తపస్కాల నాలుగవ ఆదివారము, Year C
యెహోషు 5:9, 10-12; 2 కొరి 5:17-21; లూకా 15:1-3, 11-32
ధ్యానాంశం: తండ్రి దేవుని ప్రేమ, క్షమ
ఉపోద్ఘాతం
తపస్కాలములోని నాలుగవ ఆదివారముతో, పాస్కా పండుగకు మనం మరింత చేరువవుతున్నాము. ఈ సమయములో, మనం మరింతగా దృష్టి సారించవలసినది, మన పాప జీవితానికి పశ్చాత్తాపపడి, పాస్కా పండుగకు సిద్ధపడటము. జ్ఞానస్నానంద్వారా దేవుని బిడ్డలముగా చేయబడినాము. క్రీస్తునిలో నూతన సృష్టిగా చేయబడినాము. దైవ బిడ్డలముగా, మన జీవితములో ఎల్లప్పుడూ నిజమైన ఆనందము కొరకు వెదకాలి. యేసుక్రీస్తు 'ఆనందానికి' సూచిక. పౌలుగారు, 'నిజమైన ఆనందం క్రీస్తులో పొందుతాము' అని చెప్పియున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమికి చేరుకున్నప్పుడు, దేవుని ఆనందాన్ని, సంతోషాన్ని, నిజమైన స్వేచ్చను అనుభవించారు. ఎందుకన, వారినుండి 'ఐగుప్తు అపకీర్తి' తొలగించబడినది. మరల పాస్కపండుగను చేసికొనిరి. వాగ్ధత్త భూమి పంటను రుచి చూచిరి (మొదటి పఠనం). దేవుడు క్రీస్తు ద్వారా మనుష్యుల నందరిని తనతో సఖ్యత పరచుకొనుచున్నారు. క్రీస్తునందు ఉన్నవారు 'నూతన సృష్టి'. పాత జీవితము గతించినది. క్రీస్తు మరణ, ఉత్థానమూలా ద్వారా పాత [పాప] జీవితాన్ని జయించి, నూతన జీవితాన్ని ఏర్పాటు చేసియున్నారు (రెండవ పఠనం).
మనంకూడా నిజమైన వెలుగును, ఆనందాన్ని, స్వేచ్చను పొందాలంటే, ఈజిప్టులాంటి పాపదాస్యమునుండి బయటపడాలి. ఎర్రసముద్రములాంటి శోధనలను జయించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆనందాన్ని పొందడానికి 40 సంవత్సరాలు పట్టింది. మనం ఈనాడు 40 రోజుల తపస్కాలములో ఉన్నాము. పశ్చాత్తాప పడినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలవలె మనంకూడా 'పాపపు అపకీర్తి' నుండి తొలగించ బడతాము. దివ్యపూజాబలిని సమర్పించుకో గలుగుతాము. పవిత్రాత్మ ఫలాలను అనుభవించ గలుగుతాము. మనం ఎంతవరకు ఆ ఆనందానికి చేరువయ్యామో ఒకసారి ఆలోచిద్దాం! ఆత్మపరిశీలన చేసుకుందాం! క్రీస్తు ఒసగు ఆనందాన్ని పొందాలంటే, పశ్చాత్తాప పడాలి. దేవుని వైపునకు మరలి రావాలి!
సువిశేష పఠనము: దేవుని ప్రేమ, క్షమ
ఈనాటి సువిశేష పఠనములో, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, "యేసు పాపులను చేరదీయుచు, వారితో కలిసి భుజించు చున్నాడు" అని సణుగుకొనసాగిరి. అప్పుడు యేసు ప్రభువు వారిని ఉద్దేశించి చెప్పిన "తప్పిపోయిన కుమారుని" ఉపమానమును వింటున్నాము. ఈ ఉపమానముద్వారా, పశ్చాత్తాప పడి తిరిగి వచ్చే వారిని దేవుడు తన హక్కున చేర్చుకుంటాడని యేసు తెలియజేయుచున్నారు. అలాగే, క్షమించే తండ్రి దేవుని ప్రేమను గురించి మనకు తెలియజేయు చున్నారు. దుడుకు చిన్నవాడు, ఈ లోకములో సంతోషాన్ని వెదకడంకోసం, తన ఆస్తిని తీసుకొని, తండ్రినుండి దూరముగా వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న ధనములో సంతోషం ఉంటుందని భావించాడు. తనను మోసం చేసిన స్నేహితుల దగ్గర ఆనందం ఉంటుందని భావించాడు. లోకపు సుఖభోగాలలో నిజమైన ఆనందం ఉంటుందని భావించాడు. ఇదే నిజమైన ఆనందం, స్వేచ్చ అని భావించాడు. కాని, చివరికి నిజమైన ఆనందం, స్వేచ్చ అతను ఎక్కడా పొందలేక పోయాడు. తిరిగి మరల తండ్రి వద్దకు వచ్చాడు.
మనముకూడా, అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. కుటుంబ సభ్యులకన్న, ఆధ్యాత్మిక విషయాలకన్న, మనకు వచ్చే ఆస్తిపై ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటాము. దానికొరకై ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాము. మన చుట్టూ ఉన్న చెడు పరిస్థితులను, చెడు స్నేహాలను గమనింపక, వాటిలో నాశనమై పోవుచున్నాము.
ఈ ఉపమానములో, మన పరలోక తండ్రి ప్రేమను చూస్తున్నాము. లోకవ్యామోహాలలో, పాపములో పడిన తన బిడ్డలు మారుమనస్సు పొంది, తిరిగి తన చెంతకు రావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తండ్రి దేవుని చూస్తున్నాము. తిరిగి వచ్చినప్పుడు, మన గతాన్నిగాని, మన పాప జీవితాన్నిగాని ప్రశ్నింపక, జ్ఞప్తికి చేయక, కేవలం మనలో కలిగిన మారుమనస్సు, పశ్చాత్తాప హృదయాన్ని మాత్రమే చూసి, తన హక్కున చేర్చుకొనే తండ్రిని, తిరిగి తన కుటుంబములో పూర్వ వైభవాన్ని ఒసగడానికి చేతులు చాచి, ఎదురు చూస్తున్న తండ్రి దేవుని చూస్తున్నాము. "పశ్చాత్తాపము అవసరములేని తొంబది తొమ్మిది మంది నీతిమంతులకంటే, హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును" (లూకా 15:7). "హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు" (15:10). పశ్చాత్తాప పడే పాపి యెడల దేవుని దయ, కరుణ అనంతముగా ఉంటుందని అర్ధమగుచున్నది. ఇలాంటి గొప్ప, అనంతమైన ప్రేమ కలిగిన తండ్రి ఒడిలో ఒదిగిపోవడానికి ఈ తప:కాలం మంచి సమయం. క్షమించడములో దేవుడు ఎప్పుడు అలసిపోరు కాబట్టి, పాపాలకు పశ్చాత్తాప పడి, దేవునివైపునకు మరలుదాం. పరలోకమంతా ఆనందిస్తుంది.
మనం చేయవలసినదల్లా, దుడుకు చిన్నవానివలె, తండ్రికి, కుటుంబానికి దూరమై, బిజీబిజీగా ఉన్న మనం, ఎన్నో సమస్యలతో ఉన్న మనం, ఒక్కసారి ఆగి, ఆత్మపరిశీలన చేసుకుందాం! ఎందుకు నా జీవితం ఇలా ఉన్నది? ఎందుకు నాలో ఆధ్యాత్మిక లేమితనం? మనం అందరం పాపాత్ములమే. మనలో పశ్చాత్తాపం కలగాలి. హృదయ పరివర్తన కలగాలి. అప్పుడే, దుడుకు చిన్నవానివలె తిరిగి మనం తండ్రి యొద్దకు చేరుకోగలం.
ఈ కథలో, నాకు నచ్చినది, తండ్రి తన పెద్ద కుమారునితో చెప్పిన మాట: "నాకున్నదంతయు నీదే కదా" (15:31). పెద్ద కుమారుడు పనులలో, బాధ్యతలలో పడిపోయి, తండ్రి ప్రేమను గ్రహించలేక పోయాడు. సమయం వచ్చినప్పుడు, తండ్రి తనకు ఏమీ చేయడం లేడని నిందించాడు. నేడు మనతో కూడా ప్రభువు ఈ మాటను అంటున్నారు. ఏవిధముగానైతే, తండ్రి బయటకు వచ్చి, చిన్న కుమారుని ఆహ్వానించారో, అదేవిధముగా, పెద్ద కుమారుడు అలిగినప్పుడు కూడా, తండ్రి బయటకు వచ్చి అతనిని ఆహ్వానించారు, పండుగలో పాలుగొనమని పిలిచారు. మన నిజమైన ఆనందం ఇదే: "నాకున్న దంతయు నీదే." కాని పెద్ద కుమారుడు ఎల్లప్పుడు తండ్రితోనే ఉంటూ, తండ్రి ప్రేమను తెలుసుకోలేక పోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడిని స్వీకరించలేక పోయాడు. తండ్రి ఏర్పాటు చేసిన విందులో కూడా సంతోషముగా పాల్గొనలేక పోయాడు.
మనంకూడా, మన జీవితములో, ఇతరులు మనకన్న ఎక్కువ అనే భావనతో ఉంటాము. ఈ భావనతో, పెద్ద కుమారునివలె, మనలో మనం భాదపడుతూ ఉంటాము. దేవుని దృష్టిలో అందరం సమానులమే! అందరం ఆయన సృష్టియే! అందరం ఆయన బిడ్డలెమే! మనమే, ఆస్తి, కులం, మతం, భాష, ప్రాంతం, రంగు మొదలగు వాటితో, ఎక్కువ, తక్కువ అనే భావనలతో జీవిస్తున్నాం! ఇది సరైనది కాదు! ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే భావనతో జీవింపక, అందరినీ సమానత్వముతో గౌరవిస్తూ, మనలో ప్రేమించే శక్తిని బలపరచుటకు ప్రయత్నిద్దాం!
తప్పిపోయిన కుమారుని ఉపమానం ద్వారా, మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉన్నదని ప్రభువు తెలియ జేస్తున్నారు. కనుక, పాత జీవితాన్ని విడచిపెట్టి, క్రీస్తు అయిన క్రొత్త జీవితములోనికి వచ్చే గొప్ప అవకాశం ఉన్నది. ఎప్పుడైతే, దేవునివైపు మరలాలి అని అనుకొంటామో, అది దేవునికి మనపై ఉన్న ప్రేమను సూచిస్తుంది. ఎందుకంటే, మనలో ఎవరినీ కోల్పోవడం ఆయనకు ఇష్టం లేదు.
ఆయన మనకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన దరికి వచ్చిన మనలోని పాపాలను కడిగి వేస్తారు. మనలను క్షమిస్తారు. కనుక, మారుమనస్సు, పశ్చాత్తాపం చెందుదాం. పాస్కా పరమ రహస్యాన్ని నిజమైన ఆనందముతో కొనియాడటానికి సంసిద్దులమవుదాం!
ఆత్మపరిశీలన
* మనలో ప్రతీ ఒక్కరం, "తప్పిపోయిన కుమారుడు" ఉపమానాన్ని పదేపదే చదివి ధ్యానించాలి!
* నేటి ఉపమానం ద్వారా ఆధ్యాత్మిక నాయకులుకూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి! పాపములో పడి క్రీస్తు మందకు దూరమైనా వారిపట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నారు? వారిని చేరుకోవడానికి ఎలాంటి రిస్క్ చేస్తున్నారు?
* నేటి ఉపమానం ద్వారా, మన కుటుంబ బంధాలను పరిశీలించుకుందాం! కుటుంబ బంధాలు, విలువలు నేడు కరువైపోయాయి. విడిపోయిన బంధాలను మరల తిరిగి కలుపుకోలేని అయోమయ స్థితిలో మనం ఉన్నాం! కుటుంబములో ప్రేమలు నిలబడాలంటే, నిబద్ధత కలిగి జీవించాలి. ఉపమానములోని తండ్రివలె, మన కుటుంబములోని పెద్దలు కూడా, దారితప్పి తిరిగి వచ్చినవారిని, క్షమించి హక్కున చేర్చుకోవాలి. కుటుంబ బంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేయాలి. విలువలు, బంధాలు, ప్రేమాప్యాయతలున్న కుటుంబములో నిజమైన ఆనందం, క్రీస్తు ఆనందం ఉంటుందని అందరం తెలుసుకోవాలి!
*****
- నేడు అనేకమంది ఆస్తికోసం, సంపదకోసం తల్లిదండ్రులనుండి విడిపోతున్నారు; తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకాడటం లేదు.
- నేడు అనేకమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు; వారిని గౌరవించడం లేదు; తల్లిదండ్రుల ప్రేమను గ్రహించడం లేదు.
- నేడు అనేకమంది తల్లిదండ్రులను భారముగా భావిస్తున్నారు. వృద్దాశ్రమాలలో, అనాధాశ్రమాలలో వదిలేస్తున్నారు;
- కొంతమంది సంపాదనలో పడిపోయి, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
*** ఇవన్నీ కూడా తండ్రి దేవుని ప్రేమను, దయను, కరుణను తృణీకరించడమేనని గుర్తించాలి! ***
No comments:
Post a Comment