు.

మన పరలోక తండ్రి అయిన దేవుడు! లోకరక్షకుడైన నిజ దేవుడు! “మనం ప్రార్థన ద్వారా అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తారు. మనం దేవునియందు వెదకితే! దొరుకునట్లు చేస్తారు. దేవునిలో మనం తట్టినచో మనకు తెరవబడుతుంది. అనే స్వయంగా క్రీస్తు ప్రభువు మనకు తెలియపరుస్తున్నారు.

మనము అడగకముందే మనకు మంచి ఆధరణ కర్త! ఐన పరిశుద్ధాత్మ దేవున్ని పరలోక తండ్రి దేవుడు మనకు ఒసగారు. జ్ఞానస్నానము/ దివ్యసప్రసాదము తీసుకున్న మనందరిలో ఆత్మానుసరణ ఉంది. మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు వశిస్తున్నారు.

క్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానమును మనం అర్థం చేసుకోవాలి. మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్లి మిత్రమా నీవు నాకు మూడు రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవుచు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదు అని పదేపదే ప్రాధేయపడి అడుగునందున, సాకులు చెప్పిన తన స్నేహితుడు, లేచి అతని అవసరము తీర్చెను అని, క్రీస్తు ప్రభువు మనకు తెలియపరిచిన ఉపమానములో, మనము విసుగు చెందక, ఓర్పుతో దేవునికి ప్రార్థించాలి. దేవుడు మనకు దయ చేయు వరకు దేవున్ని విడిచిపెట్టక, దేవునికి  మొర పెడుతూనే ప్రాధేయ పడుతూనే, ప్రార్థించాలి.

దేవుని నామములో ప్రార్థించి, మన ప్రార్థన ద్వారా దేవున్ని అడిగిన ప్రతి ఒక్కరికీ కూడా  ఇవ్వబడుతుంది. వెదకిన ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కరికి తెరవబడుతుంది అని స్వయంగా క్రీస్తు ప్రభువు మనకు దేవుని యందు వేచి ఉండడం నేర్పిస్తున్నారు.

దేవుడు మనకు మనం అడిగిన దానికన్నా మేలైనవే ఇస్తారు అని తెలియ పరుస్తున్న ఈ సందేశము నుండి మనం ప్రార్థించడం, మన ప్రార్థనలో ఓర్పుతో ఎదురు చూడడం, దేవుని కార్యాలను గూర్చి వేచి ఉండడం నేర్చుకుందాం, అలవరచుకుందాం.

“నిజదేవుడు! స్వయముగా మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి శ్రద్ధ విశ్వాసము వినయముతో ధ్యాన పూర్వకమైన హృదయముతో ప్రార్ధిద్దాం ఆ దైవాశిస్సులనుఆ దైవ శక్తిని, ఆ దేవుని మహిమను, దేవుని అద్భుత కార్యములను పొందుకుందాం.

ప్రార్ధనలో పట్టుదల ఉండాలి. పట్టువిడువక ప్రార్ధన చేయాలి. అబ్రహాము, పునీత మోనికమ్మ చక్కని ఉదాహరణలు. తన కుమారుని పరివర్తన కొరకుమోనికమ్మ 20 సం.లు ప్రార్ధన చేసింది. దేవుడు మన ప్రార్ధనలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయడు. చిత్తశుద్ధితో, విశ్వాసముతో ప్రార్ధన చేయాలి. మనకు ఉదారముగా ఒసగే తండ్రి ఉన్నారని యేసుక్రీస్తు తెలియజేయుచున్నారు. దీనికి విరుద్ధముగా, దేవుని బిడ్డలమైన మనం స్వార్ధముతో, గర్వముతో, ఇతరులపట్ల ఔదార్యము లేకుండా జీవిస్తున్నాం. తండ్రి దేవునివలె ఉదారముగా ఉన్నామా అని ఆత్మపరిశీలన చేసుకుందాం!

ప్రార్ధన కృతజ్ఞతాభావముతో చేయాలి. దేవుడు ఇప్పటికే మన జీవితములో ఎన్నో మేలులు చేసారు. దేవునకు వందనాలు తెలుపుకోవాలి.

ప్రార్ధన ఎప్పుడుకూడా దేవునితో మనకున్న అనుబంధముపై ఆధారపడి ఉంటుంది. కనుక, దేవునితో మనకున్న బంధముపై ముందుగా మనం ఎక్కువ దృష్టిని పెట్టాలి.

ప్రార్ధనతోపాటు మన కృషి ఉండాలి. ఉదాహరణకు, కుటుంబములో శాంతి, సమాధానాలు ఉండాలని ప్రార్ధన చేస్తాం. కాని, వాటికొరకు ఎలాంటి కృషి చేయము! మంచి ఆరోగ్యంకొరకు ప్రార్ధన చేస్తాం. కాని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోము! బహుశా, మన ప్రార్ధనలు నెరవేరక పోవడానికి అదొక కారణం కావొచ్చు!

ముగింపు:

ఈ పఠనాల ద్వారా మనం దేవుని అనంత కనికరాన్ని, ప్రేమను, క్షమాగుణాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాం. సొదొమ పట్టణం విషయంలో అబ్రాహాము చేసిన విజ్ఞాపన దేవుడు తన ప్రజల పట్ల ఎంత దయామయుడో తెలియజేస్తుంది. పదిమంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయనని దేవుడు చెప్పడం, ఆయన న్యాయం, కరుణ రెండింటికీ ప్రాధాన్యత ఇస్తాడని చూపిస్తుంది. అయినప్పటికీ, ఆ పట్టణంలో కనీసం పదిమంది నీతిమంతులు కూడా లేకపోవడం మానవాళి పతన స్వభావాన్ని సూచిస్తుంది.

మనం దేవుని బిడ్డలము. ఆయన మనల్ని తన రూపంలో సృష్టించాడు. కాబట్టి, మనం నీతి, న్యాయం, ప్రేమ, పరోపకారంతో జీవించాలి. అబ్రాహాము వలె, దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్నవారికి దీవెనగా ఉండాలి. దేవుడు మనల్ని తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఎంచుకున్నాడు, కాబట్టి మన జీవితాలను ఆయన సేవకు అంకితం చేయాలి.

అంతేకాకుండా, ప్రార్థన మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి. దేవునితో సంభాషించడానికి, ఆయనతో మన సంబంధాన్ని బలపరచుకోవడానికి ప్రార్థన అత్యవసరం. క్రీస్తు ప్రభువు కూడా ప్రార్థించారు. మనం అడిగితే ఆయన ఇస్తారు, వెదకాలి, తట్టాలి. ఆయన మన ప్రార్థనలను ఆలకించి, మన అవసరాలను తీర్చి, కష్ట సమయాలలో మనల్ని కాపాడతారు. మన ప్రార్థనలు విశ్వాసం, పట్టుదల, కృతజ్ఞతా భావంతో ఉండాలి. కేవలం అడగడమే కాదు, ప్రార్థించిన వాటి కోసం మన వంతు కృషి కూడా ఉండాలి.

పునీత పౌలు కొలొస్సీయులకు వ్రాసిన లేఖలో చెప్పినట్లుగా, క్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. మనం క్రీస్తుతో పాటు లేపబడ్డాం. ఈ నూతన జీవితంలో, మనం పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించాలి. లోక సంబంధమైన ఆనందాలు కాకుండా, మన ఆత్మ రక్షణే మన ప్రధాన లక్ష్యం కావాలి. దేవుడు మన కన్నతండ్రి, మనం ఆయనను మహిమపరచడానికి పవిత్రంగా జీవించాలి.

ప్రార్థన మనకు శక్తిని, బలమును ఇస్తుంది. మోనికమ్మ వలె, పట్టువదలని ప్రార్థనలు అద్భుతాలు చేయగలవు. దేవుడు మన ప్రార్థనలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయడు. కాబట్టి, విశ్వాసంతో, వినయంతో, ప్రేమతో నిత్యం ప్రార్థిస్తూ, దైవ ఆశీస్సులు, శక్తి, మహిమలను పొందుదాం.

మన జీవిత కేంద్రబిందువు దేవుడైతే, మనం నీతి, న్యాయంతో జీవిస్తే, పట్టుదలతో ప్రార్థిస్తే, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరతాయి. దైవ మార్గంలో నడుస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

No comments:

Post a Comment