మ్రానికొమ్మల ఆదివారము, Year C

మ్రానికొమ్మల ఆదివారము, Year C

క్రీస్తు పాటుల స్మరణోత్సవము - యెరూషలేములో 
క్రీస్తు విజయ ప్రవేశ స్మరణ దినము
యెషయ 50:4-7, ఫిలిప్పీ 2:6-11, లూకా 22:14-23:56.
''దావీదు పుత్రునకు హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువారు ఆశీర్వదింప బడినవారు, ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసాన్న'' (మత్త 21:9).

ఉపోద్ఘాతము: పాస్కాయత్తకాల ప్రారంభమునుండి మన హృదయాలను పశ్చాత్తాపము, మారుమనస్సు, తదితర ప్రేమపూరిత క్రియలద్వారా ఆయత్తము చేసికొనిన పిదప, ఈదినము తిరుసభయంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్రకార్యమును [క్రీస్తు శ్రమలు, మరణం, ఉత్థానం] స్తుతించుటకు సమావేశమైయున్నాము. ఈ రక్షణకార్యమును నెరవేర్చుటకై క్రీస్తు యెరూషలేము నగరమున ప్రవేశించారు. ఈ ప్రవేశం ఒక నూతన నిర్గమనానికి నాంది. కనుక, సంపూర్ణ భక్తి, విశ్వాసముతో, ఈ రక్షణాయుత ప్రవేశమును స్మరించుకొనుచు రక్షకుడైన క్రీస్తును వెంబడించి, సిలువ ఫలిత కృపయందు భాగస్తులమై, ఆయన పునరుత్థానమందును భాగమును పొందుటకు ప్రయాసపడుదాం!

మ్రానికొమ్మల [మట్టల] ఆదివారముతో పవిత్రవారములోనికి ప్రవేశించియున్నాము. పవిత్రవారము మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకన, క్రీస్తుప్రభువు భూలోక జీవితములోని చివరి ఘట్టాలను ధ్యానిస్తూ ఉన్నాము. ముఖ్యముగా, దివ్యసత్ప్రసాద స్థాపన, శ్రమలు, సిలువ మరణం మొదలగు పరిశద్ధ రక్షణ కార్యాలతో, ప్రభువు దేవునికి-మానవునికి మధ్య సఖ్యతను, సమాధానమును నెలకొల్పియున్నారు. పవిత్రవారములోని సాంగ్యాలద్వారా, మన రక్షణకార్య ఘట్టాలను అనుభవించెదము. మన విశ్వాసాన్ని నూత్నీకరించెదము. మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచెదము. మన విశ్వాసయాత్రలో ఓ నూతన జీవితాన్ని, ఆధ్యాత్మిక కన్నులతో చూచెదము. ఈ యాత్ర ఈనాటి మ్రానికొమ్మల ఆదివారముతో మొదలవుతుంది. ఇది రక్షణకార్య పరమరహస్యాలను చేరుటకు తోడ్పడుతుంది. తద్వారా, విశ్వాసములో ఎదిగి క్రీస్తుకు దగ్గర కాగలము.

ధ్యానము: ఈ రోజు మ్రానికొమ్మల ఆదివారము లేదా ప్రభువు శ్రమల ఆదివారము. ఈ రోజు యేసుక్రీస్తు యెరూషలేము విజయ పురప్రవేశమును స్మరించుకొను రోజు (లూకా 19:28-40; మార్కు 11:1-11; మత్త 21:1-15). మరణాన్ని జయించటానికి సిద్ధమవుతున్న యోధుని వలె, యేసు యెరూషలేము నగరంలోకి ప్రవేశించారు. ప్రజలు ప్రభువును ఒక మెస్సయ్యగా, రాజుగా ఆహ్వానించారు. ఆయన గాడిద పిల్లపై, వినయముతో ముందుకు సాగిపోవుచుండగా, దారిలో తమ వస్త్రములను పరిచి, మ్రానికొమ్మలతో జేజేలు పలుకుతూ స్వాగతించారు. "ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక! పరలోకమున శాంతియు, మహోన్నతమున మహిమయు కలుగునుగాక" (లూకా 19:38) అని ఆయన శిష్యులును, ప్రజలును దేవునికి ఎలుగెత్తి స్తుతిగీతాలు పాడారు. వారు, "దావీదు కుమారా హోసన్న! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింప బడునుగాక! సర్వోన్నతమున హోసన్న!" అని విజయ ద్వానములు చేసారు (మత్త 21:9). 'హోసన్న' అనగా 'ఇప్పుడు రక్షింపుము' అని అర్ధము. వారు, "యిస్రాయేలు రాజు స్తుతింప బడునుగాక!" (యోహాను 12:12-13) అని ఎలుగెత్తి చాటారు.

అయితే, వారు ప్రభువును భూలోక రాజుగా, యోధునిగా పరిగణించారు. రోమీయుల బానిసత్వమునుండి విడుదలను, స్వతంత్రమును దయచేయు రాజుగా యేసును వారు చూసారు. అందుకే, ప్రభువు గుర్రముపైగాక, వినయపూర్వకమైన సేవ, శాంతికి చిహ్నమైన గాడిద పిల్లపై ఎక్కి వచ్చారు (500 సం.ల క్రితం జెకర్యా పలికిన ప్రవచనం- జెకర్యా 9:9). ఆయన ఆయుధాలను, శాంతితో నాశనం చేయురాజని, ఆయన పేదల రాజని... ప్రజలు గ్రహించలేక పోయారు. బహుశా, యేసు తన ప్రేషిత సేవలో, ఎంతోమందికి స్వస్థతలు, అద్భుతాలు చేసారు కాబట్టి, ఆయనను రాజుగా చేయాలని ప్రయత్నించారు. ఇంకో మాటలో చెప్పాలంటే, వారంతా యేసు అభిమానులు మాత్రమే, విశ్వాసులు కాదు!

అందుకే, అలా ప్రభువును స్తుతించిన ప్రజలే కొన్ని రోజుల తర్వాత, వారి ఆశలు నెరవేరక పోవుట వలన, 'అభిమానుల' ఆశలు అడియాసలు అవటము వలన, 'ప్రభువును సిలువ వేయుడు' అని, 'బరబ్బాను విడుదల చేయుడు' (లూకా 23:18, 21) అని గట్టిగా కేకలు వేసారు. "సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు" (యోహాను 19:15) అని పలికారు. దారిలో తమ వస్త్రములు పరచిన ప్రజలు (లూకా 19:36), ఆయన వస్త్రములను ఒలుచుటకు, చీట్లు వేసుకొని పంచుకొనుటకు సిద్ధపడ్డారు! ప్రజలు ఎంతగా తప్పుదారి పట్టారో అర్ధమగుచున్నది! పిలాతు కూడా, "నాకు ఇతనిలో ఏ దోషము కనిపించుట లేదు" (లూకా 23:22) అని ప్రకటించినను, నేరస్తుడైన బరబ్బాను విడుదల చేయమని కోరారు. ఆనాడు వారు హృదయమునుండి ప్రభువును స్తుతించలేదు. ఈరోజు ప్రభువుని స్తుతించిన వారిలో ఎంతమంది ప్రభువుతో సిలువ చెంత ఉన్నారు? గుంపులో ఉండటం చాలా సులువు. కాని, వ్యక్తిగతముగా ప్రభువుతో ఆయన శ్రమలలో, సిలువ యాత్రలో ఉండినవారు ఎంతమంది? ప్రభువునకు వారి అవసరం ఉన్నప్పుడు, వారు ఆయన శ్రమలలో, సిలువ చెంతన ఉండలేక పోయారు! 

కడరాభోజన సమయములో పేతురు ప్రభువుతో చెరసాలకు పోవుటకు, మరణించుటకు సైతము సిద్దముగా ఉన్నానని (లూకా 22:33) చెప్పాడు. కాని కొన్ని గంటల తరువాత అదే రోజు రాత్రి ప్రభువును ఎరుగనని బొంకాడు (లూకా 22:56-62). ఎంత త్వరగా అతను తన మనసును మార్చుకున్నాడు! మనముకూడా ప్రభువుతో ఎన్నో వాగ్దానాలు చేస్తాం. కాని, శోధనలకు, బలహీనతలకు దాసులమై, వాటిని మరచిపోతూ ఉంటాం. కనీసం పేతురు, కోడికూతను విని (లూకా 22:60), ప్రభువు మాటలు గుర్తుకువచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు. పశ్చాత్తాప పడ్డాడు. కాని, మనం జీవిస్తున్న ఈ గందరగోళ లోకములో, ఏ స్వరాన్ని, ఏ కూతని మనం వినలేక పోతున్నాం. అంతగా, మన హృదయాలు మూసుకొనిపోయి ఉన్నాయి. మన అంతరాత్మ ఘోషను మనం వినలేక పోతున్నాము. ప్రభువు శ్రమలగూర్చి ధ్యానిస్తూ ఎందుకు మన హృదయాలు చలించడములేదో ఆత్మపరిశీలన చేసుకుందాం!

ఈనాటి మొదటి పఠనములో, ప్రభువు శ్రమలను గూర్చిన ప్రవచనాలను వినియున్నాము: "నేను అతనికి అడ్డు చెప్పలేదు. అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకొంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియు చేయనైతిని" (యెషయ 50:5-6). ఈనాటి భక్తికీర్తనలోకూడా ప్రభువు శ్రమల గూర్చిన ప్రవచనాలను వినియున్నాం: "నా వైపు చూచిన వారెల్లరు నన్ను గేలిచేయుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను. అతడు ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో, అతడు ఇతనిని కాపాడునేమో చూతము. శునకములు నన్ను చుట్టుముట్టినవి. దుష్టబృందము నా చుట్టు క్రమ్ముకొనినది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నింటిని లెక్కపెట్టుచున్నారు. శత్రువులు సంతసముతో నావైపు చూచుచున్నారు. వారు నా బట్టలను తమలోతాము పంచుకొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లువేసికొను చున్నారు" (కీర్తన. 22:7-8, 16-18).

కథ: ఒక పట్టణములో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నవాడు ఎప్పుడూ జులాయిగా తిరుగుచూ, త్రాగుచూ రోజూ ఇంటికి ఆలస్యముగా వచ్చేవాడు. అతని అన్న ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతిని మార్చుకోలేదు. ఒక రోజు చేతిలో పిస్తోలు, రక్తపు మరకలతో రాత్రి ఇంటికి వచ్చాడు. 'నేను ఒక వ్యక్తిని చంపాను... నేను కావాలని చంపలేదు. నాకు చావాలని లేదు' అని అన్నాడు. అప్పుడే పోలీసులు ఇంటిని చుట్టుముట్టి తలుపులు తట్టారు. తమ్ముడికోసం అన్న, తమ్ముడి బట్టలు వేసుకొని పోలీసులకు లొంగిపోయాడు. అతన్ని విచారించి, మరణదండన విధించారు. తమ్ముడి కోసం అన్న మరణించాడు. తమ్ముడు జీవించాడు.

ఇదంతా ప్రేమకోసమే! అలాగే క్రీస్తుకూడా మన మీద ప్రేమ వలన మనకోసం మరణించారు. మన శిక్షను ఆయన భరించారు. మన పాపభారం ఆయన మోసారు. ఈ అనంతమయిన ప్రేమకు మనం ఎలా స్పందించాలి! పైకథలో తమ్ముడు అన్నపట్ల ఎంతో కృతజ్ఞుడై ఉండవచ్చు. అలాగే మనముకూడా దేవునికి, క్రీస్తుకు కృతజ్ఞులమై ఉండాలి. అంతేగాక, మన పాతజీవితానికి/ పాపజీవితానికి స్వస్తిచెప్పాలి. క్రీస్తులో నూతన జీవితాన్ని జీవించాలి. తమ్ముడు తన జీవితాన్ని మార్చుకోకపోతే, అన్న మరణానికి అర్ధమే ఉండదు. అలాగే క్రీస్తు మరణం కూడా! క్రీస్తు మరణములో మనం జీవిస్తున్నాము. కనుక, దానిని సమృద్ధిగా, పవిత్రముగా జీవించుదాం. మన జీవితం, క్రీస్తు మరణము వలన పొందిన భిక్ష అని ప్రతీక్షణం జ్ఞప్తియందు ఉంచుకుందాం. 

క్రీస్తు శ్రమలు మనలను కదిలించాలి, ఎందుకన ఆయన శ్రమలకు కారణం మనమే కాబట్టి! ఆయన శ్రమలకు పెద్దలు, రోమను సైనికులు మాత్రమే కాదు, మన పాపజీవితం కూడా. "అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. మన పాపములకొరకు నలిగి పోయెను. అతడు అనుభవించిన శిక్షద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బలద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను" (యెషయ 53:5).

పాపం చేసినప్పుడెల్ల, మనం ప్రభువును సిలువ వేయుచున్నాము. ఈ రోజు, క్రీస్తుపాటుల స్మరణోత్సవ దినము. క్రీస్తుశ్రమల స్మరణ మన జీవితాలను చలించాలి. మన హృదయాలు కరగాలి. పాపజీవితాన్ని విడచిపెట్టాలి. పవిత్రవారములో పాపసంకీర్తనముద్వారా మరల మనం ప్రభువు చెంతకు తిరిగి రావాలి. పశ్చాత్తాప పడాలి, సఖ్యత పడాలి. క్రీస్తు శ్రమలు మనకు స్వస్థతను చేకూర్చాలి! ఈ పవిత్రవారాన్ని మనం వృధాచేయకూడదు. క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయనతో గడుపుదాం. పవిత్ర గురువారమున ప్రభువు ఏర్పాటు చేసిన దివ్యసత్ప్రసాద విందులో, పవిత్ర శుక్రవారమున ప్రభువు శ్రమలలో, పవిత్ర శనివారమున పాస్కా జాగరణలో పాల్గొందాం. దేవుని ఆశీస్సులను పొందుదాం!

పవిత్రవారం, ప్రేమవారం అని కూడా చెప్పవచ్చు! మనమీద ప్రేమవలననే, యేసు శ్రమలను, సిలువ మరణాన్ని పొందడానికి సిద్ధపడ్డారు. కడరా భోజన సమయములో ప్రేమనుగూర్చి బోధించిన ప్రభువు, ప్రేమకోసమే సిలువపై మరణించారు. తనను పొగిడిన జనాలు, స్తుతించిన జనాలు దూషించినను, వారికోసం సిలువను ఎత్తుకున్నారు, సిలువపై మరణించారు. ఈ రోజు ఆశీర్వదింపబడిన మ్రానికొమ్మలతో, మనం కూడా ప్రభువుకు స్వాగతం పలికాం. మ్రానికొమ్మలు జీవముకు, విజయానికి, మహిమకు సూచన! అవి క్రీస్తు పాపాన్ని, మరణాన్ని జయించిన విజయానికి, రక్షణకు, మహిమకు సూచనలు కావాలి! అయితే, ఇంటికి వెళ్లగానే, మ్రానికొమ్మలను పీఠాలవద్ద, పటాలవద్ద, ద్వారాలవద్ద, ఫ్రిజ్జులమీద, సజ్జలమీద ఉంచుతాం. త్వరగానే, ఆ కొమ్మలు వాడిపోతాయి. కాని క్రీస్తుపై మనకున్న ప్రేమ, విధేయత, విశ్వాసం, నమ్మకం, క్రీస్తునందు నిరీక్షణ ఎన్నటికీ వాడిపోకూడదు. అవి మనలో సజీవముగా ఉండాలి. దానికోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మంచిగా, ప్రేమగా జీవించాలి.

క్రీస్తు శ్రమలతో పోలిస్తే, మన బాధలు, కష్టాలు ఏపాటివి? యేసుక్రీస్తు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మనలో ఒకనిగా జీవించారు. మన కష్టాలను, బాధలను ఆ ప్రభువునకు అర్పించుదాం. వాటినుండి పారిపోక (ఆత్మహత్య, నిరాశ), ఎదుర్కొను శక్తినివ్వమని, దైవచిత్తమే జరగాలని ప్రార్ధిద్దాం! దేవుని కుమారుడే శ్రమలను పొందవలసి వచ్చినది! కనుక, మనముకూడా మన జీవితములో వచ్చే కష్టాలను, బాధలను ఎదుర్కొనుటకు దేవుని సహాయమును కోరుదాం.

సందేశాలు:
1. గాడిద - బరువులు మోయును; యేసు గాడిదపై రావడం, ఆయన మన పాప భారాన్ని మోస్తాడు అని అర్ధం; గాడిద 'వినయానికి', 'శాంతికి' గురుతు; యేసు గాడిదపై రావడం, ఆయన వినయశీలుడని సూచిస్తుంది; ఆయన మార్గం హింస కాదని, శాంతి మార్గమని, శాంతిదూతయని, శాంతిని నెలకొల్పునని సూచిస్తుంది. మనం ప్రభువువలె వినయం కలిగి జీవించాలి.
2. వస్త్రములు: వస్త్రాలు పరచడం, సంపూర్ణ సమర్పణకు సూచన; దైవాంకిత జీవితానికి సూచన; 1 పేతురు 5:5 - "వినయము అను వస్త్రమును ధరింపవలెను." రోమీ 13:14 - "ప్రభువైన యేసు క్రీస్తును ధరింపుడు."
3. మ్రానికొమ్మలు: విజయానికి గురుతు; యుద్ధములో గెలిచిన వారిని ఖర్జూరపు కొమ్మలతో ఆహ్వానించేవారు; యేసు యెరూషలేములోని ప్రవేశించడం, 'తన సిలువ మరణం' ద్వారా పాపము, సాతానుపై విజయాన్ని సూచిస్తుంది.
4. హోసాన్న: అనగా 'మమ్ము ఇప్పుడు రక్షింపుము' అని అర్ధం; మనలను కూడా ఇప్పుడు రక్షింపుమని ప్రార్ధన చేద్దాం! యేసును, "దావీదు కుమారా!" అని పిలిచారు, అనగా ఆయన మెస్సయ్య అని అభిషిక్తుడని, క్రీస్తు అని వారు గుర్తించారు.
5. యెరూషలేము: పాస్క పండుగ సందర్భముగా, యేసు యెరూషలేములోనికి ప్రవేశించారు. యేసు యెరూషలేమును చూసి విలపించారు (లూకా 19:41-44). 'యెరూషలేము' అనగా పవిత్ర నగరం అని, శాంతికి పునాది అని అర్ధం; యేసు యెరూషలేమును చూసి విలపించడం అనగా, అచటి ప్రజల గూర్చి విలపించారు. కాని అచట ప్రజలలో శాంతి లేదు, సమాధానం లేదు; విశ్వాసం, నమ్మకం, ప్రేమ నిరీక్షణ లేవు; పశ్చాత్తాపం, మారుమనస్సు, హృదయపరివర్తన లేవు. అచట కేవలం నిరాకరణ, తిరస్కారం, కటిన హృదయం, ద్వేషం... ఉన్నాయి. మనలో కూడా శాంతి, సమాధానం లేదు; ప్రార్ధన చేద్దాం.
6. ప్రభువు శ్రమలు: ప్రభు శ్రమలు పాస్క పరమరహస్యం: శ్రమలు, మరణం, ఉత్థానం. శ్రమలు, మరణం లేనిదే ఉత్థానం లేదు. ఇది ప్రభువు పాస్క, అనగా ప్రభువు శ్రమలే మన ఉత్థానం. "మృత్యువు నాశనం చేయబడింది. విజయం సంపూర్ణమైనది" (1 కొరి 15:54). క్రీస్తు శ్రమలు ఒక నిర్గమనం. మరణాన్ని, మృత్యువును దాటడం; పాపాన్ని దాటడం; అంధకారాన్ని దాటడం; "ఈ లోకాన్ని దాటి తండ్రి దేవుని వద్దకు వెళ్ళడం" (యోహాను 13:1).
7. ప్రజలు: కొందరు ప్రభువును విశ్వసించారు, మెస్సయ్యగా అంగీకరించారు; కొందరు ఇహలోక రాజుగా భావించారు; రాజును చేయాలని భావించారు. కొందరు తిరస్కరించారు; ఆయనను చంపాలని ప్రయత్నాలు చేసారు; కొందరు ఈ రోజు, 'దావీదు కుమారా!' అని స్తుతించినవారు, కొన్ని రోజుల తరువాత 'సిలువ వేయుడు' అని అరిచారు; ఈనాడు వస్త్రాలు పరచినవారు, ఆయన వస్త్రాలను ఒలచడానికి, చీట్లు వేసుకొని పంచుకోవడానికి సిద్ధపడ్డారు. కొందరు ఆయనను మౌనముగా, గుప్తముగా అనుసరించారు. మనం ఏ కోవకు చెందిన వారము? ఆత్మపరిశీలన చేసుకుందాం!

సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా! మానవ జాతికి దైన్య పుణ్యమునకు ఆదర్శముగా, రక్షకుడు మనుష్యావతారమెత్తెను. సిలువ బాధలను పొందను మీరు చిత్తగించితిరి. ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్తులమగునట్లు మాకు అనుగ్రహింపుడు. ఆమెన్‌.

No comments:

Post a Comment