ఐదవ తపస్కాల ఆదివారము, 7 ఏప్రిల్ 2019

ఐదవ తపస్కాల ఆదివారము, 7 ఏప్రిల్ 2019

పవిత్ర వారానికి ఒక వారం దరిలో మాత్రమే ఉన్నాము. పవిత్ర వారములో క్రీస్తుని శ్రమలు, మరణము, ఉత్థానముద్వారా దేవుని యొక్క ప్రేమను ధ్యానిస్తూ ఉంటాము. తపస్కాలములో ప్రత్యేకముగా దేవుని సాన్నిధ్యాన్ని, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాము. మనం చేయవలసినదెల్ల, మనలను మనం మార్చుకొని దైవానుచిత్తముగా జీవించడం. ఆయనయందు మన బలహీనతలను అంగీకరించి, ఆయన మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడని విశ్వసించాలి. తపస్కాలం ఓ ఆనందకరమైన కాలం, ఎందుకన, క్రీస్తు ఉత్థానమహిమలో, ఆనందములో ఆశీర్వాదములో భాగస్తులమవుటకు మనలను మనం సిద్ధపరచుకొను కాలం. మనం ఎంతటి పాపాత్ములమైనను, ప్రభువు మనలను క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకు ఉదాహరణ ఇనాటి సువిషేశములో విన్నట్లుగా వ్యభిచారమున పట్టుబడినదని ప్రభువు చెంతకు తీసుకొని రాబడిన స్త్రీని ప్రభువు సంపూర్ణముగా క్షమించడమే!

మొదటి పఠనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన కార్యాలను, చూపిన ప్రేమను చూస్తూ ఉన్నాము. దేవుడు ఇశ్రాయేలును సృజించాడు. మోషే నాయకత్వములో, వారిని వాగ్దత్త భూమి వైపుకు నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఫరోసైన్యాన్ని నాశనము చేసి, ఈజిప్టు బానిసత్వమునుండి కాపాడాడు. పాపములో పడిన ప్రతీసారి, తన ప్రజలను సరిచేసి కాపాడుకొన్నాడు.

అయితే, గతాన్ని చూడక, ముందుకు సాగిపోవాలని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. గతం ఎప్పుడుకూడా మన మనస్సులను మూసివేసి, ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా చేస్తుంది. అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు: ''మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కర లేదు. పాత సంఘటనలను తలంచుకోనక్కరలేదు'' (యెషయ 43:18). ''ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసెదను'' (యెషయ 43:19) అని వాగ్దానం చేసియున్నాడు. అనగా దేవుడు ఎప్పుడుకూడా మనకోసం నూతనత్వాన్ని సష్టిస్తూ ఉంటాడు. నూతన అవకాశాలను కల్పిస్తూ ఉంటాడు.

రెండవ పఠనములో కూడా, పునీత పౌలుగారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో, గతాన్నుండి బయట పడాలని తెలియ జేస్తున్నాడు. పౌలుగారు, క్రీస్తును మాత్రమే పరిగణిస్తున్నాడు. మిగతా వాటన్నింటిని, ముఖ్యముగా గతాన్ని చెత్తగా భావిస్తున్నాడు. ''నా ప్రభు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును తెలిసి కొనవలెనని, ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనని నా వాంఛ (ఫిలిప్పీ 3:8,10). పౌలుగారు పరిపూర్ణతను వెదకుటలో ఒక  పరిసయునివలె ధర్మశాస్రమును విధేయించాడు. కాని, చివరికి క్రీస్తులో ఆ పరిపూర్ణతను కనుగొన్నాడు. అప్పుడు క్రీస్తుకై సమస్తమును విడనాడాడు. క్రీస్తును పొందడం అనగా కేవలం జ్ఞానమును కలిగియుండుట మాత్రమే గాక, క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని కలిగి యుండటము. క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని పొందియున్నప్పుడు, మన శ్రమలన్ని కూడా ఆశీర్వాదాలుగా మారతాయి.

మనలను మనం ప్రశ్నించుకొందాం: తండ్రి యెహోవా దేవుడు మనకు గతములో ఎన్నో చేసాడని, అలాగే మన కొరకు ప్రతీ క్షణం నూతనత్వాన్ని సష్టిస్తున్నాడని విశ్వసిస్తున్నామా? ఆ తండ్రి దేవుడు సృష్టించిన ఆ నూతనత్వం క్రీస్తునిలో మన జీవితం అని విశ్వసిస్తున్నామా? ఆ క్రీస్తు కొరకు సమస్తమును విడనాడుటకు సిద్దముగా ఉన్నామా? పౌలుగారివలె, క్రీస్తు పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనను వాంఛను కలిగియున్నామా?

ఈనాటి సువిశేష పఠనమును ధ్యానిద్దాం: వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని (యోహాను 8:1-11) యేసు చెంతకు తీసుకొని వచ్చిన సన్నివేశం. ఈ సన్నివేశాన్ని చదివినప్పుడు లేదా విన్నప్పుడు మొట్టమొదటిగా, ఇతరులపై తీర్పు చేయరాదని గుర్తించాలి. ఇతరులలో తప్పులను వెదకి వారిని నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము! అలాగే, మన ఈ ప్రస్తుత సమాజములో స్త్రీపట్ల ఎన్నో అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీని గౌరవించడాన్ని నేర్చుకోవడం ఎంతైనా అవసరం ఉన్నది! ఈ సన్నివేశములో, ఒకవైపు ధర్మశాస్రబోధకుల కుటిలబుద్ధి మరోవైపు యేసు క్షమాగుణం. ఆ స్త్రీద్వారా, ప్రభువును ఇరకాటములో పెట్టాలని చూసారు. ''మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును'' అని చెప్పి వారికి బుద్దిచెప్పాడు. అలాగే ఆ స్త్రీతో, ''ఇక పాపము చేయకుము'' అని చెప్పియున్నాడు.

ఈ సన్నివేశాన్నుండి, మనము నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది: 1. ప్రభువును నిందించేవారు, ఆయనను దూషించేవారు, ఆయనను పరిహసించేవారు తప్పక ఒడిపోయెదరు. 2. ప్రభువు తప్పక క్షమిస్తాడు. అయితే మనలో తప్పకుండ ఉండవలసినది పశ్చాత్తాపం. ఆ స్త్రీ పశ్చాత్తాపముతో చివరి వరకు ప్రభువు క్షమకొరకు వేచియున్నది కనుక ఆమె ప్రభువు క్షమను పొందియున్నది. పుణ్యస్త్రీగా జీవించినది. ప్రభువు అందరిని క్షమిస్తాడు. ఆమెను నిందించడానికి ఎంతోమంది వచ్చారు. అందరూ పాపాత్ములే. ఎప్పుడైతే ప్రభువు వంగి నేలమీద వ్రేలితో వ్రాయసాగెనో మరియు ప్రభువు మాటలు విని అచ్చట                 ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్లి పోయారు. వారి పాపాలను ప్రభువు బట్టబయలు చేసినను వారిలో ఒక్కరు కూడా పశ్చాత్తాప పడలేదు. ఆ పాప(త)జీవితానికే తిరిగివెళ్లిపోయారు. పశ్చాత్తాపపడియుంటే, ప్రభువు తప్పక వారిని క్షమించియుండేవాడు, వారికి నూతనజీవితాన్ని ఒసగి యుండేవాడు. మనముకూడా మన పాపాలకు పశ్చాత్తాపపడదాం. క్షమించుటకు, నూతన జీవితాన్ని, హదయాన్ని ఇచ్చుటకు ప్రభువు ఎప్పుడూ సిద్ధమే. 3. ఎవరిపై తీర్పు చేయరాదు. వారి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. నిజమైన తీర్పరి దేవుడు మాత్రేమే. ఇతరులు పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది ప్రభువు సన్నిధిలో జీవించులాగ చేయగిలిగితే మనం నిజముగా అదష్ట వంతులమే! ప్రభువు మనలను ఆశీర్వదిస్తారు. 4. వ్యభిచారం మహాపాపం. ఆ స్త్రీ ఏ పాపము చేయలేదని ప్రభువు శిక్షించలేదు. కాని, ఆమెలో పశ్చాత్తాపాన్ని చూసి ఆమెను క్షమించాడు. ''ఇక పాపము చేయకుము'' అని చెప్పి వ్యభిచారం పాపం అని తెలియజేసాడు. శారీరక వాంఛలకు లోనుకాకూడదన్నదే పౌలుగారి బోధనలలో కూడా చూస్తున్నాం. 5. ఇంతకు ముందు చెప్పినట్లుగా, ప్రభువుతో వ్యక్తిగత అనుభూతిని కలిగియుండుట మన జీవితాన్ని మారుస్తుంది. ప్రభువుతో ఒకసారి వ్యక్తిగత అనుభూతిని పొందినట్లయితే, మనం ఎప్పటికీ పాపములో ఉండము. క్రీస్తులో ఓ నూతన జీవితాన్ని జీవిస్తాం. దీనికి ఉదాహరణ, పునీత పౌలుగారు మరియు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ. మనకు కూడా అలాంటి అనుభూతి ప్రభువుతో ఉండాలి. అప్పుడు మన జీవితాలలో నిజమైన మార్పును చూస్తాం.

No comments:

Post a Comment